Wednesday, November 21, 2012

నేము

2004లో అనుకుంటా, మాధాపూర్లో అన్నమాచార్య భావనా వాహిణిలో (హైటెక్స్కు వెళ్ళేదారిలో ఎడమవైపు ఉంటుంది) ఏదో సంగీత కార్యక్రమం ఉందంటే వెళ్ళాం నేను నా మిత్రుడు కలిసి. జనం బానే ఉనారు. ఐటీ సముద్రమైన మాధాపూర్లో సంగీతానిక్కూడా ఇంత మంది  అభిమానులున్నారా? అనిపించింది. మేమిద్దరం వెళ్ళి కుర్చీల్లో కూర్చుని సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. హాయిగా సాగిపోతుంది సంగీత విభావరి. ఎన్నో పాటలు మారుతున్నయి, వాటితోపాటు గాయకులు మారుతున్నారు. ఇంతలో ఎదో చిన్న అలజడి, మృధువైన సంగీతంలో విహరిస్తున్న నా మనసుకి ఎదో విఘ్నం. తార్రోడ్డు మీద ప్రయాణిచే బస్సు ఒక్కక్షణంలో కకరరోడ్డు మీదికి వచ్చినట్టుంది. ఏంటీ అలజడి కనుక్కొమ్మని బుఱ్ఱను పురమాయిస్తే అది పనిలో పడింది. పాట సాగిపోతోంది, "పాడేము నేము పరమాత్మ నిన్ను, వేడుక ముప్పదిరెండు వేలలా రాగలను", పట్టేసింది నా బుఱ్ఱ, ఇక్కడే ఉంది అలజడి. "నేము" ఏంటి? తెలుగులో పదం ఉందా? ఏంటబ్బా దీని అర్ధం. అప్పన్నుండి నేము చెదపురుగులా నా బుఱ్ఱను తొలుస్తుంటే సంగీతం మీదికి మనస్సు వెళ్ళనంది. ఏమి చేస్తే నేముకు అర్ధం తెలుసుస్తుంది నాకు?

అలా ఆలోచిస్తుండగా గాయకుడు పాట పూర్తిచేసుకొని ఫోన్లో ఎవరితోనో మాట్లాదదామని కిందికి దిగాడు. ఇంక అవకాశం వదులుకోదలుచుకోలేదు. పరిగెత్తుకుంటూ వాన్ని గట్టిగా పట్టేసుకున్నా, ఎంత గట్టిగా అంటే వాడు ఊపిరాడక మూర్చపొయ్యేంత. వాడు మూర్చపోగానే నాకు భయమేసింది ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు అని. వెంటనే వెళ్ళి ఒక బిందెడు నీళ్ళు తెచ్చి వాడిమీద పోస్తే లేచి కూర్చున్నాడు. హమ్మయ్య లేచాడు అనుకుని, ఇందకా పాడిన పాటలో "నేము" అంటే అర్ధం ఏంటి అని అడిగా. మాత్రం తెలీదా అన్నాడు వాడు. నాకు కాస్త సిగ్గనిపించింది, నాకు మాత్రం తెలుగు రాదా అని. కాస్త స్వరం తగ్గించి అర్ధం ఏంటి అని అడిగా. N A M E, name అంటే పేరు అన్నాడు. భగవంతుని పేరు పాడుకుంటాం అని వాక్యానికి అర్ధం అన్నాడు.  వాడిచ్చిన సమాధానానికి నాకు కళ్ళు బైర్లుకమ్మేసాయి. మెల్లిగా తేరుకుని ఒరే వెధవా, అన్నమయ్యకు నీలా ఇంగ్లీషురాదు అది ఇంగ్లీషు name కాదు అని తిట్టి, మనసులోనే వాడి గుండు పగులగొట్టి, వాడి మానాన వన్నొదిలేసి, ఇప్పుడు దీని అర్ధం ఎలా పట్టాలా అని అలోచిస్తూ కూర్చున్నా.

అక్కడినుండి వచ్చేసినా "నేము" చెదపురుగులా నా బుఱ్ఱను తొలుస్తూనే ఉంది. నేము గురొంచి ఆలోచిస్తూ, నిద్రలోకి జారుకున్నానో లేదో, ఒక భయంకరమైన రాక్షసుడు కళ్ళముందు ప్రత్యక్షమయ్యాడు. చూడగానే ప్రాణం పొయేంత భయంకరంగా ఉన్నాడు. ఎలాగో ధైర్యం చేసుకుని ఎవరునువ్వు అని రాక్షసున్ని అడిగా. వాడు నా పేరు "నేము" నిన్ను నిద్రపోనివ్వను అంటూ వికటాట్టహాసం చేసాడు. వికటాట్టహాసానికి నాకు మెలకువొచ్చేసింది. ఛీ ఛీ "నేము" ఎంటి ప్రశాంతంగా పని చేసుకోనివ్వట్లేదు, కనీసం పడుకోనివ్వడం లేదు అని తిట్టుకుంటూ ఎలా సమస్యను పరిష్కరించాలా అని అలోచిస్తున్నా.

తెల్లారి ఆఫీసుకు వచ్చేసినా చెదపురుగు నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వడంలేదు. అప్పుడర్ధమయింది ముందు నేను "నేము" పనిపడితే కానీ నేను ఇంకేపనీ చేయలేను అని. ఆలోచిస్తూ వాక్యం "పాడేము నేము పరమాత్మ నిన్ను"  కాదేమో "పాడేము మేము పరమాత్మ నిన్ను" అయ్యుండొచ్చు. అప్పుడు వాక్యార్ధం చక్కగా సరిపోతుంది. వీడు తప్పు పాడుంటాడు అని అనుకుని దాన్ని నిర్ధారించుకోవడానికి యంత్రం వేసి మరీ గూగుల్తల్లిని అడిగా. గూగుల్ నా ఆశలమీద నీళ్ళు చల్లింది. అది "మేము" కాదు "నేము" నే అని చెప్పింది. పోనీ నేముకి అర్ధం చెప్పు తల్లీ అంటే నాకు తెలీదుపో అంది. ఛి ఛి ఏదీ కుదరడం లేదు. ఎలా ఇప్పుడు. ఇదెలాగూ ద్రావిడ భాషపదమే కాదా, మిగతా ద్రావిడ భాషవాళ్ళకు తెలిసుండే అవకాశం ఉంటుంది కదా అని పక్కనున్న తమిళ్పిల్లతో "నేము" అని గోముగా అంటే పిల్ల సిగ్గుతో వంద మెలికలు తిరిగిపోయింది. వామ్మో! పిల్లకు ఏమర్ధమయిందో ఏమో, ఇలాంటీ  సాహసాలు మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అని ఒట్టేసుకున్నా. అది మొదలు పగలు చెదపురుగు రాత్రి రాక్షసుడు, నా జీవితంలో ప్రశాంతతే లేకుండా పోయింది.

ఎలా ఎలా ఎలా ఎలా అనుకుంటూ వెళుతున్న నాకు, రోడ్డుమీద ఒక ఆశాజ్యోతి కనిపించింది, మాధాపూర్ ఉన్నత పాఠశాల. మిగతా పనులన్నీ మానుకుని మరీ పాఠశాల్లోకెళ్ళి, అయ్యా నా పరిస్తితి ఇది నేను తెలుగు పండితున్ని కలవాలనడితే కుదరదు తొక్క అని వంద చెప్పాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. డొనేషన్ కింద 5000 తీసుకుని అప్పుడు కుదురుతుందన్నాడు. కుదరడమే కాదు మనిషిని పంపించి టీ కూడా తెప్పించాడు. డొనేషన్ ఇవ్వగానే ఇవ్వన్నీ కుదిరాయా? పంచె కట్టుకుని హుందాగా వచ్చాడు తెలుగు మాస్టారు, చూడగానే తెలుగుదనం ఉట్టిపడుతుంది. అతనికి నమస్కరించి, బాబూ ఇది నా సమస్య దీనికి తరుణోపాయం చెప్పండీ అనడిగితే, తను చూడునాయనా తెలుగులో ఎన్నో పదాలుంటాయి అన్ని తెలుసుకోవాలనుకోకూడదు కొన్ని వదిలెయ్యాలి. అయినా ఆధునిక కాలంలో బ్రతికే నీకు తెలుగు తెలుకోవాలన్న కోరిక ఏంటి చక్కగా ఇంగ్లీషు నేర్చుకో పనికొస్తుంది. అది రాక నా జీవితం ఇలా అఘోరిస్తుంది అని నాలుగు చివాట్లు పెట్టి వెళ్ళిపోయాడు. అహా? ఎంత గొప్ప తెలుగు ఉపాధ్యాయులున్నరు మన పాఠశాలల్లొ, వీళ్ళను చూస్తే అర్ధమవుతుంది తెలుగు భవిష్యత్తేంటో. ఛీ ఛీ తెలుగు ఉపాధ్యాయున్నని చెప్పుకునే కనీస అర్హత కూడా లేదు వీడికి అనితిట్టుకుని అక్కన్నుండి బయలుదేరా. ఇక్కడ నా సమస్య తీరకపోగా వెయ్యిరూకల బొక్క.

అక్కన్నుండి బయటకు రాగానే తెలుగు ఉపాధ్యాయుల్ని పట్టుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న విషయం అర్ధం చేసుకున్న నా బుఱ్ఱ పాదరసంలా పనిచేయడం మొదలెట్టింది. అంతే వెంటనే అసెంబ్లీ వైపు ప్రాయణం మొదలెట్టా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం చేరడానికి. లోపలికెల్లగానే, "వాటు యూ వాంటూ" అని బట్లర్ఇంగ్లీషులో  అడిగాడు అక్కడున్న గుమాస్తా (ఇది తెలుగు విశ్వవిధ్యాలయం కానీ వీళ్ళు మాట్లాడే భాష తెలుగు కాదు). నా సమస్య చెప్పి, నిద్రాహారలు మానసిక ప్రశాంతత లేక కొట్టుమిట్టాడుతున్నా. నన్ను రాక్షసుడు అనునిత్యం వెంటాడుతున్నాడు. వాడిని సంహరించే అస్త్రం సంపాదించడం కోసం ఇక్కడున్న తెలుగు పండితులకు శిశ్రూష చేయాలని వచ్చా అనిచెప్పా. "స్టుడెంట్ ఓన్లీ మీట్ ప్రోఫెసర్, యూ నో స్టుడెంట్, యూ నో మీట్ ప్రోఫెసర్" అన్నాడు. అయినా నిన్నెవడు పట్టించుకుంటాడు నేనే వెళ్ళి కలుస్తా అని కదలబోతుంటే. "యూ గో ఆర్ కాల్ చెప్రాషి" అని అరిచాడు. ( అరుపుకి భవనం ఊగినంత పనిచేసింది. అసలే పాత భవనం, వీడు ఇంకాస్త గట్టిగా అరిస్తే కూలడం ఖాయం.) ఇప్పుడు వీడితో మెడపట్టి గెంటించుకునే సత్కారం నాకు అవసరమా?  అని బయటికి నడుస్తుంటే పైనుండి ఇదంతా చూస్తున్న రాక్షసుడు మరో వికటాట్టహాసం చేసాడు. దాంతో నాకు చెవుడొచ్చిందేమో రోడ్డుమీద వాహనాల హారన్శబ్ధం కూడా వినిపించడం మానేసింది.

ప్రతి ప్రయత్నం వ్యర్ధమయిపోతుంటే నిరాశగా రూంచేరిన నాకు నా మిత్రుడు డిక్షనరీ చూడొచ్చుకదరా అని సలహా ఇచ్చాడు. ఆహా! ఏమి సలహా? ఇంతకాలం నాకు ఎందుకు తట్టలేదు? రాక్షసుడి మహిమ అనుకుంటా, నాకు తట్టకుండా చేసాడు అనుకుని, మిత్రుడికి సాస్టాంగ నమస్కారం చేసి, రాత్రే బండెక్కి కోఠి వైపు పరిగెత్తించా. నేను వెళ్ళేసరికి అప్పుడే మూసేస్తున్నారు కోఠిలోని విశాలాంధ్ర బుక్ హవుస్. బాబ్బాబు ఇది నా సమస్య నేను అతిత్వరగా రాక్షసున్ని చంపాలి, అందుకు సంబంధించిన గ్రంధం కొనుక్కోనివ్వండి అంటే. మా టైం మాకుంటుందండి, మీరు ఎప్పుడు కావలనుకుంటే అప్పుడు వచ్చి తీయమంటే కుదరదు అన్నాడు. నీతో ఇలాకాదు అని వెయ్యి తీసి దాన్ని వాడి జేబులో తోసా. వాడు నవ్వుతూ, మీలాంటివాళ్ళకు సహాయపడటానికే కదా మాకు జీతం ఇచ్చేది అంటూ తలుపు తీసాడు. మనసులో 'ఛా' అనుకుని, లోనికెళ్ళి, శంకరనారాయణ నిఘంటువు, సూర్యాంధాయన నిఘంటువు, శభార్ధ రత్నాకరం, బ్రౌణ్ డిక్షనరి, మొ|| (ఈ పదానికి అర్ధం ఏ నిఘంటువులో అయినా ఉండకపోదా అని, ఉన్న తెలుగు నిఘంటువులు అన్నీ) కొనుక్కుని, వాడికి డబ్బులు కట్టి ఇంటికొచ్చి. ఆత్రంగా ఒక్కో నిఘంటువు తీసి "నేము"కోసం వెతకనారంభించా. దొరికిందీ. నా ప్రయత్నం ఫలించింది. ఆహా! ఇంతకాలంగా నన్ను తొలిచిన చెదపురుగు ఒక్కక్షణంలో చచ్చిపోయింది. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో. పదానికి నాకు అర్ధం తెలియగానే నావైపు భయం భయంగా చూస్తున్న రాక్షసుడినిపై, పుస్తకాన్నే విల్లుగా మలచి, పద అర్ధాన్ని బాణంగా మలచి, బాణాన్ని సంధించా. మరుక్షణం రాక్షసుడు తునాతునలైపోయాడు. హమ్మయ్య ఇంక రాత్రి హాయిగా పడుకోవచ్చు. మళ్ళీ ఇంకెప్పుడు సంగీత కచేరీకి వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకున్నా.

ఇంతకు నేము అంటే ఏంటొ చెప్పలేదు కదూ. నేము అంటే “నేను యొక్క బహువచనరూపము”, “Plu. of నేను, We, మేము.” అంటే మేము. నేము కి అర్ధం మేము అయితే, “పాడేము నేము పరమాత్మ నిన్ను” చక్కగా సరిపోతుంది. అంతే కాదు నాకు నిఘంటువులో ఇంకో కొత్తపదం దొరికింది ఏము. దీని అర్ధం కూడా మేము. మేము అన్నా, ఏము అన్నా, నేము అన్నా అర్ధం ఒక్కటే మేము అని.

2 comments:

  1. racchal..... modati lone nannu talchukunnaavu...... manamiddaram kalisi vellina annamayya geetalu training gurinchi.....

    ReplyDelete
  2. super read sir...

    tappakapote tappite aangla padaalu upayoginchakapovatanni chusi chala muchatesindi..

    ReplyDelete