Saturday, October 5, 2013

పోస్ట్ చేయని ఉత్తరాలు -2


ప్రకృతి ఎంతొ అందంగా, ఆహ్లాదంగా, హాయిగా ఉంటుంది అని అందరికి తెలుసు. అంటే నాక్కూడా తెలుసు.... కానీ ఇష్టమైన మనిషి తోడుంటే ఆ ప్రకృతి అందం, ఆనందం ద్విగుణీకృతం అవుతాయి, ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది... నీతో మాట్లాడుతున్నపుడు. ఇన్నాళ్ళు నాకు తెలియని ఎన్నో కొత్త అనుభూతులు నీ సాంగత్యంలో నాకు అనుభవమవుతున్నాయి. నీతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రశాంతంగా చల్లగాలిలో నిలుచుంటే... ఎంతబాగుందో తెలుసా? నేను అలా చల్లగాలిలో నిలుచోవడం మొదటిసారి కాదు, అలా నిలుచొవడం నాకు చాలా ఇష్టం అందుకే తరచు అక్కడికి వెళ్తా. కానీ నిన్నటి అనుభూతి చాలా అందంగా ఉంది. ఆ చిరుగాలికి తోడు చల్లని నీ మాటలు వింటుంటే.... ఆ చల్లని గాలిలో తేలిపోయినంత ఆనందంగా ఉంది.. తెలుసా. నాకు తెలిసిన అందాన్ని కూడా కొత్తగా మరింత అందంగా పరిచయం చేస్తున్నావు నువ్వు. కవ్వించే చిరుగాలికి, మురిపించే ప్రియురాలు తోడైతే .... ఊ... అమ్మో! ఇంకొక్క మాట మట్లాడితే నన్ను చంపేస్తావు. ఆకాశానికి చందమామే అందం అంటారు కానీ నీ మాటలు నా తోడున్నప్పుడు చందమామ లేకున్నా ఆకాశంలో మబ్బులు కూడా ఎంతో మనోహరంగా కనిపించాయి. కానీ.. మళ్ళీ ఇవ్వాళ అక్కడికే వెళితే ఎందుకో ఆ అనుభూతి కొంచెం కూడా కలగలేదు.. వినడానికి నీ మాటలు లేవు కదా... అందుకేనేమో.. అంతా నీ మాయే కదా..

ప్రకృతి అందం, ఆనందం అన్నీ అనుభవించగల మన మనస్సులేనే ఉంటాయి కదా. మనసు అనుభవించడానికి సిద్ధంగా లేనప్పుడు.. ఎంతటి అందమైన, ఆనందమైన క్షణమైనా.. బూడిదలో పోసిన పన్నీరే కదా.. అలా కాక మనసైన చిన్నది ఆ మనసును స్పందిపంపజేస్తేనో.. అప్పుడో.. ఆ క్షణమే మరింత అందంగా, ఆనందంగా, మనోహరంగా ఉంటుంది... నిన్నటి రాత్రిలా.. అమ్మో! నన్ను కూడా కపిని చేసేస్తున్నావ్... అదికూడా నీ మాయే. అలాంటి మాయలో మునిగిపోయె రాసాడనుకుంటా, 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చేలీ' అని. ఆ కారణమేంటొ నాకిప్పుడు తెలుసుగా.. నీలాంటి అందమైన నిచ్చెలి. ఆ నిచ్చెలి తోడు. అవునూ.. నాకో చిన్న అనుమానం, మనసును స్పందిపంపజేసే ప్రియురాలి తోడుంటే... ఏండ కూడా చల్లగా ఉంటుందా? ఏమో.. ఈ వేసవిలో ప్రత్యక్షంగా పరీక్షించి చూస్తా. మండే ఎర్రటి ఎండలో నిలబడి నీకు ఫోన్ చేస్తా. అప్పుడు ఎండ వేడి గెలుస్తుందో.. నీ చల్లదనం గెలుస్తుందో...

నీలో చల్లదనమే కాదు తీయ్యదం కూడా చాలా ఎక్కువే. అందుకే నీతో మాట్లాడాలంటే చాలా భయం నాకు, ఆ మాటల తీయదనానికి ఎక్కడ మధుమేహం వస్తుందో అని. ఎంత తీయగా మాట్లాడుతావో తెలుసా.. నీతో మాటాడుతూ టీయో  కాఫీయో తాగితే, దాంట్లో పంచదార వేసుకోనవసరం లేదు.. నీకు ఇంత తీయగా మాట్లాడటం ఎలా వచ్చింది? రోజూ బోలెడు చాక్లెట్లు, బోలెడు బోలెడు పంచదార తింటావా? కాదులే. అవ్వే నీలో తీయదనాన్ని నేర్చుకున్నాయి కానీ నీకు వాటి తీయదనం రాలేదులే. నిజం, తీయదనం కన్నా తీయనిదానివి నువ్వు. 'పాలు మీగడలకన్నా, పంచదార చిలకలకన్నా, శ్రీరామ నీ నామమెంతో రుచిరా' అన్నారు రామభక్తులు. రాముడు పేరు అంత తీయగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, నువ్వు మాత్రం అంతకన్నా తీయగా ఉంటావని తెలుసు నాకు.

చల్లగా తీయగా ఉండేది ఏది అని అడిగితే అందరు ఐస్‌క్రీం అంటారు. కానీ నేను మాత్రం నువ్వే అంటా. మరి నిన్ను ఐస్‌క్రీం అని పిలవనా? అదిగో బుంగమూతి, నీ ముక్కుమీది కోపం కనిపిస్తుందిలే. అనను, నిన్ను ఐస్‌క్రీం అనను. ఎందుకంటే ఐస్‌క్రీం కన్నా నువ్వే ఎన్నోరెట్లు తీయగా, చల్లగా ఉంటావు. ఆ తీయదనం ఆ చల్లదనం నన్ను ముంచేస్తే.. నేను నేనుగా ఉండను... అందులో కరిగిపోతా..

ఇట్లు,
నీ...

6 comments:

  1. చాలా బాగుందండీ.. చదవటానికి కూడా తియ్యగా ఉంది..ఊహాలొకాన్ని మొత్తం తియ్యదనంతో నింపేసారు..నిజ జీవితంలో మాత్రం దీనికి తోడుగా కాసిని కారాలు మిరియాలు కూడా ఉంటాయండోయ్ :)

    ReplyDelete
  2. nijamo ooho telidu kani adarakottesaru!!

    ReplyDelete
  3. maree challadanam ekkuvaina kashtamenandoi..mottaniki bagundi.

    ReplyDelete
  4. ఊహ ఎంత అందమయినదో .. మీరు రాసింది అంతా ఊహిస్తూ చదివితే... I m not that Good at Telugu to say. How marvellous it is

    ReplyDelete