Tuesday, October 28, 2014

పోస్ట్ చేయని ఉత్తరాలు -5

నువ్వు హాయిగా, ప్రశాంతంగా పడుకున్నావు. రోజంతా అలసిపోయి నిద్రాదేవి ఒడిలో చేరి సేద తీరుతూ తీయగా కలలు కంటున్నావు. నువ్వు నిద్రపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు నిద్ర రావడంలేదు. మనసంతా అల్లకల్లోలంగా, చికాకుగా ఉంది. ఏవేవో ఆలోచనలు, ఎవరికి చెప్పలేను, చెప్పుకోవడానికి నువ్వు లేవు. నువ్వు లేక నిదుర రాక నిమిషమైన మనసు నిలకడగా ఉండటం లేదు. ఈ రోజంతా నువ్వు నాతో మాట్లాడలేదు తెలుసా. నువ్వు మాట్లాడకుంటే నేను నాలా ఉండను అని నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు మాట్లాడలేదు. నీకు నామీద కోపమో లేక అసహ్యమో తెలీదు. కానీ మాట్లాడలేదు అన్న విషయం మాత్రం తెలుసు. రోజంతా ఏదో చిన్న ఆశ రోజుమొత్తంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడకపోతావా అని. కానీ, ఆ ఆశ అడియాసే అయిపోయింది. ఈ రోజు అయిపోయింది, నువ్వు మాట్లాడనేలేదు.

అయినా నాకు కదా నీ మీద కోపమొచ్చింది. నేను కదా అలగాల్సింది. మరి నువ్వే నా మీద అలిగి మాట్లాడలేదు ఏమిటి? ఇదేమి న్యాయం? నేను అలగాల్సినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద అలుగుతావా? నాకు కోపమొచ్చినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద కోపం చూపిస్తావా? ఇదెక్కడి న్యాయం? అయినా నాకు నీ మీద కోపరావడం తప్పా? కోపం తెచ్చుకునే హక్కు నాకు లేదా? నువ్వు చేసిన పనికి నాకు బాధ కలగడం తప్పా? అందుకు నాకు కోపం రావడం తప్పా? కాదు కదా. మరి నాకెందుకీ శిక్ష? సరె, నీకు కోపం వచ్చిందే అనుకో, వస్తే? మాట్లాడకూడదా? మాట్లాడటం మానెయ్యాలా? కోపం వచ్చినా మాట్లాడొచ్చు కదా? మామూలుగా మాట్లాడటం ఇష్టంలేకపోతే తిట్టొచ్చుకదా? అవేవీ చేయకుండా, రోజంతా మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలి? నేనేమైపోతానో అని ఒక్క క్షణమైనా అలోచించావా?

నువ్వెప్పుడూ అంటుంటావు, "విఘ్నీ, నేనులేకుండా నువ్వు ఉండగలవు కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను" అని. కానీ నిజమేంటో తెలుసా? నాతో మాట్లాడకుండా నువ్వు హాయిగా ఉన్నావు, కానీ నీ కనుచూపైనా లేక నేను సతమతమవుతున్నా. మనసంతా ఏదో వెలితి, చుట్టూ అన్నీ ఎప్పటిలాగే ఉన్నా అంతా గందరగోళం. నాకు నేనుగా పరిపూర్ణం కాదు, నువ్వు లేకుంటే నేను శూన్యమే అని మళ్ళీ తెలిసింది. ఈ క్షణం నువ్వు నిద్రలేచి మాట్లాడితే ఎంత బాగుండు అన్న తపన, నిన్ను నిద్రలేపి మాట్లాడాలన్న ఆరాటం. అన్నీ నాకే. నీకేం నువ్వు చక్కగా బజ్జున్నావు. నేను, నా తలపులు, నా ఆలోచనలు, నా ఊహలు చేసుకోలేని సుదూర లోకాల్లో ఆనందంగా విహరిస్తున్నావు. కానీ ఇక్కడ నేను, నువ్వు ఎప్పుడెప్పుడు నిద్రలేచి నాతో మాట్లాడతావా అని నిద్రలేకుండా ఎదురు చూస్తూ ఉన్నా.

అదిగో, ఉషోదయ సమయం అయ్యింది. నాలో చిగురాశ ఉదయిస్తుంది. నా మీద ఉన్న కోపాన్నంతా ఓ కలలా మరచిపోయి మళ్ళీ నా మీద నీ ప్రేమ కురిపిస్తావని ఆశ. ఉదయ భానుడి లేత కిరణాల్లాంటి వెచ్చని ప్రేమనే నాపై కురిపిస్తావో లేక ప్రచంఢ భానుడి భగభగల్లాంటి నీ కోపంలో నన్ను దహించివేస్తావో చూడాలి మరి.


నీకిదే నా సుప్రభాత లేఖ..

Sunday, October 26, 2014

చినుకులు

ఈశాన్య ఋతుపవనాల వళ్ళ అనుకుంటా పొద్దున్నుండీ జల్లు కురుస్తూ ఉంది. ఈ ముసురు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. వరండాలో నిల్చుని చెయ్యి చాచి చూస్తే సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈ చినుకులు నన్ను ఏమి చేస్తాయి అనుకుని అలా నడుద్దామని బయలుదేరితే చల్లగా పలకరించింది వాన చినుకు. అది మీద పడగానే ఝల్లు మంది, అయినా హాయిగానే ఉంది. అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నా, నా ఆలోచనలు మాత్రం నీ చుట్టే. నీ ఆలోచనల్లో నేను మునిగిపోయుంటే, చినుకు చినుకుగా ముంచేస్తుంది నన్ను ఈ వాన. పడేది ఒక్కో చినుకే కానీ నాకు తెలియకుండానే మెల్లమెల్లగా తడిసిపోతున్నా. ఈ వానకూడా నీలాగే మెల్లమెల్లగా నాకే తెలీకుండానే నన్ను తడిపేస్తుంది.

నీ ప్రేమకూడా ఒక్కో చినుకుగా నన్ను తడిపేసింది. అందులో నేను తడుస్తున్నా అన్నవిషయం నాకు అర్ధమయ్యే నాటికి అందులో పూర్తిగా మునిగిపోయా. ఎప్పుడు మొదలయ్యిందో తెలీదు కానీ మొదట్లో నీ నవ్వు కోసం ఎంతగానో ఎదురు చూసేవాన్ని. అంతగా ఎదురుచూస్తే దొరికే నీ నవ్వు ఒకేఒక్కక్షణం.  ఆ ఒక్క క్షణం నవ్వుకోసం ఎంతగా ఎదురు చూసేవాన్నో నీకేం తెలుసు. ఎన్ని గంటలు ఎదురుచూసినా కానీ, నీ చిరుమందహాసాన్ని చూసిన ఆక్షణం ఎదురుచూపు చాలా తక్కువనిపించేది. నీ నవ్వు నీ పెదవులపైనే కాదు, నీ కళ్ళల్లొ కూడా అందంగా కనిపిస్తుంది. నీ మనసులో ఉన్న ప్రశాంతత మొత్తం నీ నవ్వులో కనిపిస్తుంది. ఆ ప్రశాంతత నాకు చాలా హాయిగా అనిపించేది. నీ కళ్ళల్లో నాపై నింపుకున్న అభిమానం, నువు చెప్పకున్నా నీ కళ్ళు చెప్పేవి. నీ కళ్ళు చెప్పే ఆ అభిమానం నిజమో అబద్దమో తెలీదు కానీ అది నిజమని అనుకోవడమే నాకు తృప్తిగా ఉండేది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు ఓ పెద్ద మాయావివి. నీ కంటి చూపులోనే ఏదో తెలీని మాయుంది. నీ నవ్వు, అమ్మో! అది మరీ పెద్ద మాయ. ఆ మాయ నన్ను నీ వైపు లాగేస్తుందని నాకు తెలియనే లెదు.

నీ నవ్వుకోసం నా ఎదురు చూపు, నీకోసం ఎదురుచూపుగా ఎప్పుడు మారిందో నాకు తెలీనేలేదు. నువ్వు నా కళ్ళ ఎదురుగా ఉండాలి, నీతో మాట్లాడాలి.  ఎంత ఎక్కువసేపు కుదిరితే అంత ఎక్కువసేపు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అని అడగకు, నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఏదో మాట్లాడాలి. నాలో ఈ మార్పు వస్తున్న క్షణం మాత్రం నాకు అర్ధమయ్యింది నాలో ఏదో మార్పు వస్తుందన్న విషయం. నేను నీకోసం ఎదురు చూస్తున్నా అన్న విషయం, నీతో మాట్లాడాలని తపన పడుతున్నా అన్న విషయం. నీకీ మార్పు అవసరమా అని నన్ను మెత్తగా మందలించింది నా బుద్ది, కానీ మనసు మాత్రం నాకిది చాలా బాగుంది నాకిదే కావాలి అని నిక్కచ్చిగా చెప్పింది. అయినా బుద్ది మాట వినడానికి నేనేమన్నా మహా యోగినా? అందుకే, మనసుదే పైచేయి అయ్యింది. అప్పటినుండి నీకోసం ఎదురు చూడటం, నీతో మాట్లాడటం, నీతో చాట్ చెయ్యడం నా రోజూ వారి దినచర్యలో అతి ముఖ్య భాగాలు అయిపోయాయి. ఎంతగా అంటే, అవి లేకుంటే ఆ రోజు రోజులా ఉండనంతగా, అవి లేకుంటే నేను నాలా ఉండనంతగా, నిదుర లేచినప్పటి నుండి, పడుకునేంత వరకు నువ్వుతప్ప వేరే ధ్యాస లేనంతగా. అదిగో, అప్పుడు తెలిసింది మెల్లమెల్లగా నీ ప్రేమ చినుకుల్లో నేను తడిసిపోయా అని.


ఈ చినుకులు నన్ను పూర్తిగా తడిపేసాయి. జుట్టులోంచి చుక్క చుక్కలుగా నీళ్ళు కారుతున్నాయి. చొక్కా మొత్తం తడిసిపోయింది. రోడ్డు మీద కనుచూపుమేరలో ఎవరూ లేరు. చలికి శరీరం సన్నగా వణికిపోతుంది. ఇంక వెనక్కి వెళ్ళాలి తప్పదు. ఈ వాన చినుకులకన్నా నీ ప్రేమ చినుకులే ఎంతో బాగున్నాయి. ఇప్పుడు నీ మాటల చినుకులు దొరకవేమో కానీ నీ జ్ఞాపకాల చినుకులనుండీ నన్నెవ్వరూ దూరం చేయలేదు. ఇంటికెళ్ళి వాటిలో తడుస్తా.

Thursday, September 4, 2014

నిదురించవే నా చెలి

నా హృదయంలో నిదురించే చెలి, కలల్లో కాక కళ్ళేదురుగా నిదురిస్తే? ఆ రోజు ఒకటొస్తుందని అది ఏదో ఓ మాయలోకి తీసుకెళ్తుందని నేనేనాడూ అనుకోలేదు. అనుకోని అదృష్టం వరమై కళ్ళముందు నిలిస్తే? గలగలా మాట్లాడుతూ, అందంగా నవ్వుతూ, కళ్ళతోనే కవ్విస్తూ, చిరుకోపం నటిస్తూ, మూతిముడుస్తూ, ప్రేమ ఒలికిస్తూ…. మాట్లాడుతూ, పోట్లాడుతూ.. ఆ మాటల్లోనే మెల్లిగా నువ్వు నిద్రలోకి జారుకున్న ఆక్షణం... కళ్ళెదురుగా ప్రియురాలు నిద్రిస్తూ ఉంటే ప్రేమికుడి మనసులో కలిగే మధురానుభూతి నాకు మొట్టమొదటిసారి తెలిసింది. కళ్ళు మూసుకుని అందంగా, అమాయకంగా, చిట్టి పాపలా కనిపించే నీ నగుమోము తదేకంగా చూస్తూ రెప్పవేయడం కూడా మరచిపోయా నేను. రెప్పవేస్తే ఆ రెప్ప పాటు కాలంలో ఎంత అందాన్ని, ఆనందాన్ని కోల్పోతానో అని రెప్పవేయనివ్వలేదు నా మనసు.  నిదురలో కూడా నీ పెదాలపై ఏమాత్రం చెరిగిపోని చిరునవ్వు.. నగుమోము అంటే ఏమిటి అని అడిగేవాళ్ళకు ఇదిగో ఇదే అని చూపించాలనుంది. ఆ నగుమోము ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. తీరుతుందన్న ఊహ కూడా లేదు.

నువ్వు మెలకువగా ఉన్నప్పుడు నిన్నే చూస్తే ‘ఏయ్ అలా చూడకు’ అని తల తిప్పుకుంటావు. కానీ ఇప్పుడు నేను ఇలా ఎంతసేపైనా చూసెయ్యొచ్చు. నీకు తెలీదుగా! తెలిసాక కొట్టవుగా? కాలం ఇక్కడే ఇలాగే ఆగిపోతే జీవితమంతా నిన్ను ఇలాగే చూస్తూ గడిపేయాలనుంది. కానీ.. పక్షుల కిలకిలలలాంటి నీ గలగలల మాటలు, నీ తిట్లు, నీ కోపాలు తాపాలు, ప్రేమ ఇవ్వన్నీ లేకుండా నేను ఉండగలనా? కుదరదు. నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ మైమరచిపోయే ఆ క్షణాలు లేకుండా నేను ఉండగలనా? ఊహూ. ఉండలేను. అంటే నువ్వు మెలకువలో కూడా ఉండాలి మరి. ఏంటో నా మనసులో ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలు. అదంతా మీ మాయే. ఆ మాయతో నిండిన మనసుతో నున్ను చూస్తుంటే, ఈ ఆనందం మరింతా అనందంగా ఉంది. అలా చూస్తున్న నాకు ఈ అందమైన క్షణాన్ని ఫొటోలో బంధించాలనిపించింది, కానీ దానికి నా మనసు ఒద్దంది.. నీ అందమైన ఈ రూపాన్ని తనలో బంధిచుకున్నా అంది.. ఎప్పుడు ఎక్కడ చూడాలనుకున్నా తనలో ఈ ప్రతిమ ఉండగా ఫొటో ఎందుకు అంది. ఇక మనసు మాట వినక తప్పలేదు.

నిన్నలా చూస్తున్న నా మనసు ‘నిదురించే ప్రియురాలి పెదాలపై ముద్దు దొంగిలిస్తేనో? అంతకన్నా అందమైన దొంగతనం ఉంటుందా’ అని నన్ను ప్రేరేపించింది. ఆ మనసు మాట వినాలనే ఉంది కానీ ఆ ముద్దు నీకు నిద్రా భంగం కలిగిస్తుందేమో అని మిన్నకుండిపోయా. గట్టిగా శ్వాసిస్తే ఆ శబ్ధానికి నీ నిదుర చెదిరిపోతుందేమో అని దాదాపు ఊపిరి పీల్చడమే మానేసా. నా వైపు తిరిగి నాతో మాట్లాడుతూ కుడిచేతిపై పడుకుని నిద్రలోకి జారుకున్నావు నీవు. ఇప్పుడు నిద్రలో ఉన్నా నువ్వు నన్నే చూస్తున్నట్టుగా ఉంది నాకు. నా వైపు చూస్తూ మూసిన ఆ కనురెప్పలు, తెరిచిన మరుక్షణం నువ్వే కనిపించాలి అన్నట్టుగా ఉన్నాయి. కళ్ళకు కాటుకందము అంటారు కానీ కాటుక పెట్టకున్నా కాటుక కళ్ళ సోయగం నీ కళ్ళది. నిద్రలో నీవు ఇంత అందంగా ఉంటావని నాకు తెలీదు. ముగ్ధ మనొహరానికి ప్రతిరూపమైన నీ మోము, సన్నగా వీస్తున్న ఏసీ గాలి ఆ గాలికి మెల్లగా కదులుతున్న నీ కురులు, నువ్వు శ్వాసిస్తుంటే లయబద్దంగా పైకి కిందికి కదులుతున్న నీ చేయి, రేకులు ముడుచుకున్న మొగ్గలాంటి నీ కళ్ళు. ఇలా నీలోని ప్రతి అందాన్ని ఎంతగా చూసినా ఇంకా ఇంకా చూడాలనే ఉంది. నీలోని ఓ అందాన్ని చూస్తే ఇంకో అందాన్ని చూడలేకున్నా. నీ అందాన్ని అంతా తనివితీరా చూడటానికి నా రెండుకళ్ళు చాలడంలేదు. ఇంత అందమైన నా ప్రియురాలు నిద్రిస్తున్న ఈ గదిలో ఏసీ గాలా?  ఊహూ వద్దు, సహజ సిద్దమైన చల్లని పైరగాలితో, పూల గుమగుమలతో నింపమని ప్రకృతిని అడుగుదామని కిటికీ వైపు చూస్తే అందులోంచి దొంగ చంద్రుడు నిన్ను చూడాలని తన వెన్నెల కిరణాలతో నిన్ను తాకాలని పరితపిస్తున్నాడు. ఆ దొంగ నిన్ను తాకకుండా కిటికీ తలుపులు మూయాలని ఎంతగా అనిపించినా మూయలేని అశక్తత నాది. అదిగో, అంతలో నీలో చిన్న ఉలికిపాటు, ఆ ఉలికిపాటుకి ఎక్కడ నీ నిద్ర చెదురుతుందో అని కలత చెందింది నా మనసు. కానీ ఆనందకరమైన విషయం ఏంటంటే నీ నిదుర చెదరలేదు. వెళ్ళకిలా తిరిగి, కుడిచేయి మడిచి తలపక్కన పెట్టుకుని పడుకున్నావు. ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సంపూర్ణంగా కనిపిస్తుంది చంద్ర బింభంలాంటి నీ మోము. ఇప్పుడు రమ్మను ఆ చందమామను. ఎందుకొస్తాడు? రాడు. నీ అందం ముందు తను దిగదుడుపని అవమాన పడలేక వెళ్ళి మెఘాలవెనక దాక్కున్నాడు. ఓ అందమైన పువ్వుని ఎటునుండి చూసినా అందంగానే ఉంటుంది. నీ అందాన్ని చూస్తుంటే నాకు ‘సొగసు చూడ తరమా నీ సొగసు చూడతరమా’ అని పాడాలనిపించింది. కానీ పాడితే.. అమ్మో! నీకు నిద్రా భంగమైపోదూ..

అలసి సొలసి నిదురించే నా చెలి అలసట తీర్చడానికి అందమైన కలగా మారి తన కన్నుల్లో చేరాలనుంది. ఆ కలలో అలసిన చెలి మనసుకు నే ఊరటనవ్వాలనుంది. గువ్వల్లా రెక్కలు కట్టుకుని ఊహాలోకాలకు ఎగిరిపోవాలనుంది. ఈ రేయి గడిచి తెలవారితే, ఉషోదయవేళలో చిరునవ్వుతో నీకు సుప్రభాతం పాడాలని ఎదురు చూస్తోంది నా మది. అందాకా నిదురించవే నా చెలి.

Friday, April 18, 2014

పోస్ట్ చేయని ఉత్తరాలు -4

రెండే రెండు నిమిషాల క్రితం ఎంతో ఆనందంగా ఉన్న నాకు ఇప్పుడు చాలా దిగులుగా ఉంది. అది ఎందుకో నీకు తెలుసు, నా ఆనందానికైనా బాధకైనా కారణం నువ్వే అని నీకు తెలుసులే. నా ఆనందమే నువ్వైనప్పుడు నువ్వులేని నాకు ఆనందం ఎలా ఉంటుంది? సమయం అంతలొనే ఎంతలా మారిపోయింది. సాయంత్రం నీతో కలిసి కాఫీడేలో కాఫీ తాగినప్పుడు, ఆ తరువాత నీతో కలిసి డిన్నర్ చేసినప్పుడు, పావు గంట క్రితం నీతో కలిసి ఐస్‌క్రీం తిన్నప్పుడు నీ తోడులో, నీ మాటల లాలనలో, నీ చూపుల జల్లులలో మైమరచి ఆనంద తీరాల్లో విహరించిన నా మనసు ఇప్పుడు ఒంటరిదైపోయింది.

నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి మరీ బస్ ఎక్కించా. అదిగో, నిన్ను తీసుకుని ఆ బస్ వెళ్ళిపోతుంది. దాన్ని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నిన్ను నాకు దూరం చేస్తున్నందుకు దాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోతున్నావ్.. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నావ్. నువ్వు వెళ్ళిపోతే హైదరాబాద్ నిన్ను మిస్ అవదు, కాఫీడే నిన్ను మిస్ అవదు, ఐస్క్రీం పార్లర్ మిస్ అవదు.. కానీ నేను నిన్ను మిస్ అవుతా, చాలా మిస్ అవుతా… నా మనసులో తీరని వెలితి.. నువ్వు తప్ప మరేది గానీ, మరెవ్వరు గానీ పూడ్చలేని వెలితి.. అది నీకు అర్థం కావడంలేదా? అర్థం అయితే నువ్వు బస్ దిగి రావెందుకు? మొన్న అదేదో సినిమాలో చూసా హీరో మనసులోని బాధ అర్థమయిన హీరోయిన్ విమానంలోంచి దిగి మరీ వస్తుంది. కానీ నువ్వు బస్‌లోంచి కూడా రావడంలేదు ఎందుకు?

నీకు తెలుసు. నువ్వు తప్ప నాకు మరోలోకం లేదు అని నీకు తెలుసు. నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను అని నీకు తెలుసు. నాలాగే నువ్వుకూడా బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ తప్పదు వెళ్ళాలి. తప్పదు. మనకీ క్షణం ఎడబాటు, విరహం తప్పదు. జీవితంలో ఎన్నో బంధాలు బాధ్యతలు, వాటికోసం తప్పదు. అసలు ప్రపంచంలో మనిద్దరం తప్ప బంధాలు, బాధ్యతలు లేకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎప్పుడైన నాకు దేవుడు కనిపిస్తే అడుగుతా నువ్వు నేను తప్ప మరేవ్వరూ లేని లోకం సృష్టించమని. అక్కడ ప్రతి నిమిషం నువ్వు నాతోనే, నువ్వు నాకు దూరమయ్యే క్షణమే కాదు, దూరమవుతావనే ఊహ కూడా కూడా ఉండదు. ఊహ కూడా చాలా బాధగా ఉంటుంది తెలుసా.

నువ్వు రెండు రోజుల్లో మళ్ళీ హైదరాబాద్లో ఉంటావని తెలుసు. ఎడబాటు కేవళం రెండేరోజులనీ తెలుసు. రెండురోజులు కూడా మొబైల్లో, వాట్స్ఆప్లో ఉంటావనీ తెలుసు. తెలిసీ బాధపడుతోంది నా మనసు. నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా మాట్లాడుకునేది మొబైల్, వాట్స్ఆప్ల్లోనే; నువ్వు ఊరు వెళ్ళిపోయినా అవి ఉంటాయి అనీ తెలుసు. కానీ ఏదో లోటు, మాటల్లో చెప్పలేని వెలితి. నువ్వు ఇప్పుడు ఊరిలో లేవు అన్న చిన్న భావనే నాకు చాలా దిగులుదా ఉంది. నువ్వు ఉన్నప్పుడు ఎంతో అందగా కనిపించే నగరం ఇప్పుడు బోసిపోయినట్టుంది. ఇంతసేపు చల్లగా ఆహ్లాదకరంగా వీచిన గాలి ఇప్పుడు వడగాలిలా తోస్తోంది. నువ్వు ఎప్పుడు ఇంటికెళ్ళినా నా పరిస్తితి ఇంతే.  ఇదేంటో నా పిచ్చి... అది నీ పిచ్చి.

కీ… కీ.. వాట్స్ఆప్ శబ్దం, అది నీ మెసేజే. అప్పుడే నువ్వు వెళ్ళి 300సెకన్లు దాటింది. నిన్ను తీసుకెళ్ళిన బస్ కనుమరుగయిపోయింది. ఇంక ఇక్కడ ఒక్కక్షణం ఉండాలని లేదు. ఇంతమందిలోనూ నెను ఒంటరిగా మిగిలిపోయా.. నీవులేనప్పుడు ఎవరుంటే ఎమి.. నా ఒంటరితనాన్ని దూరం చెయ్యగలరా?... ఇంటికెళ్ళి నీ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. నా ఈ పిచ్చి ఆలోచనలన్ని ఉత్తరంగా రాసి నువ్వు రాగానే నీకందిస్తా..

నీ రాకకొసం ఎదురుచూస్తూ..


నీ...

Saturday, January 4, 2014

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

కాల చక్రం మరో భ్రమణం పూర్తి చేసుకుంది, నూతన సంవత్సరం రానేవచ్చింది, అభినందనల సందడులు హడావిడులు సద్దుమనిగాయి, మళ్ళీ అంతా మామూలు అయిపోయింది, కొత్తసంవత్సరానికి అందరు అలవాటుపడిపోయారు. కానీ నవ వసంతానికి స్వాగతవాక్యం పలకాలన్న నా కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంక లాభంలేదు అని మనసు చెవి మెలివేసి, కూర్చోబెట్టి ఏదైనా చెప్పు నేను రాస్తా అంటే, ఎందుకో నా మనసు భావాన్ని పలకలేను అని మౌనంగా ఉండుపోయింది. పోయిన సంవత్సరం రాసినకొత్త సంవత్సరానికి స్వాగతం’ను చదివి చూడు, అప్పుడైనా ఏవైనా కొత్త తలపులు తలుపు తడుతాయేమో ప్రయత్నించు అంటే మళ్ళీ పాత భావాలే పలుకుతా అంటుంది.

ఏమైంది ఈ మనసుకివాళ? ఎందుకీ మౌనం? ఏమిటీ నిరాసక్తత? ఎప్పుడూ నాతో ఏదో ఒక కత చెప్పే ఈ మనసు ఇవ్వాళ నేను చెప్పమని అడిగినా స్పందిచదెందుకు. మనసు ఏమి ఆలోచిస్తుందా అని తొంగి చూస్తే.... ఏ సంవత్సర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. వచ్చేటప్పుడు ఆశపెడితే, వచ్చాక ఏడిపి స్తుంది. ఆశలన్నీ నిరాశలయితే, కలలన్నీ కల్లలయితే, పన్నీరుగా కనిపించినవన్నీ నిజానికి కన్నీరని తేలితే.. ఆ సంవత్సరమంతా బాధను దిగమిందుకుని మళ్ళీ కొత్తసంవత్సరానికి ఆశతో స్వాగతం పలకనా? ముందున్నది నిరాశే అని తెలిసి ఆశపడనా? ఆశపడి భంగపడనా?...  ఆలోచన రాగానే నైరాశ్యంతో laptop పక్కన పడేసి కళ్ళుమూసుకున్నా....

"క్లైబ్యం మాస్మగమః" ఎక్కడినుండో వినిపించింది కంఠం. ఎవరా అని చూస్తే ఎదురుగా శ్రీ కృష్ణ పరమాత్మ, భగవద్గీతలో నుండి చిరునవ్వు చిందిస్తూ కనిపిచాడు. చిరునవ్వు సకల దుఃఖాలను పారద్రోలే ఆనంద స్వరూపంతో శోభిస్తుంది. దివ్య మంగళ చరణాలకు మనసులోనే ప్రణమిల్లు వేళ,
స్వామి: క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే| క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప||
(ఈ శ్లొకం ఎక్కడో విన్నట్టు అనిపించి, బాగా ఆలోచించి)
 నేను: స్వామీ! శ్లోకం మీరు గీతలో అర్జునికి చెప్పారు కదా, మరి ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారు?
స్వామి: అనాడు అర్జునుడు కర్తవ్యాన్ని వీడి హృదయ దౌర్భల్యాన్ని పొందాడు. ఈనాడు నీవు భవిష్యత్తు అంటే భయంతో హృదయ దౌర్బల్యాన్ని పొందావు. పిరికి తనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యమును వీడి, కార్యోన్ముఖుడవు కమ్ము. తప్పక లక్ష్యాన్ని పొందుతావు.
నేను: కానీ స్వామీ! టెర్రరిస్ట్ బాంబు పేలుళ్ళు వాటిలో ఎంతో మంది అమాయకుల మరణం, రైలు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. ఇవ్వన్నీ ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. సంవత్సరం కూడా వింటాను చూస్తాను. అలా చనిపోతున్నవారిని గురించి ఆలోచనవస్తేనే మనసు వ్యాకులత చెందుతుంది.
స్వామి: గతాసూన గతాసూంశ్చ నానుసోచంతి పండితాః
వివేకం కలవారు చనిపోయిన వారిని గురించి కానీ, బ్రతికి ఉన్నవాళ్ళను గురించి కాని బాధపడరు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాన్తరప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతి||
మనుష్యునకు ఈ దేహమున బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొకదేహమును పొందుటకూడ అటువంటిదే. కావున ఈ విషయమై చింతించకుము.
జాతస్య హి ధృవో మృత్యుః - పుట్టినవానికి మరణము తప్పదు అని గ్రహించి శోకింపకుండుము.
నేను: సరే స్వామి! మీరు చెప్పారు కనుక ఆ విషయం వదిలేస్తా. ఒక నిమిషం నా విషయమే ఆలోచించుకుందాం. ప్రతిసంవత్సరం ఏదో చేయాలనుకోవడం, ప్రయత్నించడం, విఫలమవడం మళ్ళీ బాధపడటం. అవి పొందలేకపోతున్నా అన్న ఆలోచనతో, పొందలేనేమో అన్న బాధతో వాటికోసం ప్రయత్నించాలన్న ఇచ్చ కూడా కలగడం లేదు. దీనికి నీ సమాధానం ఏంటి స్వామీ?
స్వామి: ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే| సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే||
క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్బుద్ధినాశో, బుద్దినాశాత్ ప్రణశ్యతి||
నీవు నీ కోరికల గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకే సంకట స్తితి.
మనుష్యులు విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారో దానిపై వారికి అనురాగం కలుగుతుంది, అనురాగం కామముగా మారుతుంది. అవి నెరవేరనిచో క్రొధం కలుగుతుంది. క్రోధం వలన అవివేకం ఆవేశం కలిగి తనను తాను మరచిపోతాడు. అజ్ఞానంతో అవివేకంతో ప్రవర్తిస్తాడు.
కనుక నీవు కోరికల గురించి ఎక్కువగా ఆలోచించకు, నీవు చేయవలసిన పనులను కేవలం బాధ్యతగా నిర్వర్తించు.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ| తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి||
యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయ| సిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే||
నీవు ఫలితమునందు ఆసక్తిని వదలి యోగ భావనతో నీ పనులను నిర్వర్తించు. సుఖ, దుఃఖాలను జయాపజయాలను సమానంగా భావించి కేవలం కర్తవ్య నిర్వహన కోసం కార్యోన్ముఖుడవు కమ్ము. నీవు కోరుకున్న ఫలితం కలిగినా కలగకున్నా సమాన భావంతో స్వీకరించు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||.
నీ కర్తవ్యం ఉద్దేశించినటువంటి పనులను చేయడానికే నీకు అధికారం ఉంది. దాని ఫలితాన్ని నిర్దేశించే అధికారం నీకు లేదు. ఫలితం మీద అధికారం లేదు కదా అని కర్మలను చేయటం మానకు. నీవైపు నుండి నీ కర్తవ్యాన్ని ఫలాపేక్షరహితుడివై నిర్వర్తించు.
అయితే నీ కర్మకు ఫలితం రాదేమో అని నిరాశ చెందకు
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం
ఎవరెవరు ఏయే విధంగా నన్ను పూజిస్తున్నారో, ఎవరు ఎయేవిధంగా నిష్కామ కర్మ అనుసరిస్తున్నారో వారికి వారి వారి కర్మానుసారంగా ఫలితాన్ని ప్రసాదిస్తున్నాను.
నిష్కామ భావంతో ఫలితం గురించి ఎదురు చూడకుండా జయాపజయాలను సమాన భావంతో అంగీకరిస్తూ నీ కర్మలు ఆచరించు. దానికి తగిన ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను.
నేను: స్వామీ! కానీ ఇదంతా నేను ఆచరించగలనా? నా మనస్సు నిష్కామ కర్మను చేయగలదా? అది ఎప్పుడు ఫలితం గురించే ఆలోచిస్తుంది.
స్వామి: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్| అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే||
అవును మనసుని నిగ్రహించడం చాలా కష్టసాధ్యమైన విషయమే. కానీ నిరంతర ప్రయత్నంతొ అభ్యాసించడం వలన దానిపై నిగ్రహాన్ని సాధించవచ్చు.
నేను: (మనసులో - అవును నిరాశ చెంది ప్రయోజనం లేదు. నా వంతు కర్తవ్యాన్ని ఫలితం దక్కదేమో అని నిరాశ చెందక నూతనోత్సాహంతో చేయవలసిన నిర్వర్తిస్తా- అనుకుని; స్వామీతో) స్వామీ| రేపు నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుంటాను. నీకు కొబ్బరికాయ కొట్టనా, లేక పూజ చేయించనా?
స్వామి: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి| తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః||
డాంబికాలకు పోకు. నిర్మలమైన భక్తితో నీవు ఏది సమర్పించినా మిక్కిలి ప్రేమతో స్వీకరిస్తా. అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, మరేదైనా. భక్తిలేకుండా దాంబికంగా నీవు గుడికట్టించిననూ అది నన్ను చేరదు.
నేను: (మనసులో) - నిష్కామ భావంతో సకల కర్మలు నిర్వర్తించాలి అది పూజ అయినా సరే అని ఆలోచిస్తుండగా.. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ నిబోధత అని మేలుకొలుపు వింపించింది.

కఠోపనిషత్తు నుండి యమ ధర్మరాజు "ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్.." (లే, మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో.. Arise, awake, and stop not till the goal is reached) అంటూ కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు. అది విన్న నా మనసులో స్వామీ వివేకానంద చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. “దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు నాశనమైనట్టే. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికి మహా కారణం భయమే. మూఢనమ్మకాలన్నింటిలోకి పెద్దది భయమే మన దుఃఖాలన్నింటికి కారణం భయం. నిర్భయత్వం మనిషికి ఒక్కక్షణంలో ముక్తిని తెచ్చిపెట్టగలదు. కాబట్టి, ‘లేవండి! మేల్కొనండి! గమ్యాన్ని సాధించేవరకు ఆగకండి’” అన్న మాటలు.
ఎంత అందమైన పిలుపు, భయాన్ని వీడి కర్తవ్యాన్ని నిర్వర్తించమంటూ అలా ప్రయత్నించి మన భవిష్యత్తును మనల్నే నిర్మించుకొమ్మని. మూర్ఖులు, అజ్ఞానులు తమ శక్తిని నమ్మకుండా అదృష్టాన్ని, జాతకాన్ని నమ్ముతారు. మరి నేను కూడా ఆ మూర్ఖుళ్ళో ఒకన్నా? కాదు. అలా ఏనాటికి కానివ్వను. నేను నా శక్తితో నా భష్యత్తును రచించుకుంటా. ఏ జాతకానికి ఏ గ్రహానికి తలొంచని భవిష్యత్తును నిర్మించుకుంటా. గ్రహాల ప్రభావం ఉండొచ్చుగాక దాని ప్రభావాన్ని ఎదురించి నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి నాకు ఉంది.  నిరాశ, నిస్పృహలతో బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ముల్లోకాలను నా పాదాల చెంతకు చేర్చుకునే శక్తి నాలో ఉంది. ఆ శక్తిముందు ఏ దుష్ట శక్తి, దుష్ట గ్రహం నిలువలేదు.

మన ఆలోఛనలే మన శీలాన్ని నిర్ణయిస్తాయి కదా. మన ఆలోచనలే మన ప్రస్తుత పరిస్తితిని, రేపటి గమ్యాన్ని నిర్ధారిస్తాయి కదా. ఒక్క చెడు ఆలోచన జీవితాన్ని అథః పాతాలనికి తీసుకుపోగలదు అలాగే ఒక్క మంచి ఆలోచన మనల్ని విశ్వవిజేతను చేయగలదు. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో, గెలుపును శాసించగలమనే ధైర్యంతో, మన శక్తి మీద నమ్మకంతో, ఓటమి భయంలేకుండా కర్తవ్యనిర్వనకు ముందడుగేద్దాం.
మిత్రులారా! రండి.. ఈ కొత్త సంవత్సరంలో గెలుపుని పాదాక్రాంతం చేసుకుందాం..


బ్లాగు మిత్రులందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.