Monday, April 22, 2013

ఆది దేవుడు

ఆదిదేవుడు ఎవరని అడిగితే మనలో చాలా మంది మరో ఆలోచన లేకుండా శివుడు అని చెప్పేస్తారు. విషయం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది పండిత పామరులందరూ అంగీకరించే సత్యమా? అలా అని మీరనుకుంటే ఒక్కసారి వెళ్ళి వైష్ణవులతో ‘శివుడు ఆదిదేవుడు’ అని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఇస్కాన్ వాళ్ళకు చెప్పండి. ఒక్క వైష్ణవులే కాదు శాక్తేయులు, సౌరులు, గాణాపత్యులు, కౌమారులు మొదలగు వారెవ్వరు శివుడు ఆదిదేవుడంటే ఒప్పుకోరు. ఎవరి దైవం వారికి ఆదిదేవుడే. ఒకరి దైవాన్ని ఆదిదేవుడంటే ఇంకొకరు ఒప్పుకోరు. వీళ్ళందరిని ఒప్పించేలా చెప్పే జ్ఞానం నాకు లేదు. అందుకే విషయాన్ని ఆధ్యాత్మికంగా కాక శాస్త్రీయంగా సమీక్షిస్తున్నా.

సమీక్ష మొదలెట్టేముందు ఒక చిన్న ప్రశ్న, మనిషి దేవున్ని సృష్టించాడా లేక దేవుడు మనిషిని సృష్టించాడా? హేతువాదులయితే వెంటనే మనిషే దేవున్ని సృష్టించాడు అని చెప్పేస్తారు. మరి ఆస్తికులేమంటారు? హిందూ మతానికి మూలమైన వేదాల్లో భగవంతుండి ఆకరాన్నిగానీ రూపాన్నిగాని ప్రస్తావించే మంత్రాలు లేవు. వేద మంత్రాల ప్రకారం ప్రకారం భగవంతుడు నిరాకారుడు, నిర్వికారుడు. భగవంతుడి రూపాన్ని లక్షణాల్ని స్తుతించే, "శుక్లాంబర ధరం", "శాంతాకారం భుజగ శయనం", "శరదిందు వికాస మందహాసం", "నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ" మొదలగు శ్లోకాలన్నీ తరువాత కాలంలో వచ్చినవే. అలా అయితే భగవంతునికి రూపం మానవుడు ఆపాదించిందేనేమో కదా. హేతువాదంగా చూసినా, ఆస్తిక భావనతో చూసినా భగవంతుడి రూపం మానవ సృష్టి అవడానికి అవకాశం ఉంది. కనుక ఒకవేళ భగవంతుడి రూపం మానవ కల్పితమే అయితే, మనిషి రూపాన్ని ముందుగా కల్పించుంటాడో రూపన్ని ఆదిదేవుడు అనొచ్చేమో కదా. ఇక పరిశీలనలోకి వెళదాం…

జీవపరిణామ సిధ్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడని మనకు తెలుసు. మనిషి కోతి రూపంలో ఉన్నప్పుడే భగవంతున్ని సృష్టించాడనుకోవడంలో అర్ధంలేదు. మనిషి ఆదిమానవుడి రూపంలో ఉన్నప్పుడు భగవంతుని గురించి అలోచించుండాలి, భగవంతుడికి రూపం కల్పించుండాలి. భూమిమీదున్న మిగతా జంతు జాతుల్లో ఒకడయిన ఆదిమానవుడు భగవంతుడి గురించి ఎందుకాలోచించాడు? మిగతా జంతువులకు లేని అవసరం మనిషికే ఎందుకొచ్చింది? అందుకు కారణం చావు అయ్యుండాలి. జీవిత కాలం తనతో తోడుగా ఉన్న మనిషి, నిన్న తనతో మాట్లాడిన మనిషి, ఇవ్వాళ ఏమయ్యాడు? ఎక్కడికెళ్ళాడు? అలాగే నిన్నటి వరకు లేని చిట్టి పిల్లాడు ఇవ్వాళ ఎక్కడినుండి వచ్చాడు? అన్న అలోచననుండి పుట్టుండాలి భగవంతుడు. అలాగే ప్రకృతిలో తనను నిత్యం భయపెట్టే ప్రకృతి శక్తులను చూసి భయపడ్డ మనిషి, ఆ భయంనుండి తనను కాపాడేవాడెవడో ఉన్నాడు అని ఆలోచించి ఉండాలి. ఆ ఆదిమానవుడి ఆలోచనే భగవంతుడు అనే ఆలోచనకు మూలం అయ్యుండాలి. అందుకే ఆదిమానవుడు తనను భయపెట్టే ప్రకృతి శక్తులను ముందు పూజించుంటాడు. ఈ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లో ప్రకృతి ఆరాధన ఉంది. హైందవ మతంలో ఈనాటికీ ప్రకృతి ఆరాదన కనిపిస్తుంది.

అలా ఆలోచించడం మొదలెట్టిన మనిషి భగవంతుడికి రూపాన్ని (మూర్తి) కల్పిచడానికి ప్రయతించాడలనిపిస్తుంది. ఆ రూపాన్ని తనరూపం అయిన మనిషి రూపంగా మలచాడనుకుంటా. ఆది మానవుడు ఆకులు, జంతువుల చర్మం ధరించేవాడని చదువుకున్నాం. అవే తన భగవంతునికి తొడిగాడు. భగవంతుడు కనుక కొంచెం గొప్పగా ఉండటానికి పులిచర్మాన్ని తొడిగాడు. తనను రక్షించాలంటే బగవంతుడి దగ్గర ఆయుదం ఉండాలి. ఆది మానవుడు జంతువులను వేటాడటానికి బల్లెం వాడేవాడు. దాన్ని విసిరి జంతువులను సంహరించేవాడు. దాన్నే కాస్త మార్చి త్రిశూలం చేసాడు. తన భగవంతుడుకూడా త్రిశూలాన్ని విసురుతాడు. తనను అతిగా భయపెట్టే చావుకు అధిపతిగా చేసి స్మశానంలో కూర్చుండబెట్టాడు. భగవంతున్ని అందంగా అలంకరించాలి, కానీ మేకప్ కిట్ లేదు. ఎలా? పౌడర్‌కు బదులుగా స్మశానంలో పక్కనే ఉన్న బూడిద పూసాడు. నగలు చేయడం తెలీదు కనుక పాములతో అలంకరించాడు, ప్రకృతిలో చెట్లకి కాసే రుద్రాక్షను తెచ్చి దారనికి గుచ్చి మెడలో వేసాడు. కేశాలంకరణ తెలీని ఆదిమానవుడు తన భగవంతుడి కేశాలంకరణ కూడా తన కేశాలంకరణ లాగే చేసాడు. అలంకరణ కోసం ఆకాశంలో అందంగా కనిపించే నెలవంకను తెచ్చి తన భగవంతుని తెలలో పెట్టేసాడు. మనిషి కన్నా ప్రత్యేకంగా ఉంటాడు అని చెప్పడానికేమొ తన భగవంతునికి మూడో కన్ను పెట్టాడు. శివుడి వాయిద్యం ఢమరుకం కూడా చాలా ప్రాథమికంగా ఉంటుంది. అదికూడా ఆది మానవుడు ఆనాడు వాడిన వాయిద్యమే అయ్యుండాలి. ఇలా ఆదిమానవుడు తన భగవంతున్ని సృష్టించుకునుండాలి. ఆ భగవంతునికి ఆదిమానవుడు ఏ పేరు పెట్టాడో కానీ, శివుడు అన్న పేరు మాత్రం తరువాతి కాలంలో వచ్చిందేమో అనిపిస్తుంది. శివుడుకి మిగతా దేవుళ్ళకి తెడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శివుడి లక్షణాలన్నీ ఆదిమానవుడి లక్షణాలతో సరిపోతాయి. కానీ మిగతా దేవుళ్ళ విషయంలో అలా కాదు, ఆ రూపం కల్పించే నాటికి మనిషి ఆలోచనా సరళి మారింది, కొంత ఆధునికత అలవడింది. అందుకే ఆ దేవుళ్ళ రూపాలు కాస్త ఆధునికంగా ఉంటాయి. ఆదిమానవుడు ముందుగా కల్పించిన రూపం శివుడే అనిపిస్తుంది. అలా అలోచిస్తే శివుడే ఆది దేవుడు అనొచ్చేమో.

శివుడికి ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి. లింగ రూపం ఒక ప్రత్యేకత. ఆదిమానవుడు భగవంతుడికి (మానవ) రూపాన్ని కూడా కల్పించలేని కాలంలో ఈ లింగరూపలో పూజించుండాలి. కాల క్రమేణా మానవ రూపం కల్పించినా, లింగరూపంలో కూడా పూజిస్తూనే ఉన్నాడు. శివుడు ఆదిమానవుడి రూపంతో ఉన్నా, పార్వతి మాత్రం ఆధునిక రూపంలో ఉంటుంది. ఎందుకు? మరి ఈ ఆధునిక రూపన్ని ఆదిమానవుడు ఎలా కల్పించాడు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది, శివుడి మొదటి భార్య సతి. తను ఆదిమానవ రూపంలోనే ఉండుండాలి. తరువాతి కాలంలో ఆదిమానవ రూపంలో ఉన్న సతిని చంపేసి పార్వతిగా పునర్జన్మ కల్పించారు, అందుకే పార్వతి ఆధునికంగా ఉందా?

ఆనాడు మానవుడు భగవంతుని రూపాన్నెలా సృష్టించాడో తెలీదు కానీ, ఆదిమానవ రూపలో ఉన్న శివున్నే ఆది దేవుడు అనడం సమంజసం అనిపిస్తుంది.

Friday, April 19, 2013

సత్యం ప్రియహితం

'సత్యం వద, ధర్మం చర', ఈనాటి పిల్లలకు తెలుసో తెలీదో కానీ నాకు మాత్రం ఊహ తెలీక పూర్వమే తెలుసు. పదాలకు అర్ధం తెలియని నాడే అవి వల్లెవేసినట్టు గుర్తు. అసత్యం చెప్పడం చాల పెద్ద నేరం అని నేను నమ్మిన రోజులవి. ఆకాలంలో నేను చెప్పిన అబద్దం నన్ను చాలా ఆలోచింపజేసింది.

అప్పుడు నా వయసు 3-4 సంవత్సరాల మధ్య ఉంటుందనుకుంటా. అప్పట్లో మేము ఇప్పగూడెంలో (స్టేషన్ ఘణపూర్ మండలం, జనగాం తాలూకా, వరంగల్ జిల్లా) ఉండేవాళ్ళం. ఆరోజు సద్దుల బతకమ్మ. [బతకమ్మ తెలంగాణాలో ఒక ముఖ్య పండగ. బతకమ్మ పండగలో చివరిరొజు సద్దుల బతకమ్మ. ఆరోజు అందరు తమ తమ శక్తికి తగ్గట్టు పెద్ద పెద్ద బతకమ్మలు చేస్తారు. పెద్ద బతకమ్మతో పాటు రోజు ఒక చిన్న బ్రతకమ్మని కూడా చేస్తారు. పెద్ద బతకమ్మనైన లేదా చిన్న బతకమ్మనైన 12 గంటల లోపు పూర్తిచేయాలి. పద్దతి ఎందుకొచ్చిందో ఇదమిద్దంగా తెలీదు గానీ పెద్ద బతకమ్మ చేయడానికి సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో వచ్చిందనుకుంటా]

ఇంట్లో బతకమ్మ చేస్తుంటే నేను పక్కనే కూర్చున్నా. తంగెడు పువ్వు, గునుగు పువ్వు మొ|| రకరకాల పూలు పేరుస్తూ ఉంటే బుద్దిగా చూస్తూ కూర్చున్నా. పెద్ద బతకమ్మ అయిపోయింది. సమయం ఎంతయింది? పావు తక్కువ పన్నెండు. పక్కనే ఉన్న నేను కూడా విన్నా. అప్పటికి కూర్చుని కూర్చుని నాకు కూడా ఓపిక నశించింది. లేచి అటు ఇటు తిరుగుతూ బుజ్జి బతకమ్మ చేయడాన్ని గమనిస్తూ ఉన్నా. రెండు బతకమ్మలు అయిపోయాయి. ఆరెండు బతకమ్మలు పక్కన పెట్టి, మొత్తం ఊడ్చేసి, సర్దేసారు. సమయం దాదాపు 12.15. ఇంక మనకు అక్కడ పనిలేదు. ఏమి చేస్తాం. ఇంటిముందుకెళ్ళి అరుగు మీద నుంచుని వచ్చిపోయేవాళ్లను చూస్తూ నిలుచున్నాం.

మా పక్కింట్లో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవాళ్ళు. పాపం ఎప్పుడో కోడి కూయకముందే (మనం నిద్ర లేవకముందే) లేచి, పూలు కోసుకు రావడం కొసం వెళ్ళిపోయారు. రెండు బస్తాలనిండా (గోనెసంచుల నిండా) పూలు మోసుకుంటూ మొసపోసుకుంటూ (రొప్పుతూ) వచ్చేసారు. పూల బస్తాలు ఇంట్లో పెట్టి, మంచి నీళ్ళు తాగి, ఇంకో బస్తా కింద పరచి, పూలు పరచిన బస్తాలో పోసి బతకమ్మ పేర్చడానికి కూర్చున్నారు. ముసలమ్మ ముసలాయన్ని తిడుతుంది నీవళ్ళే ఇంత ఆలస్యం అయ్యింది 12లోపు చిన్న బతకమ్మ అయినా చేయాలి అని. పక్కనే ఉన్న నన్ను పిలిచి, "బాబూ అమ్మనడిగి టైం ఎంత అయిందో కనుక్కొని వస్తావా" అని అడిగారు. 12 ఎప్పుడొ అయిపోయింది అది మనకు తెలుసు. కానీ ఎందుకో చెప్పాలనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళిపోయా. ఎవరినడితే మాత్రం 12 కాకుండా పోతుందా. ఇప్పుడేమి చెప్పాలి? 12 అయిపోయిందని చెబితే? పాపం, వాళ్ళు అంత కష్టపడి పూలు కోసుకొచ్చారు. కాలేదని చెబితే? అమ్మో! అబద్దమా? అయోమయం. ఏమో ఏమనిపించిదో తెలీదు కానీ కాసేపటి తరువాత వాళ్ళింటికెళ్ళి పావుతక్కువ పన్నెండు అని చెప్పేసా. ముసలమ్మ, ముసలాయన చాలా సంతోష పడ్డరు. 12లోపు చిన్న బతకమ్మ అయిపోయింది ఇక మెల్లెగా పెద్ద బతకమ్మ పేర్చుకోవచ్చు అని. ఇప్పుడు ముసలయన మొదలెట్టాడు, 12లోపు చిన్న బతకమ్మ అయిపోయింది కదా, ఆమాత్రం దానికే అంత లొల్లి పెట్టావు అని.

నా అబద్దనికి ముసలమ్మ ముసలాయన అంతా ఆనందంగా ఉన్నారు. కానీ అంతసేపు ఆనందంగా ఉండి అబద్దంతో ఆనందాన్నంతా కోల్పోయింది నేనే. చిన్ని మనసు అయోమయంలో పడిపోయింది. అబద్దం చెప్పేసా. పెద్ద తప్పు చేసా. 'సత్యం వద, ధర్మం చర', కానీ నేను అబద్దం చెప్పేసా. కానీ నేను చేసింది తప్పా? నిజం చెప్పుంటే ఏమయ్యేది. నా జీవితంలో మొట్టమొదటిసారి అబద్దం చెప్పడం తప్పా? ఎందుకు తప్పు? అని నా మనసు నన్ను ప్రశ్నించింది. కానీ సమధానం లేదు. చాలా రోజులు తప్పుచేసాననే భావన నన్ను బాధ పెట్టింది. కాలం బలీయమయింది, అన్నింటిని మరపింపజేస్తుంది.

"వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయ మగునులే" అన్నట్టు, వయసు పెరుగుతున్నకొద్ది "సత్యం వద"తో పాటు "సత్యం వధ"కూడా సమ్మతమే అన్న లోకగతి ఒంటపట్టించుకుని అందరిలో ఒకడిగా సత్యాసత్యాల్ని కలగలిపి జీవించడనికి అలవాటు పడిపోయా. కానీ ఈనాటికి ఎప్పుడయిన అబద్దం చెప్పడం తప్పు అన్న ఆలోచన వస్తే అన్నింటికన్న ముందుగా నా మదిలో మెదిలే సంఘటన ఇదే.

ఇలాంటి ధర్మ సంకట స్తితికి సమాధనం ఏంటి? "తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ" (.గీ 16-24) అన్నాడు గీతాకారుడు. మరి శాస్త్రం ఏమి చెబుతోంది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
బ్రూయాత్ సత్యం అప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏషత్ ధర్మ స్సనాతనః ||
భావం: సత్యాన్నే పలకాలి, ప్రియమైన విషయాన్నే పలకాలి. సత్యమైనంతమాత్రాన అప్రియాన్ని పలకకూడదు. ప్రీయమైనంతమాత్రాన అసత్యాన్ని పలకకూడదు.  ఇదే సనాతన ధర్మం.

ఇదే విషయాన్ని గీతాకారుడు కూడా చెప్పాడు భగవద్గీతలో
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15 ||
భావము: ఉద్వేగం లేకుండా, సత్యంగా, ప్రియంగా, ఎదుటివాళ్ళకు హితంగా మాట్లాడటం; స్వాధ్యాయం (శాస్త్ర గ్రంధాల్ని చదవడం) వాచిక తపస్సు అంటారు.

అయినా నా ప్రశ్నకు సమాధనం దొరకలేదు. నేను రోజు ఏమి చేసుండాల్సింది? అప్రియం చెప్పకూడదు కనుక 12 దాటిందని చెప్పకూడదు. ఆసత్యం చెప్పకూడదు కనుక 12 దాటలేదని చెప్పకూడదు. మరి ఏమి చెప్పాలి? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోనా?