Thursday, November 22, 2012

పదహారణాలు

" అమ్మాయి పదహారణాల తెలుగమ్మాయి రా" అని చెప్పుకుంటారు కానీ నిజంగా అమ్మాయిని చూస్తే వీళ్ళకి పిల్ల పదహారణాల తెలుగమ్మాయని ఎందుకనిపించిందో నాకైతే తెలీదు. పిల్లను చూస్తే పొట్టి చొక్కా, పొట్టి ప్యాంటు వేసుకుంటుంది. ప్యాంటు మీద బొట్టు పెట్టుకుంటే బాగోదు కనుక బొట్టు పెట్టుకోదు. నోరు తెరిచిందా దొర్లేది ఆంగ్లమే. మరి పిల్ల పదహారణాల తెలుగుపిల్ల ఎలా అయ్యింది? ఇంకొందరైతే అడుగు ముందుకేసి, నండూరి వారు ఎంకి పాటలు పిల్లను చూసే రాసాడు అంటాడు. ఇవ్వన్ని విన్న పిల్ల తను పదహారణాల తెలుగమ్మాయినని, ఎంకినని ఊహించేసుకుంటుంది. వీళ్ళకు పదహారణాల తెలుగమ్మాయి అంటే తెలీదు, ఎంకి అంటే అంతకూ తెలీదు. సినిమా పాటైతే "పదహారణాల తెలుగు జూలియెట్ ఎక్కడ ఉందో వెతుకుదాం" అంటూ సాగుతుంది. జూలియెట్ పదహారణాల తెలుగుపిల్ల ఎలా అయ్యిందబ్బా?

నా బీటెక్లో ఒకసారి మిత్రులతో మాట్లాడుతూ, నేను పదహారణాల తెలుగబ్బాయిని అంటే అందరు పక పకా పక పకా పక పకా నవ్వేసారు. నేను చేసినతప్పేంటంటే పదహారణాల తెలుగబ్బాయి అనడం, పదహారణాల తెలుగమ్మాయి అని మాత్రమే అనాలంట. పదహారణాల తెలుగబ్బాయి అనే ప్రయోగం సాధారణంగా ఎక్కడా కనిపించదు, అది నేనూ కూడా ఒప్పుకుంటా. కానీ అలా అంటే అందులో తప్పేముంది? పదహారణాల తెలుగమ్మాయి అని మాత్రమే ఎందుకనాలి? అసలు పదహారణాల తెలుగమ్మాయి అంటే అర్ధం ఏంటి? ఈ పదహారణాలకు అమ్మాయికి సంబంధం ఏంటి? అమ్మాయి ధర పదహారణాలా? (ఒకానొక కాలంలో కన్యాశుల్కం ఉండేది కదా, అప్పుడు పదహారణాలు చెల్లించి పెల్లిచేసుకునేవారా? అలా వచ్చిందా పదం?). అనడిగితే, కాదు అని నా సమాధానం. పోనీ బరువా? (ఏడు మల్లెలెత్తు అన్నట్టు, పదహారణాల ఎత్తా?) మళ్ళీ కాదు అనే నా సమాధానం. మరేంటి? పదహారణాల తెలుగమ్మాయి ఏంటి? అది తెలుసుకోవాలంటే ముందు పదహారణాలు అంటే ఏంటో పరిశీలిద్దాం.

భారత దేశంలో ఒకప్పుడు అణాలు ఉండేవి అని మన అందరికి తెలుసు. తరువాతి కాలంలో రూపాయి ప్రవేశపెట్టబడింది. రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఒక భాజకం ఉండాలి కదా, అది ఒక అణా = 6.25 పైసలు.
మనలో చాలా మందికి తెలిసిన కొన్ని పదాలు పరిశీలిస్తే. (భావితరాలకు తెలిసే అవకాశంలేదు, ఎందుకంటే అవి వాడుకలోంచి వెళ్ళిపోయాయి)
చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు
ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు
బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు

లెక్క సరిపోయింది కదా. ఇక పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పుకోవచ్చు. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలొ, ఇలా ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయి మాతమే పదహారణాల తెలుగమ్మాయి అనడానికి అర్హత కలిగిన అమ్మాయి. ఒక్క విషయంలో తెలుగుదనం లేకున్నా తనకు పదహారణాలు తెలుగమ్మయి అని పిలవబడటానికి అర్హత లేదు.

మనం పదహారణాలు అంటే 100% అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి పదహారణాల తెలుగబ్బాయి అంటే తప్పేంటి? నా ఉద్దేశ్యంలో అలా అనడంలో తప్పులేదు. అంతే కాదు, పదహారణాలు అనే పదానికున్న అర్ధాన్ని చూస్తే పదహారణాల తమిళమ్మాయి (పదహారణాల తమిళ్ పొన్ను), పదహారణాల మళయాళ అమ్మాయి (పదహారణాల మళయాళ కుట్టి), పదహారణాల కన్నడ అమ్మాయి (పదహారణాల కన్నడ ????), పదహారణాల భారతీయుడు, పదహారణాల ఆంధ్రుడు, పదహారణాల మూర్ఖుడు, పదహారణాల కమ్యూనిష్టు ఇలా ఏదయినా అనొచ్చు. అని నా అభిప్రాయం. 

2 comments:

  1. బాగుంది అండి మీ పదహారణాల గురుంచిన టపా.
    ఒక విషయం, ఎంకి పాటలు వ్రాసింది క్రిష్ణ శాస్త్రి గారు కాదు. నండూరి వెంకట సుబ్బారావు గారు.

    ReplyDelete
  2. నా పొరపాటు తెలిపినందుకు ధన్యవాదాలండి. తప్పును సవరించి ప్రచురించాను.

    ReplyDelete