Wednesday, November 14, 2012

ఆలోచించాలా? వద్దా?

మధ్య ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఒక విచిత్రమైన సందేహం వెలిబుచ్చాడు. సందేహం విన్నాక నాకు ఒక్కనిమిషం 'ఇలాకూడా అలోచించొచ్చా?' అని అనిపించింది. కానీ వాడి సందేహం నిజంగానే వాడిని ఆలోచింపజేస్తుందని తెలిసి నాకు తెలిసినంతలో సమాధానం చెప్పేసాను. నా సమాధానం నన్నే ఆశ్చర్యానికి గురిచేసింది, నేను అంతగా ఎదిగిపోయానా అనిపించింది.

సంభాషణ:
మిత్రుడు: మనం చనిపోయాక మనగురించి ఎందరో బాధపడతారు, అంత మంది బాధకు కారణమవుతాం. వాళ్ళగురించి బాధగురించి మనం ఇప్పుడు ఆలోచించొద్దా?
విఘ్ని: (మనసులో: వామ్మో! ఇలాకూడా అలోచించొచ్చా?)
విఘ్ని: ఆలోచించకూడదు. ఆలోచించి బాధపడుతూ ఉంటే, ఆలోచించడానికి, బాధపడడానికి ఎన్నో ఉంటాయి. అప్పుడు జీవించడం మరచిపోయి ఆలోచిస్తూ ఉండిపోతాం. వాటిని గురించి ఆలోచించడం మానేసి జీవించడం నేర్చుకో.
మిత్రుడు: కానీ
విఘ్ని: కానీ లేదు ఏమీ లేదు, ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో చక్కగా వివరించాడు.
మి: ఏమని?
వి: "అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే, గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః (2-11)"
మి: అంటే?
వి: ధుఃఖింప తగని వాటిని గూర్చి ధుఃఖిస్తున్నవు, పైనుండీ జ్ఞానిలా మాటాడుతున్నావు. [ఇక్కడ కృష్ణుడు అర్జునునితో కాస్త కఠినంగానే చెప్పాడు, కానీ నేను నీతో అలా చెప్పలేను]. జ్ఞానులు బ్రతికున్నవారిని గురించికానీ, చనిపోయినవారిగురించి కానీ ధుఃఖింపరు. అందుకని నువ్వు అనవసరంగా ఆలోచించకు. ఆలోచించి బుఱ్ఱ పాడుచేసుకోకు.
మి: అది సాధ్యమా? చనిపోయిన వారిని గూర్చి, బ్రతికున్నవారిని గూర్చి అలోచించకుండా ఉండగలమా? చనిపోయినవారిని వదిలేసినా బ్రతికున్నవారిని గురించి ఆలోచించకుండా ఉండగలమా?
వి:  కాదు. నీలాంటి వాళ్ళకు, నాలాటివాళ్ళకు సాధ్యం కాదు. అర్జునునికే సాధ్యం కాలేదు. ఇంక మనమెంత. అది యోగులకు మాత్రమే సాధ్యం. అందుకే గీతలో ప్రతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు యోగివికమ్మని బొధిస్తుంటాడు.
మి: అంటే సన్యాసం పుచ్చుకోనా?
వి:  అవసరం లేదు. యోగి సన్యాసి అవనవసరం లేదు. పెళ్ళిచేసుకుని కర్మయోగిలా జీవించొచ్చు.
మి: అంటే ఎలా?
వి:  వెళ్ళి ఒక గీత పుస్తకం కొని చదువు.

(అబ్బో, విఘ్నికూడా గీత గురించి మాట్లాడేస్తున్నాడు.)

1 comment:

  1. మీ బ్లాగు నాకు బాగా నచ్చింది.. తెలుగు లో ఇంత చక్కని బ్లాగ్ ఉన్నందు సంతోషం.
    మొత్తానికి మీ స్నేహితునికి బ్రహ్మవిద్య బోధించేసారు అనమాట..

    బుజ్జి..

    ReplyDelete