Thursday, January 15, 2015

వీడుకోలు నేస్తమా

ఈ జీవన ప్రయాణంలో ప్రతి కలయిక విడిపోవడానికి నాంది - అని చెప్పారు ఎవరో మహానుభావులు. అలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆచరణ? ఆచరించడం సాధ్యమా? చాలా వరకు పరిచయాల్లో కలవడం, విడిపోవడం, మధనపడటం, మరచిపోవడం సాధారణం. కానీ, నిన్ను? నిన్ను మరచిపోవడం సాధ్యమా? ఏ నాటికైన నేను నిన్ను మరచిపోగలనా? నా వళ్ళ కావడం లేదు. మనం ఎవరికి వారై వేరైపోయి విడిపోవడాన్ని నువ్వు తీసుకున్నంత సమభావనతో నేను తీసుకోలేకపోతున్నా. నీ అంత స్తిమితంగా నేను ఉండలేకపోతున్నా. నిజం ఇదే అని తెలుసు, ఇకనుండి ఈ నిజంలోనే జీనించాలని తెలుసు, కానీ అంగీకరించలేకపోతున్నా. తెలిసిన నిజాన్ని అంగీకరించలేక, కోరుకున్న కల అందక, నా మనసులో నాతోనేనే పోరాడుతూ, అది బయటివారికి కనిపించకుండా లేని నవ్వుని పెదాలపై పూసుకుని నన్ను నేను మోసం చేసుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్ళను మోసం చేస్తూ రోజులీడుస్తున్నా.

నీతో గడిపిన ఆ రోజులు నా జీవితంలోనే అందమైన క్షణాలు. ఒక్కో క్షణం మాటల్లో చెప్పలేని ఎంతో తీయని అనుభూతి. నీతో కలిసిగడిపినంత ఆనందంగా ఈ జీవితంలో మరేనాడూ లేనేమో. అదో కలలా గడిచిపోయింది. ఒక్కోసారి అది అసలు నిజమేనా లేక కలా? అన్న అనుమానం కూడా కలుగుతునంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది, కల కరిగిపోయింది. అది మిగిల్చిన జ్ఞాపకాలు, ఆ జ్ఞపకాలు కలిగించే బాధ ఇవే ఈ జీవితానికి నాకు మిగిలిపోయాయి.

మనిద్దరం ఉత్తర దక్షిణ ద్రువాలం, ఇద్దరి భావాలు భావనలువేరు. వెయ్యిలో తొమ్మిదొందల తొంబయితొమ్మిది విషయాల్లో మనం విరుద్ధంగా ఆలోచిస్తాం. అది మనకు మొదటినుండే తెలుసు. మన స్నేహం మొదలయ్యిందే వాదనతో. ఆనాటి ఆ వాదనే లేకుంటే ఆ పరిచయం పరిచయంగానే మిగిలిపోయేదేమో, స్నేహంగా మారేది కాదేమో. పరిచయం కొత్తలో మనల్ని కలిపిన ఆ వాదనే కాలక్రమంగా మన మధ్య ఎడం పెంచింది. ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయ బేధాలు ఉండటం, వాటివళ్ళ వాధనలు రావడం సహజం. ఓ బంధం ఎంత గట్టిగా ఉన్నది అనేది గొడవలు రాకుండా ఉండటాన్ని బట్టి కాదు, గొడవలు వచ్చిన ఎంత బలంగా ఉంది అన్నదాని మీద ఆధరపడి ఉంటుంది అని ఇద్దరికి తెలుసు. కానీ అది మనల్ని కలిపి ఉంచలేకపోయింది. ఓ గొడవ అయిపోయిన తరువాత ఆ వాదనను ఆ ఆవేశాన్ని అక్కడే వదిలి ముందుకు వెళ్ళాలి. కానీ, నీకు అదే కావాలి. ఆ విషయంలో అయిన గొడవే కావాలి ఎన్నాళ్ళయినా సరె అది నీ మనసులో అలాగే నిలిచిపోయింది. అక్కడే మొదలయ్యింది, అది మెల్లిమెల్లిగా చిలికి చిలికి గాలివానలా మన బంధాన్ని తెంచేంతగా.

ఆ రోజులు ఆ జ్ఞాపకాలు ఎంత తీయగా ఉన్నా ఈనాటి అవి గతం తిరిగి రావు. మనం వేరువేరు అన్నది ఈనాటి నిజం. ఆ నిజాన్ని ఎలా అంగీకరించేది. నిన్ను మరచి ఎలా జీవన యాత్ర కొనసాగించేది? నిన్ను మరచిపోవడం, నీ జ్ఞాపకాలు రాకపోవడం నాకు సాధ్యమా? మనం దూరమైన ఇన్ని రోజుల్లో నువ్వు గుర్తు రాని ఒక్క క్షణం కూడా లేదు అలాంటిది నిన్ను మరచిపోయే రోజొకటి వస్తుందా? పొద్దున మెలకువ రాగానే గుర్తొస్తావు, నిద్రపోయేముందు గుర్తొస్తావు, FMరేడియో వింటే గుర్తొస్తావు, అందులో 'ఏం సందేహంలేదు' పాట వస్తే మరీ గుర్తొస్తావు, ఒంటరిగా ఉంటే గుర్తొస్తావు, సాయంత్రం ఒంటరిగా అలా ORRమీద వాహ్యాళికి వెళితే గుర్తొస్తావు, ఫొన్ రింగ్ అయితే గుర్తొస్తావు, ఫొన్ రింగ్ అవకపోతే ఎందుకవ్వట్లేదు అని నువ్వే గుర్తొస్తావు, మెసేజ్ వస్తే గుర్తొస్తావు, మెసేజ్ రాకపోతే ఎందుకు రావట్లేదు అని నువ్వే గుర్తొస్తావు, అలసిపోతే గుర్తొస్తావు, ఉత్సాహంగా ఉంటే గుర్తొస్తావు, ఎవరితో అయినా మాట్లాడాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏదైనా చెప్పాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏది చెప్పకుండా మౌనంగా కూర్చోవాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏది చేసినా నువ్వే గుర్తొస్తావు, ఏది చేయకపోయినా నువ్వే గుర్తొస్తావు.. ఇంతగా గుర్తొచ్చే నిన్ను ఎలా మరచిపోగలను? నా వళ్ళ కాదు. తాగితే మరచిపోతారు అంటారు కదా, ఒక్కోసారి తాగితేనో అనిపిస్తుంది. నిన్ను మరచిపోతే గానీ నాకు మానసిక ప్రశాంతత రాదు, నాకు మానసిక ప్రశాంతత వస్తేగానీ నేను నిన్ను మరచిపోలేను.

ఇలా రాస్తూ ఉంటే, మనసులో నీ జ్ఞాపకాలు కదలాడుతూ ఉంటే ఇంకొక్క వాక్యం కూడా ముందుకు కదలలేకున్నా.  తుఫాను ముందు నిశ్శబ్ధలా ఉన్న నా భావవేశ సముద్రంలో నీ జ్ఞాపకాల అలలు అలజడి కలిగిస్తే ఆ భావాలు పొంగి కళ్ళల్లోంచి జారేలా ఉన్నాయి. అలా జరగకుండా వాటిని అక్కడే ఆపాలి ఎందుకంటే మగవాళ్ళు ఏడవకూడదు. వాళ్ళు మనుషులు కారు, వాళ్ళకు మనసు ఉండదు, ఆ మనసుకు బాధ కలుగదు, కలిగినా కన్నీళ్ళు రావు. అది సమాజం గీసిన గీత. దాన్ని దాటకూడదు. వాటిని అక్కడే ఆపాలి.

ఇక ఉంటా మరి.

నీ విఘ్ని

3 comments:

  1. hmm, mottaniki andarinee edipinchalani niryayinchukonnattunnaru ee post dwara?

    ReplyDelete
  2. adentandi babu, ila mugincharu? aina magavallu edavakoodadu ani ey samajam cheppindi meeku?

    ReplyDelete
  3. హ్మ్మ్.. ఉత్తరాలు పోస్ట్ చెయ్యకుండా పెట్టుకొంటే ఇలాగే ఉంటుంది మరి! అన్ని ఉత్తరాలు రాసింది ఇలా వీడుకోలు చెప్పడానికా? ఇప్పటికైనా ఆ ఉత్తరాల మీద చిరునామా రాసెయ్యండి.. 'ఏం సందేహంలేదు' :)

    ReplyDelete