Thursday, September 26, 2013

పోస్ట్ చేయని ఉత్తరాలు -1


ప్రియమైన నీకు,

మనసు నీ ఆలోచనలతో నిండిపోయిన వేళ, ప్రతి ఆలోచనలో నీ రూపమే కదలాడిన వేళ భావాలన్నీ నీకు చేప్పాలన్న కోరికతో నీకు లేఖ రాయాలని కూర్చున్నా. కానీ ఏమి రాయాలో ఎలా రాయాలో అర్ధం కావడం లేదు. నీ అలోచనే తప్ప వేరే ఆలోచనే రాని నా మనసుకు లేఖ రాసేందుకు భాష కూడా రాదు. భావాన్ని వ్యక్తపరచడానికే భాష ఉందనంటారు కానీ ప్రతి భావాన్ని భాషలో వ్యక్తపరచలేమేమో అనిపిస్తోంది నాకీ క్షణం. ఎదో రాయాలని ఉంది కానీ ఏదీ రాయలేని అసహాయ స్తితి నాది. ప్రతి ప్రేమికుడికి ఏదో ఒకరోజు పరిస్తితి వస్తుందనుకుంటా.  వివేకానందుడి పుస్తకంలో చదివినట్టు గుర్తు, రెండో ఆలోచన లేకుండా మనసు ఒకే ఒక ఆలోచనలో లగ్నమయితే దాన్నే ధ్యానం అంటారని. క్షణం నువ్వు తప్ప మరో ఆలోచన లేని నా మనస్సు నీ ధ్యానంలో ఉందా? ఏమో. నిన్ను ఇంతలా ధ్యానం చేసే నా మనసు నువ్వు ఎదురుపడితే మాత్రం మౌనమే వహిస్తుంది. మౌనంగా మాట్లాడే నా మనసు మూగ భాష నీకు వినిపిస్తుందనే అనుకుంటా. అలా అనుకుంటేనే నాకు తృప్తి.

నీ పరిచయం కలిగేనాటికి నేను ఒక Technocratని. నా Technologyకి నేను మకుటం లేని మహారాజుని. Technology తప్ప మరేమి తెలియని నాకు నాలో ఉన్న మరో మనిషిని పరిచయం చేసింది నీ స్నేహం. జీవితం చాల అందమైందని మొదటిసారి నాకు పరిచయం చేసింది నీ స్నేహం. అందంగా నవ్వుతూ పలకరించే నీ Good Morning కోసం ఎదురు చూపుతో ప్రారంబమయ్యేది నా రోజు. వస్తూ రాగానే నాకోసమే వెతికేవి నీ కళ్ళు, ఆవిషయం ఎన్నో సార్లు గమనించాలే నేను. పొద్దున్నే నీతో కలిసి కాఫీ తాగాక కానీ నాకు పని ప్రారంభించాలనిపించేది కాదు. ఎంత అందమైన స్నేహం మనది, ఎంత అల్లరి చేసామో, ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నమో కదా. ప్రతి గొడవ మన స్నేహాన్ని పెంచిందే కానీ మనల్ని దూరం చేయలేదు. గొడవ పేట్టుకుంటే మనం మెయిల్స్ రాసుకుంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ ఎదురు పడితే మాత్రం ఒకరివైపు ఒకరం చూసుకునేవాళ్ళం కాదు. మరీ చిన్న పిల్లలమైపోయాం కదా, మనిద్దరిని తీసుకెళ్ళి ఒకటో తరగతిలో కూర్చోబెట్టాలి. మన సాన్నిహిత్యము అలాగే ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ నువ్వు వేరే Projectకు వెళ్ళిన నాడు నాకు అర్ధమయింది, నా మనసుకు నువ్వు కావాలని, నువ్వంటే నాకున్న ఈ ఇష్టం, నీ మీద నా ప్రేమ అని.

విషయం నీకు ఎలా చెప్పను, చెబితే నువ్వు ఏమంటావు? నా మిత్రుల సలహా అడిగితే ప్రేమ అన్నది తొలిచూపులోనే పుట్టాలి, స్నేహంలో ప్రేమ ఏంటి అంటున్నారు. ప్రేమ పేరుతో అందమైన నీ స్నేహాని దూరం చేసుకోకు అంటున్నారు. స్నేహం ప్రేమగా మారకూడదా? నా మనసుకు నచ్చిన, నా ఆందందానికి కారణమైన నిన్ను నాదాన్ని చేసుకుని నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకోవడం తప్పా? ప్రశ్న నిన్నే అడగాలనుంది, కానీ ఎలా అడగను. నీ ఎదురుగా వచ్చి అడిగే ధైర్యం నాకు లేదు. అందుకే లేఖ. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు. నేను చేసేది తప్పే అయినా, నా తప్పును నువ్వు మనస్పూర్తిగా క్షమిస్తావని నాకు తెలుసు. అందుకే ధైర్యం చేస్తున్నా.

నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా. నీ సమాధానం చిరునవ్వే అయినా అది నాకు వరమే.

ఇట్లు,
నీ...

* * * * * *
వెన్నెల్లో ఆడపిల్ల నవలలో అందమైన ప్రేమలేఖలు చదివాక ఇంత అందంగా ప్రేమలేఖ రాయొచ్చా అనిపించింది నాకు. ఆ ప్రేమలేఖలు రాయడానికి రచయితలోనైన భావావేశం నా ఆలోచనకు అందలేదు. ప్రియురాలు లేకుండా ఉన్నట్టు ఊహించుకొని కూడా రాయొచ్చా అనిపించింది. రచయిత మరో అడుగు ముందుకేసి తనను ప్రియురాలిగా ఊహించుకుని ప్రియుడికి ప్రేమలేఖ రాసాడు అద్భుతం కదా. ఎందుకో నాక్కూడా అలా ప్రయత్నిచాలనిపించింది. ఆ ప్రయత్నంలో భాగంగా రాసిన మొదటి ఉత్తరం ఇది. ఈ ప్రయత్నం ద్వారా, లేని ప్రియురాలిని ఊహించుకుని లేఖ రాయడం చాలా కష్టం అని అర్ధమయింది నాకు.

Tuesday, September 10, 2013

వాడినేది కోరేదీ

'ఆది భిక్షువు వాడినేది కోరేదీ? బూడిదిచ్చే వాడినేది అడిగేది? ఏది కోరేదీ? వాడినేది అడిగేదీ?' అని సందిగ్ధావస్తకు లోనయ్యాడు హరిప్రసాద్ పండితుడు. అయితే ఏది కోరాలి అని కాక ఎందుకు కోరాలి అన్నది నా ప్రశ్న. చిన్నప్పన్నుండి పెద్దవాళ్ళు భగవంతున్ని ఏదో ఒకటి కోరుకోవాలనే నేర్పిస్తారు. భగవంతుడిని చూడటం అన్నా, తనదగ్గరికి వెళ్ళటం అన్నా, చివరికి తనగురించి ఆలోచించడం అన్నా ఏదో ఒకటి కోరుకోవడానికే అని నేర్పిస్తారు. మంచి మార్కులు రావలనో, ఫస్ట్ రావాలనో, ర్యాంక్ రావలనో ఏదో ఒకటి భగవంతున్ని కోరుకొమ్మని చెబుతారు. ఇంక పెద్దయ్యక పెళ్ళవ్వాలనో, కొంగుముడి వేసుకున్న కొత్తదంపతులను కొడుకు పుట్టలని కోరుకొమ్మనో చెబుతారు. ఈ మధ్య మా మిత్రుడొకడు అనుకోకుండా తిరుపతి వెళితే 'ఏమి కోరుకుంటారు, ఏదైనా కోరుకొండి ' అని చెప్పిందట వాళ్ళావిడ. ఈ కోరుకోవడమనేది మనకు ఎంతగా అలవాటయ్యిందంటే, మనకు తెలిసిందల్లా భగవంతున్ని ఏదో ఒకటి కోరుకోవడమే, కోరుకోకుంటే భగవంతుని దగ్గరికెళ్ళడమే వృధా. అసలు భగవంతున్నెందుకు కోరుకోవాలి? మనకు దేనికి అర్హత ఉందో దేనికిలేదో ఆయనకు తెలీదా? కోరుకున్నామని అర్హత లేకున్నా ఇస్తాడా? కోరుకోకుంటే అర్హత ఉన్నా ఇవ్వడా?

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, "పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రహచ్చతి; తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః" అన్నాడు. ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడని అవి మాత్రమే కాదు, ఏదైనా అని అర్ధం, అది నమస్కారమే కావచ్చు. భగవంతుడు తనకు ఇచ్చేది ఏదైన భక్తితో ఇవ్వమన్నాడు, అలా ఇస్తే దాన్ని ప్రీతితో స్వీకరిస్తా అన్నాడు. ఘంటసాల భగవద్గీతలో 'ఫలాపేక్ష రహితంగా' అని భావం చెప్పారు. శ్లోకంలో ప్రత్యేకంగా 'ఫలాపేక్ష రహితంగా' అని చెప్పకపోయినా ఆ భావం అంతర్గతంగా ఉంది. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే ఏ కోరికా కోరుకోకుండా పూజించమని చెప్పాడు కదా? మరి భౌతిక ప్రపంచంలో కోరికలను ఎందుకు కోరాలి? ఇంకొదరు భౌతిక ప్రపంచంలోది కాని పుణ్యాన్ని కోరుకుంటారు. అది కూడా భగవంతున్నుండి కోరడానికి తగదు.  శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, "వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ! అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపై తిచాద్యమ్!!" అన్నాడు. ఇక్కడ పుణ్యాన్ని కూడా దాటెయ్యమన్నాడు. అంటే మొత్తం మీద భగవంతున్ని భౌతికలోకంలో కోరికలు కానీ, పుణ్యం కానీ కోరుకోకూడదని గీతాకారుడు చెప్పాడు.

భగవంతున్ని ఏదీ కోరుకోకూడదా? భగవంతునినుండి కోరుకోవడానికి దేనికీ అర్హత లేదా అంటే ఒక్కటుంది. భగవంతున్ని ఎప్పుడూ కోరుకోవలసింది ఒక్కటుంది. అదేంటంటే భగవంతుండే. భగవంతున్నుండి మనం కోరుకోవలసింది భగవంతు న్ని మాత్రమే. ఓ భగవంతుడా, అనునిత్యం నాకు తోడుగా ఉండు అని కోరుకోవచ్చు. అలా చేయడం సాధ్యమా? భౌతికంగా సాధించవలసినవి, పొందవలసినవి, కావలసినవి ఎన్నో ఉండగా వాటినన్నింటినీ కాదని భగవంతున్నెవరైన కోరుకుంటారా?’ ఇది చలా మంది అడిగే ప్రశ్న. అంటే, దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు మహాభారతంలో కనిపిస్తుంది అర్జునుని రూపంలో. మహాభారత యుద్దం సమీపిస్తుంది. యుద్దంలో గెలవాలని పాడవులు, కౌరవులు రకరకాల వ్యూహరచనలు చేస్తున్నారు. యుద్దానికి సైన్యాన్ని సమీకరిస్తున్నారు. తమ పక్షాన యుద్దంలో పాల్గొనమని శ్రీ కృష్ణున్ని అడగడానికి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ వెళ్ళారు. భగవంతుడు తన సర్వ సైన్యన్ని ఒకవైపు, తనని ఒకవైపు పెట్టాడు. తను ఆయుధం పట్టను అని కూడా చెప్పాడు. ఈ రెంటిలో ఏది కావాలో కోరుకొమ్మన్నాడు. ఇక్కడ అర్జునుని పరిస్తితి చుస్తే, తను గెలవాల్సింది యుద్దం. అది భౌతిక ప్రపంచంలో జరగాలి. ఎవరికి ఎక్కువ సైన్యం, అస్త్ర, శస్త్రాలు ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఇక శ్రీ కృష్ణుడేమో ఆయుధం కూడా పట్టనన్నాడు. ఒక భక్తుడు (అర్జునుడు) భగవంతుని దగ్గరికొచ్చాడు, తనకోరిక భౌతికమైనది. భౌతిక ప్రపంచంలో యుద్దంలో గెలవాలి. మరి భగవంతున్ని ఏది కోరాలి? భౌతికమైన సైన్యమా లేక భగవంతున్నా? అర్జునుడు మనలా ఆలోచిస్తే సైన్యాన్నే కోరేవాడు. కానీ తను నిజమైన భక్తుడు, తనకు సైన్యం అవసరంలేదని భగవంతున్ని తనవైపు నిలవమని కోరుకున్నాడు. భక్తుని కోరికకు సంతృప్తి పొంది భగవంతుడు అనునిత్యం భక్తుడి వెంట ఉండి, రక్షించి, యుద్దంలో గెలిపించాడు. భగవంతుడెక్కడుంటే గెలుపు అక్కడే ఉంటుంది.


అందుకే మనం కూడా భగవంతునినుండి భౌతికమైన గెలుపు కాకుండా భగవంతున్నే కోరుకుంటే, గెలుపు కూడా తనతోపాటే మనవద్దకొస్తుంది. శ్రీ కృష్ణుడు గీతలో, "అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే! తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్!!" అన్నాడు. అనన్య భక్తితో అనునిత్యం తననే పూజించే భక్తుని యోగక్షేమాలు తానే చూసుకుంటానని మాటిచ్చాడు. నమ్మకమా? సందేహమా?

Sunday, September 8, 2013

హైదరాబాద్‌లో నా మొదటి రోజు

దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందటి మాట, 1992లో మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్ వచ్చాను. అప్పటి వరకు హైదరాబాద్ గురించి పుస్తకాల్లో చదవడమో, లేక ఎవరైన చెబితే వినడమో అంతే, ప్రత్యక్షంగా తెలీదు. ఆ పుస్తకాల్లో హైదరాబాద్ అందాల వర్ణన అంతా ఇంతా కాదు. చార్‌మినార్ అందాలు, జిమ్మా మసీదు అందాలు, ఉస్మానియా arts college అందాలు....  అబ్బో.. ఒక్కొక్కదాని అందాన్ని అత్యద్భుతంగా వర్ణించేసారు రచయితలు. నాకు ఇంకా గుర్తు, మా పాఠ్యపుస్తకంలో ఉస్మానియా arts college ఇంద్ర భవనం నుండి రాలిపడ్డ తురుపు ముక్క అని మరీ రాసారు. ఇవ్వన్ని చదివిన నాకు హైదరాబాద్ అంటే ఇదేదో భూతల స్వర్గం అన్న భావన ఉండేది. ఈ హైదరాబాద్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూసేవాన్ని. అలాంటి నాకు హైదరాబాద్ వచ్చే అవకాశం వచ్చింది. రాష్ట్రస్తాయి science quizలో (రాతపరీక్షే లెండి) వరంగల్ జిల్లా తరపున పాల్గొనడానికి నేను ఎంపికయ్యా. పట్నం ఆంటే ఏంటో తెలీని పల్లెటూరి పిల్లాన్ని. తెలుగు తప్ప వేరే భాషలో ఒక్క పదం కూడా కూడా తెలీని తెలుగు పిల్లాన్ని. [అప్పుడు నాకు ఆంగ్లం కానీ, హిందీ కానీ ఏమాత్రం రాదు. పరభాష పదం లేకుండా శుద్ధ తెలుగులో మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు కుదరదనుకొండి]. అయితే ఏం? ప్రయాణానికి సిద్దమైపోయా, హైదరాబాద్ మొత్తాన్నీ చూసెయ్యాలన్న అత్యాశతో సహా.

బండారుపల్లి నుండి వరంగల్ వచ్చి, అక్కడ జిల్లా ప్రతినిధితో కలసి హైదరాబాద్ వచ్చేసా. ఇంలిబన్ bus standలో దిగా. దాన్ని చూస్తే అదేదో గోదాములా అనింపించింది నాకు, దాన్నిండా బస్సులే. [అది ఇప్పటికి ఉంది MGBS పక్కన, ఇప్పుడు దాన్ని city bus standగా వాడుతున్నారు.] Bus stand నుండి సరాసరి state science centerకి వెళ్ళి పరీక్షకు కూర్చున్నా. జీవితంలో మొట్టమొదటిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివిన వాళ్ళకు ఉండే ప్రయోజనాలు, నాలా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకుండే నష్టాలు తెలిసాయి.  పరీక్ష పత్రం తెలుగులో ఉంది  కానీ అందులో scientific terms అన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. అక్కడ ఉన్న పర్యవేక్షకునితో ఒక పది నిమిషాలు వాదించా ఇవ్వన్నీ నాకెలా తెలుస్తాయి నేను తెలుగు మాధ్యమం వాన్ని అని. అయినా ప్రయోజనం శూన్యం. ప్రరీక్ష అయిపోయింది, వెనక్కొచ్చేసాం. మా జిల్లా ప్రతినిధి ఆబిడ్స్‌లో ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. రాత్రి పడుకుని తెల్లారి పొద్దున్నే ఫలితాలకోసం మళ్ళీ science centerకి వెళ్ళాం. అవును, మీరు ఊహినట్టే జరిగింది మనకు విజయం దక్కలేదు, సరిగా రాస్తే కదా. అక్కన్నుండి పదకొండు వరకు ఆబిడ్స్‌లో మా గదికి వచ్చేసాం. నేను మాజిల్లా ప్రతినిధిని హైదరాబాద్ చూద్దాం అని అడిగా. తనేమో తనకు పనుందని బయటికి వెళ్ళాడు. వేళ్ళేముందు ఎక్కడికైనా వెళితే సాయంత్రం ఆరింటివరకు వచ్చేయమని నాకు చెప్పాడు.

అసలే పట్నం అంటే భయపడే పల్లెటూరి పిల్లాన్ని, ఈ మహా నగరంలో ఎలా? ధైర్యం చేసా, ‘చాలా దూరం వెళ్ళకూడదు నడిచే దూరంలో ఉన్నవే చూడాలి అని నిర్ణయించుకున్నా. బయటికొస్తే అమ్మో ఇంత పెద్ద రోడ్డా, దీన్ని ఎలా దాటాలి? చేతిలో కాగితం, కలం పట్టుకుని నడిచే దారిలో గుర్తులు రాసుకుంటూ, మూల మలుపుల వద్ద గుర్తుగా భవనాల, దుకాణాల పేర్లు రాసుకుంటూ నడవనారంబించా. తిరుగు ప్రయాణంలో దారి తెలియాలి కదా మరి, అందుకన్నమాట కాగితం మీద గుర్తులు రాసుకునేది. అలా నడుస్తున్న నాకు అల్లంత దూరంలో కనిపించింది ఆంధ్ర ప్రదేశ్ assembly, ఎప్పుడు బొమ్మలో చూడటమే, నిజంగా చూడటం అదే మొదటిసారి. అది కనిపించగానే అటువైపు నడక ప్రారంభించా.  అసెంబ్లీ దగ్గరికొచ్చేసరికి ఎదురుగా కనిపించింది బిర్లా మందిరం, దాని పక్కనే బిర్లా planetarium.

వేరే ఆలోచనే లేకుండా బిర్లా మందిరం చేరుకున్నా. పాలరాతి కట్టడాన్ని చూడటం అదే మొదటిసారి. తెల్లగా మెరిసిపోతుంది బిర్లా మందిరం. జనాలు చాల మందే ఉన్నారు. దర్శనం చేసుకుని మందిర ప్రాంగణంలోకి వచ్చేసా. అంతవరకు సినిమాల్లో మాత్రమే చూసేవాన్ని అమ్మాయి అబ్బయి కలిసి తిరగడాన్ని, మొట్టమొదటి సారి ప్రత్యక్షంగా అక్కడే చూసా. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, 'క్లాస్‌లు ఎగ్గొటి ఇలా గుళ్ళ చుట్టు తిరిగితే ఎంత బావుంటూందో కదా'. నేను వాళ్ళవైపు చాలా వింతగా చూసా (అలా చూసిన నన్ను వాళ్ళూ వింతజంతువు అనుకున్నారేమో). మందిర ప్రాంగణం నుండి చూస్తే నగరం అంతా కనిపిస్తుంది. చార్‌మినార్ కోసం ఆశగా చూసా కానీ కనిపించలేదు. చార్‌మినార్ అంటే పెద్దగా ఉంటుంది ఎక్కడినుండి చూసినా కనిపిస్తుంది, కానీ నగరం అంతా కనిపిస్తున్నా చార్‌మినార్ కనిపించడంలేదు. పక్కనే ఉన్న ఒక్కన్నడిగా చార్‌మినార్ ఏది అని. వాడేదో చెప్పాడు, ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు. వాడు ఏదో భాషలో మాట్లాడుతున్నాడు, తెలుగు మాత్రం కాదు. తరువాత ఒకవైపు చూపుడు వేలు చూపించాడు. వాడి భాష అర్ధం కాకున్నా, అటు చూడాలని మాత్రం నాకు అర్ధమయింది. ఆశగా అటుచూసా కానీ ఏమీ కనిపించలేదు. వాడు నన్ను ఏదో అడిగాదు. 'కనిపించిందా?' అని అడిగాడెమో అనుకునుకుని అవునన్నట్టు తలాడించా. వాడు ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. నాకు మాత్రం చార్‌మినార్ కనిపించలేదు. వాడు చూపుడు వేలు చూపించిన వైపు ఎంతసేపు చూసినా చార్‌మినార్  కనిపించలేదు. నిరాశ. కాసేపు అక్కడే ఉండి బిర్లా planetarium వైపు నడిచా. Ticket తీసుకుని లోపలికెళితే నక్షత్రాలు, గ్రహాల గురించీ చాల విశేషాలే చెప్పాడు. అక్కడ చెప్పిన ఒకవిషయం నాకు ఇంకా గుర్తుంది. రాత్రి గడుస్తున్న కొద్దీ నక్షత్రాలన్నీ వాటి దిశ మార్చుకుంటాయి, ఒక్క దృవ నక్షత్రం (pole star) తప్ప. ఎందుకంటే అది భూభ్రమణాక్షం (earth’s axis of rotation) మీద ఉంటుంది కనుక. ఆ ప్రదర్శన అయిపోయాక కాసేపు అక్కడే తిరిగి, తిరుగు దారి పట్టా. ఆరింటిలోపు గది చేరాలి. కాగితం మీద రాసుకున్న గుర్తులు చూసుకుంటు వెనక్కి నడుస్తున్నా. అలా నడుస్తున్న కాసేపటికి రాసుకున్న గుర్తులు కనిపించలేదు, అప్పుడు అర్ధమయింది ఎక్కడో దారి తప్పా అని. వెనక్కి ముందుకి అటూ ఇటూ నడిచి చూసా ఎక్కడైనా గుర్తులు కనిపించవా అని, కానీ కనిపించలేదు. పక్కనే ఉన్న ఒకన్ని దారి అడిగా, వాడు ఏదో అన్నాడు, నాకు అర్ధం కాలేదు. ఇంకొకన్నడిగా, వాడూ ఏదో అన్నాడు, కానీ అర్ధం కాలేదు. మరొకన్ని, ఊహూ అర్ధం కాలేదు. వాళ్ళు ఏదో అంటున్నారు కానీ నాకు మాత్రం అర్ధం కావడం లేదు. దారిన పోయేవాళ్ళనెందరినో అడిగా, అక్కడున్న దుకాణాల్లో అడిగా ఎవరు కనిపిస్తే వాళ్ళని అడిగేసా. అందరు ఒకటే మాట అంటున్నారు, కానీ ఆ మాట నాకు అర్ధం కావడం లేదు. [వాళ్ళు ముఝే తెలుగు నై మాలూం అంటున్నారు.. ఆ వాక్యానికి కూడా అర్ధం తెలియని పరిస్తితి నాది]. దాదాపు గంట పైగా వెతికా ఎవరైనా తెలుగులో మాట్లాడతారేమో అని. ఒక్కరు కనిపించరు. కనిపించిన ప్రతిమనిషిని అడిగా. ఎవరు సమాధానం చెప్పరు. ఎక్కడున్నానో తెలీదు, ఎటెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో అంతకన్నా తెలీదు. ఏమి పాలు పోవడం లేదు. హైదరాబాద్ అంటే చీ అనిపించింది, హైదరాబాద్ మీద పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఇంత గొప్పగా ఊహించుకున్న హైదరాబాద్ ఇదా? ఎందుకొచ్చాను ఈ హైదరాబాద్‌కి అని ఏడుపొచ్చినంత పనయ్యింది. ఆరింటిలోపు వెళ్ళాలి ఎలా? అలా బాధపడుతూ ఏగమ్యం లేకుండా అటు ఇటు తిరుగుతుండగా దూరంగా కనిపించింది, assembly. వడివడిగా assembly వైపు వెళ్ళి, రాసుకున్న గుర్తుల ప్రకారం, ఈసారి దారి తప్పకుండా మాగది చేసుకున్నా. అప్పటికే జిల్లా ప్రతినిధి నాకోసం ఎదురు చూస్తున్నాడు.


ఇంలిబన్ బస్‌స్టాండ్‌నుండి వరంగల్ బస్సు బయలుదేరగానే గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నా జీవితంలో మళ్ళీ ఈ హైదరాబాద్‌కు రాను రాను రాను........

Thursday, September 5, 2013

అరాళ కుంతల

మా మిత్రబృందం అంతా సాయంత్రం కాఫీకి కూర్చుని, పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. మాలో ఒక మిత్రుడు మాత్రం దీనవదనంతో దేవదాసులా కూర్చున్నాడు. ఆక్షణం వాడి ముఖారవిందాన్ని చూస్తే క్రూరమృగం కూడా జాలిపడిపోయ్యేంతలా ఉంది వాడి తీరు. అసలే మనసున్న మనుషులం, పైగా వాడికి మిత్రులం వాడి బాధ చూసి చలించిపోయాం. ఆ సదరు మిత్రున్ని ఏమయ్యిందని అడిగితే చెప్పాడు, అందరికీ ఉండే సమస్యే. వాడి ప్రియురాలు మూడు రోజులుగా వాడితో మాట్లాడటం లేదంట. ఓసి! ఇంతేనా అని వాడికి తలా కొన్ని సలహాలు పడేసారు. సలహా ఇవ్వడం ఇంత సులభమా అనిపించింది. కానీ దాన్ని అమలు పరచాల్సింది వాళ్ళు కాదు కదా. ఇప్పుడు వాడు ఆ సలహాలన్నీ గుర్తుతెచ్చుకుని ఒక్కోటి ప్రయోగించాలి వాడి ప్రియురాలి మీద. ప్రయోగాలన్నీ అయిపోయాక జీవితంలో పక్కవాళ్ళ సలహా వినకూడదు అన్న నగ్నసత్యం వాడికి తప్పకుండా బోధపడుతుంది.

సొల్లేసుకోవడానుకి మాకో విషయం దొరికింది. మా బృందంలో ఒకడికి ఓ వెధవ ఆలోచన వచ్చింది, ‘మీ పెళ్ళాం/ప్రేయసి అలిగితే మీరు ఏమి చేస్తారు, ఒక్కొక్కరు ఏమి చేస్తారో చెప్పాలి. జనాలు ముందు కాస్త తటపటాయించినా, తరువాత వాళ్ళల్లో ఉన్న అరవై నాలుగు కళలు చూపించారు. పాటలు, పద్యాలు, వర్ణనలు, ఆశు కపితలు, అభినయాలు అబ్బో.. దేశంలో ఉన్న కళాకారులంతా ఒక్కచోటే చెరారు. ఇంతమంది కళాకారులున్న దేశానికి ఒక్క Oscar కూడా రాదెందుకో. అక్కడ మాత్రం నవ్వులే నవ్వులు. తనివితీర నవ్వుకున్నాం, పైనుండి చలోక్తులు కూడా విసిరాం. తనదాకా వస్తే కానీ తెలీదు, ఇప్పుడు వచ్చేసింది. ప్రేక్షకుడిగా చూసినంతవరకు బానే ఉంది కానీ ఇప్పుడు నా వంతు. నాకు పెళ్ళి కాలేదు, ప్రేయసీ లేదు కనుక అలిగే అవకాశం లేదు అలాంటప్పుడు బ్రతిమాలు కోవలసిన అవసరం రాదు, నన్ను ఒదలండ్రా బాబూ అంటే ఒక్కడు వినడే. ఇక తప్పేలా లేదు, బాగా ఆలోచించి శ్రీకృష్ణతులాభారంలోంచి ఒక పాట పాడేసా. పాటే కాదు, పాటతో పాటూ పద్యం కూడా. అభినవ ఘంటసాల అయిపోయా అంటే నమ్మండి.

ఓ చెలీ కోపమా అంతలో తాపమా
సఖీ నీవలిగితే నే తాళజాలా ||ఓ చలి ||

అందాలు చిందేమోము
కందేను ఆవేదనలో
పన్నీట తేలించెదనే
మన్నించవే ||ఓ చలి ||

ఏనాడు దాచని మేను
ఈనాడు దాచెదవేల
దరిచేరి అలరించెదనే
దయచూపవే || ఓ చెలి ||

ఈ మౌనమోపగలేనే
విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ
మ్రొక్కేనులే

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన అదినాకు మన్ననయా .. చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తనుపులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద .. అల్కమానవుగదా ఇకనైన అరాళకుంతలా ! అరాళ కుంతలా !!

మిత్రులు: ఏంటి, కాళ్ళ బేరమా?
నేను: అవసరమొస్తే తప్పదు. సాక్షాత్తు ఆ పరమత్ముడికే తప్పలేదు. నేనెంత?
మిత్రులు: మిగతావేవీ ప్రయత్నం కూడా చేయవా?
నేను: సమస్య ఎలా తీరుతుందో తెలిసాక మళ్ళీ ఈ వేరే ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు? శుద్ద దండక, కాల యాపన తప్ప.
మిత్రులు: ఎక్కడ నేర్చారు ప్రభూ తమరు ఈ విద్యలన్నీ?
నేను: అంతా ఆ శ్రీ కృష్ణుడి చలవే, ఆయన చూపిన మార్గంలో నేను వెళుతున్నా. ఆయన్నే అనుకరిస్తున్నా, ఆయన చెసినట్టే నేనూ చేస్తున్నా.
మిత్రులు: అభినవ కృష్ణుడు వచ్చాడు
నేను: J

అందులో ఉన్న ఒక అమ్మాయి పద్యం అర్ధమడిగితే విడమరచి మరీ చెప్పా (మిగతా వాళ్ళందరు వద్దు బాబోయ్ అంటూన్నా ఆగలేదు).
భవదీయ - నీ, దాసుని- దాసుడిని, (అయిన) నను - నన్ను, (నీ) మనంబున - మనసులో, నెయ్యపు -స్నేహపు, కినుక+పూని - అలక పూని (స్నేహపు అలక - ప్రణయ కలహం), తాచిన - తన్నిన, అదినాకు - అదినాకు, మన్ననయా - గౌరవమే; (నీ పాదం నన్ను తాకడం వలన) పులకాగ్ర- పులకించి గగుర్పొడిచి, కంటక - ముల్ల, వితానము - సమూహము, పొద (లా ఉన్నటువంటి) మత్తను - నా శరీరం, (ను) చెల్వగు - చెలివి అయినటువంటి, నీ - నీ, పదపల్లవంబు - చిగురులంటి పాదం, తాకిన - తాకిన, నొచ్చునంచు - నొప్పి కలుగును అని, నేననియెద - నేను అంటున్నా;. (కనుక) ఇకనైన - ఇకనైన, అల్కమానవుగదా - (నీ) అలక మానవా? అరాళ కుంతలా --??

అరాళ కుంతలా - అంటే? ఏమో.  ఆరోజు ఆ చర్చ ముగిసింది కానీ అరాళ కుంతల మాత్రం నన్ను వదల్లేదు. అ పదాన్ని రకరకాలుగా విడగొట్టి అర్ధం చెప్పడానికి ప్రయత్నిచా. అ రాల కుంతల - రాలని కుంతలు కలది (మరి కుంతల అంటే?), అరా ళ కుంతల? అరాళ కుం తల? అబ్బో ఎన్ని రకాలుగా కుదురుతుందో అన్ని రకాలుగా ముక్కలు చేసా. తెలుగు పండితులు ఆత్మహత్య చేసుకునేలా.

ఆరోజు శ్రీ కృష్ణుడు చూపిన మార్గంలో నేను వెళుతున్నా అని ఎందుకన్నానో తెలీదు కానీ. ఆయన మార్గంలో వెళితే  ఉన్న లాభాలు నాకు అరాళ కుంతల అన్న పదానికి అర్ధం తెలిసాక కానీ తెలీలేదు. జగన్నాటక సూత్రధారికి ఆమాత్రం నటించడం రాదా?

నిఘంటువులో అరాళము అన్నపదానికి మదపుటేనుఁగు, వంకరైనది మొదలగు అర్ధాలున్నాయి. కుంతలము అన్నపదానికి వెండ్రుక, నాగలి మొదలగు అర్ధాలున్నయి. కనుక మన సందర్భంలొ అరాళ కుంతల అంటే వంకరైన వెంట్రుకలు (curly hair) కలదానా అని చెప్పుకోవాలి. అంటే సత్యభామకు curly hair అన్నమాట. దాన్ని అటుదిటు, ఇటుదటుగా చెబితే curly hair కలవాళ్ళందరు సత్యభామలు అనాలా? సరె ఇదంతా ఇప్పుడెందుకు కానీ విషయానికొద్దాం. శ్రీ కృష్ణుడు సత్యభామను బ్రతిమాలుకుంటున్నాడు, కాళ్ళ దగ్గరికొచ్చాడు కానీ జుట్టు గురించి మాట్లాడుతున్నాడు. చూసారా! ఎంత మోసమో, ఎంత కంతిరి తనమో. ముందు పట్టుకున్నది కాళ్ళే అయినా తరువాత పట్టుకునేది జుట్టే అని ముందే అరాళ కుంతలా అని పిలిచి మరీ హెచ్చరించాడు. పాపం సత్యభామ ఈ నిజం గ్రహించక నమ్మేసి చల్లబడిపోయింది. తులాభారం తరువాత సత్యభామ జుట్టే పట్టుకున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ కుయుక్తి శ్రీ కృష్ణుడు సత్యభామమీదే కాదు, భృగు మహర్షి మీద కూడా ప్రయోగించాడు, వేంకటేశావతారానికి ముందు, అవతారం మారినా బుద్దులు మారవు కదా.

పాఠకులందరికి శ్రీ కృష్ణుని మార్గం అర్ధమయ్యిందనుకుంటా, "ముందు పట్టుకునేది కాళ్ళే అయినా లక్ష్యం మాత్రం జుట్టే". అదే మనకు ఆరర్శం. కుచ్ (జుట్టు) జీత్‌నే కేలియే కుచ్ (కాళ్ళు) హార్‌నా పడ్‌తా హై.

 కొస మెరుపులు:
1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.
2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.

Sunday, September 1, 2013

ఆరుద్ర పురుగు

ORR (outer ring road) కొత్తగా ప్రారంబించిన రోజులవి, road మీద drive చేయాలని చాలా కోరికగా ఉండేది. కానీ bikeలకు ప్రవేశం లేదు. ప్రవేశంలేని వాహనాలు road పైకి వెళ్ళకుండా గచ్చిభౌలి దగ్గర ఒక పోలీసు ఎప్పుడూ కాపలాగా ఉండేవాడు. వాడు నాకు విలన్‌లా కనిపించేవాడు. ఎలాగైతేనేం ఓ రోజు వాడి కన్నుగప్పి ORR ఎక్కేసా. విజయం సాధించా అన్న ఆనందంతో bikeని వాయువేగంతో పరిగెత్తించా. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మధ్యలో ఒక పోలీసు ఆపి road దించేసాడు. Road దిగాక ఎక్కడున్నానో తెలీదు, ఎలా వెళ్ళాలో కూడా తెలీదు.

అటుగా ఎవరైనా వస్తే దారి కనుక్కుందామని bike దిగి, ఎదురుచూస్తూ నిలుచుని, యాదృచ్ఛికంగా నేలపైకి చూసిన నా కళ్ళు ఎఱ్ఱగా కనిపించిన వస్తువు ఏంటా అని నిశితంగా పరిశీలించాయి. ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా.. ఇది నిజమా? నేను చూస్తున్నది నిజమేనా? ఎన్నాళ్ళుగానో నేను వెతుకుతున్న నా చిన్ననాటి నేస్తం ఆరుద్ర పురుగు. మరో ఆలోచన లేకుండా వెంటనే దాన్ని మెల్లగా, సున్నితంగా రెండు వేళ్ళతో‌ ఎత్తి  నా అరచేతిలోకి తీసుకున్నా. ఆరుద్ర పురుగు నాకు మళ్ళీ కనిపిస్తుందన్న ఆశకూడా పోయింది. అలాంటిది అది కనిపించగానే ఆ క్షణం చిన్నపిల్లాన్నయిపోయా. దానితో ఎంతసేపు ఆడుకున్నానో కూడా తెలీదు. ఓ క్షణం ఇంటికి తీసుకెళితేనో అనిపించింది. అదే చిన్నప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళేవాడినే కానీ అది ఆనందంగా బ్రతకాలి కదా అందుకే దాన్ని అక్కడే వదిలేసా. రెండు నిమిషాలాగి తిరిగి చూస్తే మాయమయిపోయింది. అక్కడంతా వెతికా కానీ కనిపించలేదు. ఇది కలా? నిజమా? నేను ఇందాక చూసింది ఆరుద్ర పురుగునేనా? నేల పొరల్లోకి వెళ్ళిపోయిందేమో.

ఆ నిమిషం చిన్నతనంలో ఆరుద్ర పురుగుతో ఆడుకున్న సంగతులు ఎన్నో మదిలో మెదిలాయి. ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన ఇప్పగూడెంలోనే ఈ ఆరుద్ర పురుగుని మొదటిసారిగా చూసా. ఇవి ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి కనుక వీటికి ఆరుద్ర పురుగులని పేరు. వర్షాకాలం వస్తే చాలు గుంపులు గుంపులుగా వచ్చేవి పెద్దవి చిన్నవి అన్నీ కలిసి, నాకైతే చిన్న పురుగులంటేనే చాలా ఇష్టం. ఎక్కన్నుండి వచ్చేవో మాత్రం నాకు తెలీదు. పెద్దవి అన్నా కదా అని భారీ ఆకారాన్ని ఊహించుకోకండి. పెద్ద పురుగులు కూడా అర సెంటీ మీటర్ కన్నా పెద్దగా ఉండవు. అయితే అవి ఇట్టే వచ్చి అట్టే మాయమయిపోయేవి. రెండు, మూడు వారాలకన్నా ఎక్కువగా కనిపించేవి కాదు. ఆరుద్ర పురుగుల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసేవాన్ని నేను.

ఇవి ఎర్రగా, మెత్తగా, మృదువుగా, దూదిపింజంలా ఉంటాయి. చూడగానే పట్టుకోవాలనిపించేంత ముద్దుగా కదిలే బొమ్మల్లా ఉంటాయి. పురుగులంటే భయపడే చిన్న పిల్లలు సైతం ఈ ఆరుద్రపురుగుల్ని పట్టుకునేవాళ్ళు. మనం ముట్టుకుంటే చాలు అవి ముడుచుకుంటాయి. కాసేపు ఏ కదలికా లేకుండా ఉంటే మెల్లగా నడవడం మొదలెడతాయి. చిన్నప్పుడు వాటిని జాగ్రత్తగా అరచేతిలో తీసుకుని, ఓపికగా అవి కదిలేవరకు ఎదురుచూసి, అవి చేతిలో పాకుతుంటే ఆనందించేవాళ్ళం. వాటిని చాలా మురిపెంగా చూసుకునేవాళ్ళం. ఇప్పగూడెంలో మా స్కూల్‌లో అయితే వాటితో నానా అల్లరి చేసేవాళ్ళం. వాటిని పట్టుకుని అగ్గిపెట్టెలో పెట్టి, అవి తినడానికని కొన్ని ఆకులు పెట్టే వాళ్ళం. చిన్న పిల్లలం కదా అవి ఆ ఆకులు తినవన్న సంగతి మాకు తెలీదు. అసలవి ఏమితింటాయో నాకు ఈనాటికీ తెలీదు. ఇంతాచేస్తే అవి మాకు తెలీకుండా చల్లగా జారుకునేవి. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది పాపం అవి అప్పుడు మా అల్లరికి ఎంత భయపడిపోయేవో. ఓ రోజు ఒక ఆరుద్ర పురుగును చంపేసాడని మా క్లాస్‌మేట్‌తో మాట్లాడటం మానేసా. ఆ తరువాత అతనితో ఈనాటి వరకు మాట్లాడలేదు.

అంత అందమైన ఆరుద్ర పురుగుని చివరిసారిగా చూసింది బండారుపల్లిలో అనుకుంటా. కలుష్యంతో నిండిన ఈ అభాగ్యనగరంలో ఈ సున్నితమైన ప్రాణులు బ్రతకలేవని తెలిసీ చాలాసార్లు ఆరుద్ర కార్తెలో ఆరుద్రపురుగులకోసం వెతికా కానీ ఏనాడూ కనిపించనిది అనుకోకుండా ఈనాడు కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో...


ఇంతకి ఈ నా చిన్ననాటి నేస్తం మీకు తెలుసా?

ఆంగ్లలో దీని పేరు: Red Velvet Mite