Saturday, June 15, 2013

వెన్నెల్లో ఆడపిల్ల

వెన్నెల్లో ఆడపిల్ల, యండమూరి వీరేంద్రనాధ్ రచన. చదరంగం ఆటగాడు రేవంత్కి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిల్ల రమ్యకు మధ్య జరిగే దాగుడు మూతల ప్రేమకత. అప్పట్లో టీవీలో సీరీయల్గా వచ్చేది, చూసినట్టు గుర్తు. అనుకోకుండా నిన్న యూట్యూబ్లో తగిలితే మొత్తం 13 భాగాలు చూసా (ఈసారెప్పుడైనా పుస్తకం కొని చదవాలి.). ఒంటరి వాడైన రేవంత్‌కు తన బాధల్ని పంచుకోవడానికా అన్నట్టు తనని చేరుతుంది రమ్య. చలాకీగా కవ్విస్తూ, ఆట పట్టిస్తూ, మెదడుకు మేత పెడుతూ రమ్య చేసే అల్లరి. ఆహా!! తనలో ఉన్న భావుకత అద్భుతం.

రేవంత్ ఓటమి బాధతో ఉన్నప్పుడు తోడైనిలచి, తనలో ఆత్మస్థైర్యాన్ని నింపి, సమస్యకు పరిష్కారాన్ని సూచించి, ప్రోత్సహించి తనను గెలిపిస్తుంది. కానీ అంతలోనే రేవంత్ జీవితంలో ఒంటరి తనాన్ని నింపి మాయమైపోతుంది. రేవంత్కు ఓటమిలో తోడుగా నిలచి గెలుపును ప్రసాదించడానికి దిగివచ్చిన దేవదూత రమ్య అనొచ్చేమో.

కధా గమనం ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వెన్నెల్లో ఆడపిల్ల ఉంటుందనుకుంటా. ప్రతి ఒక్కరు అన్న కదా అందుకే దానికి నేను మినహాయింపు ఏమీ కాదు. నాకు చిన్నప్పటినుండి గెలుపు ఎప్పుడు కరతలామలకము. నేను కావలనుకుంటే అందుకోలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్న పొగరు ఉండేది నాకు. అందుకేనేమో అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్న విషయం నాకు అర్ధం కాలేదు. అలాంటి నన్ను మొట్టమొదటి సారి ఓటమి పలకరించినప్పుడు చాలా కోపం వచ్చింది. ఒకదాని తరువాత మరొకటి ఇలా నన్ను ప్రతి విషయంలో ఓటమి వరిస్తూ ఉంటే ఆశ్చర్యపోయా. ఏది పట్టుకున్నా, పని చేసిన, ఎక్కడికెళ్ళినా, అతి సాధారణ విషయమైనా, అత్యంత క్లిష్టమైన విషయమైనా నన్ను వరించేది కేవలం ఓటమే. నా ఆశ్చర్యం కాస్త విసుగుగా మారింది. అలా దాదాపు రెండు సంవత్సరాలు ఓటమి నా వెనకాలే వచ్చింది, గెలుపు నాకు అందనంత దూరంగా పారిపోయింది. అప్పుడప్పుడు ఇక నా జీవితంలో మళ్ళీ గెలుపును చూడలేనేమో అన్న నిరాశకూడా కలిగేది. ఓటమితో నలుగురిలో కలవలేక ఒంటరితనంలో మునిగిపోయా. ఒంటరినైన నాకు నేస్తంగా ఉండేది ఆర్కుట్.

అదిగో అప్పుడు పరిచయమయ్యింది తను, ఆర్కుట్లో. ఘంటసాల కమ్యునిటీలో పాటలువేస్తూ కనిపించింది. తన ప్రొఫైల్ చూస్తే అందులో నిరాఢంబరంగా 'An average Telugu gal' అని రాసుకుంది. నాకైతే చాలా ఆశ్చర్యమేసింది. ఆర్కుట్‌లో ఏ అమ్మాయి ప్రొఫిల్‌లో అయినా ఏ Angelఅనో లేక ఏ Pricessఅనో ఒక రెండు మూడు పేజీల చరిత్ర, పది బొమ్మలు ఉంటాయి. కానీ అలాంటిదేదీ లేకుండా కేవలం 'An average Telugu gal' అని రాసుంటే ముచ్చటేసింది. ఘంటసాల కమ్యునిటీలో పొస్ట్‌ల నుండి, స్క్రాప్ బుక్ దాకా, అక్కడి నుండి మెయిల్ దాకా ఎదిగింది మా పరిచయం. తనకు నచ్చిన బుడుగు ఫాన్స్ కమ్యూనిటిలో అల్లరి చేసేవాళ్ళం.

కాలంతో పాటు పరిచయం స్నేహంగా మారి ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం, అప్పుడు చెప్పా తనతో నా ఓటమి బాధ. నాకు తెలీకుండానే నాకు ధైర్యం చెప్పేది. నేను ఒకరు చెబితే వినను, పరమ మొండి. అది తనకు అర్ధమయిందో ఏమో నాకు తెలీకుండానే నాలో నమ్మకాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపింది. తను అలా చేస్తిందని నాకు అర్ధమవడానికి ఒక నెలపట్టింది. కేవలం మాటలతోనే ఎదుటివాళ్ళను, వాళ్ళ ఆలోచనలను మార్చొచ్చు అని నాకు అప్పుడే మొదటిసారిగా తెలిసింది (మారింది నేనే కదా). గెలుపుకోసం ఇలా చెయ్యి అని నాకు ఒక మార్గాన్ని సూచించింది. నాకిప్పటికీ అర్ధం కాని విషయం, ఒకరు చెబితే నేను వినడం ఏంటి? కానీ విన్నాను ఎందుకో తెలీదు కానీ తను చెప్పినట్టు చేసాను. ఆశ్చర్యం రెండు సంవత్సరాలుగా నాకు దూరంగా పారిపోయిన గెలుపు నెలలో మళ్ళీ నాదగ్గరికొచ్చేసింది. అది నా సామర్ధ్యమో లేక తన మాయో నాకు ఈనాటికీ తెలీదు. అన్ని రోజుల తరువాత గెలుపు, జీవితంలో మొదటిసారి గెలుపును మనస్పూర్తిగా ఆస్వాదించా.

స్నేహమైన కాలంతో పాటు పెరుగుతుంది. అందుకు మా స్నేహం మినహాయింపేమీ కాదు. ముంబై వెళ్ళినప్పుడు తనని కలవాలని ప్రయత్నించా కానీ కుదరలేదు. తను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలవడం కుదరలేదు. మేము కలవకూడదన్నది విధి నిర్ణయమేమో. తను నాతో ఒకనాడు వైధ్యంకోసం లండన్ వెళుతున్నా, వచ్చాక కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. తన మొబైల్ మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతుందా అని ఎన్నోసార్లు కాల్చేసా కానీ ఎప్పుడూ రింగ్ అవలేదు. తరువాత కొంతకాలాం నుండి మొబైల్ ' You seemed to have dialed an incorrect number. Please check the number and dial again.' అని చెప్పడం ప్రారంభించింది.

తను వెళ్ళిపోయి సంవత్సరం దాటింది తను మళ్ళీ కాల్ చేస్తుందన్న నమ్మకం సన్నగిల్లింది. జీవితంలో ఓటమితో ఒంటరితనంతో బాధపడుతున్న నాకు ఆత్మస్థైర్యాన్ని కలిగించి గెలుపును చూపించి, తరువాత మాయమైపోయిన తనే నా జీవితంలో వెన్నెల్లో ఆడపిల్ల కదా. తను ఎక్కడికెళ్ళింది? ఏమయిపోయింది? వెన్నెల్లో ఆడపిల్ల నవల ముగింపే నా ఈ కతకు కూడా ముగింపా? ఆలోచన వస్తేనే భయమేస్తుంది. తను ఎక్కడో ఒక దగ్గర ఆనందంగా ఉందనే నా నమ్మకం, ఉండాలనే నా కోరిక. ఏదో ఒకరోజు తను పోస్ట్ చదువుతుందన్న చిన్న ఆశ.

ఎప్పుడు పూణే వేళ్ళినా తనకోసం దగ్డూశేట్ గణపతిని దర్శించుకుంటా.

వెన్నెల్లో ఆడపిల్ల రమ్య అన్నట్టు, "శరత్‌చంద్ర చటర్జీ రాసిన శ్రీకాంత్ ఎన్ని సార్లు చదివానో, శ్రీకాంత్ చదివాక అనిపించింది, 'ప్రతి కలయిక విడిపోవడానికి నాంది'అని. కలయికని, విడిపోవడాన్ని ఒక కర్మగా తీసుకోవాలి అంటే ఎంతో detachment కావాలి అనుకుంట."

1 comment:

  1. Meeru mee snehituralini tappaka kalavalani korukuntunna.

    ReplyDelete