Friday, April 19, 2013

సత్యం ప్రియహితం

'సత్యం వద, ధర్మం చర', ఈనాటి పిల్లలకు తెలుసో తెలీదో కానీ నాకు మాత్రం ఊహ తెలీక పూర్వమే తెలుసు. పదాలకు అర్ధం తెలియని నాడే అవి వల్లెవేసినట్టు గుర్తు. అసత్యం చెప్పడం చాల పెద్ద నేరం అని నేను నమ్మిన రోజులవి. ఆకాలంలో నేను చెప్పిన అబద్దం నన్ను చాలా ఆలోచింపజేసింది.

అప్పుడు నా వయసు 3-4 సంవత్సరాల మధ్య ఉంటుందనుకుంటా. అప్పట్లో మేము ఇప్పగూడెంలో (స్టేషన్ ఘణపూర్ మండలం, జనగాం తాలూకా, వరంగల్ జిల్లా) ఉండేవాళ్ళం. ఆరోజు సద్దుల బతకమ్మ. [బతకమ్మ తెలంగాణాలో ఒక ముఖ్య పండగ. బతకమ్మ పండగలో చివరిరొజు సద్దుల బతకమ్మ. ఆరోజు అందరు తమ తమ శక్తికి తగ్గట్టు పెద్ద పెద్ద బతకమ్మలు చేస్తారు. పెద్ద బతకమ్మతో పాటు రోజు ఒక చిన్న బ్రతకమ్మని కూడా చేస్తారు. పెద్ద బతకమ్మనైన లేదా చిన్న బతకమ్మనైన 12 గంటల లోపు పూర్తిచేయాలి. పద్దతి ఎందుకొచ్చిందో ఇదమిద్దంగా తెలీదు గానీ పెద్ద బతకమ్మ చేయడానికి సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో వచ్చిందనుకుంటా]

ఇంట్లో బతకమ్మ చేస్తుంటే నేను పక్కనే కూర్చున్నా. తంగెడు పువ్వు, గునుగు పువ్వు మొ|| రకరకాల పూలు పేరుస్తూ ఉంటే బుద్దిగా చూస్తూ కూర్చున్నా. పెద్ద బతకమ్మ అయిపోయింది. సమయం ఎంతయింది? పావు తక్కువ పన్నెండు. పక్కనే ఉన్న నేను కూడా విన్నా. అప్పటికి కూర్చుని కూర్చుని నాకు కూడా ఓపిక నశించింది. లేచి అటు ఇటు తిరుగుతూ బుజ్జి బతకమ్మ చేయడాన్ని గమనిస్తూ ఉన్నా. రెండు బతకమ్మలు అయిపోయాయి. ఆరెండు బతకమ్మలు పక్కన పెట్టి, మొత్తం ఊడ్చేసి, సర్దేసారు. సమయం దాదాపు 12.15. ఇంక మనకు అక్కడ పనిలేదు. ఏమి చేస్తాం. ఇంటిముందుకెళ్ళి అరుగు మీద నుంచుని వచ్చిపోయేవాళ్లను చూస్తూ నిలుచున్నాం.

మా పక్కింట్లో ఇద్దరు ముసలివాళ్ళు ఉండేవాళ్ళు. పాపం ఎప్పుడో కోడి కూయకముందే (మనం నిద్ర లేవకముందే) లేచి, పూలు కోసుకు రావడం కొసం వెళ్ళిపోయారు. రెండు బస్తాలనిండా (గోనెసంచుల నిండా) పూలు మోసుకుంటూ మొసపోసుకుంటూ (రొప్పుతూ) వచ్చేసారు. పూల బస్తాలు ఇంట్లో పెట్టి, మంచి నీళ్ళు తాగి, ఇంకో బస్తా కింద పరచి, పూలు పరచిన బస్తాలో పోసి బతకమ్మ పేర్చడానికి కూర్చున్నారు. ముసలమ్మ ముసలాయన్ని తిడుతుంది నీవళ్ళే ఇంత ఆలస్యం అయ్యింది 12లోపు చిన్న బతకమ్మ అయినా చేయాలి అని. పక్కనే ఉన్న నన్ను పిలిచి, "బాబూ అమ్మనడిగి టైం ఎంత అయిందో కనుక్కొని వస్తావా" అని అడిగారు. 12 ఎప్పుడొ అయిపోయింది అది మనకు తెలుసు. కానీ ఎందుకో చెప్పాలనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళిపోయా. ఎవరినడితే మాత్రం 12 కాకుండా పోతుందా. ఇప్పుడేమి చెప్పాలి? 12 అయిపోయిందని చెబితే? పాపం, వాళ్ళు అంత కష్టపడి పూలు కోసుకొచ్చారు. కాలేదని చెబితే? అమ్మో! అబద్దమా? అయోమయం. ఏమో ఏమనిపించిదో తెలీదు కానీ కాసేపటి తరువాత వాళ్ళింటికెళ్ళి పావుతక్కువ పన్నెండు అని చెప్పేసా. ముసలమ్మ, ముసలాయన చాలా సంతోష పడ్డరు. 12లోపు చిన్న బతకమ్మ అయిపోయింది ఇక మెల్లెగా పెద్ద బతకమ్మ పేర్చుకోవచ్చు అని. ఇప్పుడు ముసలయన మొదలెట్టాడు, 12లోపు చిన్న బతకమ్మ అయిపోయింది కదా, ఆమాత్రం దానికే అంత లొల్లి పెట్టావు అని.

నా అబద్దనికి ముసలమ్మ ముసలాయన అంతా ఆనందంగా ఉన్నారు. కానీ అంతసేపు ఆనందంగా ఉండి అబద్దంతో ఆనందాన్నంతా కోల్పోయింది నేనే. చిన్ని మనసు అయోమయంలో పడిపోయింది. అబద్దం చెప్పేసా. పెద్ద తప్పు చేసా. 'సత్యం వద, ధర్మం చర', కానీ నేను అబద్దం చెప్పేసా. కానీ నేను చేసింది తప్పా? నిజం చెప్పుంటే ఏమయ్యేది. నా జీవితంలో మొట్టమొదటిసారి అబద్దం చెప్పడం తప్పా? ఎందుకు తప్పు? అని నా మనసు నన్ను ప్రశ్నించింది. కానీ సమధానం లేదు. చాలా రోజులు తప్పుచేసాననే భావన నన్ను బాధ పెట్టింది. కాలం బలీయమయింది, అన్నింటిని మరపింపజేస్తుంది.

"వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయ మగునులే" అన్నట్టు, వయసు పెరుగుతున్నకొద్ది "సత్యం వద"తో పాటు "సత్యం వధ"కూడా సమ్మతమే అన్న లోకగతి ఒంటపట్టించుకుని అందరిలో ఒకడిగా సత్యాసత్యాల్ని కలగలిపి జీవించడనికి అలవాటు పడిపోయా. కానీ ఈనాటికి ఎప్పుడయిన అబద్దం చెప్పడం తప్పు అన్న ఆలోచన వస్తే అన్నింటికన్న ముందుగా నా మదిలో మెదిలే సంఘటన ఇదే.

ఇలాంటి ధర్మ సంకట స్తితికి సమాధనం ఏంటి? "తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ" (.గీ 16-24) అన్నాడు గీతాకారుడు. మరి శాస్త్రం ఏమి చెబుతోంది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
బ్రూయాత్ సత్యం అప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏషత్ ధర్మ స్సనాతనః ||
భావం: సత్యాన్నే పలకాలి, ప్రియమైన విషయాన్నే పలకాలి. సత్యమైనంతమాత్రాన అప్రియాన్ని పలకకూడదు. ప్రీయమైనంతమాత్రాన అసత్యాన్ని పలకకూడదు.  ఇదే సనాతన ధర్మం.

ఇదే విషయాన్ని గీతాకారుడు కూడా చెప్పాడు భగవద్గీతలో
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15 ||
భావము: ఉద్వేగం లేకుండా, సత్యంగా, ప్రియంగా, ఎదుటివాళ్ళకు హితంగా మాట్లాడటం; స్వాధ్యాయం (శాస్త్ర గ్రంధాల్ని చదవడం) వాచిక తపస్సు అంటారు.

అయినా నా ప్రశ్నకు సమాధనం దొరకలేదు. నేను రోజు ఏమి చేసుండాల్సింది? అప్రియం చెప్పకూడదు కనుక 12 దాటిందని చెప్పకూడదు. ఆసత్యం చెప్పకూడదు కనుక 12 దాటలేదని చెప్పకూడదు. మరి ఏమి చెప్పాలి? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోనా?

1 comment:

  1. Even if you had escaped the question, the same confusion rules the mind that whether you should have answered them even though you know time!!

    As per my understanding, DharMam does not mean you have to behave such and such way always, all through the life and like a programmed robot. At that point of time and space, your behaviour has to be governed by other aspects like what is your actual intention, whom are you dealing with (aged, old, young etc), what is their mental status, Are they in misery etc and convey the truth accordingly.

    No dr says to patient that your are gonna die and so get ready!! Every mother considers her son the most beautiful magnificent being despite any anomalies.

    A child heart is more beautiful and Godly so what you had done as a young boy should be in adherence with God's divine plan to cause a small happiness to the couple. Let go your question and be happy.

    ReplyDelete