Monday, December 17, 2012

ఎలా పలకను?

ఆంగ్ల భాష పదాలకు ఒక పద్దతి పాడు అంటూ లేదు. ఒక్కో పదానికి ఒక్కో spelling, ప్రతి పదానికి ఉచ్చారణ, spelling రెండు ప్రత్యేకంగా నేర్చుకోవలసిందే, ఒక నియమం అంటూ లేదు. కానీ తెలుగు అలా కాదు, ఎలా రాస్తామో అలా పలుకుతాం, ఎలా పలుకుతామో అలా రాస్తాం అని అనుకుంటాం కదా. కానీ, తెలుగులో ఉచ్చరించే విధానం రాసే విధానం వేరు వేరుగా ఉన్న పదాలు చాలా ఉన్నాయి. అవి నన్ను మకతిక పెడుతూనే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నా దృష్టిని ఆకర్షించిన పదంబ్రహ్మ’. నేను అయిదవ తరగతిలో ఉన్నప్పుడు అనిపించింది,ఏంటిది? దీన్ని మనం ఇలా పలుకుతున్నాం? రాసినట్టు పలకటంలేదే’ అని.

ఈ ఉల్లేఖనంలో, ముందుకెళ్ళేముందు ఒక్కసారి మీరుబ్రహ్మ’ను ఉచ్చరించండి. ఎలా ఉచ్చరించారు? బ్రహ్ అనా? లేక బ్రమ్ అనా? మనలో దాదాపుగా అందరం బ్రమ్ అనే పలుకుతాం. అవునా? కాదా? బ్రమ్ అని పలకాలంటే బ్రమ్హ అనో లేక బ్రంహ అనో రాయాలి కానీ బ్రహ్మ అని రాయడం ఏంటి? బ్రహ్మ అని రాస్తే బ్రహ్ అని పలకాలి కదా. మకతిక ఏంటబ్బా? ఇంకొంతమంది మరీ దారుణంగా బ్రమ్మ అని పలుకుతారు. (ఉదా: బ్రహ్మానందాన్ని బ్రమ్మానందం అంటారు.) ఇంతకి ఏమని ఉచ్చరించాలి? బ్రహ్ అనా? బ్రమ్ అనా? లేక బ్రమ్ అనా?

మకతిక మన తెలుగులోనే కాదు, దాదాపుగా అన్ని భాషల్లో ఉంది. నేను చాలా భాషలు పరిశీలించా, అన్నింట్లో ఇదే సమస్య. కన్నడ, హింది, గుజరాతి, మరాఠీ భాషల లిపులన్నింటిలో సమస్య ఉంది. సమస్య ఎక్కడినుండొచ్చిందబ్బా? బ్రహ్మ సంస్కృత పదం కదా, ఇదేదో సంస్కృతం నుండీ వచ్చిన సమస్య అనుకుంటా. దేవనాగరిలో కూడా, బ్రహ్మ అనే రాస్తారు. అక్కడినుండి అన్ని భాషల్లో చేరిందీ సమస్య. అంతెందుకు నిన్న మొన్న భారత దేశంలోకి వచ్చిన ఆంగ్లంలో కూడా Brahma అనే రాస్తం, Bramha అని రాయం. ఇన్ని లిపులు బ్రహ్ అని చెబుతుంటే బ్రమ్హ అని ఎలా పలకను?

సమస్యబ్రహ్మ’లోనే ఉందా అంటే కాదు. చాలా పదాల్లో ఉంది. బ్రహ్మలో ఉంది కనుక బ్రహ్మతో మొదలయ్యే అన్ని పదాల్లో ఉంది. బ్రాహ్మణ, బ్రహ్మాండం, బ్రహ్మానందం, బాల సుబ్రహ్మణ్యం మో||. ఇవేకాక, వీటితో పాటు వేరే పదాలు చాలా ఉన్నాయి. మధ్యాహ్నం - దీన్ని మధ్యాన్హం అని లేదా మధ్యాన్నం అని ఉచ్చరిస్తారు. చిహ్నాన్ని కొందరు చిన్హం అంటారు. ఈలా చాలా మకతికలు ఉన్నాయి. అసలే చిన్నప్పటినుండి తికమక పడుతున్న నాకు ఈమధ్య మరో పదం తగిలింది. శంకర్ మహదేవన్ గారుఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి’ పాటలో, 'గురు విక్రమాయ గుహ్య  ప్రవరాయ  గురవే గుణ గురవే'లో గుహ్యను గుయ్హ అని ఉచ్చరించారు. నేను ఇన్నాళ్ళూ ఆ పదాన్ని గుహ్యం అనే పలికా విన్నా కూడా. మొట్టమొదటిసారి పాటలొ గుయ్హం అని విన్నా.  పోనీ పదాలన్నీఒత్తుకు సంభందించినవే కదా, ‘కు ఏదైనా హల్లు ఒత్తుగా ఉన్నప్పుడు, ఒత్తుకు సంబంధించిన హల్లును ముందుగా పలికి తరువాతహ’ను పలకాలేమో అనుకుందామా అంటే; బాహ్యం, ప్రహ్లాదుడు, ఆహ్లాదం, జిహ్వ ఇలా ఎన్నో పదాలు రాసినట్టుగానే పలుకుతున్నాం కదా. మరి ఆ కొన్ని పదాల్లో ఆ తేడా ఎందుకు? ఏంటీ తికమక? ఎలా పలకను?

నాకీ అనుమానం (పెనుభూతం) చిన్నప్పుడే వచ్చింది కనుక మా బడిలో తెలుగు సంస్కృత పంతుల్లను అందరిని అడిగా. కొందరు రెండు ఉచ్చారణలు సరైనవే అని చెబుతే, కొందరు బ్రహ్ అని పలకాలని, మరికొందరు బ్రమ్ అని పలకాలని చెప్పారు. పదం ఉచ్చారణ మీద వాళ్ళల్లో కూడా బేధాలున్నాయి. నేను మాత్రం బ్రహ్మ (బ్రహ్) అని పలకాలని నిశ్చయించుకున్నా.

ఇంకొన్ని మకతికలతో మరో 'ఎలా పలకను?'లో కలుద్దాం.

గమనిక: ఉచ్చారణను రాసి చూపించడం కోసం, ఈ ఉల్లేఖనంలో అక్షరాల్ని విడగొట్టడమైనది. అలా రాయాలని కానీ అలా పలకాలని కానీ నా ఉద్దేశ్యం కాదు.

No comments:

Post a Comment