Wednesday, December 5, 2012

ఉపవాసం

విఘ్ని నువ్వు బ్లాగులు బాగా రాస్తున్నావు నీ తరువాత బ్లాగు 'ఉపవాసం' మీద రాయి అని రాంబాబు అడిగినప్పుడు ఏమిరాయాలో నాకు పాలుపోలేదు. ఈ విషయం మీద నేను ఏమి రాయాగలను అని ఆలోచిస్తుండగా 'మనవాళ్ళాంతా కార్తీక మాసంలో ఉపవాసంచేస్తుంటారు, కొందరు ఉపవాసం అంటారు, కొందరు ఒక్కపొద్దు అంటారు, కొదరేమో ఉపవాసం చేస్తూ తింటారు, ఇంకొందరు ఏమీ తినరు, మహ్మదీయులైతే  రోజాలో ఏదీ ముట్టరు. వీటిలో ఏది సరైన పద్దతి ఇవ్వన్ని విశ్లేషించి రాయండి; ఉపవాసంలో ఉప, వాసం అనే రెండుపదాలున్నాయి కదా వాటి అర్ధం ఏంటో ఇవ్వన్నీ రాయండి ' అని తనే  ఏఏ విషయాలు రాస్తే బావుంటుందో సూచించాడు. రాంబాబుతో సరే అన్నా కానీ నాకు ఏమి తెలుసని రాయడానికి? పోనీ స్వానుభవంతో రాద్దామా అంటే మనకు ఉపవాసం చేసే అలవాటే లేదు. శివరాత్రి రోజు కూడా నాలుగుపూటలు పుష్టిగా మెక్కే రకం నేను. అలాంటి నేను ఏమి రాయగలను. కానీ ‘ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచై:’లా ఉండకూడదని మొదలెట్టేసా. ఉపవాసం గురించి వెతుకుతూ చాలా విషయాలు తెలుసుకున్నా. అలా తెలుసుకున్న విషయాలను నా మాటల్లో చెబుతూ ఈ పోస్ట్ వేస్తున్నా. ఈ విషయం మీద రాయమని నాకు సూచించిన రాంబాబుకు, ఈ పోస్ట్ ద్వారా దన్యవాధాలు తెలుపుకుంటున్నా.

రాంబాబు చెప్పినట్టు మనచుట్టూ ఉన్నవాళ్ళల్లో ఒక్కక్కరు ఒక్కోవిధంగా ఉపవాసం చేయడం చూస్తుంటాం. పుఱ్ఱెకో బుద్ది ఇక్కడ కూడా కనిపిస్తుంది.

ముందు మన జఫ్ఫారావు గాడు ఎలా చేస్తాడొ చూద్దాం. అదేనండి మన సుబ్బారావుకి చాలా దగ్గరి చుట్టం (సుబ్బారావు వాళ్ళా తాత తమ్ముని మామ .... వేలు విడిచిన ..... వేలు విడిచిన... పిన్ని తమ్ముని కొడుకే ఈ జఫ్ఫారావు). ఓరోజు జఫ్ఫారావుగాడు పెద్ద మూట నెత్తిమీద పెట్టుకుని ఆఫీసులోకి వస్తుంటే సెక్యూరిటీ అతను ఆపాడు. దానికి వాడు ఏంటి మీరు లంచ్ కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరా అని వాళ్ళతో తగువు పెట్టుకుని మరీ ఆ మూట పట్టుకుని లోనికొచ్చాడు. వీడు ఏమి తెచ్చాడబ్బా అనుకుంటూ లేచి వాడి కుర్చీ దగ్గరికి వెళ్ళేలోపే వాడు సంచీలోంచి ఒక మారణాయుధం బయటికి తీసాడు. అదేనండి కత్తి. అంత పెద్ద కత్తి పీకలు కోయడానికి వాడితే మాత్రమే దానికి న్యాయం చేసినట్టవుతుంది. ఎందుకైనా మంచిదని నా మెడచుట్టూ ఓ ఇనప రేకు చుట్టుకుని, వాడిదగ్గరికివెళ్ళి, ఏంట్రా ఈ మూట అంటే తెరిచి చూపించాడు. అరటిపళ్ళు, ద్రాక్షపళ్ళు, బత్తయిపళ్ళు, జామపళ్ళు, నారింజపళ్ళు ఒకటేమిటి ఈ ప్రపంచంలో దొరికే అన్ని రకాల పళ్ళు ఉన్నాయి ఆ మూటలో. ఏంటి కొత్తగా పళ్ళ వ్యాపారం పెడుతున్నావా అంటే, అదేంట్రా అలా అంటావు ఇది నా లంచ్ అన్నాడు. ఇది లంచా అని అడుగుదామనుకున్నా కానీ చేతిలో ఉన్న కత్తిని చూసి మూసుకున్నా. కానీ వాడు మాత్రం కత్తికి పని చెప్పాడు, నామీద కాదులెండి పుచ్చకాయ మీద. పొద్దున వచ్చినప్పన్నుండి, సాయంత్రం వరకు వాడి మీద కన్నేసి చూస్తూనే ఉన్నా. క్షణం తీరిక లేకుండా, పండు తరువాత పండు, పండు తరువాత పండు, పండు తరువాత పండు తింటూనే ఉన్నాడు. ఏమయ్యింది వీడికి? ఇక ఈ ఉత్కంఠ తట్టుకోలేక వాడి దగ్గరికెళ్ళి, ఏంట్రా పొద్దున్నుండి పళ్ళు తింటూనే ఉన్నావని అడిగేసా. దానికి వాడు జాలిగా మొఖం పెట్టి, ఏమి చేయమంటావురా, ఇవ్వాళ మా ఆవిడ ఏదో వ్రతం చేస్తుంది కనుక నాకు ఉపవాసం, అన్నం తినకూడదు. అందుకే పళ్ళు తిని సరిపెట్టుకుంటున్నా అన్నాడు. ఉపవాసం అంటే ఇదా? ఉపవాసం పేరు చెప్పి రోజూ తినే అన్నానికి పది రెట్లు పళ్ళు తినడమా?

ఇక ఈ జఫ్ఫారావుగాడి తమ్ముడు జుఫ్ఫారావుగాడు వాడు మరో రకం. ఓ రోజు వాళ్ళింటికెళ్ళేసరికి, రకరకాల వంటలు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఏరా మీరు తినబోయే సమయంలో వచ్చానా అంటే, అబ్బేలేదురా ఇవ్వాళ మాకు ఉపవాసం అందుకే అన్ని సిద్ధంగా పెట్టుకున్నా, రాత్రి 12 అవగానే తిండానికి అని. ఉపవాసం అంటే ప్రస్తుతానికి తినకుండా ఎప్పుడు తినే సమయం అవుతుంది తిందాం అని ఎదురుచూడటమా? ఆ మాత్రం దానికి ఎదురుచూడటం ఎందుకు? తినేస్తే పోలా?

ఇంక మూడో రకం సుబ్బమ్మ. పేరు సుబ్బమ్మ కానీ చూడటానికి గొబ్బెమ్మలా గుండ్రంగా ఉంటుంది. ఈవిడ వాళ్ళలా కాక చాలా నిష్టగా చేస్తుంది ఉపవాసం. మంచి నీళ్ళు తప్ప ఏదీ ముట్టదు. వారానికి అయిదురోజులు ఉపవాసం ఈవిడకు, రోజుకో దేవుడికి. ఆ రెండురోజులు మాత్రం తినడం ఎందుకు? అదికూడా మానేస్తే ఓ పనయిపోతుంది కదా. అయినా మరీ ఇంత దైవ భక్తా అని ఓరోజు ఉండబట్టలేక, తనదగ్గరికెళ్ళి, 'గొబ్బెమ్మ మేడం గారు' అని పిలిచి నాలుక కరుచుకుని 'సుబ్బమ్మ మేడం గారు, మీకు ఇంత భక్తి ఏంటి వారానికి అయిదు రోజులు ఉపవాసం ఉంటారెందుకు?' అని అడిగేసా.  ముందు గొబ్బెమ్మ మేడం అన్నప్పుడు ఉరిమి చూసినా, తన భక్తి విషయం రాగానే ఆనందంతో, 'అవునండి నాకు దేవుడాంటే...' అంటూ చాట భారతం మొదలెట్టింది. ఎరక్కపోయీ వచ్చాను ఇరుక్కుపోయాను, ఎలా తప్పించుకోవాలా అని అలోచిస్తుండగా అసలు విషయం బయటపెట్టింది. తను లావు తగ్గడానికి డైటింగ్ చేస్తుందంట, డైటింగ్‌తోపాటు భక్తి కూడా కలిసొస్తుందని రోజుకో దేవుడి చొప్పున మొక్కుకుందంట. ఒక దెబ్బకి రెండుపిట్టలు, స్వామి కార్యం స్వకార్యం, పుణ్యం పురుషార్ధం. ఆహా ఎంత గొప్ప ఆలోచన మా గొబ్బెమ్మది (అదేనండి సుబ్బమ్మది.) ఉపవాసం అంటే డైటింగా?

ఇక ఉపవాసం విషయానికొస్తే, అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఉపవాసం అన్న పదానికి తిండి తినకుండా ఉండటం అనికానీ, ఒక పూట మాత్రమే తినడం అని కానీ అర్ధం లేదు. ఉపవాసం చేయాలంటే తిండి మానెయ్యాలన్న నియమం లేదు. కదా, నేను కూడా మీలాగే ఆనందపడ్డా, ఉపవాసం చేస్తూ తినొచ్చు అని. రాంబాబు చెప్పినట్టు ఉపవాసంలో రెండు పదాలున్నాయి 'ఉప, వాసం'. ఉప అంటే 'సమీపం', వాసం అంటే 'ఉండటం'. ఉపవాసం అంటే సమీపంలో ఉండటం. ఎవరి సమీపంలో? (పక్కనున్న పిల్ల సమీపలో కాదు.) జీవాత్మ పరమాత్మ సమీపంలో ఉండటమే ఉపవాసం. అంతేకానీ శరీర శోష ఉపవాసం కాదు. మన హైందవ ధర్మంలో ప్రతి పని పరమాత్మ సాక్షాత్కారనికే ఉద్దేశించబడింది, అలాగే ఈ ఉపవాసం కూడా. జీవాత్మను పరమాత్మ సమీపంలో నిలపడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం, అర్ధం. తినకుండా ఉండటం అన్న అర్ధం లేదా? అంటే లేదు. ఆ అర్ధం ఉపవాసం అన్న పదానికి మాత్రం లేదు. లంకణం అన్న పదానికి ఆ అర్ధం ఉంది. వైద్యశాస్త్రరిత్యా కొన్ని జబ్బులు నివారించడానికి లంకణం చేయమని చెబుతారు. లంకణం పరమ ఔషదం అని విన్నాం కదా. లంకణం ఆరోగ్యం కోసం చేయ్యొచ్చు. కానీ భగవంతుని గురించి చేసే ఉపవాసరిత్యా చేయనవసరం లేదు.

మరి ఉపవాసానికి ఆహారం తీసుకోకుండా ఉండటం అన్న అర్ధం ఎందుకు ఆపాదించబడింది? ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పబడు కారణాల్లో నాకు నచ్చిన రెండు ఇక్కడ ప్రస్తావిస్తున్నా. మొదటిది, పూర్వం ఉపవాసం చేసేవాళ్ళు (పరమాత్మ దగ్గరగా జీవితం గడిపేవాళ్ళు) భగవంతుని మీద మనస్సు పూర్తిగా లగ్నం చేసి భోజనం చెయ్యాలన్న విషయాన్నే మరచిపోయి తినకుండా ఉండేవాళ్ళంట. అలా మరచిపోయి తినేవాళ్ళు కాదు. మరి మనం? భగవంతున్ని మరచిపోయి భోజనం మానెయ్యాలన్న విషయం గుర్తుపెట్టుకున్నాం. రెండవది, నాకు నచ్చింది, ఉపవాసం అంటే భగవంతుడి సమీపలో గడపడం అంటే భగవంతుడి మీద మనసు నిలిపి ఉంచటం కదా. బాగా తింటే ఏమొస్తుంది? ముందు భుక్తాయాసమొస్తుంది, తరువాత నిద్రొస్తుంది. మరి భగవంతుడి విషయం? భగవంతుడికే ఎరుక. అసలు తినకుంటే? నీరసమొస్తుంది, అప్పుడు కూడా మనసు భగవంతుడిమీద లగ్నం అవదు. అందుకే కాస్త తక్కువగా తినమన్నారు. ఉపవాసం చేయడంకోసం (మనసు భగవంతుడి మీద నిలపడంకోసం) మితంగా తినాలి కానీ మితంగా తినడమో లేక తినకపోవడమో ఉపవాసం కాదు.

మరి ఉపవాసం చెయ్యాలంటే ఏమి చేయాలి? భగవంతుని గురించిన విషయాలు వింటూ, చదువుతూ, మననం చేసుకుంటూ, ధ్యానం, జపం చేసుకుంటూ గడపాలి. శరీర పోషణకై సాత్వికాహారం మాత్రమే (పళ్ళు, పాలు) తినాలి. మిగిలిన సమయాన్నంతా భగవంతుని ధ్యానిస్తూ గడపాలి. మనం చేసే ప్రతి పని మనలో సత్వగుణాన్ని పెంపొందించేదిగా మనసు భగవంతునిమీద నిలిపేదిగా ఉండాలి. అలా చేసినప్పుడే, ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. అలాగే నిరాహారంగా ఉండటంవళ్ళ  ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అలా కాకుండా, కేవలం ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెడుతూ నిరాహారంగా, ఆఫీస్‌లో కూర్చుని లోకాభిరామయణం మాట్లాడుతూ, పక్కనున్న పిల్లను చూస్తూ, బాసును ఆన్‌సైట్‌వాన్ని తిడుతూ, గంటకు పదిసార్లు నేను ఉపవాసం చేస్తున్నా అని చెప్పుకుంటూ, కడుపు మాడ్చుకుంటూ, ఎప్పుడెప్పుడు తినే సమయం అవుతుందా అని ఎదురుచూస్తూ గడిపితే వచ్చే ఫలితం శూన్యం. అలా అని ఆఫీస్‌కి రావద్దు అనడంలేదు, వచ్చినా కూడా కుదిరినంతలో ప్రయత్నలోపం లేకుండా భగవంతున్ని ధ్యానిస్తూ గడపాలి. అప్పుడే చేసే ఉపవాసానికి అర్ధం ఉంటుంది.

మనసుని నిగ్రహించుకోకుండా, కేవలం బాహ్యేంద్రియాల్ని నిగ్రహించేవాడు కపటి అని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. మనసుని నిగ్రహించుకోకుండా ఇంద్రియాల్ని నిగ్రహిస్తే అవి అంతకు కొన్ని వేలరెట్ల శక్తితో మనలను వశపరచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఆకలిని చంపడం కన్నా మనసును నిగ్రహించి భగవంతునిపై నిలపడానికి ప్రయత్నిచాలి. అదే ఉత్తమమైన పద్దతి.

ఉపవాసం గురించి నేను తెలుసుకున్న విషయాల్లో, నాకన్నింటికన్నా బాగా నచ్చిన విషయం ఏంటంటే, తింటూ ఉపవాసం చెయ్యొచ్చు. ఉపవాసం చేయడానికి తిండి మానెయ్యనవసరం లేదు. హమ్మయ్య! ఇంకే ఇకనుండి నేను కూడా ఉపవాసం మొదలెడతా. మరి రాంబాబో?

No comments:

Post a Comment