Thursday, March 19, 2015

నీ ఊహ

నిజంకన్నా ఊహే తీయగా ఉంటుంది. అందుకేనేమో నిజాన్ని చెదు నిజం అని, నిప్పులాంటి నిజం అని; అదే ఊహని తీయని ఊహ, తీయని కల అంటారు. ఊహ అబద్దమైనా సరే మనసుకు సేద తీరుస్తుంది. ఊహేలేకుంటే జీవితం ఎంత భారంగా ఉండేదో. ఆ ఊహంటే నాకు చాలా ఇష్టం. ఊహల్లో అయినా నిన్ను కలుస్తాను, ఊహల్లోనే నీతో ఊసులాడతాను. ఆ ఊహేలేకుంటే? ఊహించుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఊహ ఉండాలి, ఊహ కావాలి. నేను ఆ ఊహలో జీవించాలి.

నా ఊహల సామ్రాజ్యానికి మహారాణివి నీవు, నా ఊహల గుడిలో దేవివి నీవు, నా ఊహల జీవితాన ప్రేయసి నీవు. కానీ నిజం అదికాదు. నేనంటే నీకు చిరాకు, చికాకు, అసహ్యం. అందుకే మనసు నిండా ప్రేమ ఉన్నా నీ ఎదురుగా రావాలంటే భయం, ఎక్కడ నీ తిరస్కారాన్ని చవిచూడాల్సొస్తుందో అని. నీకు తెలీకుండా దొంగచాటుగా నీ నవ్వుల పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తుంది నా మనసు. ఆ నవ్వులు నాకోసమే అని ఊహించుకుని మురిసిపోతుంది నా మనసు. కానీ ఆ పిచ్చి మనసుకేమి తెలుసు ఆ నవ్వులు నావి కావని.

ఏదో ఒకరోజు నీ మనసు మారుతుందని, నేనంటే ఇష్టపడుతుందని ఊహించుకుంటూ, ఆ రోజు ఎంత అందంగా ఉంటుందో తలుచుకుంటూ ఈ నాటి నిజాన్ని మరచిపోతుంది. కానీ ఆ రోజు ఏనాటికి రాదు, నీ మనసులో నాకు ఏమాత్రం స్తానం దొరకదు, కనీసం అందులో నాపై జాలి కూడా కలగదు అన్న నిజం నా మనసుకు తెలీదు. తెలీకపోవడమే మంచిదేమో తెలిసిన మరుక్షణం అది విలపించి విలపించి ఏ స్పందనా లేని బండలామరిపోతుంది. అందుకే దాన్ని ఆ ఊహలోనే ఉండనీ దానికి నిజం చెప్పొద్దు.


నిజానికి ఊహకు మధ్య ఓ వంతెన కట్టాలని, ఆ వంతెన మీదుగా ఊహల్ని నిజాలు చెయ్యాలని ఆరాటపడుతున్న నా మనసుకు ఆ ఊహ శాశ్వత అబద్దం, అది ఏ నాటికీ నిజం కాదు, నిజం నీ ఊహ దరిదాపుల్లోకి కూడా రాదు అని ఎలాచెప్పను. చెప్పి దాన్ని ఎలా చంపేయను. అందుకే ఆ నిజం చేరని సుదూర తీరానికి వెళ్ళిపోవాలని, అక్కడ నిజాన్ని మరచి ఊహే నిజమనుకుని జీవించాలనుంది. ఊహ నిజం కాదు అని నా మనసుకి తెలిసేలోగా, ఈ లోకాన్ని వదిలి ఆ నిజం చేరలేని సుదూర లోకాన్ని చేరాలనుంది.

No comments:

Post a Comment