Sunday, December 29, 2013

Telephoneకు భాష రాకుంటే

కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన, గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది

తిరువన్నమలై నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గం|| ప్రాంతంలో చెన్నై కోయంబేడ్ బస్స్టాండ్ చేరుకున్నాను. నేను రెజర్వేషన్ చేయించుకున్న హైదరాబాద్ రైలు సాయంత్రం ఆరు గంటలకు ఉంది. మొబైల్ చూస్తే అందులో చార్జ్ చాలా తక్కువగా ఉంది, ఎలాగూ రైలుకు ఇంకా చాల సమయం ఉంది కదా, ఇక్కడే ఎక్కడైనా మొబైల్ రీచార్జ్ చేసుకుందామని అక్కడ ఒకతన్ని అడిగితే బుస్స్టాండ్కు చివర ఉంది అన్నాడు. అక్కడికి వెళ్ళి చార్జ్ పెట్టుకుంటుంటే ఒకతను వచ్చి ఏదో అడిగాడు. అతని పేరు నాకు తెలీదు కనుక అతన్ని రజినీకాంత్ అనుకుందాం. రజినీకాంత్ గారు తమిళ్లో ఏదో అడిగాడు. మనకు తమిళ్ అక్షరం ముక్క కూడా రాదు కనుకతమిళ్ తెరియాదు’ అని చెప్పా, దాంతో నన్నేదో వింతమనిషి అనంట్టు చూపు చూసి యక్షప్రశ్నలు వెయడం మొదలుపెట్టాడు. ( భాషలో? హింది, ఇంగ్లీషు, తమిళ్ మూడింటిని రోట్లో వేసి నూరితే తయరయ్యే విచిత్రమైన భాషలో) తమిళదేశంలో ఎదుటివాళ్ళు వింతమనుషులా కాదా అని తెలుసుకోవడానికి ఇలాంటి యక్షప్రశ్నలు వేస్తారు కాబోలు అనుకుని, వేమన పద్యం ‘అనువుగాని చోట అధికులమనరాదు...’ను గుర్తు తెచ్చుకుని బుద్దిగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. దాంతో మన రజినీకాంత్ సంతృప్తి చెంది, నేను వింతమనిషిని కాదు మామూలు మనిషినే అని నిర్ధారించుకుని, తన మొబైల్ కూడా చార్చింగ్కు పెట్టుకుని పక్కకెళ్ళి చతికిలబడ్డాడు. నేను మాత్రం అక్కడే నిలబడి ఒకకన్ను మొబైల్ మీద వేసి ఇంకో కన్నుతో అక్కడ ఎవరైన తమిళ పొన్ను కనిపిస్తుందేమో అని వెతకడంలో నిమగ్నమయిపోయా. ఎంత సేపు చూసినా అక్కడ అంతా నల్ల పొన్నులే కనిపించారు. ఇంక లాభంలేదనుకుని పని విరమించి రెండు కళ్ళు మొబైల్ మీదే వేసి ఇది ఎప్పుడు చార్జ్ అవుతుందా అని ఎదురుచూడసాగాను.

కాసేపు పోయాక ముసలావిడ తన మనవన్ని వెంటబెట్టుకుని వచ్చి నన్ను ఏదో అడిగింది. వాలకం చూస్తే ఏదో పల్లెటూరునుండి వచ్చినట్టుంది. మనకు తమిళ్ తెలీదు కదా అందుకే బుద్దిగాతమిళ్ తెరియాదు’ అని సమాధానం ఇచ్చా. ఈవిడ కూడా నన్ను వింతమనిషిలా చూసి, మళ్ళీ ఏదో అడిగింది. '$**$@)(@$*@$%@*!@~ @$!*@) తమిళ్ తెరియాదా?' అందులో తమిళ్ తెరియాదా తప్ప మిగతా ఒక్క ముక్క కూడా అర్థమయితే ఒట్టు. అందుకే వినయంగా తెరియాదు అని సమాధానం చెప్పా. దాంతో ఆవిడ వింతగా, ఆశ్చర్యంగా, అయోమయంగా, కలవరపాటుతో ... మొ|| రకరకాల భావాలనన్నీ కలిపి నా వైపు చూపు చూసింది. ఇదేంటి తమిళ్ తెలియక పోవడం తప్పా? వీళ్ళంతా ఎందుకు ఇలా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు.
ముసలావిడ మన రజినీకాంత్ దగ్గరికి వేళ్ళింది. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. &$%^*()@ *!~!$$%& @$%!@~) $$@~!@~*@!(@).. మనకు ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు. మాటల మధ్యలో ముసలావిడ నావైపు చెయ్యి చూపించి, రజినీకాంత్కు నా మీద ఏదో చాడీ చెబుతోంది. వామ్మో! ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అసలే ఇందాక రజినీకాంత్ నన్ను వింతమనిషి అని అనుమానించాడు, ఇప్పుడు ముసలావిడ నా మీద ఏదో చాడీ చెబుతోంది. ఇప్పుడా రజినీకాంత్ వచ్చి నన్ను నాలుగు తంతే రక్షించేదెవరు? వెంటనే బుస్స్టాండ్ మొత్తం నిశితంగా పరిశీలించా ఎటువైపు పారిపోవడానికి అనువుగా ఉందా అని. మొబైల్ పోతే పోయింది, బ్రతికుంటే వెయ్యి మొబైల్స్ కొనుక్కోవచ్చు అనుకుని అక్కడినుండి లగాయించేలోపు రజినీకాంత్ మాటలు సంగీతంలా వినిపించాయి.. ‘వీడికి తమిళ్ రాదు, దానికి వస్తుంది’ అంటూ నావెనక వైపు చేయి చూపించాడు. తమిళ్ రాకపోయినా అది మాత్రం అర్ధమయిపోయింది. వాడు చేయి చూపించిన వైపు ఏముందా అని కుతూహలంగా చూస్తే.. అక్కడ ఉంది pay and use public telephone. నేను public telephoneకు ఎదురుగా నిలుచున్నా. విషయమర్ధమయిన నాకు నవ్వాగలేదు.

Replay with new understanding.
నేను public telephoneకు ఎదురుగా నిలుచున్నా.
ముసలావిడ వచ్చి పోన్ గురించి ఏదో అడిగింది.
నేనుతమిళ్ తెరియాదు’ (తమిళ్ రాదు) అని చెప్పా.
ముసలావిడ పోన్కు తమిళ్ రాదు అనుకుని ఖంగుతిని, నిర్ధారించుకోవడానికి మళ్ళీ అడిగింది.
నేను మళ్ళీ తమిళ్ రాదు అని చెప్పా.
తమిళ్ రాని ఫోన్‌లు కూడా ఉంటాయని కంగారుపడ్డ ముసలావిడ రజినీకాంత్ దగ్గరికెళ్ళింది.
ఆయనవీడికి తమిళ్ రాదు, ఫోన్కు వచ్చు’ అని చెప్పడంతో కత సుఖాంతం అయ్యింది.


హమ్మయ్య! నా మొబైల్ నాకు దక్కింది.

3 comments:

  1. funny..papam avida ni bhayapettesaru ga :D

    ReplyDelete
  2. Meeru Bus stand lo train kosam wait chesthunnaraa???

    ReplyDelete
    Replies
    1. Train ku chaalaa time undatam valla... railway station ki vellakunda bus stand lone kurchuni mobile charge chesukuntunnaa

      Delete