Friday, August 30, 2013

మేఘమా... మేఘమా....

ఆషాఢ మాసాన ఆ నీలి గననాన మేఘాల రాగాల ఆలాపన... ఆ ఆలాపనే చినుకు చినుకు చినుకు చినుకు అని అనుకునేవాన్ని నేను. ఆకాశంలో బారులు బరులుగా సాగే మేఘాలు వర్షం కురిపిస్తాయని మాత్రమే నాకు తెలుసు. ఆ మేఘాల తొలకరి చినుకులో తడిసి ఆనందించాలని నేను ఎంతగా ఎదురుచూస్తానో, అంతే ఆత్రుతగా ప్రకృతిలో ప్రతి అణువు ఎదురుచూస్తుందని మాత్రమే తెలుసు. ఆకాశంలో మెరిసే మెరుపులు, కురిసే వాన, ఆ వర్షానికి గాలితోడై చల్లగా ఆహ్లాదకరంగా వీసే తుషారం .. ఆహా... అవి మాత్రమే తెలుసు. తొలకరి చినుకుకు పులకించిన పుడమిలోంచి వచ్చే పరిమళం.. అమోఘం.. అది మాత్రమే తెలుసు. భాస్కర శతకంలో చెప్పినట్టు 'మేఘుడంబుధికి పోయి జలంబుల తెచ్చి యీయడే వాన' అని మాత్రమే తెలుసు. అవును, నాకు చిన్నప్పుడు మేఘం గురించి తెలిసింది అంతే. మేఘం సమస్త ప్రాణుల దాహార్తిని తీర్చేందుకుగాను వర్షాన్ని కురిపిస్తుందని మాత్రమే తెలుసు.

కానీ కొన్నాళ్ళకు మేఘం వర్షంతో పాటు సందేశాలు కూడా మోసుకెళుతుందని, వాటిని మేఘసందేశాలంటారని తెలిసింది. 'ఆకాశదేశానా ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా..' అని పిలిచి మరీ ఓ ప్రేమికుడు తన విరహ వేదనను తన చెలికి మేఘసందేశంగా విన్నవించమని కోరుకున్నాడు. ఇంతకీ ఆ సందేశం తన ప్రియురాలికి చేరిందో లేదో నాకైతే తెలీదు కానీ, మేఘాలు సందేశాలు కూడా మోసుకెళ్తాయని మాత్రం నాకు తెలిసిపోయింది. మేఘాలు సందేశాలు మోసుకెళ్ళగలిగినప్పుడు ఈ mobile phoneలు ఎందుకు? వాటికి వచ్చే billలు ఎందుకు?

సందేశాలే కదా పోనీ అని ఊరుకుంటే, ఈ మధ్య మేఘాలు కొత్త విద్య నేర్చుకున్నయండొయ్, అదే మేఘ గణన (cloud computing). ఎంకి పెళ్ళి సుబ్బి చాకుకొచ్చిందో లేదో తెలీదు కానీ, మేఘాలు నేర్చుకున్న ఈ కొత్త విద్య మాత్రం నాకు ప్రస్తుతానికి తలనొప్పిగా మారింది. ఏ వెధవతో చర్చించినా ఈ cloud గోలే. Public cloud, private cloud వాటి సాదక బాధకాలు, Oracle Fusion componentsని cloudలో install చేస్తే వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు, ఒక నిపుణుడిగా నేను ఇచ్చే సూచనలు, సలహాలు ఏ చర్చలో అయినా ఇవ్వే. నాకు మాత్రం ఏమి తెలుసు? నేను ఇంతకు ముందు ఎప్పుడైనా మేఘంతో పని చేసానా? ఈ మేఘం నేర్చుకున్న కొత్త విద్య మేఘ గణనపై నాకెప్పుడు పూర్తిగా పట్టు దొరుకుతుందో తెలీదు కానీ, అప్పటివరకు ఈ తలనొప్పి తప్పేలా లేదు. మేఘ గణనపై నాకు పట్టు దొరికేలోపు ఈ మేఘం మళ్ళీ కొత్తగా ఇంకేవిద్య నేర్చుకుంటుందో. అన్నట్టు, ఇంకో విషయం ఈ మధ్య ఎక్కడ cloud అన్న పదం విన్నా నాకు cloud computingఏ స్పురిస్తుంది కానీ, ఆకాశంనుండీ వర్షం కురిపించే మేఘం స్పురించడంలేదు.


ఈ మేఘం ఇంకా ఎన్ని విద్యలు నేర్చుకుంటుందో.. మేఘ సందేశం, మేఘ గణనం (cloud computing)భవిష్యత్తులో cloud cleaning, cloud washing, cloud driving, cloud farming…. ఏమోఇవ్వన్నీ నేర్చుకుని వర్షం కురిపించడం మానేస్తుందేమో… work load గురూ.. కొత్త technologies కాదని old technology వర్షం కురిపించడం మీద పనిచేస్తుందో లేదో...

1 comment:

  1. చాలా బాగుందండీ.. ఐనా నిజంగా మేఘం అలా వాన కురిపించటం మరచిపోయే రోజే ఒస్తే "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అని దానికి క్లాసు పీకటానికి విఘ్ని ఉన్నారు కదా :)

    ReplyDelete