Friday, November 16, 2012

నా దుబాయి యాత్ర

దుబాయి, ఒక మధ్యప్రాశ్చ దేశం. నాకు మొదటినుండి మధ్యప్రాశ్చదేశాలంటే ఒక విధమైన అయిష్టత. ఎందుకు అని అడిగితే ఇదమిద్దంగా సమాధానం చెప్పలేను కానీ ఎప్పుడూ అయిష్టభావమే ఉంది. నేను ఉద్యోగంలో చేరినప్పటినుండి, మధ్యప్రాశ్చదేశాలకు వెళ్ళమన్న ప్రతి సారి ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాన్ని. ఇలా ఎన్నిసార్లు చేసానో నాకే తెలీదు. కానీ ఈసారి దుబాయి వెళ్ళడానికి సిద్దమవుతున్నాను. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు అని అడిగితే, 'విధ్యుక్త ధర్మం నన్ను వెళ్ళమంది, నాకు నచ్చినా నచ్చకున్నా నా వృత్తి నిర్వహణ కోసం వెళుతున్నా' అని అబద్దం చెప్పను. నాకు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం దొరకలేదు కనుక తప్పడం లేదు.

దె*** నాకు call చేసి దుబాయి వెళ్ళాలి అన్నప్పుడు చాలా చికాకేసింది. నేను ఎందుకు వెళ్ళాలి RFP మీద నేను పనిచేయలేదు ఎందుకు వెళ్ళాలి అని అడిగా. కానీ ప్రయోజనం శూన్యం. వెళ్ళి చెయ్యాల్సిన పనిఏంటంటే, ‘client వెరే రెండు కంపనీలను ఎంచుకున్నాడంట, అందులో cog*** లేదంట. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకు కతలు చెప్పి మనల్ని ఎంచుకునేలా చెయ్యాలంట’. అంటే ఒక సమస్య తెచ్చి నా మీద పడేస్తున్నారు. గెలిస్తే, ఆగెలుపులో సగం అ***కు సగం నాకు. ఓడిపోతే, తప్పంతా నాదే, బావుంది. తప్పనిసరై proposal తెరిచి చూస్తే, అందులో ఎన్నో పొరపాట్లు. అలాంటి దాన్ని నేను సమర్ధించాలా?  నావళ్ళ కాదు. ***కు call చేసి ఏంటి ఇన్ని తప్పులు అని అడిగితే, దానికి ఎవెవో కతలు చెప్పాడు. చేసిన తప్పు వాడు ఒప్పుకోడు అని అర్ధమయింది. ఇప్పుడు ఇవ్వన్నీ నా తలమీదికొచ్చాయి 'అమ్మో, ఇప్పుడెలా అని అలోచిస్తుంటే'. రా*** మెయిల్ చేసాడు clientతో call అని. హమ్మయ్య ఎలాగూ ఆ call *** చూస్తాడు, నాకు తలనొప్పి పోతుందిలే అనుకున్నా. అనుకున్నట్టే client call *** చేసాడు. వాడు సమస్యాత్మకమని తెలిసిన విషయాలు ముట్టుకోకుండా పైపైన ఏదేదో చెప్పేసాడు. ఏదో ఒకటి అయిపోయిందిలే అనుకుంటే, తెల్లారి రా*** నుండి mail. వివరంగా clientకి చెప్పాలట అందుకు ఒకడు అక్కడికి వెళ్ళాలంట. హమ్మా, మళ్ళీ నా? ఎలా? ఎలా? అనుకుంటూ ఒక్కోరోజు తప్పించుకుంటూ, ఎలగైతెనేం శబరిమల train ఎక్కేసా. నేను వచ్చేలోపు ఎవడో ఒకడు వెళతాడులే, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, శబరిమల పుణ్యమా అని తప్పించుకున్నా అనుకుంటూ తెగ సంబరపడిపోతుంటే, ఇంతలో దె*** call. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. వీసా apply చేయాలి కావలసిన వివరాలు పంపించు అని. trainలో నుండే వివరాలన్నీ పంపించా. దుబాయి నన్ను  శనిలా పట్టుకుంది వదిలేలా లేదు.

శబరిమలై నుండి వచ్చేసరికి అన్నీ సిద్దమయిపోయాయి (visa, సమావేశం తేదీ అన్నీ). ఇక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చేసా. ఇప్పుడు తప్పించుకోవాలని అలోచించుకోవడం కన్నా, చెయ్యల్సిన పని ఎలా చేయాలో ఆలోచించడం ఉత్తమం. forex,room, taxi మొ|| వాటికి అభ్యర్ధన(request) చేసేసా. ఇంక ఇప్పుడు clientకి చెప్పల్సిన సోదికి సంబంధించిన PPT చెయ్యాలి. అబ్బా, ఇదో పెద్ద తలనొప్పి, అయినా తప్పదు కదా. అసలే client సమావేశం మూడు రోజులు. మూడు రోజులకు ఏమేమి కావలో రాసుకున్నా. కానీ PPT చెయ్యాలంటే ఏమాత్రం మనసు లగ్నం అవటంలేదు. దాన్ని ఒక్కోరోజు వాయిదా వేస్తూ పోతున్న. చివరి రోజు వచ్చింది, అయినా మనసు లగ్నం అవటం లేదు. ఇష్టంలేని విషయం మీద మనసు లగ్నం చేయడం ఎంత కష్టమో కదా. శుక్రవారం సాయంత్రం ప్రయణానికి కావలసినవన్నీ తీసుకుని ఇంటికెళ్ళి పడుకున్నా. ఆదివారం తెల్లవారు జామున ప్రయాణం.

శనివారం నిద్రలేవాలనిపించలేదు, బాగా పొద్దెక్కెవరకు పడుకునే ఉన్నా. మధ్యాహ్నం నిద్రలేచి PPT మీద కూర్చున్నా, రాత్రి మొత్తం మేలుకునైనా దీన్ని పూర్తిచేయాలి, లేదంటే నా పని గోవింద. ఎలాగో కష్టపడి మొదటిరోజుPPT ముగించేసరికి రాత్రి ఏడయ్యింది. ఇంకా రెండు మిగిలిన రోజులకు PPTలు చెయ్యాలి. PPT పని ఆపి పెట్టె సర్దుకుని బయటికెళ్ళి కాఫీ లాగిస్తే కాస్త ప్రశాంతంగా ఉంది. కాస్త తలనొప్పి తగ్గింది, కాఫీని కనిపెట్టినవాడేవడొకానీ వాడికి దన్నంపెట్టుకున్నా. వచ్చి రెండొ రోజు PPT మీద కూర్చున్నా, మనస్సస్సలు లగ్నమవటం లేదు, అయినా ఏదో యాంత్రికంగా చేస్తూ పోతున్న. ఇంతలో ఎదురుచూస్తున్న mail వచ్చింది. దుబాయిలో hotel booking. అందులో వివరాలు చూసాక ఒక్కసారి immigration & finance teams మీద కోపమొచ్చింది. అక్కడునే నాలుగు రోజులకు అయ్యే హోటల్ ఖర్చు 1800 దినార్లు, కానీ వీళ్ళు నాకిచ్చింది 1650 దినార్లు. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు హోటెల్ఖర్చులకి కూడా సరిపోవు. finance teamకు  mail పెట్టేసరికి Cab వచ్చేసింది (అంటే తెల్లారింది, రాత్రంతా నిద్ర లేదు. PPT కూడా పూర్తవలేదు.) విమానాశ్రయానికి వెళ్ళడం, check-in, emigration, security check శరామామూలు గా అయిపోయాయి. ఇంకా విమానం రావడానికి చాలా సమయం ఉంది. ఉన్న సమయంలో PPT చేద్దామని మొదలెడితే బుఱ్ఱ సహకరించనంది. PPT కన్నా బుఱ్ఱ ముఖ్యం అని నిర్ణయించుకుని, అది పక్కన పెట్టి net చేస్తూ కూర్చున్న. తరువాత boarding, ప్రయాణం వాటికవ్వే జరిగిపోయాయి.

కళ్ళు తెరిచి కిందికి చూస్తే నేల కనిపిస్తుంది అంటే దుబాయి వచ్చినట్టే. నేను ఇంతకు ముందు ఎన్నోసార్లు దుబాయి వచ్చను కానీ సమయంలో ఎప్పుడు రాలేదు. వచ్చిన ప్రతిసారి రాత్రిసమయంలో (transit కనుక) వచ్చేవాడిని. కిందికి చూస్తే అంతా ఇసుకే, అక్కడక్కడ ఒక చెట్టు. అక్కడక్కడా ఒక ఇల్లు. ఇసుకలో మహా నగర నిర్మాణం ఏంటొ, ప్రకృతి అందాలు కాదని విహారానికి ఇసుక నగరానికి పర్యాటకులు రావడం ఏంటొ. ఇప్పుడు వీళ్ళకు డబ్బుంది, అదీ పెట్రోలియం వళ్ళ, కానీ 19 శతాబ్ధంలో వీళ్ళదగ్గర ఏముంది? తాగడానికి నీళ్ళు కూడా లేవు. అప్పుట్లో ఇక్కడ ఉన్నది ఎవరు? దారిదోపిడీ దొంగలు తప్ప, ఎవరూ ఉండేవారు కాదు. అందుకే కదా మధ్య ప్రాశ్చదేశాల జనాబా చాలా తక్కువ. ఇప్పుడేమో అక్కడి ప్రబుత్వాలు పిల్లల్ని కనమని డబ్బులిస్తున్నాయి. ఎలాంటి దేశాలు ఎలా మారిపోయా యి. ఇంతటి ఏడారిలో పెట్రోలియం పడటం ఏంటో, దాని మూలంగా ఈ సంపద ఏంటో. ఇక్కడ అభివృద్ది అంతా గత కొన్ని దశాబ్ధాలుగా వచ్చిందే కదా. ‘ధనం మూలం ఇదం జగత్’ కదా, ఇంకో 200 సంవత్సరాల తరువాత వీళ్ళ పరిస్తితి ఏంటి? అని ఆలోచిస్తూ ఉండగానే విమానం దిగడం అయిపోయింది. వచ్చేసా దుబాయికి, రావద్దు రావద్దు అనుకున్నా కానీ వచ్చేసా. ఎందుకో మనసుకు నచ్చడం లేదు. ఇంతకుముందెప్పుడూ ఇలా అనిపించలేదు. అప్పుడు దుబాయి నా అంతర్జాతీయ ప్రయాణంలో ఒక మజిలీగా ఉండేది కానీ ఇప్పుడు దుబాయిలోకి వెళ్ళాలి తప్పదు. విమానం దిగి నడుస్తూ ఉంటే దారి చూపే గుర్తులు (sign boards) నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టనిపించింది. Transit/Baggageలో నేను ఎప్పుడు Transit వైపు వెళ్ళేవాన్ని. అలా వెళ్ళిన ప్రతిసారి Baggage వైపు ఎప్పుడూ వెళ్ళకూడదు అనుకునేవాన్ని. కానీ నేను ఇప్పుడు Baggageవైపే వెళ్ళాలి. ముందుకు నడుస్తూ ఉంటే పాత ఆలొచనలు గుర్తొస్తున్నయి. ముందుకు నడుస్తున్నాననే కానీ అడుగులు మాత్రం సహకరించడం లేదు. అవ్వి వెనక్కే వెళదాం అంటున్నాయి. Transit వైపు వెళ్ళిపోదామని మనసు చెబుతోంది, కానీ అటు ఎక్కడికెళతాం? తప్పదు Baggageవైపు వెళ్ళాల్సిందే. Port of entry, దుబయి వెళ్ళకుండా ఉండటానికి ఉన్న చివరి అవకాశం. మనసులో ఏదో చిన్న ఆశ. అక్కడ కూర్చున్న officers దున్నపోతుల్లా ఉన్నారు. వీళ్ళు officers ఏంటిరా బాబు అనిపిస్తుంది. ఒక్కడిక్కుడా officer లక్షణాలు లేవు. నా వంతు రాగానే ఒక officer దగ్గరికెళ్ళా, వాడు మాట్లాడనుకూడా మాట్లాడలేదు అన్నీ సైగలే. వీడు మూగవాడా? లెక ఆంగ్లం రాక అలా సైగలు చేస్తున్నాడా. ఏమో, ఏమయితేనేం నన్ను తిరస్కరిస్తే చాలు. ఊహు, లాభం లేదు. ముద్దెర వేసేసాడు. ఒక ముద్దెర నా పాస్పోర్ట్ మీద ఇంకో ముద్దెర వీసా కాగితం మీద. ఉన్న చివరి ఆశ కూడా నీరుగారిపోయింది. ఇంక తప్పదు నిజాన్ని అంగీకరించాలి, నేను దుబాయిలో ఉన్నా అదినిజం. విమానాశ్రయం నుండి బయటికొస్తుంటే, అక్కడ నిలుచున్న ఒక వ్యక్తి ఈద్ ముబారక్ అంటూ ఏదో చిన్ని పెట్టే ఇచ్చాడు. తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నా, మనసు అదోలా ఉండటంవళ్ళేమో దాన్ని తెరవాలనిపించలేదు. ఒక sim card కొనుక్కొని, taxi పట్టుకున్నా.

కార్ దుబాయ్ రోడ్లమీద పరిగెత్తడం మొదలెట్టింది. వావ్, అద్భుతం, అమోఘం అనాలేమో. అంతబావున్నాయి దుబాయి రోడ్లు. ఒక వైపు ఆరు/ఏడు లైన్లు, రెండు వైపులా కలిపి 12/14 లైన్లు. ఇంతవరకు చాలా అంతర్జాతీయ నగరాల్ని చూసా (న్యూయార్క్, లాస్ఏంజ్లెస్, లండన్, బాస్టన్ , హ్యూస్టన్, శాన్ఫ్రాన్సిస్కో మొ||), కానీ నగరల్లో ఎక్కడా లేనంత అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. నగరం మధ్య అభివృద్ది చెందడంవళ్ళ కలిగినలాభాలు ఇవి. పాత నగరాళ్ళొ ఎక్కడా ఇంత అద్భుతంగా రోడ్లు వేయలేం. న్యూయార్క్ నగరంలోనో లేక లండన్ నగరంలోనో ఇలాంటి రోడ్లువేయాలంటే కుదరదు, ఎన్నో భవంతులు పడగొట్టాలి కానీ కొత్త నగరాల్లో ముందే ప్రణాళిక వేసుకుని కట్టొచ్చు. రోడ్డు మీద కాస్త దూరం వెళ్ళగానే రోడ్డు చుట్టూ ఆకాశ హర్మ్యాలు. ఇంతకాలం ఈమెయిల్లోనో, గూగుల్లోనో కనిపించే భవనాలు. వాటిదాటుకుంటూ ముందుకు దూసుకెలుతోంది కారు. మాటకు మాటే చెప్పుకోవాలి, నగర అభివృద్ది చాలా బావుంది. అయితే అభివృద్దంతా గత పదేళ్ళలో వచ్చిందన్న విషయం మరచిపోకూడదు.

టాక్సి వాడికి డబ్బులు ఇచ్చేసి, హోటెల్లోకి వెళితే అక్కడ receptionలో తెల్లపిల్ల. తెల్లవాళ్ళకు బుఱ్ఱలు ఉండవు అని నా అనుభవం చెబుతోంది. కానీ ఏమి చేస్తాం, తప్పదు. Room booking వివరాలు చెప్పి అక్కడ కూర్చున్నా. పిల్ల 1800 దినార్లు ఇవ్వమంది. కానీ మీకు ముందే చెప్పా కదా, మనదగ్గర అంత డబ్బు లేదు. నాకు forex teamఇచ్చిందే 1650, అందులోsim card, taxiకి కలిపి ఒక 150 దినార్లు అయిపోయాయి. కనుక నా దగ్గర ఉన్నది 1500 దినార్లు మాత్రమే. 'నా cardలో మొత్తం డబ్బులు పడలేదు, పడటనికి కాస్త సమయం పడుతుంది. నేను రెండోజులకుగానూ 900 దినార్లు చెల్లిస్తా, మిగతా 900 రెండ్రోజుల తరువాత చెల్లిస్తా' అని చేబితే నా పాస్పోర్ట్ లాగేసుకుంది. డబ్బులు ఇవ్వకుంటే పాస్పోర్ట్ ఇవ్వనంటుంది. నాకైతె తల తీసేసినట్టుగా అనిపించింది. Receptionలో అంతమంది ముందు, డబ్బులు లేవని పాస్పోర్ట్ లాగేసుకుంటే చాలా అవమానంగా అనిపించింది. ఎవడో forex department వాడు చేసిన తప్పుకి నాకు తలనొప్పి. ఎంత అర్ధమయ్యేలా చెప్పినా తెల్లపిల్లకు ఎక్కడంలేదు. రెండ్రోజులకు డబ్బులు ఇస్తున్నా ఆతరువాత ఇవ్వకుంటే నన్ను హోటేల్ నుండి తరిమెయ్యమని చెప్పినా పిల్ల బుఱ్ఱ వెలగడంలేదు. మోకాళ్ళో మెదడుంటే ఎలా అర్ధమవుతుంది. పోనీ వేరే హోటెల్కి వెళదామన్నా; ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మాత్రం పిల్ల డబ్బులు ఇవ్వకుండా పాస్పోర్ట్ ఇస్తుందా? ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఇంక లాభంలేదని రా*** number పిల్లకిచ్చి తనకు call చేయమని చెప్పా. పిల్ల భయపడినట్టుంది, పక్కన ఎవరినో పిలిచింది. అప్పుడు ఆపద్భాందవుడిలా వచ్చాడు అవినాశ్ ( shiftకు incharge అనుకుంటా ). వాడికి కత అంతా చెబితే పర్లేదు అన్నాడు. హమ్మయ్య, సమస్య తీరిపోయింది. పిల్లకు 900 దినర్లు ఇచ్చి రూం వైపుకు నడిచా.

రూంలోకెలితే రూంబానే ఉంది. కానీ నేను అనుకున్నంత బాలేదు. శుభ్రంగానే ఉంది కానీ నిశితంగా పరిశీలిస్తే అక్కడక్కడ మురికి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల్లో లేదు. మొత్తానికి బానే ఉంది. రా***కు call చేస్తే సాయంత్రం కూర్చుని, రేపు ఎవరెవరు ఏమేమి చేప్పాలో ఎక్కడ మారాలో మాట్లాడుకుందమన్నాడు. సరే అన్నా, తను వచ్చేలోపు మిగిలిన రెండు రోజుల PPTలు పూర్తి చేయాలి. స్నానం చేసి, కాఫీ పెట్టుకుని, PPTచేస్తూ కూర్చున్నా. రెండొరోజుది అయ్యిందనిపించేసా (అది బాలేదని నాకు అర్ధమవుతూనే ఉంది), మూడో రోజుది చేసే సమయం లేదు. 7.30 ప్రాంతంలో రా*** వచ్చేసాడు. దాదాపు అరగంట తెల్లారి ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో మాట్లాడుకున్నాం. పొద్దున్నే 8కి వస్తా, కలిసి వెళదాం అని చెప్పాడు. దగ్గర్లో తినడానికి ఏమున్నయి అంటే హోటెల్లో బాలీవుడ్ కేఫ్ ఉంది లేదా room service ఉంది. అదీ వద్దంటే Taxi తీసుకుని వెళితే ఏదో ఉంది అని చెప్పాడు. అప్పుడు Taxi తీసుకునెళ్ళే ఓపికలేదు. roomకెళ్ళి menu చూసి, ఎలాంటి ప్రయోగం చేయకుండా 'చికెన్ బిర్యానీ’ చెప్పా. ఆశ్చర్యం పూర్తిగా మన బిర్యాని రుచే ఉంది. (అలా ఎందుకన్నా అంటే, అమెరికాలో పేరుకే ఇండియన్ తిండి కానీ రుచి కోశాన మన రుచి కాదు.) మొదటిరోజు PPT తీసి తుదిమెరుగులు పెట్టి అలా నడుంవాలిస్తే, ఎప్పుడు కన్నటుకుందో కూడా తెలీదు. (అసలే ముందురోజు రాత్రి నిద్ర లేదు.)

అలారం మోగడంతో మెలకువొచ్చింది. టైం చూస్తే ఏడు, ఎనమిందింటికి రా*** వస్తాడు. త్వరత్వరగా అన్నీ ముగించుకుని, కాఫీ పెట్టుకుని, Tie ముడెస్తుంటే అస్సలు ముడి కుదరటంలేదు. Tie కట్టుకుని చాలా కాలం అయింది కదా, అలవాటు తప్పినట్టుంది దాదాపు 9-10 సార్లు ప్రయత్నిచా. అప్పుడు కానీ నాకు నచ్చేలా రాలేదు. రాజీవ్ 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. client కార్యాలయానికి వెళ్ళేదారి కూడా అదే రోడ్, అవే ఆకాశ హర్మ్యాలు. రా*** దుబాయ్ గురించి, cog***లో తన అనుభవాల గురించి చెబుతున్నాడు. దుబాయి చాలా ప్రశాంతమైన నగరం, ఇక్కడ నేరాలు జరగవు. [అవును నేరస్తులంతా అక్కడే ఉంటే అక్కడ నేరాలెందుకు జరుగుతాయి. (ఉదా: దావూద్ ఇబ్రహీం) కూర్చున్న కొమ్మను నరుక్కునేంత మూర్ఖులు కాదు వాళ్ళు.] ఇక్కడ విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ [మరి అక్కడ మనకు ఉన్న విలువ?] దేశపు రాజు నిరాడంబరత గురించి చెప్పిన విషయం మాత్రం నాకు నచ్చింది.

client కార్యాలయం పాత దుబాయిలో ఉంది. కొత్త దుబాయికి పాత దుబాయికి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొత్తదుబాయిలా హంగూ ఆర్భాటాలతో లేదు. మామూలు నగరాలు ఎలా ఉంటాయో అలా ఉంది ఈ పాత దుబాయి. client కార్యాలయం, పరవాలేదన్నట్టు ఉంది. అంత పెద్ద బ్యాంకు కార్యాలయంలా లేదు. లోపలికెళ్ళాక, కాఫీ ఇచ్చే మనిషి కాఫీ తెచ్చి ఇచ్చాడు. కాఫీ మొదలెట్టానో లేదు వచ్చేసారు clients. పరస్పర పరిచయాలు కరచాలనం అయిపోయాక, ఇంక మొదలెట్టనా అని అడిగా. అందుకోసమే చూస్తున్నా, నీ పని పట్టడానికి అన్నట్టుగా ఉంది ఒకతని చూపు. [client ఉద్యోగుల్లో ఒకరు శ్రీలంక (X అనుకుందాం), ఒకరు తమిళనాడు (Y అనుకుందాం), ఇంకొకరు కేరళ (Z అనుకుందాం). మిగతావాళ్ళు అప్రస్తుతం మనకు. X అందరికీ బాసు] Y ముఖకవళికలు చూస్తే మనం రావడం తనకు ఇష్టం లేదు అని అర్ధమవుతుంది. X మాత్రం ఏమి చెబుతామా అన్నట్టు ఆసక్తిగా చూస్తున్నాడు. నేను చెప్పిన విషయాలు Xకి సమ్మతంగానే ఉంది కానీ Y దేనికి ఒప్పుకోవడం లేదు. చాలా విషయాలు చర్చించాం, నిజం చెప్పాలంటే చర్చ నాక్కూడా బాగా నచ్చింది. భోజనం సమయానికి Y కూడా వీళ్ళు చెప్పేది బానే ఉంది అన్నట్టుగా మారిపోయాడు. ఒక్కరోజులో ఆమాత్రం తేడా చాలు అనిపించింది. Y, నేను కలిసి భోజనానికెళితే, Y నాకు భోజనం తీసుకున్నాడు [రా*** ఎక్కడికో వెళ్ళాడు]. భోజనం తరువాత వాళ్ళకున్న సమస్యలు, వాటి పరిష్కారం మీదే చర్చ జరిగింది. దాదాపు 3.30కు రోజు చర్చలు అయిపోయాయి. అప్పటికి Y దాదాపు అనుకూలంగా మారిపోయాడు. అక్కన్నుండి మార్గమధ్యంలో భోజనం చేసి రూంకి వచ్చేసా. రోజులో మిగిలిన సమయంలో మరీనా వాక్కి గానీ, ఎమిరేట్స్ మాల్కి గానీ వెళ్ళమని చెప్పాడు రా***. నేను మాత్రం మరీనా వాక్కి వెళదామనుకుని నిశ్చయించుకుని వచ్చేసా.

రూంకి వచ్చి మెయిల్ చూస్తే ఇంకా డబ్బులు రాలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నా పరిస్తితి ఇలా ఉంటే వీళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. Forex వాళ్ళకి ఫొన్ చేసి ఎందుకు రాలేదు అంటే, పెద్ద కత చెప్పింది. ముందు నువ్వు forex అభ్యర్ధన (request) పంపు, అది ఆమోదం (approve) పొందాక డబ్బులు ఇస్తాం అని చెప్పింది. నాకైతె చిర్రెత్తుకొచ్చింది. నా చేతిలో డబ్బుల్లేవు మొర్రో అంటే పద్దతులన్నీ ఏంటి అని తిట్టేసా. దాదాపు రెండు గంటల చర్చల తరువాత ఒక అంగీకారం కుదిరింది. (నెను అభ్యర్ధన పంపించాలి, అది ఆమోదం పొందేలా చేస్తా అని ఒక మెయిల్ రాయాలి, అప్పుడు తను డబ్బులు ఇస్తుంది). అనుకున్నట్టుగా అన్నీ పంపించా. తను bank వాడికి మెయిల్ పెట్టేసా, వాడు డబ్బులు లోడ్ చేస్తాడు అని ఒక మెయిల్ పెట్టి వెళ్ళిపోయింది. ఎంతసేపు చూసినా తేడా లేదు. Bank వాడికి మెయిల్ పేడితే, వాడు దాన్ని forexకి పంపి చేయనా అని అడిగాడు. (ఇంకేం forex, forex వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు.) అంటే ఇవ్వాళ కూడా మనకు డబ్బులు లేవు. Receptionకు వెళ్ళి మరో రోజుకోసం ఇంకో 450 చెల్లించేసా. ఇప్పుడు నా చేతిలో మిగిలింది 50 దినార్లు. ఇంకా బయటికెళ్ళే కార్యక్రమాలన్నీ రద్దు. ఇవ్వాళ కూడా భోజనం రూంకే, బయటికెళ్ళే డబ్బులు లేవు. బికారిని కదా. నా పేరు బికారీ నా ఊరు ఎడారీ అని పాడుకున్నా (దుబాయి ఎడారేకదా.).. రెండోరోజు PPTకి తుదిమెరుగులు పెట్టి పడుకోబోతుండగా హోటల్ పుస్తకం(magagine) కనిపించింది. ఒకసారి దాన్ని తెరిచి చూస్తే, హోటెల్ యజమానీలో ఏమాత్రం హుందాతనం లేదు. ఇంతపెద్ద వ్యాపార సంస్తకు వీడు యజమాని ఏంట్రా అనుకున్నా. పుస్తకం కూడా మరీ చెత్తగా ఉంది సినిమాతారలబొమ్మలు వాళ్ళతో కలిసి తిరిగిన బొమ్మలు, అసలు వీడేంట్రా అనుకున్నా. (తరువాత తెలిసింది వాడు దావూద్కు బినామీ అంట). టీవీ పెట్టిచూస్తే అమెరికాలో శాండీ, నేను దుబాయి రావడమేమో కానీ అమెరికాకు శాండీ వచ్చింది.

కాలం పరిగెడుతూనే ఉంటుంది, తెల్లారింది. మెయిల్ చూసా, ఇంకా డబ్బులు రాలేదు. Forex team కి భయంకరమైన మెయిల్ పెట్టి పనుల్లో పడిపోయా. దారిలో రా*** నేను దుబాయి, UAEల గురించి విషయాలు మాటాడుకున్నాం. అబుదాబీ రాజు UAEకి రాష్ట్రపతి అంట, దుబాయి రాజు ప్రధానం మంత్రి అంట. రాజుల్లో ఎవడి దగ్గర డబ్బులు ఎక్కువుంటే వాడికి UAEలో పెద్ద పదవి అంట. దుబాయి ఆర్ధిక మాంధ్యం వచ్చినప్పుడు అబుదాబీ రాజు దుబాయికి చాలా డబ్బులు ఇచ్చి దుబాయిని కాపాడడంట. దానికి ప్రతిగా బుర్జ్ ఖలీఫాను రాజుకు ఇచ్చేసారంట, అందుకే బుర్జ్ దుబాయి కాస్త బుర్జ్ ఖలీఫాగా మారిందంట. మళ్ళీ నామనసులో అదే సమాధానం, ఇప్పుడంటే పెట్రోలియం ఉంది కనుక అబుదాబీ రాజు ఇచ్చాడు కానీ ఇంకో 200 సంవత్సరాల తరువాత ఎవడు పట్టించుకుంటాడు. Client కార్యాలయం వచ్చేసింది.  మళ్ళీ client, వాళ్ళ సమస్యలు సమాధానాలు. కానీ ఇవ్వాళ చాలా ఆసక్తిగా విన్నారు. వాళ్ళ రరకాల సమస్యలు అడిగారు, చెప్పిన సమాధానలు ఓపిగ్గా విన్నరు. చాలా ఫలవంతమైన చర్చ జరిగింది. వాళ్ళ ముఖాళ్ళో మనపై నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళ Sr.VPని కలవడానికి, అతనికి కూడా ఇవ్వన్నీ చెప్పడానికి అనుమతి ఇచ్చేసారు. తెల్లారి 9కి Sr.VPతో సమావేశానికి సమయం నిర్ణయించారు. మీ testing capabilities కూడా చెప్పండి అని అడిగారు. తరువాత రా*** Xని అడిగాడు, మా సామర్ధ్యాలమీద మీద మీ అభిప్రాయం ఏంటి అని. మీరు కూడా oracle consultingకి సమానంగా ఉన్నారు అని చెప్పాడంట. అదివిన్న నాకు అది విని హమ్మయ్య వీళ్ళు సంతోశించారు, ప్రస్తుతానికి ఇది చాలు అనిపించింది. అక్కడినుండి బయలుదేరి భోజనంలో కూర్చుని తెల్లారి ఏమేమి చెప్పాలి, వాళ్ళ Sr.VPకి మన సామర్ధ్యం తెలిసొచ్చేలా ఎలా చెప్పాలి అని చర్చించుకున్నాం. రేపు ఎవరెవరు ఏమేమి చెప్పాలి, అని ఒక అంగీకారనికి వచ్చేసాం. ఈ రోజు భోజనంలో ఒక దుబాయి వంటకాన్ని తిన్నా, అదికూడా రా*** తినేలా ఉంటుంది అని చెప్పాకే తిన్నా. ఇంతలో SMS వచ్చేసింది, డబ్బులు పడ్డయని. రూంకి వెళ్ళగానే bank siteకెళ్ళి డబ్బులు వచ్చాయా అని చూసుకున్నా. వావ్, వచ్చేసాయి. నేను బికారినుండీ దనవంతున్నయిపోయా. డబ్బుల్లేకుండా ఎంత చికాకులు అనుభవించానో తెలుసుకదా అందుకే డబ్బులు రాగానే హమ్మయ్య అనిపించింది. వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకున్నా. ఇవ్వాళ ఎలా అయినా మరీనా వాక్ వెళ్ళాల్సిందే. రా***కి call చేస్తే 7కి అక్కడ ఉండేలా వెళ్ళు అన్నాడు. కాసేపు కునుకు తియ్యొచ్చన్నమాట.

సాయంత్రం 6కి లేచి కాఫీతాగి, బయలు దేరేముందు camera తీసుకెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నా, నేను వెళ్ళేది అందాలు ఆస్వాదించడానికి కానీ photos తీసుకోవడానికి కాదు. చాలామంది ఏప్రదేశానికి వెళ్ళినా photoలమీద పడి వెళ్ళిన ప్రదేశాన్ని చూడటం మరచిపోతారు. మళ్ళీ ఇంటికొచ్చి photoలు చూసుకుంటారు. photoలే చూడలనుకుంటే అంతదూరం వెళ్ళడం ఎందుకు? netలో దొరుకుతాయి కదా. నావరకు మాత్రం photos కాక ప్రదేశంలో మమేకమవడమే కోరుకుంటా. హోటెల్ బాయటికొచ్చేసా. అక్కడ taxi కావలంటే రోడ్ మీదికెళ్ళి చెయ్యి చూపడమే. Driver పాకిస్తాని(నాకు ఒకప్పుడు పాకిస్తానీల మీద దురభిప్రాయం ఉండేది ఇప్పుడు లేదు), వాడు బాగా మాట్లాడాడు. మరీనా వాక్ దగ్గర దించేసాడు. మళ్ళీ వావ్ అనాలి తప్పదు, ఎందుకంటే ప్రదేశం చలా అందంగా ఉంది. చుట్టూ ఎత్తైన భవనాలు, మధ్యలో సముద్రపు నీరు. సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకొస్తే దాని చుట్టూ అందగా భవనాలు, hotels, walk area కట్టేసారు వీళ్ళు. అది చూడగానే నాకు వచ్చిన సందేహంసముద్రపు నీరు భూభాగంలోకి ప్రకృతి సిద్దంగా వచ్చిందా లేక మానవ నిర్మితమా?’ ( ప్రశ్నకు సమాధానం మర్నాడు తెలిసింది, రా*** చెప్పాడు . అదంతా ఒకప్పుడు సముద్రమే అంటా. సముద్రాన్ని మట్టితో నింపి తయారు చేసారట.) అడుగు ముందుకెయ్యకుండా అక్కడె నుంచుని ప్రదేశపు అందాలు చూస్తూ ఉండిపోయా. అంధమైన భవనాలు, వాటిని ఇంకా అందంగా మలచే విధ్యుద్దీపాల వెలుగులు. మానవ కళాత్మకత ముందు ప్రకృతి అందాలు తీసికట్టు అంటే అతిషయోక్తి కాదేమో అంత అందంగా ఉందాప్రదేశం. కాసేపు అక్కడే నుంచుని ముందుకడుగేసా. అక్కన్నుండి రెండడుగులు నీటివైపు వెయ్యగానే చల్లని పిల్లగాలి హాయిగా తగిలింది. ఆహా, పిల్లగాలి, నీటి తెమ్మెర ఎంత మనోహరంగా ఉందో. ఆ గాలి సన్నని దుర్గంధాన్ని కూడా మోసుకొస్తుంది. అయినా బానే ఉంది. సముద్ర తీరం కదా ఆమాత్రం కాలుష్యం, దుర్గంధం మామూలే. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే అందగా అలకారించబడిన హోటల్స్, రంగురంగుల వర్ణాల విధ్యుత్తుకాంతుల్లో వెలిగిపోతూ ఠీవీగా నుంచున్న ఎత్తైన భవనాలు. మనోహరమైన వాతావారణం. అన్నింటికన్నా చికాకువేసే విషయం ఏంటంటే బుర్కాలు. ఎక్కడు చూడూ బుర్కాలే. ఆ బుర్కాల మధ్య అక్కడక్కడ డబ్బుల్లేక దుస్తులు వేసుకోలేదేమో అనిపించే పాశ్చాత్య వనితలు, చెవుల్లో ear phone పెట్టుకుని పరిగెడుతున్నారు. ముందుకు వెళుతూ ఉంటే పాశ్చాత్యుల సంఖ్య పెరుగుతూ ఉంది, బుర్కాల సంఖ్య తగ్గుతూ ఉంది. ఆ ప్రాంతంలో పాశ్చాత్యులకు కొదవేలేదు (అంతా ఐరోపా ఖండం వాళ్ళు అనుకుంటా).  ముందు అందమైన భవనాలు, వెనక అందమైన భవనాలు ముందు చూస్తే వెనకనున్న భవనాలు చూడలేకపోతున్నా. ముందు వెనక చూస్తే ఎదురుగా వచ్చే అందాలు చూడలేకపోతున్నా. స్కేటింగ్ చేసె చిట్టిచిట్టి పిల్లలు. పక్కన నీటిలో పడవలు (cruice), వాటిలో సంగీతం.  ఇక్కడ చూడడానికి ఇన్ని అందాలున్నాయి, కానీ కళ్ళు రెండే. భగవంతుడా నాకు రెండే కళ్ళూ ఎందుకిచ్చావు? డబ్బులు తగలెయ్యాలంటే ఎన్నో మార్గాలున్నాయిక్కడ. ముందుకెళ్తూంటే పక్కన shopలు తగ్గుతున్నాయి, జన సాంద్రత తగుతోంది. ప్రశాంతమైన గాలి (సన్నని దుర్గంధంతో) మనసుకు హాయి గా ఉంది. పక్కన పడవలు (cruice) ఆగుస్తలాలు పెరుగుతున్నాయి. శ్రమంచి అలసిపోయిన అందమైన పడవలు ఎన్నో అక్కడ విశ్రాంతి పొందుతున్నాయి. ఇంకాస్త ముందుకెళ్ళ గానే పక్కన ఎలాంటి hotels/shops లేవు. సముద్రపు నీరు, ఆనీటికి ఇరువైపులా ఓడ్డున ఎత్తైన భవనాలు, చెవుళ్ళొ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పరిగెత్తే పాశ్చాత్యులు (ఈ పాశ్చాత్యులు ఎక్కడ చూసినా ఇలాపరిగెడుతూనే కనిపిస్తారు సిలికాన్ వాలీలో ఆఫీసు పక్కన, న్యూయార్క్ రోడ్డు మీద, గచ్చిబౌలి రోడ్డు మీద, కేబీఅర్ పార్కులో ఎక్కడ చూసినా ఇలగే కనిపిస్తారు), కుటుంబ సమేతంగా నడిచేవాళ్ళు, స్కేటింగు చేసే పిల్లలు, తొక్కుడు బళ్ళమీద వెళుతూ హడావిడి చేసే పిల్లలు పెద్దలు, మధ్య మధ్యలో బుర్కాలు అవ్వన్నీ చూస్తూ అడుగులు ముందుకేస్తూ కదలుతున్నా. ముందుకెళుతూ ఉంటే జనాలు తగ్గడంతో నిశ్శబ్ధంగా ఉంది; చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటికే చాలా దూరం నడచినట్టున్నా అలసటగా ఉంది, పక్కన బల్ల కుర్చీ మీద కూర్చుంటే? అక్కడ ఎవరో పిల్ల కూర్చునుంది, చెవిలో ear phones పెట్టుకుని పాటలు వింటూ తనలోకంలో ఉంది. ఆ పిల్లపక్కన కూర్చునె ధైర్యం లేదు, అందుకే పక్క బల్లమీద కూర్చున్నా. మనసులో ఏవేవో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. మనిషి ప్రకృతికే అందాలు తెచ్చాడు, సృష్టికి ప్రతిసృష్టి అంటే ఇదేనేమో. ఈ తీరం ఎంతదూరం ఉందో, ఇవ్వాళ చివరి వరకు వెళ్ళగలనా? కాసేపు సేదతీరి మళ్ళీ నడక ప్రారంభించా, అక్కడ పెద్దగా ఎవరూ లేరు. నేను ఒక్కన్నే నడుస్తూ వెళుతూ ఉన్నా. భవనాలు సముద్రం తప్ప ఏమీలేవు అలా ఎంతసేపు నడిచానో తెలీదు కానీ తీరం సమాప్తమయిపోయింది. అంటే పూర్తిగా అయిపోలేదు, అంతకు ముందుకు వెళ్ళకూడదు అని అర్ధమయ్యేలా దారికి అడ్డుపెట్టారు. ముందుకి వెళితే ఇంక ఎంతదూరం ఉందో తెలీదు కానీ అంతకన్నా ముందుకి వెళ్ళడానికి అనుమతి లేదు. అందరూ అక్కన్నుండే వెనక్కి వచ్చేస్తున్నారు. నేను కూడా చివరి వరకు వెళ్ళి వెనుదిరిగాను. వెనక్కి చూస్తే నేను నడిచి వచ్చిన దారి, భవనాలు, మనుషులు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రియురాలితో వాహ్యాళికి వెళ్ళడానికి సరైన ప్రదేశం ఇది. ఇక్కడ అందరు వారివారి ప్రేయసితోనో, కుటుంబ సభ్యులతోనో తిరుగుతున్నారు. ఈ మరీనా వాక్‌లో అన్నీ జంటలే మనుషులు భవనాలు అన్నీ (మరీనా వాక్‌లో దాదపు అన్నీ జంటభవనాలే). ఎవరూ తోడులేకుండా ఒంటరిగా నడిచేది నేనొక్కన్నే. నా పరిస్తితి చూసి నాకే జాలేసింది (అక్కడ నాపై జాలిపడే తీరిక వేరెవ్వరికీ లేదు). ఎందుకో తెలీదు ఆక్షణం మనసులో "పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని" అనే చరణాలు మెదిలాయి. ఆ క్షణం అప్రమేయంగా ఆకాశంలోకి చూసిన నన్ను ‘ఎవరూలేరంటావే నేను ఉన్నగా నీకు తోడుగా’ అంటూ ఆకాశంలో నిండుజాబిల్లి పలకరించాడు. అవును ఆ జనారణ్యంలో నాకు తెలిసింది ఆ జాబిల్లి ఒక్కడే. ఆ క్షణం నాకు తోడొచ్చినందుకు చందమామకు thaks చెప్పి, తనతో మాట్లాడుతూ, చల్లని గాలిని (దుర్గంధంతో సహా) ఆస్వాదిస్తూ వెనక్కి నడవడం ప్రారంభించా.

ఇవ్వాళ ఎట్టిపరిస్తితిలో రూంలో తినకూడదు. ఎక్కడికైనా వెళ్ళితినాలి, పోనీ బాలీవుడ్ కేఫ్కి వెళ్ళిచూస్తే. ఆలోచన రావడమే తరువాయి, కిందికేళ్ళి బాలీవుడ్ కేఫ్ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్ళా. దారేదో వింతగా ఉంది ఎక్కడికో లోపలికి తీసుకెళ్తుంది. బాలీవుడ్ కేఫ్వచ్చేసింది. తలుపు తీసుకొని లోపల అడుగేసానో లేదో ఒక్కసారి భయం వేసింది. నేనెక్కడికొచ్చాను, అమ్మో వెళ్ళిపోతేనో, వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకుంటారు? ఇలా ఆలొచిస్తుండగానే అక్కడున్నbarer కుర్చీలాగి కూర్చోబెట్టేసాడు. ఇంతకి నన్ను అంతభయపెట్టిన విషయం ఏంటంటే, అది ఒక bar, హోరెత్తేలా బాలీవుడ్ సంగీతం, అక్కడ ఒక చిన్న వేదిక దానిమీద పాటకు తగ్గట్టు ఎగురుతూ bar gals. ఇవ్వన్నీ సినిమాల్లో చూడటమే కానీ నిజజీవితంలో చూడటం ఇదే మొట్టమొదటిసారి. అందుకే నేమో చాలా భయంగా ఉంది. ఇక్కడ తినాలా లేక వెళ్ళిఫోవాలా? వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వెళ్ళిపోతే మరీ ఛండాలంగా ఉంటుంది అని అనిపించి తినడానికే నిశ్చయించుకున్నా. menu చూసి order చేప్పేసా. వాడు మందొద్దా అని వెటకారంగా అడిగాడు, తాగకపోవడం ఏదో పెద్ద తప్పులా. నేను వద్దు బాబు అని చెప్పి కూర్చున్నా. క్షణ క్షణం భయం భయంగా ఉంది, ఒంటరిగా కాకుండా పక్కన ఇంకెవ్వరైన ఉంటే అంతభయంగా ఉండేది కాదేమో కానీ ఒక్కన్నే. భయంలో శరీరం కంపిస్తున్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ వేదిక మీద దాదపు 18 మంది బార్గల్స్ ఉన్నారు. అందులో చాలా వరకు 14-20 ఏళ్ళమధ్యలోనే ఉంటారు. పాటకు ముగ్గురు చొప్పున ఎగురుతున్నారు. పాటమారగానే ఎగిరే ముగ్గురు మారిపోతున్నారు. వాళ్ళవైపు చూడాలంటేనే భయంగా ఉంది, అలా అని చూడకుంటే పక్కన జనాలు నన్నెలా చూస్తారో అని భయం. నా భయాన్ని దాచుకుంటూ గ్లాస్లో ఉన్న నీళ్ళు తాగుతూ భోజనంకోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. మనకు client presentation skillsలో eye contact ఎంత ముఖ్యమో నేర్పిస్తారు, వాళ్ళక్కుడా అదే నేర్పినట్టున్నారు. వాళ్ళు కూడా నేరుగా కళ్ళల్లోకే చూస్తున్నారు. అలా చూసినప్పుడు మాత్రం అమ్మో చాలా భయం. ముల్లమీద కూర్చోవడం అంటే ఏమిటో నాకు బాగా అవగతమవుతోంది. Order తీసుకొచ్చాడు హమ్మయ్య అనుకుని తినడం ప్రారంభించా. ఏమి తింటున్నానో, దాని రుచి ఎలా ఉందోకూడా అర్ధం కాకుండా తింటున్నా. Bill రాగానే డబ్బులిచ్చేసి దాదాపు పరిగెత్తినంత పనిచేసా. రూంలో పడేంతవరకు వెనక్కి తిరిగిచూస్తే ఒట్టు. రూంలోకొచ్చాక్కూడా కాసేపటివరకు భయంపోలేదు. రోజూ తప్పని పని, మూడొ రోజు PPTచేసి, Sr.VPకి ఎలా చెప్పాలో ఒకసారి rehearsal చేసుకున్నా.

పొద్దున్నే రా*** కాల్కోసం ఎదురుచూస్తూ rehearsal చేసుకుంటున్నా. ఏదోకాల్ వస్తే రా***ది అనుకుని ఎత్తేసా, అది శ్రీధర్గాడి కాల్. వాడిని ఒరే వెధవా అని తిట్టి పెట్టేసా. 200 రూపాయలు బొక్క international roaming కదా. ఈరోజు దారిలో నేను రా*** పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. దారంతా రా*** ఏదో callsలో ఉన్నాడు. Client కార్యాలయానికి వెళ్ళగానే అక్కడ cog****కి చెందిన ఇంకోమనిషి ప్రత్యక్షం అయ్యాడు. నిన్న testing capabilities గురించి అడిగారుకదా, అందుకే అతన్ని తీసుకొచ్చాడంట రా***. వచ్చేసాడు SrVP (మధ్యప్రాశ్చం వాడే), చూడగానే భయం వేసింది. చాలా గంభీరంగా ఉన్నాడు, బూతద్దంతో వెతికినా ఆ ముఖం మీద చిన్ని చిరునవ్వుకూడా లేదు. మనిషికన్నా మాట ఇంకా గంభీరంగా ఉంది. నాకైతే చాలా భయంవేసింది. ముందు రా*** మొదలెట్టాడు. తన గొంతు చూస్తేనే అర్ధమవుతుంది, తనుకూడా భయపడ్డాడని. ఓ రెండు నిమిషాలు మాట్లాడి నాకిచ్చేసాడు. నేకైతే మాట పెకలట్లేదు, తడబడుతున్నా, దాదాపు పదినిమిషాలు తడబడుతూనే మాట్లాడా. ఆ తడబాటునుండి తేరుకోవడానికి పదినిమిషాలు పట్టింది. అతని ముఖంలో ఎలాంటి భావంలేదు కేవలం గంభీంగా ఉంది. ఇలాంటి సమస్య ఉన్న మిగతా clients దగ్గర ఏమిఛేసామో చెబుతున్నప్పుడు మాత్రం కాస్త మాట్లాడాడు, కొన్ని ప్రశ్నలడిగాడు. మళ్ళీ pricing విషయంలో కాసేపు మాట్లాడాడు తగ్గించమన్నాడు మిగతావి పట్టించుకోలేదు. Tetsing అతను చెప్పినప్పుడు మా testing RFP మీకు వచ్చిందా అని అడిగాడు. సంబందిత managerను పిలిచి వీళ్ళక్కూడపంపమని చెప్పి వెళ్ళిపోయాడు. నాకైతే హమ్మయ్య వెళ్ళిపోయాడు అనిపించింది. తరువాత X,Y,Zలతో కాసేపు మాట్లాడి, వాళ్ళ అనుమానాలు నివృత్తిచేసి బయలు దేరాము. రా*** Xని నిర్మొహమాటంగా అడిగాడు cog*** వచ్చే అవకాశం ఎంత అని. మాకు నచ్చింది మా అభిప్రాయాన్ని మా boardకి చెబుతాం, వాళ్ళు ఎవరికిస్తారన్నది నిర్ణయిస్తారు. సాధారణంగా మేము చెప్పిందే చేస్తారు, వాళ్ళకు వివరాలు తెలీదు కదా అని చెప్పాడు. బయలుదేరాక రా*** నాతో ఉన్న సమయంలో ఏమిరేట్స్ మాల్ చూడమన్నాడు. నేను మాత్రం ఆకాశ హర్మ్యాలు చూస్తా అని చెప్పా. రా*** నన్ను రూంలోదించి వెళ్ళిపోయాడు.

ఇంక మిగిలున్నవి కొన్ని గంటలు, ఎలాగైనా ఆకాశ హర్మ్యాలు చూడాలి. బయట చాలా ఏండగా ఉంది అయినా చూడాలి అని నిర్ణయించుకున్నా. Taxi తీసుకుని షేక్ జాయెద్ రోడ్కి పదా అన్నా. ఇతనూ పాకిస్తాన్ వాడే. మొదటి హర్మ్యం రాగానే దిగి డబ్బులిచ్చి వాన్ని పంపేసా. ఎదురుగా నుంచుంది ఆకాశ హర్మ్యం, దాన్ని చూడడానికి తల ఎత్తడానికి కష్టపడుతున్న నన్ను చూసి నవ్వుతూ. ఫొటో తీస్తా అంటే నీ కెమెరాలో పట్టనుపో అంది. అయినా నేనూరుకుంటానా ఎలాగోలా camera బంధించేసా. అక్కడ అన్నీ ఆకాశా హర్మ్యాలే, ఒక్కో హర్య్మం ఒక్కో ప్రత్యేకమైన రూపంతో ఉంది. మానవ మేధస్సు సృష్టించిన రూపాలవ్వి, అయినా కూడా మానవ మేదస్సునే సవాలు చేస్తూ గర్వంగా నించున్నాయి. అల్లంత దూరంలో కనిపిస్తోంది బుర్జ్ ఖలీఫా ఆకాశానికి నేలకు నిచ్చన నేను అన్నట్టుగా. నడవడం ప్రారంబించా, ఒక్కో హర్మ్యాన్ని చూస్తూ దాని నిర్మాణ శైలికి అబ్బురపడుతూ, కుదిరినంతలో కెమెరాలో బందిస్తూ, ఒక్కో హర్మ్యాన్ని దాటుకుంటూ ముందుకి నడుస్తున్నా. రోడ్డు మీద పిచ్చివాడిలా భవనాలు చూస్తూ నడిచేవాన్ని నేనొక్కన్నే మిగతా ఎవరూ లేరు, అయినా మొహమాటం లేదు (సాధారణంగా సాయంత్రం వేళలో జనాలు వస్తారంట, కానీ నాకింకో సాయత్రం లేదు. సాయంత్రమే తిరుగు విమానం). కాస్త ముందుకెళ్ళాక అలసట మొదలయింది, ఎండలో dehydration మొదలయ్యింది.  ఏదేమైనా బుర్జ్ ఖలీఫా దగ్గరికెళ్ళాల్సిందే అనుకుంటూ నడక కొనసాగిస్తున్నా. ఆ భవనాలను అన్నివైపులనుండి చూస్తూ, ఫోటోలు తీసుకుంటూ కదులుతున్నా. కాస్త దూరం వెళ్ళాక రోడ్డు మరమ్మత్తులో ఉంది, ఇంతసేపు సజావుగా జరిగిన నా నడకకు కాస్త ఇబ్బంది ఎదురయ్యింది. అక్కడ foot path లేనందున main road మీదే నడవాల్సొస్తుంది. వచ్చి వెళ్ళే వాహనాలను చూసుకుంటూ నడుస్తున్నా. కొంచెం ముందుకెళ్ళాక road మీద వాహనాలు తప్ప మనుషులు లేరు నేనుక్కన్నే నడుస్తున్నా. అసలా రోడ్డు మీద నడవొచ్చో లేదో కూడా తెలీదు, ఎవరైనా పట్టుకునేలోపే ఇక్కన్నుండీ వెళ్ళాలని నడక వేగాన్ని పెంచా. దాదాపుగా అలసిపోయా, ఓపిక పోయింది అయినా చివరివరకెళ్ళాలనే తపన నడిపిస్తుంది. ఎదురుగా ఉన్న పనివాళ్ళను (వాళ్ళుకూడా దేశీయులే) ఎలా వెళ్ళాలని ఆడిగితె, short cutలో వెళతావా అన్నాడు. అలగే అంటే, ఇది దూకి అది దూకి అలా వెళ్ళు అని చెప్పాడు. అలా వెళ్ళోచ్చా అంటే ఆ అన్నాడు, ఎవరు పట్టుకోరా అంటే ఎవరూ ఏమనరన్నాడు. నాకెందుకో ఈ short cut idea నచ్చింది. ఆ దారిలోకెళ్ళాక అర్ధమయ్యింది ఎంత తప్పుచేసానో, మొత్తం దుమ్ము నిండిన దారి. ఆ దారిలో నడిచేవాళ్ళెవరూ ఎవరూ లేరు. ఎదో భవన నిర్మాణ సముదాయంలా ఉంది. ఆ మధ్యలోచి వెళుతుంటే, ఎవడైనా పట్టుకుని trespassing అంటాడెమో భయం. ఎవరైనా పట్టుకుంటే చూపించడానికి కనీసం పాస్‌పోర్ట్‌కూడా దగ్గర లేదు. అనవసరంగా వచ్చాన్రా బాబూ అనుకున్నా కానీ వెనక్కి కూడా వెళ్ళలేను, భయపడుతూ పరుగు లాంటి నడకతో మొత్తనికి భయట పడ్డా. ఈ short cutలో ఒక్క ఫోటో కూడా తీయలేదు. అది దాటగానే ఎదురుగ ఉంది బుర్జ్ ఖలీఫా, గర్వంగా నవ్వుతూ, ఠీవీగా నుంచునుంది, ఆకాశాంలోకి దూసుకుపోయినట్టుగా ఉంది. మబ్బుల్ని తాకుతుందా అన్నట్టుగా ఉంది. చూడానికి చలా అందగా ఉంది. ఎండలో మెరుస్తూ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వయం ప్రకాశకంలా కనిపిస్తూ ఉంది. కంటిక్కూడా అందనంత ఎత్తుగా ఉంది, దాన్ని చూడాలంటే తల అలా ఎత్తాల్సిందే. నన్ను చూసి ఒరేయ్ పొట్టివాడా అంది. నాకు రోషమొచ్చింది, ఆరడుగులున్న నన్ను పొట్టివాడా అంటావా నీ పని చెప్తా నీ ఫోటో తీసి నాకన్నా చిన్నదాన్ని చేస్తా అని కెమెరా తీసా. కెమెరాలో బంధించడానికి ఎన్ని రకాలుగా ప్రయతించొచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించా, ఎంత ప్రయత్నించినా కెమెరాలో పట్టదే. చివరికి ఓటమినంగీకరించక తప్పలేదు. ఇంతసేపు చిన్నా చితకా భవంతుల్ని తీసావు నేను అల్లాటప్పా కాను అంది. సరే నీ గొప్పతనాన్నొప్పుకున్నా మనిద్దరం ఫ్రెండ్స్ అన్నా, ఆనందంగా స్నేహ హస్తన్నందించింది. [నేను ఇంతవరకు చూసిన ఎత్తైన భవనం Empire State Building. (నేను న్యూయార్క్ వెళ్ళేనాటికే world trade center పడిపోయింది). దాంతోపోలిస్తే ఇది చాలా ఎత్తుంది] సాధమైనంతలో బుర్జ్‌ని ఫోటోలు తీసి, కాసేపు పక్కనున్న చెట్టునీడలో fountain పక్కన కూర్చున్నా, ఎండలో అలసిపోయిన నాకు చాలా ప్రశాంతంగా ఉంది.  అక్కడున్న security guardని 124వ అంతస్తుకి వెళ్ళనిస్తారంట కదా ఎలా వెళ్ళాలి అనడిగా. వాడు టికెట్టు కోసం ఎక్కడికెళ్ళలొ చెప్పాడు. ప్రవేశరుసుం ఎంత అంటే, రెండు రకాలుంటాయి 100 దినార్లు, 400 దినార్లు అన్నాడు. నాకాశ్చర్యం వేసింది, తేడా ఏంటి అన్నా కుత్తుహలంగా. చావు కబురు చల్లగా చెప్పాడు. ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే 400దినార్లు ముందు బూక్ చేసుకుంటే 100 దినార్లు అని చెప్పాడు. ఈ 124వ అంతస్తుకెళ్ళడానికి 400దినార్లు పెట్టడం అనవసరం అనిపించింది. కాసేపక్కడే కూర్చుని, కళ్ళతొనే బుర్జ్‌తొ మాట్లాడి దుబయి మెట్రో వైపు నడక ప్రారంభించా. మెట్రోలో ఎమిరేట్స్ మాల్‌కి వెళ్ళా కానీ నాకు ఇంక ఓపికలేదు అని అర్ధమవుతుంది. నేరుగా food courtకి వెళ్ళి ఒక బిర్యాని లాగించాక కాస్త అలసట తీరింది కానీ ఓపిక మాత్రం రాలేదు. ఇంటిదారి పడదాం అని taxi standకి వెళితే అక్కడ హనుమంతుడి తోకంత క్యూ. విషయమేంట్రా బాబూ అంటే ఇవ్వాళ taxiలు తక్కువగా ఉన్నయన్నాడు వాడు. ఆ క్యూ చూస్తే కనీసం గంటైనా పడుతుంది, లాభంలేదని నడుచుకుంటు ముందుకెళ్ళి taxi పట్టుకుని రూం చేరుకున్నా (మళ్ళీ driver పాకిస్తాన్ వాడే).

హమ్మయ్య, ఇక దుబాయితో పని అయిపోయింది ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. Receptionలో అవినాశ్ ఉన్నాడు. డబ్బులు తీసుకుని రసీదిచ్చి, మొదటిరోజు జరిగినదానికి క్షమాపణ చెపాడు. పిల్లకు తెలీక అలా చేసింది అని చెప్పాడు. అక్కడినుండి విమానాశ్రయానికి వెళ్ళే taxi driver కూడా పాకిస్తాన్ వాడే. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అన్న ఆనందంతో ఆకాశంలో విహరిస్తున్న నా ఆలోచనలతోపాటు నన్ను కూడా తీసుకుని గగనసీమకెగిరింది విమానం.

4 comments:

  1. Good Sir... So you visited Dubai at last .. hahahah haahha :) It seems you impressed a lot with Dubai's growth.

    ReplyDelete
    Replies
    1. Only infrastructure is good.. other than that every thing else is bad.

      Delete
  2. Very interesting Vigni. I thought writing some experience is very difficult to make each and every emotion, but with simple telugu you made it really awesome... I just read the each paragraph as thriller book, 1st page thought you might back to hyd and 2nd you might not attend client meeting and 3rd your client demo might fail and 4th you hate Dubai. But you complete made my thoughts are wrong... all went fine. Very interesting.

    ReplyDelete
  3. Excellent Narration andi. You took us to virtual Dubai tour!

    ReplyDelete