Thursday, October 17, 2013

లక్నవరం చెరువు సోయగాలు

ప్రకృతి ఒడిలో ఎన్నో ఆందాలు, ఎంతచూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపించే అందాలు ఎన్నో ఎన్నెన్నో. అందాల కనువిందుల్ని తనివితీరా చూడాలనుకున్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం లక్నవరం. ప్రకృతి అందాలు అంటే కోనసీమ, ఊటి, కేరళ మొదలైన ప్రదేశాలు మాత్రమే అనే వాళ్ళు ఇదిగో వరంగల్ అందాన్ని ఒకసారి చుస్తే మళ్ళీ మాట అనరు.

రుక్మాధర్ ఫోన్ చేసి రేప్పొద్దునకళ్ళా వరంగల్ వచ్చెయ్యిరా అన్నప్పుడు నాకు తెలీదు ఇంత చక్కని అందాన్ని చూడబొతున్నా అని. అది చూపించినందుకు వాడికి ధన్యవాదాలు తెలుపనవసరం లేదు, వాడు నా  చిన్ననాటి మిత్రుడు. ఇంతగొప్ప అందం ఇన్నాళ్ళు మాకు తెలీనందుకు ఛీ అనుకున్నాం. మేము చదువుకున్న బండారుపల్లికి (ములుగు మండలం), ఈ చెరువుకు పాతిక కిలోమీటర్ల దూరంకూడాలేదు. కానీ మాకేనాడు అక్కడ అది ఉందన్న విషయం తెలీదు. మేము బండారుపల్లిలో ఉన్నరోజుల్లో   ప్రాంతంలో ఎవరు చెప్పగా కూడా వినలేదు. వరంగల్ జిల్లాలో ఎన్నో చెరువుల పేర్లు విన్నా. రామప్ప చెరువు, పర్కాల్ చెవురు, కటాక్షపూర్ చెరువు, జాకారం చెరువు, పాఖాల్ చెరువు... ఇంకా ఎన్నో. అన్నింటికన్నా పెద్ద చెరువు పాఖాల్ చెరువు అని విన్నా. కానీ లక్నవరం చెరువు గురించి ఏనాడు వినలేదు. ఆధునిక ప్రపంచానికి తెలీకుండా అతి గోప్యంగా అడవితల్లి ఒడిలో ఉండిపోయింది చెరువు.

వరంగల్ జిల్లా అంతా చెరువుల మయం. కాకతీయుల రైతు ప్రేమ, దూరదృష్టి ఈనాటి రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చెరువులన్నీ కాకతీయులు నిర్మించినవే. నాకు ఇన్నాళ్ళు తెలిసిన అతిపెద్ద చెరువు పఖాల్ చెరువు కన్నా ఎన్నోరెట్లు పెద్దది చెరువు. అసలు దీన్ని చెరువు అని ఎందుకంటారో, సరస్సు అని  ఎందుకనరో నాకు అర్థం కాలేదు. పాఖాల్ చెరువుకింద పండే వరి పంట మొత్తం లక్నవరం చెరువుకింద పండే పంటకు విత్తనాలకు కూడా సరిపోదంట. ఇందులో అతియోక్తి ఉండొచ్చు కానీ చెరువు ఎంతపెద్దదో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.

వరంగల్ నుండి బైక్మీద బయలుదేరాం ఇద్దరం, లక్నవరంకు. రోడ్ నాకు చిన్నప్పటినుండి చాల సుపరిచితం కానీ బైక్ మీద వెళ్ళడం అదే మొదటిసారి. పచ్చని పొలాల మధ్య బైక్ వెళుతూ ఉంటే చిన్నప్పుడు ఎంత అందమైన ప్రకృతి మధ్య గడిపానా అనిపించింది. ఇప్పుడు ఉండేది ఈ కాంక్రీట్ అడవిలో. కాంక్రీట్ అడవికన్నా పచ్చని అడవే చాలా అందంగా ఉంది. దాదాపు గంటన్నార ప్రయణం తరువాత చేసుకున్నాం, లక్నవరం. చుట్టూ కొండలు, కొండల మధ్యలో పడిన నీరు బయటికివేళ్ళాడానికి దారి లేక అక్కడే ఉండిపోతే ఏర్పడ్డ సహజసిద్దమైన చెరువు అది. దీన్ని మొట్టమొదట కాతీయులే కనుగొన్నారట. కాకతీయులే ఆ కొండల్ని తొలిచి మరీ తూములు నిర్మించారంట, నీటిని వ్యవసాయానికి ఉపయోగించడానికి.

నలువైపులా ఎటుచూసినా పచ్చని కొండలు కొండల మధ్య చెరువు. చెరువు మధ్యలో ఆరుఏడు ద్వీపాలు చూడడానికి సుమనోహరంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అక్కడ ఒక ద్వీపానికి వేళాడే వంతెన నిర్మించారు. ఇలాటి వేలాడే వంతెనలు నేను ఇంతవరకు హిమాలయాల్లో మాత్రమే చూసా. అయితే అవి పెద్దవి, వాటి ముందు ఇది చాలా చిన్నది. ఆ క్షణం కెమెరా తేనందుకు బాధపడ్డ నాకు మొబైల్ సహకరించింది. ఆ ప్రాంతం ఎంత మనోహరంగా ఉందో నేను చెప్పడం ఎందుకు. మీరే చూడండి.

















































అక్కడ నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. సూర్య కిరణాలు నీటిలో పడితే నీటి అడుగు పైకి కనిపించేంత స్వచ్ఛంగా ఉన్నాయి.





తూము పైనుండి చూస్తే చెరువు అందాలు.







కాకతీయులచే నిర్మించబడ్డ తూముల్లో ఒక తూము.










చెరువు ఒడ్డున జలకాలాట





ఒకరోజు మొత్తం ఆనందంగా గడపడానికి అనువైన అందమైన ప్రదేశం ఇది. ఇంత అందమైన ప్రదేశం వెన్నెల రాత్రి ఇంకెంత అందంగా ఉంటుందో అనిపించింది మాకు. ఇక్కడ ఒక ద్వీపంలో aptdc వాళ్ళ guest house ఉంది. వెల 24గంటలకుగానూ 1410 రూపాయలు అంట. చెరువులో షికారుకి పడవలు ఉన్నాయి. తొక్కుడు బోట్లు కూడా ఉన్నాయి. అక్కడ వాడిని అడిగితే తొక్కుడు పడవలో ఈ ద్వీపం చుట్టే తిరగాలి అన్నాడు. అలా కాదు నాకు రోజు మొత్తానికి బోటు కావాలి అంటే, అరగంటకు 150 రూపాయల చొప్పున అన్నాడు, అలా అయితే చెరువులో ఎక్కడికి వెళ్ళినా తనకు అభ్యంతరం లేదు అన్నాడు. ఆ చెరువు మొత్తం ఇద్దరే బోట్ తొక్కుకుంటూ తిరగడం కష్టం. నాకైతే ఇంకో ఇద్దరు ఉంటే ఓ బోటు తీసుకుని అన్ని ద్వీపాలు తిరిగితే బాగుండు అనిపించింది.

ఇంకా ప్రాంతంపై మనిషి విషపడగ పూర్తిగా పడలేదు. అందుకే ఇంకా కాలుష్యపు కాటుకు గురికాకుండా అందంగా ఉంది. ఇప్పటికే అక్కడక్కడ ప్లాస్టీక్ కనిపిస్తూనే ఉంది. Aptdc వాళ్ళు ఇక్కడ ఉన్న ద్వీపాల్లో విహార భవనాలు కట్టే ఆలోచనలో ఉన్నారని తెలిసిన క్షణం మనసుకు బాధగా అనిపించింది. అంటే ప్రకృతి అందాలు త్వరలో కలుషితమవబోతున్నయన్నమాట.


ప్రదేశం హైదరాబాదుకు దాదాదు 270కిమీల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేదు, సొంతవాహనంలో వెళ్ళడం ఉత్తమం. ఇక్కడికి పొద్దున 9కి చేరుకోగలిగితే రోజంతా ఇక్కడే గడపవచ్చు. వెళ్ళడానికి మర్గం హైదరాబాదు -> వరంగల్ -> ములుగు (వరంగల్లో ములుగు రోడ్ ద్వారా వెళ్ళాలి) -> చల్వాయి (ములుగు నుండి ఏటూరునాగారం వెళ్ళేదారిలో చల్వాయి ఉంటుంది) -> చల్వాయి నుండి కుడి వైపు రోడ్ తీసుకుని లక్నవరం వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలనులనుకున్నవారు వరంగల్ ‌నుండి ఏటూరునాగారం/మంగపేట్ బస్ ఎక్కి చల్వాయిలో దిగాలి. అక్కడినుండి లక్నవరంకు ఆటోలో వెళ్ళాలి. ఇక్కడికి దగ్గరలో ఉన్న నగరం వరంగల్. వరంగల్ దాటితే ఏమీ దొరకవు. ఒకరాత్రి ముందే చేరుకుంటే వరంగల్లో ఉండాలి.

ఈ చెరువు వర్షాధారం కావడంవళ్ళ వర్షాకాలం నిండు కుండలా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు సెప్టెంబర్-డిసెంబర్ మధ్యకాలంలో వెళితే నిండైన చెరువును చూడొచ్చు. సమ్మక్క సారమ్మ జాతరకు కావలసిన నీటిని ఇక్కడినుండే తీసుకెళతారంట. ఆ జాతర తరువాత చెరువు సగం ఖాళీ అయిపొతుందంట. మీరు రామప్ప యాత్రకు వెళితే ఈ చెరువును కూడా చూసేలా మీ ప్రయాణాన్ని మార్చుకోవచ్చు. రామప్పకు కేవలం పాతిక కిమీల దూరంలో ఉంది ఈ చెరువు.

10 comments:

  1. Really wonderful!! You are a real brand ambassador for cultural heritage.

    ReplyDelete
  2. Awesome sir..pics chudatanike rendu kallu chalatledu..

    ReplyDelete
  3. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం.. మీరనట్టు కొన్ని ప్రకృతి అందాలు మనుషుల కళ్ళ పడకుండా ఉంటేనే మంచిదేమో..

    ReplyDelete
  4. చాలా బావుందండి .ఫోటోలు చాలా బాగున్నాయి

    ReplyDelete
  5. nice photography....sir..............

    ReplyDelete
  6. EXELENT PHOTOGRAPHY RA

    ReplyDelete
  7. chaala baaga raasaru. pictures kuda bagunnayi.

    ReplyDelete
  8. chakkaga vivarincharandi.

    ReplyDelete