"వీడు వేదాంతం మాటాడుతున్నార్రా", "ఇప్పుడీ వేదాంతం అవసరమా?" లాంటి ఎన్నో వాక్యాంలు మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కానీ ఈ వేదాంతం అనే పదానికి చాలమందికి అర్ధం తెలీదు. ఏది మాట్లాడితే వేదాంతం అవుతుంది? వేదాంతానికి అర్ధం ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కో అర్ధాన్ని చెబుతారు. భగవంతుని గురించి మాట్లాడటం అనో, పురాణాలగురించో మాట్లాడటం అనో, వేదాల అంతం అనో రకరకాల సమాధానాలు వస్తుంటాయి. కొందరు ప్రబుద్ధులు వేదాలను అంతం చేయడం అనో, వేదాల అంతం చూడటం అనికూడా చెబుతారు. (జ్ఞానం మరీ ఎక్కువయితే పిచ్చి ఎక్కుతుందంట కదా)
వేదాంతం అంటే వేదాలకు అంతం (వేదాలకు చివర) అన్నది మనలో చాల మంది చెప్పే సమాధానం, ఇది చాలా వరకు సరయిన నిర్వచనమే. కానీ నాకో చిన్న అనుమానం. వేదాలు అంటే ఆద్యంత రహితమైన జ్ఞానం కదా. ఆది, అంతం లేని వాని అంతం గురించి ప్రస్తావించడం ఏంటి? దాన్ని వేదాంతం అని పిలవడం ఏంటి? వేదాలకు ఆది అంతం లేనప్పుడు, వేదాంతం (వేదాలకు అంతం అనుకుంటే) లేనట్టే కదా. అంటే ఏమీ లేకపోవడమే వేదాంతమా?
నా చిన్నప్పుడు ఎవరికీ అర్ధం కాకుండా మాట్లాడితే వీడు వీదాంతం మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు. అలా ఎందుకంటారో నాకు అర్ధమవడానికి చాల కాలం పట్టింది. ఎందుకలా అంటారో అనుకునేవాన్ని కాని మొదటిసారి ఒక ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్) చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్ధమయింది అలా అనడానికి గల కారణం. (అది అర్ధమయినట్టుగానే ఉంది కానీ అర్ధం కాదు). అంతే కాదు నేనుకూడా (నాలాంటీ అజ్ఞాని కూడా) ఉపనిషత్తులు చదివి అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అని కూడా అప్పుడు నాకు అర్ధమయింది. (నిజమైన అర్ధాన్ని అర్ధం చేసుకోలేకపోయినా, నా తార్కిక బుద్ది సంతృప్తి పడేలా అయినా) [మొదటిసారి ఉపనిషత్తు చదవాలనుకునే వాళ్ళకు ఈశావాస్యోపనిషత్తు చదవమని నా సలహా.]
ఇక పోతే వేదాంతం అంటే (వేద + అంతం) వేదములకు చివర అని అనుకున్నాం కదా, అంతమాత్రాన వేదంలో (ఒక పుస్తకం అనుకుంటే) చివరి అధ్యాయం అని మాత్రం కాదు. ఒక మనిషి జీవితం యొక్క అంతిమ లక్ష్యం వేదాంతం. ఈ సంసార చక్రంలో (జనన మరణ చక్రంలో) పరిభ్రమించే జీవుడు అంతిమంగా తెలుకోవలసిన జ్ఞానం వేదాంతం. ఈ మానవ జన్మయొక్క అంతిమ లక్ష్యం వేదాంతం. వేదాధ్యాయనం యొక్క అంతిమ లక్ష్యం వేదాంతం. మరి ఈ వేదాంత జ్ఞానం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో వేదాంతజ్ఞానం వివరింపబడింది. ఈ ఉపనిషత్తులు అన్ని వేదాల్లో (ఒక పుస్తకం అనుకుంటే) చివరన లేవు. కొన్ని ఉపనిషత్తులు బ్రాహ్మణాల్లో ఉంటే, మరికొన్ని ఉపనిషత్తులు అరణ్యకాల్లో ఉన్నాయి, ఇంకొన్ని చివర్లో ఉన్నాయి. అయితే కాలక్రమేణా వేదాతం యొక్క విస్తృతి పెరిగింది. ఉపనిషత్తులసారం అయిన, శ్రీకృష్ణుని ద్వారా ఉపదేషించబడిన భగద్గీత, వ్యాసముని విరచిత బ్రహ్మ సూత్రాలు కూడా వేదాంతంగా గుర్తింపు పొందాయి. ఈనాడు వేదాంతం అంటే ముఖ్యంగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అని అర్ధం(ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు). మన ఆచర్యులందరు (శంకర, రామానుజ మొ||) ఈ మూడింటికి భాష్యాన్ని రచించారు.
మరి ఆ ఉపనిషత్తుల్లో ఏముంటుంది? ఉపనిషత్తుల్లో చక్కని తార్కిక విచారణ ఉంటుంది. చరమ సత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనస్సు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు అందుకొన్నాయి. మనం ఎవరం, ఎక్కణ్ణుంచి వచ్చాం? ఎక్కడకు వెళుతున్నం అనే విషయాలను తెలుసుకుని మనకందించారు ఉపనిషద్ ఋషులు. కేవలం శాస్త్ర జ్ఞానంతోనో, సంస్కృత పాండిత్యంతోనో ఉపనిషత్తుల నిజమైన అర్ధాన్ని గ్రహించడం సాధ్యం కాదు. పదేపదే మంత్రాలను పఠించి వాటి అర్ధాన్ని లోతుగా ఆలోచిస్తూ, ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడే వాటిని అర్ధం చేసుకోగలరు. ఉపనిషత్తుల్లో చెప్పబడిన చాలా విషయాలు నాలాంటి పామరులకు సులువుగా అర్ధం కావు. అవే విషయాలను భగవద్గీత సులువుగా అర్ధమయ్యే రీతిలో వివరిస్తుంది. (నిజమైన అర్ధం కాకపోయినా, తార్కిక బుద్ది సంతృప్తి పరిచే అర్ధం అయినా).
మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నా అందులో 10 ముఖ్య ఉపనిషత్తులని అంటారు (ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః, ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా). ఈ పదింటికి శంకరాచార్యులవారు భాష్యం రచించారు. రామకృష్ణ మఠం వారు 14 ఉపనిషత్తులను ముఖ్య ఉపనిషత్తులుగా గుర్తిస్తారు. [ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు), కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, కౌశీతకీ ఉపనిషత్తు, మహానారాయణ ఉపనిషత్తు, మైత్రాయణి ఉపనిషత్తు].
హైందవ దర్శనాలైన షడ్దర్శనాల్లో వేదాంత దర్శనం ఒకటి. వేదాంతంలో వివిధ సాంప్రదాయలున్నయి. శంకరాచార్యుల అద్వైత వేదాంతం, రామానుజాచార్యుల విశిష్ఠాద్వైత వేదాంతం, మధ్వాచార్యుల ద్వైత వేదాంతం, మొ||.అయితే వీటిలో శంకరుల అద్వైతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈనాడు కూడా మనసమాజంలో చాలామంది అంతా మాయ, అంతా మిధ్య లాంటి పదాల్ని ఉపయోగిస్తుంటారు. ఈ పదాలన్నీ శంకరుల అధ్వైతంలోనివే. శంకర విరచిత, "బ్రహ్మ సత్యం జగన్మిధ్య, జీవొ బ్రహ్మైవ నా పరః" అనే శ్లోకాన్ని మన సమాజంలో ఈనాటికీ ఎంతోమంది వాడుతుంటారు. దాన్ని బట్టి అర్ధమవుతుంది శంకరుల అద్వైతం ఆనాటి భారతాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో.
జ్ఞానయోగ మార్గంలో భగవంతున్ని అన్వేషించేవారు వేదాంత మార్గాన్ని ఎంచుకొని ‘నేతి నేతి’ (న+ఇతి = ఇది కాదు) అంటూ అన్వేషిస్తూ పరబ్రహ్మ స్వరూపన్ని పొందుతారు. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ (మానవుల బంధ, మోక్షాలకు మనస్సే కారణం) అన్నారు కదా. జ్ఞానయోగ మార్గంలో మనస్సుతో అన్వేషిస్తూ ఆ మనస్సునే దాటి మోక్షాన్ని పొందుతారు. అన్ని యోగాల్లొ జ్ఞానయోగ మార్గం నాకు చాల బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో తార్కిక విచారణ, ఆలోచన, అన్వేషణ ఉన్నాయి కనుక. జ్ఞానయోగ మార్గాన్ని అనుసరించడానికి కావలసిన అర్హతను శంకరులవారు వివేకచూడామణిలో చక్కగా వివరించారు. (ఆవివరాలు ఇక్కడ ప్రస్తావించట్లేదు, ఈ విషయాలమీద సవివరంగా ఇంకో బ్లాగు వేస్తాను.)
No comments:
Post a Comment