Thursday, October 10, 2013

ఏకాంతంగా తనతో


ఒంటరిగా చెఱువు పక్కన నడుస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. కనుచూపు మేరలో మరో మనిషి లేడు. చుట్టు పచ్చని మొక్కలతో ఈ ప్రపంచంలో వేరే రంగు లేదేమో అనిపించేలా ఉంది ఆ ప్రదేశం. వాటి మీదినుండి సన్నగా వీస్తూ చిరుగాలి మోసుకొచ్చే పరిమళం. అప్పుడప్పుడు కాలు అటుగా పడితే చల్లగా తగిలి ఒళ్ళు ఝల్లుమనిపించే చల్లని నీళ్ళు. ఆ నీటిలో దూకుతూ మళ్ళీ ఎగురుతూ సరదాగా ఆడుకుంటున్న బుడుబుంగలు. ఆ బుడుబుంగలను చూస్తుంటే చాలా ఈర్ష కలుగుతుంది. అవి గాల్లో ఎగురుతాయి, నీటిలో మునుగుతాయి, నేలపై తిరుగుతాయి. ఎంత స్వేచ్ఛో కదా వాటికి. ఆ పక్కనే దొంగ జపం చేస్తూ చేపలకోసం ఎదురు చూస్తున్న కొంగలు. కొంతదూరంలో గడ్డిని మేస్తున్న ఆవులు, మేకలు, బఱ్ఱెలు. ఇక్కడి నుండి చూస్తే పచ్చటి చీరపై ఎర్రగా తెల్లగా నల్లగా నేసిన బొమ్మల్లా కనిపిస్తున్నాయి. దూరంగా బొమ్మరిల్లుల్లా కనిపిస్తున్న గ్రామాలు. ఇంకా సృష్టిలో శబ్దం పుట్టలేదేమో అన్నంత నిశ్శబ్దం, అప్పుడప్పుడు ఆ నీరవాన్ని చీల్చుకుంటూ వినిపించే పక్షుల కిలకిలా రావాలు. ఎక్కడొ దూరం నుండి చిన్నగా వినిపించే బైక్ శబ్దం. ఈ అందాన్నంతా ఆస్వాదిస్తూ, ఈ అందానికంతా కారణం నేనే అని లోలోపల కాస్త గర్వపడుతూ పడమర దిక్కుకై ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూర్యుడు. సూర్యాస్తమయమయితే మిగిలేది విరహమే అనుకుంటూ ఈ క్షణాన్ని సాద్యమయినంతగా తనతోనే గడపాలని తపిస్తున్న కమలాలు.

ఇవ్వన్నీ చూసి నాలోని భావుకుడు ఓ రెండు మాటలు రాయాలనుందంటే కూర్చోవడానికి ఎక్కడ అనువుగా ఉంటుందా అని చూసి పక్కనే ఉన్న చాకలి బండపై కూర్చున్నా. చెరువులొ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఆకాశంలో ఎక్కడో ఎగిరే తెల్లని కొంగ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ నీటిలో. అలా కూర్చుని, రేడియో మిర్చి పెట్టుకుని చక్కగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ... కలం, కాగితం తీసి ఏమి రాయాలా అని అలోచిస్తూ కళ్ళు మూసుకున్నా. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తను. భావుకుడి గొడవలో పడి తను వచ్చిన విషయాన్ని కూడా గమనించలేదు నేను. తనను అక్కడ అలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ హడావిడి యాంత్రిక జీవితంలో తనను ప్రతిరోజూ చూసినా, ఈ రోజు ఇక్కడ, ఈ ప్రశాంత వాతావరణంలో ఏకాంతంగా తనను కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు తనతో మనస్పూర్తిగా మాట్లాడాలి. నేను తనను ఏలా ఉన్నావని కళ్ళతో పలకిరిస్తే, తన చిరునవ్వే నాకు తన సమధానం అయ్యింది. ఎదురెదురుగా కూర్చున్నా కూడా మా మధ్య మౌనమే భాష అయ్యింది. మా మనసు ఒకటే అయినప్పుడు మాట్లాడుకోవడానికి భాష ఎందుకు? అయినా తన జీవితంలో నాకు తెలియని విషయాలు ఏమున్నాయి. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన తన ప్రతి అనుభూతి ప్రతి ఆనందం ప్రతి దుఃఖానికి నేనే సాక్షి. తనవైపే తదేకంగా చూస్తున్న నా మదిలో తను నాతో పంచుకున్న అనుభవాలు మెదిలాయి.

పసితనంలో తను మొట్టమొదటిసారి కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచినప్పుడు తను సాధించిన ఆ విజయాన్ని గర్వంగా మొదట్టమొదట చెప్పింది నాకే. తను నడుస్తూ కిందపడి దెబ్బతగిలే ఆ బాధ చెప్పింది కూడా నాకే. అనాడు కూడా తనకు నాకు మధ్య భాష మౌనమే. పసితనాన్నుండి కొంచెం ఎదిగి ఆడుకుంటున్నప్పుడు తోటిపిల్లలందరు ఈరుపేనల్ని (వీటికి దువ్వెన, తుమిష్క, తూనిగ అని కూడా పేరులున్నాయి) సునాయాసంగా పట్టుకుంటే తనకు మాత్రం ఒక్క ఈరుపేన కూడా దొరకకుంటే తనుపడిన వేదన, మొదటి ఈరుపేనను పట్టుకున్నప్పుడు ప్రపంచాన్నే జయించినంతగా తను పొందిన ఆనందం తను చెప్పింది నాకే. తనను ఎవరూ పట్టించుకోవడం లేదు అని తను అలిగినప్పుడు.. ఆ అలక కూడా మొదటిసారి చెప్పింది నాకే. చీకటంటే తనకున్న భయం ఆ చీకట్లో తనకు కనిపించిన దయ్యం అది చెబితే ఇంట్లో వాళ్ళు నవ్వడం అన్నీ తను చెప్పింది నాకే. కతలంటే తనకున్న ఇష్టం, కతలు చెప్పమని అడిగితే ఎవరు చెప్పకపోవడం చదవడం రాకున్నా కతల పుస్తకాల్లో బొమ్మలతో కుస్తీ పడట్టం ...... అమ్మా, నాన్న ఇద్దరు తనని కొడితే ఎవరికి చెప్పాలో తెలీక తను ఒంటరిగా మూలన కూర్చొని గంటల తరబడి వెక్కి వెక్కి ఏడవడం..... తను ఏది చేసినా తప్పే ఎందుకవుతుందో, ఏ పని చేసిన తనకు తిట్లే ఎందుకు పడతాయో తెలియని అయోమయం... మొదటిరోజు స్కూల్‌కి వెళ్ళినప్పుడు భయం, క్లాస్‌లో టీచర్ మొదటి సారి మెచ్చుకున్నప్పుడు కలిగిన ఆనందం, క్లాస్‌లో తనకున్న ప్రత్యేక గుర్తింపుకు కాస్త గర్వం..... తన స్కూల్‌ని తన మిత్రుల్ని వదిలి వేరే స్కూల్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు కలిగిన బాధ.... కొత్త వాళ్ళ మధ్య ఒంటరితనం, వాళ్ళు తనని వెక్కిరిస్తే కలిగిన ఉక్రోషం, బాధ, కొత్త స్నేహితులతో కలిసిపోయినప్పుడు కలిగిన ఆనందం..... అయినా ఏదో కోల్పోయానన్న ఒంటరితనం.... తన మనసులో ఆనందాన్ని బాధను ఎవరో అయినా పంచుకోవాలనుకుంటే, పంచుకోవడానికి ఎవరూ లేరని బాధ.... తను మొట్టమొదటిసారిగా ఇష్టపడిన వ్యక్తి, చెప్పాలనుకున్న మాటలు..... జీవన ప్రయాణంలో ఎవరూ తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మన భాషే రాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనుభవించిన ఒంటరితనం..... తను అమితంగా ప్రేమించిన మనిషి తనకు దూరమైన ఆక్షణం తను అనుభవించిన బాధ.... ఉద్యోగంలో విజయాలు, అపజయలు, అభినందనలు, తిట్లు పొందిన హోదా, పొందలేకపోయాననుకున్న స్థానం..... ఎంతమంది మధ్య ఉన్నా తాను ఒంటరినే అన్న వేదన....  అన్నీ అన్నీ తను పంచుకుంది నాతోనే.

అన్నీ తెలిసిన నాతో తను కొత్తగా పంచుకోవడానికి ఏమున్నాయి. అందుకేనేమో మా మధ్య ఈ మౌనం. మౌనంగానే సంభాషించుకుంటున్నాం మేము. నా అలోచనలన్నీ తెలిసిపోయిన తన మదిలో ఎన్నో ప్రశ్నలు, ఇంతకు తన జీవిత ప్రయాణంలో తను గెలిచినట్టా లేక ఓడినట్టా? అసలు గెలుపు అంటే? ఓటమి అంటే? తన జీవితంలో తను పొందింది ఏంటి? తను కోల్పోయింది? కోల్పోతుంది ఏంటి? తను చేస్తున్నది ఏమిటి? ఎవరికోసం? దేనికోసం? తన జీవితంలో తనకున్న స్థానం, ప్రాముఖ్యం ఏంటి? అసలు తనజీవితంలో తను ఉన్నట్టా లేననట్టా? తన జీవితమంతా ఎవరి కోరిక ప్రకారమో, ఎవరికో ఇష్టమనో, ఏదో నియమం ప్రకారమో, ఎవరో ఏదో అనుకుంటారనో, ఎవరో బాధపడతారనో.... ఎవరికోసమో జరిగిపోతే తను ఆనందంగా ఎలా ఉన్నట్టు? తన జీవితంలో తనకు నచ్చినట్టుగా, తనకోసం తను గడిపిన క్షణాలెన్ని? అంతమందితో కలిసి నవ్వుతూ తిరిగినా; మనస్పూర్తిగా తను మాట్లాడగలిగింది, నవ్వగలిగింది ఎందరితో? తనకు కోపంవస్తే, ఆవేశం వస్తే; ఆ కోపాన్ని, ఆవేశాన్ని చూపించుకోగలిగింది ఎందరి మీద? దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎందరు? తనను తనుగా అర్థం చేసుకుని తన తప్పులోనూ, ఓటమిలోనూ తోడు నిలిచేది ఎందరు? కానీ తను మాత్రం ప్రతి క్షణం ఎవరికోసమో బ్రతకాలి, ఎందుకో ఎప్పుడూ అర్ధంకాదు తనకు. ఎందుకు అని అడిగితే తప్పు. అయినా తను జీవితమిని అంగీకరించలేదు, తన జీవన పోరాటాన్ని ఆపలేదు. తన మాటల్లో ఓటమి అంటే పోరాడటం ఆపడం, పోరాడినంతవరకు ఓడిపోనట్టే. ఆ పోరాటంలోనే ఈ యాంత్రిక జీవనానికి అలవాటు పడి, మనసులో లేని చిరునవ్వు చిందిస్తూ, ఎందుకు పొందాలో తెలియని గమ్యాల కోసం పరిగెడుతూ వాటిని దాటుకుంటూ కేవలం పక్కవాళ్ళకోసం జీవించడం అలవాటయ్యింది తనకు. ఆ యాంత్రిక జీవనంలోనూ కనీసం ఒక్క క్షణమైనా తనకోసం జీవించడం మరచిపోకుడదనే నాతో ఇలా ఏకాంత క్షణాలకోసం నిరీక్షించడం చూడటం తనకు అలవాటు. నేను తప్ప తనను ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోగలరు? తనకోసం తనగురించి ఆలోచించే వేరెవ్వరూ లేని తనకు మిగిలింది నేనే కదా. అందుకే నాతో గడిపే సమయంకోసమే ఎప్పుడూ తన ఎదురు చూపు. అయినా మా మధ్య మాటల్లేవు, ఉన్నది కేవలం మౌనమే

నా మనసులో తన ఆలోచనలు కదులుతుంటే, అవ్వన్నీ తనకు అర్థమయిన ఆ క్షణం ఎందుకో ఒక కన్నీటి చుక్క తన కంట్లోంచి జారింది. అలా జారిన ఆ కన్నీటి చుక్కను నేల మీద పడకముందే పట్టుకోవాలని నాకు తెలియకుండానే ముందుకు కదిలింది నా చేయి. కానీ నా చేయి ఆ కన్నీటి చుక్కను చేరకముందే చెరువులోని నీటిని తాకితే, ఆ నీటిలో కలిగిన అలల మధ్య తను అదృశ్యమయిపోతే, మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాను నేను అక్కడ. తను వెళ్ళిపోతే మనసు భారంగా మిగిలిపోయింది. తనులేని ఆ క్షణం ఏ భావాన్ని పలకనంది నా మనసు, ఆ విషయం అర్థమయిందేమో నాలోని భావుకుడు కూడా మారు మాట్లాడకుండా మౌనం వహించాడు. కలాన్ని, కాగితాన్ని పక్కన పెట్టి నడక ప్రారభించా ... రేడియో మిర్చిలోంచి పాట వినిపిస్తోంది, "జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే....... మల్లెల దారిలో, మంచు ఏడారిలో...... పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల.... నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ... "

చేసే పనిలో ఫలితం గురించి ఆలోచించకుండా, నిష్కామంగా కేవలం ఒక ద్రష్టలా నీ ఆ పని నువ్వు నిర్వర్తిస్తే దాని కర్మ ఫలం నిన్ను అంటదు, అట్టి కర్మ నిన్ను మోక్షమార్గంలో నడిపిస్తుంది అని చెబుతుంది వేదాంతం. మోక్షం లభించినా, లభించకున్నా అలా కర్మను ఆచరించగలిగితే నిజజీవితంలో కూడా ఎంతో మానసిక ప్రశాంతత మిగులుతుందేమో కదా... ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నా.. ఆ నడకకు గమ్యం ఏంటో తెలియదు నాకు.. 

* * * * * *
ఈ బ్లాగ్‌లోని ఆలోచన నాది కదు, అందమైన భావలను అద్భుతంగా రాయగల నా నేస్తంది. తన రాతలను బ్లాగ్‌గా వేయమని నేను ఎంత అడిగినా తను ఒప్పుకోలేదు. తను రాసిన తన భావాన్ని నా మాటల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ పోస్ట్.

7 comments:

  1. మంచి పొస్ట్. మీలోని మిమ్మల్ని మాముందుంచే ప్రయత్నం బహు బాగుంది.

    ReplyDelete
  2. awesome! we need to spend sometime with ourselves once in a while.

    ReplyDelete
  3. ఒక నిస్వార్ధ ప్రెమికుడు తన ఇష్ట సఖిని చూచి నపుడు పడె మానసిక సంఘర్షణ,ఆవెదనని రచయిత చక్కగా వరిణించగలిగారు

    ReplyDelete
  4. ఒక నిస్వార్ధ ప్రేమికుడు తన ఇష్ట సఖిని చూచి నపుడు పడె మానసిక సంఘర్షణ,ఆవేదనని రచయిత చక్కగా వర్ణించగలిగారు

    ReplyDelete