Friday, November 16, 2012

పులిహోర అంటే

పులిహోర అంటే తెలీదా? ఎందుకురా నువ్వు తెలుగుదేశంలో పుట్టి అనకండి. ఆమాత్రం పులిహోర నాక్కూడా తెలుసు, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడి పులిహోర అన్నీ తెలుసు. కానీ నేనిక్కడ చెప్పాలనుకున్నది పులిహోర అనే పదానికి అర్ధం ఏంటో. [చాలామంది పులిహార అంటుంటారు, కానీ అది తప్పు. అలా పులిహార అన్నవాడి గూబ గుయ్య్మనిపించాలనిపిస్తుంది, కానీ నాకన్నా ముందు వాడు అనిపిస్తాడేమో అని మిన్నకుంటుంటా]. ఇంకో విషయం అసలు పదం పుళిహోర

ఇంతకు నాకీ వెధవ అనుమానం ఎందుకొచ్చిందో తెలుసా. ఒకనాడు మా మిత్రుడి ఇంటినుండీ సేమియా పులిహోర తెచ్చుకున్నాడు. మధ్యాహ్నం కూర్చుని తింటుంటే అందులో ఒకడు సేమియాతో పులిహోర ఏంట్రా? రైస్తో చెయ్యాలి కానీ అన్నాడు. అక్కడ చిన్నపాటి చర్చనడిచింది, చర్చ ముగిసింది కానీ నాకో కొత్త అనుమానం వచ్చింది (అసలే అనుమానాల పుట్ట నేను). సేమియాతో పులిహోర చెయ్యొచ్చా? అసలు పులిహోర అంటే ఏంటి? వెతికి వెతికి చివరికి పట్టేసా

పులిహోరలో పులి హోర అనే రెండుపదాలున్నయి. పులి అంటే? పెద్దపులి, బెబ్బులి మాత్రం కాదు. [చాలామంది మిడిమిడిజ్ఞానంతో పులిహోరను టైగర్ రైస్ అని ఆంగ్లీకరిస్తుంటారు. అది తప్పు] పుళి అంటే పుల్లని, పులుసు, పులిసిన అనే అర్ధాలు ఉన్నాయి. పుళి కాస్త పులిగా మారిపోయింది. [ఈకాలం లో కూడా పులి అనే పదాన్ని పుల్లని అనే అర్ధంలో వాడేవాళ్ళు ఉన్నారు. వరంగల్ జిల్లాలో కొన్ని పల్లెల్లో, పచ్చి పులుసును పచ్చి పులి అనుకూడా అంటారు]. కనుక పులిహోరలో పులికి అర్ధం పుల్లని..

మరి హోర అంటే? ఆహారము అనే సంస్కృతపదానికి వికృతి, తెలుగుపదం ఓగిరం [మనలో చాలామందికి ఆహారము అనే సంస్కృతపదం తెలుసు కానీ, ఓగిరం అనే తెలుగుపదం తెలీదు. తెలుగు దౌర్భాగ్యం.].  ఓగిరం కాలక్రమేణ  యోగిరం, యోర, హోరగా రూపాంతం చేందింది.

పుళిఓగిరం (పుళి + ఓగిరం); పులి యోగిర (పులి + యోగిర); పులి యోర (పులి + యోర); పులి హోర (పులి + హోర ) అన్నీ పదాలకు అర్ధం =  పుల్లని ఆహారం.

హమ్మయ్య సమస్య తీరిపోయింది, పులిహోర అంటే పుల్లని ఆహారం. కనుక అన్నంతోనే కాదు సేమియాతో చేసినా పులిహోర అనొచ్చు. పులుపుకోసం చింతపండు, నిమ్మకాయ, మామిడీ ఏదైనా వాడొచ్చు.

నాకిప్పుడు కొత్త  అనుమానం వస్తుంది. గోదుమపిండిలొ చింతపండు/నిమ్మరసం కలిపి చెపాతీలు చేసి పులిహోర అనోచ్చా? అదికూడా పుల్లని ఆహారమే కదా. [కదా నాకు ఇలాంటి వెధవ అనుమానాలేవస్తాయి]

కొసమెరుపు:
కన్నడీగులు మన పులిహోరను పులియోగిరై అంటారు. బెంగుళూరు మహానగరం వెళ్ళినవాళ్ళకు ఈ పదం సుపరిచితం (పులిహోర, పులియోగిరై రెండు వేరు అని వాదించేవాళ్ళు దయచేసి ప్రసక్తి ఇక్కడ తేవద్దు).. ఆశ్చర్యం పులియోగిరై - పులి + యోగిరై.. ఓగిరం అనే పదం తెలుగులోనుండి కన్నడ భాషలోకి చేరి యోగిరై అయ్యిందా? లేక వాళ్ళుకూడా మనలా ఆహారానికి వికృతి ఏర్పరుచుకున్నారా?

2 comments:

  1. వీరభద్రంSeptember 2, 2014 at 1:11 AM

    "ఓగిరం" అన్నది తెలుగు మాటే అవ్వాలని ఏముంది.మూల ద్రావిడంలో కూడా ఆ మాట ఉండొచ్చు కదా.? అయితే తమిళంలో ఈ మాట ఉన్నదో లేదో నిర్ధారించించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. ఆహారము అనే సంస్కృతపదానికి వికృతి, తెలుగుపదం ఓగిరం.

      మధ్యలో తమిళం ఎందుకొచ్చిందో అర్ధం కావడంలేదు.

      Delete