ఒక పనిచేయడానికి మనకు స్పూర్తినిచ్చినవాళ్ళను ఎప్పుడు తలచుకోవాలంటారు. బ్లాగింగ్‌కు నాకు స్పూర్తిని ఇచ్చిన బుజ్జిని తప్పక తలచుకోవాలి, అందుకే ఈ పోస్ట్ (టపా అనడం నాకు ఇష్టంలేదు).
నాకు తెలుగు చాలా బాగా వచ్చు అని, నేను తెలుగు వీరాభిమానిని అని నాకు కొంచెం పొగరు. అంతేకాదు తలపై రెండు కొమ్ములు కూడా. కానీ బుజ్జిముందు మాత్రం కొమ్ములు పక్కన పెట్టి, తలదించుకుని మరీ మాట్లాడుతా. తను తెలుగులో అద్భుతంగా మాట్లాడుతుంది. కవితలు, కతలు చక్కగా రాస్తుంది. కొంటెగా, అల్లరిగా చిన్న చిన్న మాటలతో రాసిన లేదా పూర్తి గ్రాంధికంలో రాసినా తన రాతలు ఎప్పుడూ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఒకే భావాన్ని నేను, బుజ్జి ఇద్దరం తెలుగులో రాస్తే బుజ్జి రాసిన వాక్యమే చాలా బావుంటుంది, దానిముంది నా వాక్యం తీసికట్టు. బుజ్జి వాక్యం బావుందని ఎవరో చెప్పనవసరం లేదు, నామనసుకు అదే అర్ధమయిపోతుంది. తనతో మాట్లాడిన ప్రతిసారి, ఇలా కూడా రాయొచ్చుకదా లేదా చెప్పొచ్చుకదా మరి ఈ పదాలు నాకెందుకు స్పురించలేదు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణలో పదాల ఎన్నిక ఎంత ముఖ్యమో, అలాంటి పదాలతో మాట్లాడితే మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటివాళ్ళ మనసుకు ఎంతలా హత్తుకుంటుందో తనతో మాట్లాడిన ప్రతిసారి నాకర్ధమవుతుంది. తనతో మాట్లాడిన ప్రతిసారి ఇవ్వాళ చక్కని తెలుగు భాష విన్నానన్న సంతృప్తి కలుగుతుంది.
బుజ్జి (అసలు పేరు ఇక్కడ అప్రస్తుతం) నాకు ఆర్కుట్‌లో పరిచయం, అది కూడా ఆర్కుట్ తెలుగు సంఘంలో(కమ్యూనిటీ). [అంతర్జాలంలో (ఇంటర్నేట్) పరిచయమయ్యి నా నిజజీవితంలో కలిసిన ఒకేఒక్క వ్యక్తి, బుజ్జి.] అప్పట్లో ఆర్కుట్ తెలుగు సంఘంలో ఎదో తెలుగు పదాల దారం ఉండేది, తను అందులో నాకు పోటీగా వేస్తుండేది. అప్పుడు నాకనిపించేది ‘నాకేపోటీనా’ అని (నాకసలే తెలుగు బాగావచ్చు అని కొమ్ములు కదా). కొంతకాలానికి మళ్ళీ ఇంకోసారి నా కొమ్ములతో పోటీపడింది. ఈసారి ఘంటసాల సంఘంలో. అందుకే అప్పట్టో బుజ్జి మీద నాకు చాలా ఈర్ష ఉండేది. కాలం గడుస్తున్నకొద్ది ఆ పరిచయం స్క్రాప్‌బుక్ పరిచయం దాకా ఎదిగింది. తనతో మాట్లడుతుంటే అబ్బురపడేవాన్ని. ఇంత చక్కని తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారా అని. నా మాటల్లో చెప్పాలంటే తను ఒక సంస్కృతాంధ్ర పండితురాలు (పండితురాలా? అంటే, నాలాంటి పామరుడితో పోలిస్తే పండితురాలే). తను శుద్ద గ్రాంధికంలో మాట్లాడినా, హైదరాబాదీ యాసలో మాట్లాడినా, గోదావరి యాసలో మాట్లాడినా, అచ్చతెలుగులో మాట్లాడినా తన తెలుగు ముందు నా తెలుగు ఎప్పుడూ దిగదుడుపే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ఆంగ్ల మాధ్యమంలో అందులోనూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి, తెలుగుమీదున్న మక్కువతో ఇంతగా తెలుగు నేర్చుకుందంట. అలా నేర్చుకోవడానికి కనిపించిన ప్రతి తెలుగుపుస్తకం చదివిందంట. విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయిపడగలు పుస్తకాన్ని అవలీలగా చదివేస్తుందంట. (నేను వేయిపడగలు చదవాలని అంతకుముందు రెండు సార్లు ప్రయత్నించా, కానీ భాష కొంచెం కష్టంగా ఉండి, కొనసాగించే ఓపిక లేక మధ్యలోనే నా ప్రయత్నం విరమించేసా. దాన్ని బట్టే అర్ధమవుతుంది, నేనెక్కడో తనెక్కడో. అలా అని వేయిపడగలు చదవడం అసాధ్యం అనట్లేదు, ఓపికతో కూడుకున్న పని.) అదండీ భాషాభిమానం అంటే, దాని ముందు నా భాషాభిమానం ఎంత? అలా తనపై నాకున్న ఈర్ష కాస్త అభిమానంగా మారింది. తనతో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు తను ఎంత చక్కగా ఉచ్చరిస్తుందో తెలిసింది. ఎక్కడ ఏది ఒత్తి పలకాలో, ఏది తేలికగా పలకాలో అక్కడ అది అలాగే సుస్పష్టంగా పలుకుతుంది తను. అంతే కాదు చక్కని కవితలు రాస్తుంది. మనసులో పొంగే భావావేశానికి అందమైన మాటలు తొడిగి తను చెప్పే ఆ కవితలు మరెంతో అందంగా ఉంటాయి. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి తనుకూడా నా తెలుగును మెచ్చుకుంటుంది. నువ్వు చాలా బాగా మాట్లాడుతావు అంటుంది. తనే నాకు రాయడానికి ప్రయత్నించు అని సలహా ఇచ్చిన మొదటి వ్యక్తి.
అప్పటి వరకు ఈ బ్లాగింగు అనేది ఒక మహా రచయితల పని అని అనుకునే నేను బ్లాగులు చదివేవాన్ని కూడా కాదు. నేను మొట్టమొదట చదివిన బ్లాగు బుజ్జి సోది. చాలా నచ్చేసింది నేను కూడా ప్రయత్నిస్తేనో అనిపించింది. ఆ బ్లాగులో ఉన్న అల్లరి భాష, తుంటరి పోస్ట్‌లు చాలా గిలిగింతలు పెట్టాయి. అది చదువుతూ తన రచనా శైలిని ఒంటపట్టించుకునేందుకు ప్రయత్నించిన, తన ఏకలవ్య శిష్యున్ని నేను. అందుకే నా ఈ బ్లాగు పరిచయంలో తన అల్లరి వాక్యాలనే అనుకరించి తన అడుగుజాడల్లోనే నడుస్తున్నా అని చెప్పకనే చెప్పడనికి ప్రయత్నించా. నా బ్లాగు చదివిన బుజ్జి నాతో బాగారాస్తున్నావు అన్నప్పుడు పొంగిపోయా. గురువుకి నచ్చేలా రాయడం అంటే మామూలా.
నాలో దాగున్న రచయితను మేలుకొలిపిన గురువుకు నమస్కరించే భాగ్యం కూడాలేదు, ఎందుకంటే తను నాకన్నా చిన్న.
బుజ్జి సోది చదవాలనుందా? http://bujjisoodi.blogspot.in/
బుజ్జి సోది చదవాలనుందా? http://bujjisoodi.blogspot.in/
No comments:
Post a Comment