కొందరు ఏది చెప్పినా చాలా బాగుంటుంది, అలాంటివాళ్ళలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు ఒక్కరు. వారు ఏ పాట రాసినా అందరు ఆహా! ఎంత బాగా రాసాడు అనే అంటారు. అది వాళ్ళకు ఎంతవరకు అర్ధమయిందో వాళ్ళకే తెలీదు. అర్ధంలేని చదువు వ్యర్ధం అని సామెత, కానీ మనవాళ్ళకు అర్ధం కాకుండా రాస్తే అది చాలా గొప్ప. ఆ కోవకు చెందిన పాటల్లో ఒకటి ఈ జగమంత కుటుంబం నాది.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
కవినై కవితనై, భార్యనై భర్తనై (2)
మల్లెల దారిలో, మంచు ఏడారిలో (2)
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)
మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై (2)
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)
చాలా చా చాలా బాగా రాసాడు కదా. ఎంత బాగా రాసాడో? ఇంత అద్భుతమైన భావాలు ఎలా వస్తాయో కదా. అలాంటి భావాలు చెప్పాలంటే సిరివెన్నెలలాంటివాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఇంకెవరివళ్ళ సాధ్యం కాదు మీరేమంటారు. మీరేమంటారు అవుననే కదా అనేది. సరే, ఒక చిన్న ప్రశ్న. ఇంతకు మీకీపాటలో ఏమర్ధమయిది, ఏ భావం మీ మనసును తట్టింది? మీకెందుకు నచ్చింది? దయచేసి చెప్పరా? నాకు మాత్రం చాలాకాలం వరకు అర్ధం కాలేదు. చాలామంది ‘ఈ పాట నన్ను, నా జీవితాన్నే చూసి సిరివెన్నెలగారు రాసారు’ అని చెప్పినకాలంలో నేను ఈ పాట భావం ఏంటా అని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయా. చాలా కాలం వరకు ఈ పాట భావం సంపూర్ణంగా నాకర్ధం కాలేదు. దీని భావం ఇది అని చెప్పలేకపోయా. కొంత కాలం తరువాత సిరివెన్నెలగారు ఒక టీవీ కార్యక్రమంలో ఈపాటకు చెప్పిన భావం చూసాకగాని నాకీపాట పూర్తిగా అర్ధమవలేదు. వారు చెప్పిన భావం విన్నాక, పాట ఎంత అద్భుతంగా ఉందో, అందులో అంతర్గతంగా ఎంత గొప్పభావం ఉందో అర్ధమయింది. అంతేకాదు ఇన్నాళ్ళూ నేను ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నానో కూడా అర్ధమయింది. ఆ క్షణం ఏమనిపించిందంటే, ఒక కవి హృదయాన్ని అర్ధంచేసుకోవడం అంత సులభం కాదు.
ఇదంతా విన్నాక సిరివెన్నెలగారు చెప్పిన ఆ భావం ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా. మీకు ఆ కార్యక్రమం link తప్పకుండా ఇస్తా. కానీ ముందు నా అజ్ఞానంతో నేను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించిన భావం చెప్పనివ్వండి.
(ఇది నా మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పుకున్న భావం)
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
[జగం అంటే ప్రపచం. జగమంత కుటుంబం నాది - ఈ ప్రపంచమే నా కుటుంబం, ఈ ప్రపంచంలో అందరు నా కుటుంబ సభ్యులే. ఏకాకి జీవితం నాది - నాకు సంబంధించినంతవరకు నేను ఏకాకిని. ఈ ప్రపంచంలో అందరూ నావాళ్ళే, కానీ నేను ఎవరివాన్నీ కాదు. సకల చరాచర ప్రాణులగురించి ప్రేమభావాన్ని కలిగి కూడా వాటిలో వేటిని అంటిపెట్టుకునుండని, నిస్సంగత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడా?]
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
[సంసారం అంటే కుటుంబం అని అర్ధమున్నా, జనన మరణ చక్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ అర్ధంలో చెప్పినా, సంసార సాగరం నాదే - ఈ ప్రపంచమే నాది అనుకున్నవాడికి, అందరి బాధలు కష్టాలు తనవే కదా. సన్యాసం శూన్యం నావే - అన్నీ నావే కానీ నేను ఎవరివాడిని కాదు అనుకున్నప్పుడు, అన్నీ త్యజించిన నేను సన్యాసినే కదా, సన్యాసికి ఉండేది ఏంటి? శూన్యం (రామారావు గారి మాటల్లో చెబితే నాదగ్గర ఉన్నది ఏంటి? బూడిద తప్ప)]
కవినై కవితనై, భార్యనై భర్తనై
[కవినై కవితనై - నేనే కవిని నేనే కవితనా? అంటే?? రచనను నేనే, రచయితను నేనే. ఏమి చెప్పాలనుకుంటున్నాడబ్బా? భార్యనై భర్తనై - వామ్మో! భార్యా భర్త ఒకడేనా? ఉభయలింగ జీవా? కాదు కాదు వేరేదేదో చెబుతున్నాడు. ఏమి చెప్పాలనుకుంటున్నాడు? అన్నీ నేనే అనా? నేను తప్ప ఇంకేవరు లేదు అనా? ఇదేదో శ్రీకృష్ణుడు గీతలో అన్నీనేనే, ఈ ప్రపంచంలో నేను తప్ప వేరేది ఏదీ లేదు అని అద్వైత జ్ఞానం బొధించినట్టు బొధిస్తున్నాడా?]
మల్లెల దారిలో, మంచు ఏడారిలో
[మల్లెల దారిలో - సులభంగా పూలబాటలో అంటే పోయేదేమో, విజయంలో అనికూడా చెప్పుకోవచ్చు; మంచు ఏడారిలో - దీన్ని కూడా సులభంగా ముళ్ళబాట అంటే పోయేదేమో, అపజయంలో అనికూడా చెప్పుకోవచ్చు]
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
[పన్నీటి జయగీతాల - పన్నీరు జల్లి జయగీతాలు పాడి నా, కన్నీటి జలపాతాల - జీవితం కన్నీటిమయమైనా. ఈవాక్యాలను పై వాక్యంలో కలిపి చెప్పుకుంటే ఇంకా చక్కని అర్ధం వస్తుంది. (మల్లెల దారిలో, మంచు ఏడారిలో; పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల) ఈ వాక్యలను మల్లెల దారిలో - పన్నీటి జయగీతాల, మంచు ఏడారిలో - కన్నీటి జలపాతాల అని చెప్పుకుంటే, విజయం కలిగినప్పుడు పన్నీరు జల్లి జయజయ గీతాలు పాడినా, అపజయాలు కలిగినప్పుడు కన్నీరు మున్నీరైనా.]
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
[అనుగమించు అంటే వెంబడించు. నాతో నేను అనుగమిస్తూ - నావెంట నేను వెళుతూ (నేను ఏకాకిని కదా). రమించు అనేపదానికి సంభోగించు (intercourse), సంగమించు అనే అర్ధాలున్నయి. ఈ అర్ధంతో నాతో నేనే రమిస్తూ అంటే చెత్తగా ఉంటుందని వెతికి మరీ వేరే అర్ధాన్ని పట్టుకొచ్చా. రమించు అనే పదానికి ఆనందిస్తూ సంతోషిస్తూ అనే అర్ధం తీసుకుంటే. నాతో నేనే రమిస్తూ - నాతో నేను సంతోషిస్తూ (నేను ఏకాకిని కదా). వీడేంటి కష్టాల్లో, సుఖాల్లో నాతో నేనే వెళుతూ, నాతో నేను ఆనదిస్తూ అంటాడు, కొంపదీసి స్థితప్రజ్ఞుడా?]
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
[అనవరతం అంటే నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఎల్లవేళలా. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం - ఒంటరి అని మాకు ముందేతెలుసు (ఏకాకి అన్నాం కదా). కంటున్నాను ఏంటి? కనడం ఏంటి? అది కూడా కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని.... ??? అర్ధం పోయింది (అపార్ధంగా కొంచెం చెత్తగా చెప్పుకుంటే, ముందు భార్యా నేనే భర్త నేనే అన్నాడు, తరువాత నాతో నేనే రమిస్తున్నా అన్నాడు, ఇప్పుడేమో కంటున్నా అనటున్నాడు. ఓరి దేవుడో.) (రంగవల్లి - మ్రుగ్గు, ముగ్గు; కావ్యకన్య - కావ్యం, కావ్యాల్ని కన్యతో (కూతురితో) పోల్చి కావ్యకన్య అనడం పరిపాటి)]
మొదటి చరణానికి మనం అంత అర్ధం చెప్పుకున్నా, చివరికొచ్చేసరికి అర్ధంలేకుండా పోయింది. కానీ ఒకటి మాత్రం అర్ధమవుతుంది, అద్వైతానుభూతిని పొందిన ఒక స్థితప్రజ్ఞుడు అంతా నేనే, అన్నీనేనే, నేనుకాక ఎవరూలేరు, అయినా ఏదీ నాది కాదు అని చెబుతున్నాడు.
ఇక రెండొ చరణం సిరివెన్నెలగారి సహాయం లేకుండా అర్ధంచేసుకోవడం దాదాపూ అసాధ్యమేమో అని నా అనుమానం. ఇప్పుడు రెండొ చరణాన్ని పరిశీలిద్దాం.
మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
[మిన్ను అంటే ఆకాశం. మింటికి కంటిని నేనై - ఆకాశానికి కన్ను నేనై. ఆకాశానికి కన్నా? అది నేనా?? కంటను మంటను నేనై - కంట్లొ మంటా? (ఏ? ఎవరినైనా చూసి కళ్ళుమండుతున్నాయా?) అదీ కాక ఆ మంట కూడా నేనేనా?]
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
[మంటల మాటున వెన్నెల నేనై - మంటల చాటున వెన్నెలుందా? ఆ వెన్నెల కూడా నేనేనా? వెన్నెల పూతల మంటను నేనై - వెన్నెల పూసిన మంటా? (తేనె పూసిన కత్తిలాగానా?) మళ్ళీ అదికూడా నేనేనా? ఇంతకి మంటా? వెన్నెలా? పదాలతో బాగా ఆడుకున్నా కూడా ఒకటి అర్ధంవుతుంది. అన్నీ నేనే. కన్నైనా, మంటైనా, వెన్నెలైన అన్నీ నేనే. మరి ఆకాశం నేను అని ఎందుకనలేదు. ఆకాశానికి కన్ను నేనైతే మిగిలిన ఆకాశం ఎవరు?]
రవినై శశినై దివమై నిశినై
[రవి- సూర్యుడు, శశి - చంద్రుడు, దివం - పగలు, నిశి – రాత్రి. అన్నీ నేనే.]
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
[నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ - మొదటి చరణంలో "నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ" అన్నాడు. అక్కడ అనుగమిస్తూ అంటే వెంబడిస్తూ. ఇక్కడ సహగమిస్తూ అంటే కలిసి వెళుతూ, కలిసి నడుస్తూ. మిగతా వాక్యానికి అర్ధం పాతదే.]
ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
[ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం - మొదటి చరణంలో "ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం" అన్నాడు. అనవరతం అన్నా, నిరంతరం అన్నా, ప్రతినిమిషం అన్నా అర్ధం ఒక్కటే. ఎల్లప్పుడు, ఎల్లవేళలా. మిగతా వాక్యానికి అర్ధం పాతదే. (హరిణం - జింక, తెల్లదనం; చరణం -పాదము; ఇంద్రజాలం – కనుకట్టు, magic)]
రెండొ చరణం మొత్తం గజిబిజే. ఇక మూడో చరణంలోకి వెళితే
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
[తరలి - కదలి. గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె - తను రచించిన పాటను తన కూతురుగా భావించేకవి, ఆ కూతురుని గాలి అనే పల్లకీలో (అత్తారింటికి) ఊరేగింపుగా సాగనంపాడు.]
గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె
[గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె - కూతురును సాగనంపాక, గొంతు అనే వాకిలిని మూసి ఇంటోకివెళ్ళి మూగదయిపోయి (కూతురువియోగంతో) గుండె మిగిలిపోయింది]
నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి
[లోగిలి - ఇల్లు]
నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి
[ఆలి - భార్య. సినీవాలి - చంద్రకళ కనిపించే అమావాస్య, పార్వతి]
మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో నేను చేసుకున్న అపార్ధాన్ని చవివారుకదా. ఇక ఈ పాటకు సిరివెన్నెలగారు స్వయంగా చెప్పిన అర్ధాన్ని వారినోటిగుండా వినండి మరి. ఎందుకాలస్యం?
Excellent!!! Mind-blowing!!!
ReplyDeleteYour photograph on top right corner please....
ReplyDelete