Friday, November 30, 2012

బుజ్జి

ఒక పనిచేయడానికి మనకు స్పూర్తినిచ్చినవాళ్ళను ఎప్పుడు తలచుకోవాలంటారు. బ్లాగింగ్‌కు నాకు స్పూర్తిని ఇచ్చిన బుజ్జిని తప్పక తలచుకోవాలి, అందుకే ఈ పోస్ట్ (టపా అనడం నాకు ఇష్టంలేదు).

నాకు తెలుగు చాలా బాగా వచ్చు అని, నేను తెలుగు వీరాభిమానిని అని నాకు కొంచెం పొగరు. అంతేకాదు తలపై రెండు కొమ్ములు కూడా. కానీ బుజ్జిముందు మాత్రం కొమ్ములు పక్కన పెట్టి, తలదించుకుని మరీ మాట్లాడుతా. తను తెలుగులో అద్భుతంగా మాట్లాడుతుంది. కవితలు, కతలు చక్కగా రాస్తుంది. కొంటెగా, అల్లరిగా చిన్న చిన్న మాటలతో రాసిన లేదా పూర్తి గ్రాంధికంలో రాసినా తన రాతలు ఎప్పుడూ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఒకే భావాన్ని నేను, బుజ్జి ఇద్దరం తెలుగులో రాస్తే బుజ్జి రాసిన వాక్యమే చాలా బావుంటుంది, దానిముంది నా వాక్యం తీసికట్టు. బుజ్జి వాక్యం బావుందని ఎవరో చెప్పనవసరం లేదు, నామనసుకు అదే అర్ధమయిపోతుంది. తనతో మాట్లాడిన ప్రతిసారి, ఇలా కూడా రాయొచ్చుకదా లేదా చెప్పొచ్చుకదా మరి ఈ పదాలు నాకెందుకు స్పురించలేదు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణలో పదాల ఎన్నిక ఎంత ముఖ్యమో, అలాంటి పదాలతో మాట్లాడితే మనం చెప్పాలనుకున్న విషయం ఎదుటివాళ్ళ మనసుకు ఎంతలా హత్తుకుంటుందో తనతో మాట్లాడిన ప్రతిసారి నాకర్ధమవుతుంది. తనతో మాట్లాడిన ప్రతిసారి ఇవ్వాళ చక్కని తెలుగు భాష విన్నానన్న సంతృప్తి కలుగుతుంది.

బుజ్జి (అసలు పేరు ఇక్కడ అప్రస్తుతం) నాకు ఆర్కుట్‌లో పరిచయం, అది కూడా ఆర్కుట్ తెలుగు సంఘంలో(కమ్యూనిటీ). [అంతర్జాలంలో (ఇంటర్నేట్) పరిచయమయ్యి నా నిజజీవితంలో కలిసిన ఒకేఒక్క వ్యక్తి, బుజ్జి.] అప్పట్లో ఆర్కుట్ తెలుగు సంఘంలో ఎదో తెలుగు పదాల దారం ఉండేది, తను అందులో నాకు పోటీగా వేస్తుండేది. అప్పుడు నాకనిపించేది ‘నాకేపోటీనా’ అని (నాకసలే తెలుగు బాగావచ్చు అని కొమ్ములు కదా).  కొంతకాలానికి మళ్ళీ ఇంకోసారి నా కొమ్ములతో పోటీపడింది. ఈసారి ఘంటసాల సంఘంలో. అందుకే అప్పట్టో బుజ్జి మీద నాకు చాలా ఈర్ష ఉండేది. కాలం గడుస్తున్నకొద్ది ఆ పరిచయం స్క్రాప్‌బుక్ పరిచయం దాకా ఎదిగింది. తనతో మాట్లడుతుంటే అబ్బురపడేవాన్ని. ఇంత చక్కని తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారా అని. నా మాటల్లో చెప్పాలంటే తను ఒక సంస్కృతాంధ్ర పండితురాలు (పండితురాలా? అంటే, నాలాంటి పామరుడితో పోలిస్తే పండితురాలే). తను శుద్ద గ్రాంధికంలో మాట్లాడినా, హైదరాబాదీ యాసలో మాట్లాడినా, గోదావరి యాసలో మాట్లాడినా, అచ్చతెలుగులో మాట్లాడినా తన తెలుగు ముందు నా తెలుగు ఎప్పుడూ దిగదుడుపే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ఆంగ్ల మాధ్యమంలో అందులోనూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి, తెలుగుమీదున్న మక్కువతో ఇంతగా తెలుగు నేర్చుకుందంట. అలా నేర్చుకోవడానికి కనిపించిన ప్రతి తెలుగుపుస్తకం చదివిందంట. విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయిపడగలు పుస్తకాన్ని అవలీలగా చదివేస్తుందంట. (నేను వేయిపడగలు చదవాలని అంతకుముందు రెండు సార్లు ప్రయత్నించా, కానీ భాష కొంచెం కష్టంగా ఉండి, కొనసాగించే ఓపిక లేక మధ్యలోనే నా ప్రయత్నం విరమించేసా. దాన్ని బట్టే అర్ధమవుతుంది, నేనెక్కడో తనెక్కడో. అలా అని వేయిపడగలు చదవడం అసాధ్యం అనట్లేదు, ఓపికతో కూడుకున్న పని.) అదండీ భాషాభిమానం అంటే, దాని ముందు నా భాషాభిమానం ఎంత? అలా తనపై నాకున్న ఈర్ష కాస్త అభిమానంగా మారింది. తనతో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు తను ఎంత చక్కగా ఉచ్చరిస్తుందో తెలిసింది. ఎక్కడ ఏది ఒత్తి పలకాలో, ఏది తేలికగా పలకాలో అక్కడ అది అలాగే సుస్పష్టంగా పలుకుతుంది తను. అంతే కాదు చక్కని కవితలు రాస్తుంది. మనసులో పొంగే భావావేశానికి అందమైన మాటలు తొడిగి తను చెప్పే ఆ కవితలు మరెంతో అందంగా ఉంటాయి. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి తనుకూడా నా తెలుగును మెచ్చుకుంటుంది. నువ్వు చాలా బాగా మాట్లాడుతావు అంటుంది. తనే నాకు రాయడానికి ప్రయత్నించు అని సలహా ఇచ్చిన మొదటి వ్యక్తి.

అప్పటి వరకు ఈ బ్లాగింగు అనేది ఒక మహా రచయితల పని అని అనుకునే నేను బ్లాగులు చదివేవాన్ని కూడా కాదు. నేను మొట్టమొదట చదివిన బ్లాగు బుజ్జి సోది. చాలా నచ్చేసింది నేను కూడా ప్రయత్నిస్తేనో అనిపించింది. ఆ బ్లాగులో ఉన్న అల్లరి భాష, తుంటరి పోస్ట్‌లు చాలా గిలిగింతలు పెట్టాయి. అది చదువుతూ తన రచనా శైలిని ఒంటపట్టించుకునేందుకు ప్రయత్నించిన, తన ఏకలవ్య శిష్యున్ని నేను. అందుకే నా ఈ బ్లాగు పరిచయంలో తన అల్లరి వాక్యాలనే అనుకరించి తన అడుగుజాడల్లోనే నడుస్తున్నా అని చెప్పకనే చెప్పడనికి ప్రయత్నించా. నా బ్లాగు చదివిన బుజ్జి నాతో బాగారాస్తున్నావు అన్నప్పుడు పొంగిపోయా. గురువుకి నచ్చేలా రాయడం అంటే మామూలా.

నాలో దాగున్న రచయితను మేలుకొలిపిన గురువుకు నమస్కరించే భాగ్యం కూడాలేదు, ఎందుకంటే తను నాకన్నా చిన్న.

బుజ్జి సోది చదవాలనుందా? http://bujjisoodi.blogspot.in/

Tuesday, November 27, 2012

పాట: జగమంత కుటుంబం నాది

కొందరు ఏది చెప్పినా చాలా బాగుంటుంది, అలాంటివాళ్ళలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు ఒక్కరు. వారు పాట రాసినా అందరు ఆహా! ఎంత బాగా రాసాడు అనే అంటారు. అది వాళ్ళకు ఎంతవరకు అర్ధమయిందో వాళ్ళకే తెలీదు. అర్ధంలేని చదువు వ్యర్ధం అని సామెత, కానీ మనవాళ్ళకు అర్ధం కాకుండా రాస్తే అది చాలా గొప్ప. కోవకు చెందిన పాటల్లో ఒకటి జగమంత కుటుంబం నాది.

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

కవినై కవితనై, భార్యనై భర్తనై (2)
మల్లెల దారిలో, మంచు ఏడారిలో (2)
పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై (2)
మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది (2)

చాలా చా చాలా బాగా రాసాడు కదా. ఎంత బాగా రాసాడో? ఇంత అద్భుతమైన భావాలు ఎలా వస్తాయో కదా. అలాంటి భావాలు చెప్పాలంటే సిరివెన్నెలలాంటివాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఇంకెవరివళ్ళ సాధ్యం కాదు మీరేమంటారు. మీరేమంటారు అవుననే కదా అనేది. సరే, ఒక చిన్న ప్రశ్న. ఇంతకు మీకీపాటలో ఏమర్ధమయిది, భావం మీ మనసును తట్టింది? మీకెందుకు నచ్చింది? దయచేసి చెప్పరా? నాకు మాత్రం చాలాకాలం వరకు అర్ధం కాలేదు. చాలామంది పాట నన్ను, నా జీవితాన్నే చూసి సిరివెన్నెలగారు రాసారు’ అని చెప్పినకాలంలో నేను పాట భావం ఏంటా అని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయా. చాలా కాలం వరకు పాట భావం సంపూర్ణంగా నాకర్ధం కాలేదు. దీని భావం ఇది అని చెప్పలేకపోయా.  కొంత కాలం తరువాత సిరివెన్నెలగారు ఒక టీవీ కార్యక్రమంలో ఈపాటకు చెప్పిన భావం  చూసాకగాని నాకీపాట పూర్తిగా అర్ధమవలేదు. వారు చెప్పిన భావం విన్నాక, పాట ఎంత అద్భుతంగా ఉందో, అందులో అంతర్గతంగా ఎంత గొప్పభావం ఉందో  అర్ధమయింది. అంతేకాదు ఇన్నాళ్ళూ నేను ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నానో కూడా అర్ధమయింది. ఆ క్షణం ఏమనిపించిందంటే, ఒక కవి హృదయాన్ని అర్ధంచేసుకోవడం అంత సులభం కాదు.

ఇదంతా విన్నాక సిరివెన్నెలగారు చెప్పిన భావం ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా. మీకు ఆ కార్యక్రమం link తప్పకుండా ఇస్తా. కానీ ముందు నా అజ్ఞానంతో నేను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించిన భావం చెప్పనివ్వండి.

(ఇది నా మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పుకున్న భావం)

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
[జగం అంటే ప్రపచం. జగమంత కుటుంబం నాది - ఈ ప్రపంచమే నా కుటుంబం, ఈ ప్రపంచంలో అందరు నా కుటుంబ సభ్యులే. ఏకాకి జీవితం నాది - నాకు సంబంధించినంతవరకు నేను ఏకాకిని. ఈ ప్రపంచంలో అందరూ నావాళ్ళే, కానీ నేను ఎవరివాన్నీ కాదు. సకల చరాచర ప్రాణులగురించి ప్రేమభావాన్ని కలిగి కూడా వాటిలో వేటిని అంటిపెట్టుకునుండని, నిస్సంగత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడా?]

సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
[సంసారం అంటే కుటుంబం అని అర్ధమున్నా, జనన మరణ చక్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ అర్ధంలో చెప్పినా, సంసార సాగరం నాదే - ఈ ప్రపంచమే నాది అనుకున్నవాడికి, అందరి బాధలు కష్టాలు తనవే కదా. సన్యాసం శూన్యం నావే - అన్నీ నావే కానీ నేను ఎవరివాడిని కాదు అనుకున్నప్పుడు, అన్నీ త్యజించిన నేను సన్యాసినే కదా, సన్యాసికి ఉండేది ఏంటి? శూన్యం (రామారావు గారి మాటల్లో చెబితే నాదగ్గర ఉన్నది ఏంటి? బూడిద తప్ప)]

కవినై కవితనై, భార్యనై భర్తనై
[కవినై కవితనై - నేనే కవిని నేనే కవితనా? అంటే?? రచనను నేనే, రచయితను నేనే. ఏమి చెప్పాలనుకుంటున్నాడబ్బా? భార్యనై భర్తనై - వామ్మో! భార్యా భర్త ఒకడేనా? ఉభయలింగ జీవా? కాదు కాదు వేరేదేదో చెబుతున్నాడు. ఏమి చెప్పాలనుకుంటున్నాడు? అన్నీ నేనే అనా? నేను తప్ప ఇంకేవరు లేదు అనా? ఇదేదో శ్రీకృష్ణుడు గీతలో అన్నీనేనే, ప్రపంచంలో నేను తప్ప వేరేది ఏదీ లేదు అని అద్వైత జ్ఞానం బొధించినట్టు బొధిస్తున్నాడా?]

మల్లెల దారిలో, మంచు ఏడారిలో
[మల్లెల దారిలో - సులభంగా పూలబాటలో అంటే పోయేదేమో, విజయంలో అనికూడా చెప్పుకోవచ్చు; మంచు ఏడారిలో - దీన్ని కూడా సులభంగా ముళ్ళబాట అంటే పోయేదేమో, అపజయంలో అనికూడా చెప్పుకోవచ్చు]

పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల
[పన్నీటి జయగీతాల - పన్నీరు జల్లి జయగీతాలు పాడి నా, కన్నీటి జలపాతాల - జీవితం కన్నీటిమయమైనా. ఈవాక్యాలను పై వాక్యంలో కలిపి చెప్పుకుంటే ఇంకా చక్కని అర్ధం వస్తుంది. (మల్లెల దారిలో, మంచు ఏడారిలో; పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల) ఈ వాక్యలను మల్లెల దారిలో - పన్నీటి జయగీతాల, మంచు ఏడారిలో - కన్నీటి జలపాతాల అని చెప్పుకుంటే, విజయం కలిగినప్పుడు పన్నీరు జల్లి జయజయ గీతాలు పాడినా, అపజయాలు కలిగినప్పుడు కన్నీరు మున్నీరైనా.]

నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
[అనుగమించు అంటే వెంబడించు. నాతో నేను అనుగమిస్తూ - నావెంట నేను వెళుతూ (నేను ఏకాకిని కదా). రమించు అనేపదానికి సంభోగించు (intercourse), సంగమించు అనే అర్ధాలున్నయి. ఈ అర్ధంతో నాతో నేనే రమిస్తూ అంటే చెత్తగా ఉంటుందని వెతికి మరీ వేరే అర్ధాన్ని పట్టుకొచ్చా. రమించు  అనే పదానికి ఆనందిస్తూ సంతోషిస్తూ అనే అర్ధం తీసుకుంటే. నాతో నేనే రమిస్తూ - నాతో నేను సంతోషిస్తూ (నేను ఏకాకిని కదా). వీడేంటి కష్టాల్లో, సుఖాల్లో నాతో నేనే వెళుతూ, నాతో నేను ఆనదిస్తూ అంటాడు, కొంపదీసి స్థితప్రజ్ఞుడా?]

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని
[అనవరతం అంటే నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఎల్లవేళలా. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం - ఒంటరి అని మాకు ముందేతెలుసు (ఏకాకి అన్నాం కదా). కంటున్నాను ఏంటి? కనడం ఏంటి? అది కూడా కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని.... ??? అర్ధం పోయింది (అపార్ధంగా కొంచెం చెత్తగా చెప్పుకుంటే, ముందు భార్యా నేనే భర్త నేనే అన్నాడు, తరువాత నాతో నేనే రమిస్తున్నా అన్నాడు, ఇప్పుడేమో కంటున్నా అనటున్నాడు. ఓరి దేవుడో.) (రంగవల్లి - మ్రుగ్గు, ముగ్గు; కావ్యకన్య - కావ్యం, కావ్యాల్ని కన్యతో (కూతురితో) పోల్చి కావ్యకన్య అనడం పరిపాటి)]

మొదటి చరణానికి మనం అంత అర్ధం చెప్పుకున్నా, చివరికొచ్చేసరికి అర్ధంలేకుండా పోయింది. కానీ ఒకటి మాత్రం అర్ధమవుతుంది, అద్వైతానుభూతిని పొందిన ఒక  స్థితప్రజ్ఞుడు అంతా నేనే, అన్నీనేనే, నేనుకాక ఎవరూలేరు, అయినా ఏదీ నాది కాదు అని చెబుతున్నాడు.


ఇక రెండొ చరణం సిరివెన్నెలగారి సహాయం లేకుండా అర్ధంచేసుకోవడం దాదాపూ అసాధ్యమేమో అని నా అనుమానం. ఇప్పుడు రెండొ చరణాన్ని పరిశీలిద్దాం.

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
[మిన్ను అంటే ఆకాశం. మింటికి కంటిని నేనై - ఆకాశానికి కన్ను నేనై. ఆకాశానికి కన్నా? అది నేనా?? కంటను మంటను నేనై - కంట్లొ మంటా? (ఏ? ఎవరినైనా చూసి కళ్ళుమండుతున్నాయా?) అదీ కాక ఆ మంట కూడా నేనేనా?]

మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై
[మంటల మాటున వెన్నెల నేనై - మంటల చాటున వెన్నెలుందా? ఆ వెన్నెల కూడా నేనేనా? వెన్నెల పూతల మంటను నేనై - వెన్నెల పూసిన మంటా? (తేనె పూసిన కత్తిలాగానా?) మళ్ళీ అదికూడా నేనేనా? ఇంతకి మంటా? వెన్నెలా? పదాలతో బాగా ఆడుకున్నా కూడా ఒకటి అర్ధంవుతుంది. అన్నీ నేనే. కన్నైనా, మంటైనా, వెన్నెలైన అన్నీ నేనే. మరి ఆకాశం నేను అని ఎందుకనలేదు. ఆకాశానికి కన్ను నేనైతే మిగిలిన ఆకాశం ఎవరు?]

రవినై శశినై దివమై నిశినై
[రవి- సూర్యుడు, శశి - చంద్రుడు, దివం - పగలు, నిశిరాత్రి. అన్నీ నేనే.]

నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
[నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ - మొదటి చరణంలో "నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ" అన్నాడు. అక్కడ అనుగమిస్తూ అంటే వెంబడిస్తూ. ఇక్కడ సహగమిస్తూ అంటే కలిసి వెళుతూ, కలిసి నడుస్తూ. మిగతా వాక్యానికి అర్ధం పాతదే.]

ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని
 [ఒంటరినై ప్రతినిముషం, కంటున్నాను నిరంతరం - మొదటి చరణంలో "ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం" అన్నాడు. అనవరతం అన్నా, నిరంతరం అన్నా, ప్రతినిమిషం అన్నా అర్ధం ఒక్కటే. ఎల్లప్పుడు, ఎల్లవేళలా. మిగతా వాక్యానికి అర్ధం పాతదే. (హరిణం - జింక, తెల్లదనం; చరణం -పాదము; ఇంద్రజాలం – కనుకట్టు, magic)]


రెండొ చరణం మొత్తం గజిబిజే. ఇక మూడో చరణంలోకి వెళితే

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
[తరలి - కదలి. గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె - తను రచించిన పాటను తన కూతురుగా భావించేకవి, ఆ కూతురుని గాలి అనే పల్లకీలో (అత్తారింటికి) ఊరేగింపుగా సాగనంపాడు.]

గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె
[గొంతు వాకిలిని మూసి మరలి తనుమూగవోయి నా గుండె మిగిలె - కూతురును సాగనంపాక, గొంతు అనే వాకిలిని మూసి ఇంటోకివెళ్ళి మూగదయిపోయి (కూతురువియోగంతో) గుండె మిగిలిపోయింది]

నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి
[లోగిలి - ఇల్లు]

నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి
[ఆలి - భార్య. సినీవాలి -  చంద్రకళ కనిపించే అమావాస్య, పార్వతి]


మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో నేను చేసుకున్న అపార్ధాన్ని చవివారుకదా. ఇక పాటకు సిరివెన్నెలగారు స్వయంగా చెప్పిన అర్ధాన్ని వారినోటిగుండా వినండి మరి. ఎందుకాలస్యం?

Monday, November 26, 2012

నీటిముల్లు

"వాన జల్లు గిల్లుతుంటే ఏట్టాగమ్మా, నీటిముల్లే గుచ్చుకుంటే ఏట్టగమ్మా, సన్న తొడిమటి నడుముందిలే లయలే చూసి లాలించుకో.." చక్కని సంగీతంతో ప్రశాంతంగా సాగిపోయే ఈపాట వచ్చేనాటికి నేను అయిదు లేదా ఆరవ తరగతి చదువుతున్నా అనుకుంటా. పాట విన్న ప్రతిసారి నాకు మా బీఎండీవై (బత్తుల మురళీధర్ యాదవ్) గాడు గుర్తొస్తాడు. సిట్స్ బర్గ్ గారి బర్మింగుహోమురో బత్లెహేము పెన్సిల్వేనియా అని పాడుకునేవాళ్ళం. ఇదేంటి, ఈ చరణాలు పాటలో లేవే అని తికమక పడకండి, సాంఘీక శాస్త్రంలో ఎవో ఊర్ల పేర్లు గుర్తుంచుకోవడానికి పాటలోని చరణాల్లాగ పాడుకునేవాళ్ళం. అలా పాడుకోవడంవళ్ళ అవి ఈనాటికి గుర్తుండిపోయింది. అంతా బానే ఉంది కానీ ఇక్కడొ సమస్యుంది, పాటల్లో సంగీతంకన్నా కూడా భావాన్ని ఎక్కువగా వెతుక్కునే నాకు ఈపాటలో ఒకపదం ఈనాటికి ఒక చిక్కుముడిలా మిగిలిపోయింది. నీటిముల్లు ఏంటి? నీరు బావుంది, ముల్లు బావుంది కానీ నీటిముల్లు? నీటిముల్లు ఏదో గానీ  నేరుగా నా మెదడులో గుచ్చుకుంది.

మళ్ళీ కొంతకాలానికి ఇంకోపాట అందులోనూ అదే నీటిముల్లు, "వాన గడియారంలో, నీటిముల్లు గంటకోడితే". నిజానికి పాట నాకు ఏమాత్రం  నచ్చలేదు కానీ నీటిముల్లు మాత్రం గంటకొట్టి మరీ నా మళ్ళీ మెదడులో గుచ్చుకుంది.

పోనీ అంతటితో అయినా నన్ను వదిలేసిందా అంటే అబ్బే లేదే. మరో కొత్తరూపం సంతరిచుకొని కొత్తపాటగా, "నీటిముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి వాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావ సిరి వాన " అనుకుంటూ వచ్చేసింది. నేను మాత్రం, "నువ్వొస్తానంటే నెనొద్దంటానా" అని అనలేదండి, తనే వచ్చి గిల్లింది.

పదానికి అర్ధం నిజమైన అర్ధమేంటో నాకు ఈనాటికి తెలీదు కాని, మూడు పాటలు పక్కన పెట్టి పరిశీలించి చూస్తే మాత్రం "వాన చినుకు" అన్న అర్ధం స్పురిస్తోంది. వాన చినుకు అలా వచ్చి మీదపడితే ముల్లులా గుచ్చుకుంటుంది అని అర్ధం చెప్పుకోవాలేమో. ఇదే అర్ధంతో మొదటి పాట పరిశీలిస్తే, "వాన జల్లు గిల్లుతుంటే ఏట్టాగమ్మా, నీటిముల్లే గుచ్చుకుంటే ఏట్టగమ్మా" (నీటి చినుకు ముల్లులా గుచ్చుకుంటే అని చెప్పుకుంటే)అర్ధం సరిపోయింది. రెండో పాట "వాన గడియారంలో, నీటిముల్లు గంటకోడితే" (వాన చినుకు అనుకుంటే) ఇక్కడ కూడా అర్ధం సరిపోయింది. మరి మూడోపాట, "నీటిముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన" (వాన చినుకులా నన్నుగిల్లి వెళ్ళిపోకు అనుకుంటే) ఇక్కడకూడా అర్ధం సరిపోతుంది.

ప్రస్తుతానికి నీటిముల్లుకు అర్ధం వానచినుకు అని అనుకుంటూ గడిపేస్తా. మళ్ళీ ఇంకోపాటలో నీటిముల్లు ప్రత్యక్షం అయితే అప్పుడు చూద్దాం.

బ్లాగు చదివే మిత్రులలో ఎవరికైనా నీటిముల్లుకు అర్ధం తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.