ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితం; ఎందుకు పరిగెడుతున్నానో, ఎక్కడికి పరిగెడుతున్నానో తెలీదు; కానీ పరిగెడుతున్నా; పోటీ
ఎవరితోనూ కాదు, అయినా పరుగు ఆగదు. పరిగెత్తి అలసి కాసింత సేదతీరడానికి ఒక్క క్షణం
ఆగితే, ఆగిన క్షణాన నా
మనసు నాతో చెబుతుంది నేను
కూడా ఉన్నా, నాకు కూడా కాస్త
సమయం కావాలి, ఈ అందమైన జీవితంలోని
మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఒక్క నిమిషం నాక్కూడా
కేటాయించు అని. అయినా
నా మనసు కోరిన చిన్ని
కోరికను పట్టించుకోకుండా మళ్ళీ పరుగులు పెట్టడం
నాకు మామూలే. కానీ ఎందుకో అప్పుడప్పుడు
తన కోరిక మన్నించి ఏకాంతంగా
తనతో గడుపుతుంటా. అలా
నేను
ఏకాంతాన్ని వెతుక్కునే ప్రదేశాల్లో పక్కనే ఉన్న outer ring road (ORR) ఒకటి. ORR మీద నడుస్తూ ఉంటే ఉన్నది కాంక్రీట్ అరణ్యంలో అన్న విషయం
ఏమాత్రం గుర్తుకు రాదు. చాలా మంది ఇక్కడ morning walk, evening walk చేస్తారు, నేను
మాత్రం అప్పుడప్పుడు night walk చేస్తా.
డిసెంబర్/జనవరి నెలల్లో సాయంత్రం 9
దాటాక స్వెట్టర్ వేసుకుని, FM రేడియో వింటూ ORR మీద నడవడం మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతి.
ORR పైకి అడుగిడగానే ఆప్యాయంగా స్వాగతం పలుకుతుంది వణికించే చలి. అబ్బో.. చలి
చలి చలి చలి... హైదరాబాద్లో చలి ఎలా
ఉంటుందో తెలుసుకోవాలంటే అక్కడికి వచ్చి తీరాల్సిందే. చలికి
తోడు అక్కడ వీచే పిల్లగాలి, అది మెల్లగా
స్వెట్టర్లోకి దూరి వణికిస్తుంటే
సన్నగా కంపించే శరీరం. ఆహా! చలికూడా అంత
అందంగా ఉంటుందని ఆ క్షణమే తెలుస్తుంది.
సందర్భానికి తగ్గట్టుగా అన్నట్టు రేడీయో మిర్చిలో పాట, ‘చలి చలిగా
అల్లింది ... గిలి గిలిగా గిల్లింది...’.
ఆ పాట నాకోసమే వేసారేమో అనిపించి నవ్వొచ్చింది. ఆ పాట అయిపోగానే
చానల్ మారిస్తే అక్కడ కంచు కంఠం
మ్రోగుతోంది. చక్కని సంగీతాన్ని వింటూ, సన్నని పిల్లగాలిని, ఆ గాలిమోసుకొచ్చే పరిమళాన్ని
ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే ఎంతసేపు నడిచినా
కాలం తెలీదు అలసటరాదు. కానీ సంగీతంలో అపశృతిలాగ
అప్పుడప్పుడు మధ్య మధ్యలో RJల
సోది మాటలు. అబ్బబ్బ ఈ ప్రతీక పెద్ద
వాగుడుకాయ, మొదలెట్టిందా ఆపలేం.
RJ మాటలతో మళ్ళీ ఈలోకానికి వచ్చి
చూస్తే ORR మీద airport వైపు వెళ్ళే కార్ల
లైట్లతో కనుచూపుమేర రోడ్డంతా ఎర్రగా కనిపిస్తుంది. ఆపక్కనే ఇటుగా
వచ్చే కార్ల flood light వెలుగులు. ఆ వెలుగులు చీకట్లొ
మిణుగురు పురుగుల్లా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పక్కనుండి రుయ్, రుయ్ మని
వెళ్ళే కార్లు. కార్ల శబ్దం లేనప్పుడు కీచుమంటూ
రాత్రివేళ కీటకాలు చేసే శబ్దం, ఆ శబ్దంలోనూ నిశ్శబ్దం. శబ్దం, నిశ్శబ్దం రెండు కలిసి
ఉండలేవు అనుకునేవాన్ని కాని అది తప్పు అని ఇప్పుడు తెలుస్తుంది. ఉన్నది మహా నగరానికి
కొన్ని అడుగుల దూరంలోనే అయినా ఎక్కడో పల్లెటూరి వాతావరణంలో ఉన్నంత ప్రశాంతత.
అలా నడుస్తూ రోడ్డు పక్కనే ఉన్న మొక్కలను అప్రయత్నంగా
చేతితో తాకిన ఆక్షణం, ‘ఈ
మొక్క చీకట్లొ కూడా ఇంత స్పష్టంగా
ఎలా కనిపిస్తుంది’ అన్న అనుమానం కలిగి
తలెత్తి పైకి చూస్తే ఆకాశంలో
దేదీప్యమానంగా వెలిగిపోతున్న చందమామ. పౌర్ణమి రోజులు అనుకుంటా, జాబిల్లి నిండుగా ఉన్నాడు. అందులో కుందేలు పిల్ల, చెట్టు, ఆ చెట్టుకింద పేదరాసి
పెద్దమ్మ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చందమామ తన వెలుగులతో భూమి మీదే కాదు
ఆకాశంలో ఉన్న చీకటిని కూడా
తరిమేస్తున్నాడు. ఎంతటి కటిక చీకటి
అయినా చిన్న వెలుగు రేఖ
ముందు తలవంచాల్సిందే, మరి ఇంత దేదీప్యమానంగా
వెలుగుతున్న నిండు జాబిల్లి ముందు
చీకటి నిలువగలదా? జాబిల్లిని తదేకంగా చూస్తుంటే కను రెప్పవేయాలనిపించడంలేదు ఎంత చూసినా
ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది.
క్షీరసాగర మధనంలో అమృతంతో కలిసి జన్మించడం వళ్ళనేమో
చంద్రున్ని చూస్తే ఈ అమృతానుభూతి. అలా
చూస్తున్న ఆ క్షణం తనను
అందుకోవాలనిపించింది, అప్రమేయంగానే ఆకాశంలోకి ఎగిరితే.. అందలేదు. మళ్ళీ ఎగిరినా అందలేదు, మళ్ళీ
మళ్ళీ ఎగిరినా అందలేదు. ఇలా ఇప్పటికి ఎన్నిసార్లు
ఆ
జాబిల్లిని అందుకోవాలని గాల్లోకి
ఎగిరి ప్రయత్నిచానో, లెక్కేలేదు.. కానీ ఏనాడూ అందలేదు.
ఎప్పుడో ఒకప్పుడు అందకపోదా అని ప్రయత్నిస్తూనే ఉంటా.
అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకవేళ ఎప్పుడైనా ఆ
జాబిల్లి అందితే? అప్పుడు నేను ఏమి చెస్తాను?
ఎవరూ దొంగిలించలేకుండా ఎక్కడైన ఎవరికి తెలీని ప్రదేశంలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా. ‘ఏంటి వీడి పిచ్చి,
అదో ఉపగ్రహం అని తెలిసి కూడా ఏంటి ఈ వెర్రి’ అనిపిస్తుందా? అవును,
ఎవరిపిచ్చి వారికి ఆనందం కదా. అయినా
జాబిల్లిని ఆకాశంలో వెలిగే అందమైన దీపం అనుకోవడంలో, దాన్ని
పొందాలని ఆశపడటంలో ఉన్న ఆనందం, అనుభూతి;
అది భూమికి ఉపగ్రహం అనుకోవడంలో లేదు కదా. అందుకే
ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం జాబిల్లిని
ఆకాశంలో వెలిగే అందమైన దీపం అనే అనుకుంటా,
కనిపించిన ప్రతిసారి అందుకోవడానికి ప్రయత్నిస్తా. సైన్స్ చెప్పే నిజంకన్నా మనసు చెప్పే అబద్దమే
తీయగా ఉంది. ఒక్కోసారి అనిపిస్తుంది
ఈ సైన్స్ వచ్చి మనిషిలోని రసజ్ఞతను
చంపేస్తుందా అని. అందుకే ఈ
సైన్స్ నాకొద్దు, దాన్నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోతా.
ఆకాశం నిండా చుక్కలే
ఉన్నాయి, ఎన్ని చుక్కలో. ఆ
చుక్కల్లో పెదచుక్కలా వాటికి కాపలాగా ఉన్నాడా అన్నట్టు జాబిల్లి. జాబిల్లి కన్నుగప్పి దొంగతనంగా మనం కొన్ని చుక్కల్ని కోసుకున్నా
ఎవరు గుర్తు పట్టలేరు, అన్ని చుక్కల్లో ఒకటి రెండు
తగ్గితే ఎవరికి తెలీదు. మొన్న
నా మైనాతో ‘చుక్కలు
తెమ్మన్నా తెంచుకురానా... చూస్తావా నా మైనా..’
అని పాడితే నాలుగు చుక్కలు కోసుకుని తీసుకురా అంది. ఈసారి మరచిపోకుండా కోసుకెళతా,
ఆ చుక్కల్ని చూసి ఆనదంతో తనూ ఆ చుక్కల్లో ఓ చుక్కగా మారిపోతునేమో చూడాలి మరి.
ఆ చుక్కల్ని అలా పరిశీలిస్తుంటే.. అదిగో అక్కడ గోరుకాయ..
కనిపించిందా? మూడు నక్షత్రాలు దగ్గరగా,
ఒకే వరుసలో, సమాన దూరంలో ఉంటే
దాన్ని గోరుకాయ అంటారంట, చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. ఆరుబయట పడుకుని ఆకాశంలో చుక్కలు లెక్కించుకుంటు అదిగో గోరుకాయ ఇదిగో
గోరుకాయ అనుకునేవాళ్ళం. మళ్ళీ గోరుకాయను చూస్తే
అదే గుర్తొచ్చింది. ఆ వైపు అన్నింటికన్నా
ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించే నక్షత్రం, నేను ORR మీదికి వచ్చిన ప్రతిసారి అక్కడే కనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా
నాతోపాటే వస్తుంది. అది దృవనక్షత్రమేమో (pole star) అని నా అనుమానం.
ధృవనక్షత్రం భూభ్రమణాక్షం (axis of rotation of
earth) మీద ఉండటం వళ్ళ, రాత్రి గడుస్తూ ఉంటే మిగతా నక్షత్రాలన్నీ స్థానభ్రంశం
చెందినా అది కదలకుండా
అక్కడే ఉంటుందంట. ఈ నక్షత్రం కూడా ఎప్పుడు అక్కడే ఉంటుంది, అన్నింటికన్నా ప్రకాశవంతంగా ఉంటుంది అందుకే అది దృవనక్షత్రం అని
నా అనుమానం. కాని దాన్ని ఎలా
నిర్ధారించుకోవాలో తెలీదు. సప్తర్షిమండలం (big dipper) తోక గుండా ఉహారేఖను
గీస్తే అది దృవనక్షత్రం నుండి
వెళుతుందంట. కానీ నాకు ఇక్కడ
ఏనాడు సప్తర్షిమండలం
కనిపించలేదు. హైదరాబాదు నగర విద్యుద్దీపాల కాంతికి
చాలా నక్షత్రాలు కనిపించవు. మళ్ళీ ఆకాశాన్ని పరిశీలిస్తే...
ఈ విశాలాకాశంలో అటువైపు ఒంటరి మేఘం. చంద్రుడికి
దగ్గరగా ఉండటం వళ్ళ చంద్రుడి కాంతితో వెండి పింజంలా మెరిసిపోతుంది. వర్షాకాలం వెళ్ళిపొగానే మిగతా మేఘాలన్నీ వేరే
ప్రాంతానికి వెళ్ళిపోతే, ఇక్కడే తప్పిపోయిన ఈ మేఘం తొందరగా
వాటిని చేరాలని వేగంగా పరిగెడుతోంది. పరిగెట్టేది మేఘమే అయినా నక్షత్రాలు
పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది.
ఇంతలో రేడియోలో బాలూగారి
పాట. రోడ్డు పక్కన ఉన్న ఇనప
కంచెపై కూర్చుని ఆ పాట వింటూంటే,
అలా వచ్చే పిల్లగాలి చల్లగా ముఖాన్ని తాకుతూ వెళుతుంటే, పాటతో పాటు దాని జ్ఞాపకాలన్నీ మదిలో మెదులుతూంటే..
మరో లోకమే తప్ప ఈలోకం తెలీదు.
ఎందుకో గానీ కొన్ని పాటాలు
చాలా ప్రత్యేకం. అవి ఎందుకు ప్రత్యేకమో
ఎప్పటికి చెప్పలేం. కానీ అవి మదిలో
ఏదో తెలియని తీగను మీటితే, ఆ
మధురానుభూతి మనసుని కట్టి పడేస్తుంది. ఎంత
చక్కని పాటలు, భావయుక్తమైన భావగీతాలు. మనసులో కలిగే ప్రతి భావానికి
ఓ భావగీతం ఉందనుకుంటా. మనసు ఆ భావంలో
నిండినప్పుడు ఈ భావగీతాన్ని వింటే... భాషలో
చెప్పలేక సతమతమవుతున్న భావాన్ని ఈ పాట ఇంతచక్కగా
ఎలా చెప్పగలిగిందబ్బా అనిపిస్తుంది. ఈ భావగీతాలన్నీ బావగీతాలు
కాకపోయినా.. భావగీతాల్లో బావగీతాలు ప్రత్యేకం... మళ్ళీ RJ సోది.. ఈసారి హేమంత్.
అటు చూస్తే దూరంగా
కొంగలగుంపు, ఇంతరాత్రి వేళ ఆకాశంలో కొంగలా?
ఆశ్చర్యం. దారి తప్పినట్టున్నాయి. దారిని
వెతుకూంటూ త్వరగా తమ గూళ్ళను చేరుకోవాలని
ఎగిరిపోతున్నాయి. ఇటు చూస్తే.. ఇంతదూరం
గాల్లో ఎగిరి, ప్రయాణ బడలికతో, ఎప్పుడెప్పుడు నేలపై వాలి రెక్కల
అలసటను తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్న లోహ
విహంగాలు. ఒకటి, దాని వెనుక
మరొకటి, దాని వెనుకే ఇంకొకటి..
వాటికి అభిముఖంగా వేల మైళ్ళ దూరాన్ని
సునాయాసంగా దాటడానికి
నూతనోత్సాహంతో గాల్లోకి ఎగురుతున్న లోహ విహంగాలు. ఒకటి,
దాని వెనుక మరొకటి, దాని
వెనుకే ఇంకొకటి.. శషాబాద్ విమానాశ్రయానికి రోజూ ఇన్ని విమానాలు
వచ్చిపోతుంటాయని నాకు ఇంతవరకూ తెలీదు.
రాత్రి పూట FMరేడియో వింటే
అన్నీ మనసుకు ప్రశాంతతను కలిగించే పాటలే వేస్తారు. Cassette classics అంటూ ఇలయరాజా,
బాలూల పాటలు లేక old melodies అంటూ ఘంటసాల పాటలు.. మనసులో మరో ఆలోచన రాకుండా కట్టిపడేసే
మధుర గీతాలు. వాటిని వింటూ కళ్ళు మూసుకున్నా.. అలా ఎంతసేపు ఉన్నానో తెలీదు. చలి తీవ్రత
పెరగడంతో మళ్ళీ ఈ లోకానికి రాక తప్పలేదు. త్వరగా ORRని వదిలి ఇంటికి వేళ్ళిపోవాలి లేదంటె
ఈ చలికి ఈ రాత్రి ఇక్కడే గడ్డ కట్టి పోవడం ఖాయం.
Good one.... Eesari orr daggariki plan chesukuni mimmalni kooda jataga teesukelthamu..
ReplyDeleteఅద్భుతంగా వర్ణించారు. ORR ని ఎప్పుడూ ఆ ద్రుష్టితో చూడలేదండి నేను..ఆస్వాదించే మనసు ఉండాలే కాని ఫ్రక్రుతి లోని అందాల్ని ఆస్వాదించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు,మనం ఉన్న చోటే మన మధ్యలోనే ఎన్నో వింతలు ఉన్నాయి అని చక్కగా చెప్పారు...
ReplyDeletegud one. nice narration andi.
ReplyDeleteవర్ణన అద్బుతం.. బాహ్య కక్ష్యా మార్గాన్ని(ORR - మీకు నచ్చని సైన్స్ లో :-)) అంత అద్బుతంగా ప్రకృతితో మిళితం చేసి వర్ణించడం మీకే చెల్లింది..
ReplyDeleteవర్ణన అద్బుతం.. బాహ్య కక్ష్యా మార్గాన్ని(ORR - మీకు నచ్చని సైన్స్ లో :-)) అంత అద్బుతంగా ప్రకృతితో మిళితం చేసి వర్ణించడం మీకే చెల్లింది..
ReplyDeleteevery good narration, mee prathi aaduguni ....aalochani.....chaala baaga varninchaaru
ReplyDeletesuper narration.
ReplyDeleteurgent ga ORR ki vellali anipistondi chadutunte :)
ReplyDelete