ORR (outer ring road) కొత్తగా ప్రారంబించిన రోజులవి,
ఆ road మీద drive చేయాలని చాలా కోరికగా ఉండేది.
కానీ bikeలకు ప్రవేశం లేదు.
ప్రవేశంలేని వాహనాలు road పైకి వెళ్ళకుండా గచ్చిభౌలి దగ్గర ఒక పోలీసు ఎప్పుడూ కాపలాగా
ఉండేవాడు. వాడు నాకు విలన్‌లా కనిపించేవాడు. ఎలాగైతేనేం ఓ రోజు వాడి కన్నుగప్పి ORR ఎక్కేసా. విజయం సాధించా అన్న
ఆనందంతో bikeని
వాయువేగంతో పరిగెత్తించా. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మధ్యలో ఒక పోలీసు ఆపి road దించేసాడు. Road దిగాక ఎక్కడున్నానో
తెలీదు, ఎలా వెళ్ళాలో కూడా తెలీదు.
అటుగా ఎవరైనా వస్తే దారి కనుక్కుందామని bike దిగి, ఎదురుచూస్తూ నిలుచుని, యాదృచ్ఛికంగా నేలపైకి
చూసిన నా కళ్ళు ఎఱ్ఱగా కనిపించిన వస్తువు ఏంటా అని నిశితంగా పరిశీలించాయి. ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా.. ఇది నిజమా? నేను చూస్తున్నది నిజమేనా?
ఎన్నాళ్ళుగానో
నేను వెతుకుతున్న నా చిన్ననాటి నేస్తం ఆరుద్ర పురుగు. మరో ఆలోచన లేకుండా వెంటనే
దాన్ని మెల్లగా, సున్నితంగా రెండు
వేళ్ళతో ఎత్తి నా అరచేతిలోకి తీసుకున్నా. ఆరుద్ర పురుగు నాకు మళ్ళీ
కనిపిస్తుందన్న ఆశకూడా పోయింది. అలాంటిది అది కనిపించగానే ఆ క్షణం చిన్నపిల్లాన్నయిపోయా. దానితో ఎంతసేపు
ఆడుకున్నానో కూడా తెలీదు. ఓ క్షణం ఇంటికి తీసుకెళితేనో అనిపించింది. అదే
చిన్నప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళేవాడినే కానీ అది ఆనందంగా బ్రతకాలి కదా అందుకే
దాన్ని అక్కడే వదిలేసా. రెండు నిమిషాలాగి తిరిగి చూస్తే మాయమయిపోయింది. అక్కడంతా
వెతికా కానీ కనిపించలేదు. ఇది కలా? నిజమా?
నేను
ఇందాక చూసింది ఆరుద్ర పురుగునేనా?
నేల
పొరల్లోకి వెళ్ళిపోయిందేమో.
ఆ నిమిషం చిన్నతనంలో
ఆరుద్ర పురుగుతో ఆడుకున్న సంగతులు ఎన్నో మదిలో మెదిలాయి. ఈ ప్రపంచాన్ని నాకు
పరిచయం చేసిన ఇప్పగూడెంలోనే ఈ ఆరుద్ర పురుగుని మొదటిసారిగా చూసా. ఇవి ఆరుద్ర
కార్తెలో కనిపిస్తాయి కనుక వీటికి ఆరుద్ర పురుగులని పేరు. వర్షాకాలం వస్తే చాలు
గుంపులు గుంపులుగా వచ్చేవి పెద్దవి చిన్నవి అన్నీ కలిసి, నాకైతే చిన్న పురుగులంటేనే చాలా ఇష్టం. ఎక్కన్నుండి
వచ్చేవో మాత్రం నాకు తెలీదు. పెద్దవి అన్నా కదా అని భారీ ఆకారాన్ని ఊహించుకోకండి. పెద్ద
పురుగులు కూడా అర సెంటీ మీటర్ కన్నా పెద్దగా ఉండవు. అయితే అవి ఇట్టే వచ్చి అట్టే
మాయమయిపోయేవి. రెండు,
మూడు వారాలకన్నా ఎక్కువగా కనిపించేవి కాదు. ఆరుద్ర పురుగుల కోసం సంవత్సరం మొత్తం
ఎదురు చూసేవాన్ని నేను.
ఇవి ఎర్రగా, మెత్తగా, మృదువుగా, దూదిపింజంలా ఉంటాయి.
చూడగానే పట్టుకోవాలనిపించేంత ముద్దుగా కదిలే బొమ్మల్లా ఉంటాయి. పురుగులంటే భయపడే చిన్న పిల్లలు
సైతం ఈ ఆరుద్రపురుగుల్ని పట్టుకునేవాళ్ళు. మనం ముట్టుకుంటే చాలు అవి
ముడుచుకుంటాయి. కాసేపు ఏ కదలికా లేకుండా ఉంటే మెల్లగా నడవడం మొదలెడతాయి.
చిన్నప్పుడు వాటిని జాగ్రత్తగా అరచేతిలో తీసుకుని, ఓపికగా అవి కదిలేవరకు ఎదురుచూసి, అవి చేతిలో పాకుతుంటే
ఆనందించేవాళ్ళం. వాటిని చాలా మురిపెంగా చూసుకునేవాళ్ళం. ఇప్పగూడెంలో మా స్కూల్‌లో
అయితే వాటితో
నానా అల్లరి చేసేవాళ్ళం. వాటిని పట్టుకుని అగ్గిపెట్టెలో పెట్టి, అవి తినడానికని కొన్ని
ఆకులు పెట్టే వాళ్ళం. చిన్న పిల్లలం కదా అవి ఆ ఆకులు తినవన్న సంగతి మాకు తెలీదు.
అసలవి ఏమితింటాయో నాకు ఈనాటికీ తెలీదు. ఇంతాచేస్తే అవి మాకు తెలీకుండా చల్లగా
జారుకునేవి. ఇప్పుడాలోచిస్తే
అనిపిస్తుంది పాపం అవి అప్పుడు మా అల్లరికి ఎంత భయపడిపోయేవో. ఓ రోజు ఒక ఆరుద్ర
పురుగును చంపేసాడని మా క్లాస్‌మేట్‌తో మాట్లాడటం మానేసా. ఆ తరువాత అతనితో ఈనాటి
వరకు మాట్లాడలేదు.
అంత అందమైన ఆరుద్ర పురుగుని చివరిసారిగా చూసింది
బండారుపల్లిలో అనుకుంటా. కలుష్యంతో నిండిన ఈ అభాగ్యనగరంలో ఈ సున్నితమైన ప్రాణులు
బ్రతకలేవని తెలిసీ చాలాసార్లు ఆరుద్ర కార్తెలో ఆరుద్రపురుగులకోసం వెతికా కానీ
ఏనాడూ కనిపించనిది అనుకోకుండా ఈనాడు కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో...
ఇంతకి ఈ నా చిన్ననాటి నేస్తం మీకు తెలుసా?
ఆంగ్లలో దీని పేరు: Red
Velvet Mite
"ఆరుద్ర పురుగు" నేను మొదటి సారిగా వింటున్న దీని గురుంచి... ఈ సారి కొత్తగ ప్రయత్నం చేసి నట్టున్నరుగా చాలాబాగుంది.
ReplyDeleteతెలీదా? అయ్యో! అయితే మీరు చిన్నతనలో చాలా కోల్పోయారు..... :p
DeleteNaku kudha theyliyadhu
ReplyDelete