Tuesday, January 1, 2013

కొత్త సంవత్సరానికి స్వాగతం

ప్రతి సంవత్సరం వచ్చేదే కొత్త సంవత్సరం. అయినా ఎందుకో గానీ అది ఎప్పుడూ ప్రత్యేకమే, అది వచ్చిన ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం ప్రవేశించే సంధి కాలంలో ఎన్నో వేడుకలు.  కొత్త సంవత్సరంలొ కొత్తగా ఏమొస్తుందబ్బా? ప్రతీ రోజూ కొత్తగా ఉదయించే సూర్యుడే ఆరోజూ ఉదయిస్తాడు, ప్రతి రాత్రి కొత్తగా ఉదయించే చంద్రుడే ఆరాత్రీ ఉదయిస్తాడు. మరి ప్రత్యేకంగా కొత్త సంవత్సరం నాడు కొత్తగా వచ్చే కొత్తదనం ఏమిటి? సంవత్సరం మారుతుంది అంటారేమో, కానీ సంవత్సరం అన్నది మనం పెట్టుకున్నదే. అలాంటప్పుడు ఇక్కడ నిజంగా మారేది ఏది? ప్రతిరోజూ, రోజు మారుతుంది, ప్రతి నెలా, నెల మారుతుంది; కానీ అప్పుడు మనం ప్రత్యేకంగా వేడుక చేసుకోము. కానీ సంవత్సరం మారినప్పుడు మాత్రం వేడుక చేసుకుంటాం. ఎందుకు? ఏదేమయినా గా** చెప్పినట్టు, వేడుక చేసుకోవాలనుకున్నవాడికి, వేడుక చేసుకోవడానికి ఒక కారణం కావాలి. కారణమే ఈ కొత్త సంవత్సరం.

ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకోవద్దనే సాంప్రదాయ వాదులు చాలా మందే ఉన్నారు. వారి వాదన ప్రకారం, ఆంగ్ల సంవత్సరాది మన సాంప్రదాయం కాదు, మన పండుగ కాదు. మన కొత్త సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది, ఉగాది నాడు మనం కొత్తసంవత్సరం జరుపుకోవాలి. ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిలుకూరు బాలాజీ గుడికి వెళితే అక్కడ పూజారి మైకు పట్టుకుని మరీ చెబుతాడు. జనవరి 1 తేదీన ప్రత్యేకంగా గుడికి రానక్కర్లేదు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మన ఇష్టంతోనో, ఇష్టం లేకుండానో, అంగీకారంతోనో, అంగీకారం లేకుండానో మనం ఇంగ్లీషు క్యాలెండర్ వాడుతున్నం, కానీ తెలుగు పంచాంగాన్ని కాదు. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం తేదీ ఎంత అంటే, అందరూ టక్కున  సమధానం చెబుతారు. కానీ తెలుగు పంచాగం ప్రకారం తిది ఏంటి అని అడిగితే ఎంతమంది దగ్గర జవాబుంది. సాంప్రదాయ వాదులు కూడా చెప్పలేరు. అందుకే మనం వాస్తవాన్ని అంగీకరిద్దాం. మనం ఇంగ్లీషు క్యాలెండర్ వాడుతున్నాం, దాని ప్రకారం సంవత్సరం మారింది కనుక కొత్తసంవత్సర వేడుక జరుపుకోవడంలో తప్పులేదేమో. అయితే ఈరోజు ప్రత్యేకంగా గుడికి వెళ్ళనవసరం లేదు అన్నదాంట్లో కూడా నిజం లేకపోలేదు. అలాగే మనం ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకున్నంతలా, తెలుగు సంవత్సరాది వేడుకలు (ఉగాది వేడుకలు) కూడా జరుపుకుంటే ఎంతో బావుంటుంది కదా.

ఏమయితేనేం 2012 వెళ్ళిపోయి 2013 వచ్చేసింది. రాత్రంతా వేడుకలు. పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా వేడుకలే. కొత్తసంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దేవాళ్ళు కొందరో అయితే, ఈ కొత్త సంవత్సరమేదో తాగడానికే వచ్చిందన్నట్టు, బార్లల్లో, ఇల్లల్లో, తప్పా తాగేవాళ్ళు చాలా మంది. ఇదేదీ చేయలేనివారు టీవీ ముందు కూర్చుని, అందులో వచ్చే చెత్తా కార్యక్రమాల్ని చూడటం. ఇక రాత్రి పన్నెండు దాటగానే, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ, బైకులు రయ్య్ రయ్య్ మనిపించుకుంటూ రోడ్ల మీద పడటం. బైకు మీద ఇద్దరు వెనక నుంచుని ఉంటే, ముందు ఉన్న చోదకుడు (driver), దాన్ని పాములా మెలికలు తిప్పుతు అతివేగంగా నడపడం. [పొరపాటున center of gravity niగానీ  metacenterను దాటిందా, అప్పుడుంటుంది వేడుక hospitalలో] కొత్తసంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన పద్దతి ఇదా? దీన్నే వేడుక అంటామా? ఏమో.

కొత్త సంవత్సర వేడుకల్లో నాకు బాగా నచ్చేవిషయం, రాబోయే సంవత్సరం మీకు ఆనందాన్నివ్వాలని, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొవడం. తమకు, తమ మిత్రులకు కొత్తసంవత్సరం ఆనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది. అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇప్పుడే ఇక్కడే సమాధి చేసి కొత్త తలపులతో, క్రొంగొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే ఆలోచన వినడానికే ఎంతో బావుంది.

మనం ప్రతి సంవత్సరం, "పాత సంవత్సరం బాగోలేదు, కొత్తసంవత్సరం బావుండాలని" కోరుకుంటాం. కానీ సంవత్సరం తిరిగాక మళ్ళీ "పాత సంవత్సరం బాగోలేదు, కొత్తసంవత్సరం బావుండాలని" అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ "పాత సంవత్సరం బాగోలేదు, కొత్తసంవత్సరం బావుండాలనే" మన కోరిక. కొత్తగా మనముందుకొస్తున్నప్పుడు అందంగా, ఆనందంగా కనిపించే సంవత్సరం, వెళ్ళిపోయేనాటికి అలా ఎందుకు కనిపించడంలేదు? పొరపాటెక్కడుంది? సంవత్సరంలోనా? అదే నిజమయితే, ఏదో ఒక సంవత్సరంలో లోపం ఉండాలి కానీ ప్రతి సంవత్సరం అలాగే ఉండకూడదు. మరి? లోపం మనలో ఉంది. పొరపాటు మనమే చేస్తున్నమన్న నిజాన్ని గ్రహించి, ఆత్మవిమర్శ చేసుకొని, గత తప్పులనుండి గుణపాఠాలు నేర్చుకుని, తప్పులు దిద్దుకుని, ప్రతి ఒక్కరు సరైన విధంగా ప్రవర్తిస్తే సంవత్సరం వాళ్ళకే కాదు పక్కవాళ్ళకు కూడా ఆనందాన్ని పంచుతుంది. "ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు ... మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది", మరి మొదటి అడుగు సంవత్సరం మనమే వేద్దామా?

నవ వసంతమా! సంవత్సరపు మొదటి పోస్ట్, నిన్నే ఆహ్వానిస్తూ రాయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు మాకు అన్ని శుభాలే ఇవ్వమని నేను నిన్ను కోరను, ఎందుకంటే శుభమైనా అశుభమైనా మానవులుగా మాకు మేము చేసుకున్నవే అందులో నీ ప్రమేయం ఏమీ లేదు అని నాకు తెలుసు. కానీ ప్రతి ఒక్కరికి కాస్త విచక్షణ కలిగించమని; దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులన్న గురజాడ మాటలు గుర్తుతెచ్చుకుని అందరు సమాజం బావుండలంటే ముందు తాము సన్మార్గంలో ప్రవర్తించాలని గ్రహించేలా చేయమని మాత్రం నిన్ను కోరుకుంటా. “సర్వేజనాః సుఖినోభవంతు”, అంటూ నీకిదే నా ఆహ్వానం..

పోస్ట్ చదివే అందరికి ఇవే నా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు….

3 comments:

  1. Chala Bagundi...

    ReplyDelete
  2. Nice blog.

    Meeku kooda ma angla samvatsaradi shubhakankshalu.

    ReplyDelete
  3. chala bagundi sir mee kotha samvastram blog... edee naa angla samvastra subhakankshalu... 2013 lo mee nunchi inka inka enno vibinnamaina blogs chudali anukuntunnamu... all the best sir... :D

    ReplyDelete