మద్రాసీ, నాకు అస్సలు నచ్చని పిలుపు. ఎవరైనా నన్ను మద్రాసీ అని పిలిస్తే వాన్ని ఆ క్షణమే అక్కడే చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది. నేను గుజరాత్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను మద్రాసీ అని పిలిచారు. నాకు చాలా కోపం వచ్చింది, నేను మద్రాసీని కాదు, నా భాష తమిళ్కాదు, నేను తెలుగువాన్ని, నేను హైదరాబాదీని అని నెత్తినోరు కొట్టుకుని మరీ చెప్పినా, నన్ను నా మాటను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఏమైనా అంటే, 'సబ్ ఏకీ హై, సబ్ మదరాసీ హై, సబ్ తమిళ్ బోల్తే హై', అంటూ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ మాటలు వింటే నాకు మండుకొచ్చేది. వీళ్ళు చదువుకోలేదా? వీళ్ళకు భారతదేశం అందులో ఉన్న రాష్ట్రాలు తెలీవా? ఎందుకింత మూర్ఖంగా మాట్లాడతారు? చదువుకోని వాళ్ళేకాదు, డిగ్రీ పుచ్చుకున్నవాళ్ళు, ఇంజనీరింగ్ చేసినవాళ్ళు, డాక్టర్ చదివినవాళ్ళు ఒక్కరేమిటి అందరి అభిప్రాయం అదే దక్షిణాదీయులు అంతా మద్రాసీలే. నాది కాని గుర్తింపును ఒప్పుకోవడానికి నా మనసు ఎప్పుడూ అంగీకరించలేదు. అప్పటుండి ఎవరో ఒకరు మద్రాసీ అనడం, నేను కాదు అని యుద్దం చేయడం నాకు మామూలయిపోయాయి. అలా మొదలైన మద్రాసీ గుజరాత్లో ఉన్న రెండు సంవత్సరాలు నాకు పిచ్చెక్కించింది. ఆ పిలుపే, చివరికి కాదు ఆ మాట అంటేనే నాకు అసహ్యం వేసేలా చేసింది.
అయితే ఆ గుజరాత్లో ఉన్న రెండేళ్ళలో జరిగిన ఒక సంఘటన మాత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి మిత్ర్తుడి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ తాత యధాప్రకారం నన్ను మద్రాసీనా అని అడిగాడు. నేను కూడా ఎప్పటిలాగే కాదూ నేను హైదరాబాదీని అన్నా. ఆశ్చర్యం, తను నన్ను అంటే నువ్వు నైజామీనా అని అడిగాడు. ‘అవును’ అని అరచినంత పని చేసా. మద్రాసి అని పరాయి గుర్తింపుకాకుండా, నాదైన గుర్తింపుకోసం తహతహలాడుతున్న నాకు నైజామీ అని పిలవగానే శ్రావ్యమైన సంగీతం విన్నంత అనందం కలిగింది. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని ఈ నైజామీ ఈ ముసలాయనకు ఎలా తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం బ్రహ్మకు కూడా తెలీదేమో. [ఇంకో విషయం, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాలం, ఎవరైనా నన్ను నైజామీ అంటే ఒప్పుకునేవాన్ని కాదు. నేను మహ్మదీయున్ని కాదు కనుక నేను నైజామీ కాదు, నేను తెలుగువాన్ని అనేవాన్ని. కానీ అంతకాలం నేను అసహ్యించుకున్న ఆ నైజామీ అనే గుర్తింపే నాకు ఆనాడు చాలా ఆనందాన్నందించింది.]
నేను గుజరాత్ నుండి వచ్చేసినా ఈ మద్రాసీ బూతం నన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు. ఎప్పుడు ఉత్తరాది రాష్ట్రానికి వెళ్ళినా అది నన్ను పట్టి పీడిస్తుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, డిల్లీ, ముంబాయి ఇలా ఎక్కడికెళ్ళినా వాళ్ళు నన్ను మద్రాసీ మద్రాసీ మద్రాసీ అనడం నేను కాదు కాదు కాదు అనడం మామూలయిపోయింది. ఎక్కడొ ఉన్న నగరల్లో ఎందుకు, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పూణే నగరంలో కూడా, మద్రాసీ అని పిలిస్తే, ఛీ అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయా. ఈ మద్రాసీ తలనొప్పి నన్నొక్కన్నే కాదు, ఉత్తర భారతం వెళ్ళిన ప్రతి తెలుగువాన్నీ బాధపెట్టుంటుంది. అందులో అనుమానం అణుమాత్రం కూడా లేదు. ఒక్క తెలుగువాళ్ళనే కాదు కన్నడీగుల్ని, మళయాళీలను కూడా బాధపెట్టుంటుంది. మనకు ఈ మద్రాసీలు అని, తమిళ్ మన భాష అని గుర్తింపు ఎందుకు? మనకంటూ గుర్తింపులేదా? లేక తమిళులు అంత గొప్ప గుర్తింపును పొందారా? ఆ గుర్తింపుముందు మనం కొట్టుకుపోయామా? నిప్పులేనిలే పొగలేదు కదా, మరి ఈ పొగవెనుక గల నిప్పు ఏంటి?
దీనివెనక ఏదైనా చారిత్రాత్మక కారణం ఉందా అని వెతకడం ప్రారంభించిన నాకు, చరిత్ర పుస్తకాలు తిరగేస్తుంటే దీనివెనకున్న కారణం ఇదేమో అనిపించే విషయం ఒకటి కనిపించింది. అయితే కారణం ఇది అని నేను ఏ పుస్తకంలో చదివింది కాదు. చరిత్రను పరిశీలించి, నాకు నేనుగా నిశ్చయించుకున్న విషయం. ఇది తప్పవ్వవచ్చు కానీ ఇదే సరైన కారణం అని నా అని నా అనుమానం, ఇంతకన్నా వేరే కారణం ఉండకపోవచ్చు.
ఒక్కసారి చరిత్రలో వెనక్కేళ్ళి 1947 దగ్గర ఆగి భారత దేశాన్ని పరిశీలిస్తే. దక్షిణ బారతంలో చాలా బాగం మద్రాస్ ప్రెసిడెన్సీలో (చెన్నపురి సంస్తానం) ఉండేది. ఆంగ్లేయుల సామ్రాజ్యంలో దక్షిణ భారతం మొత్తం మద్రాస్ ప్రసిడెన్సీనే. (ఆంధ్రప్రదేశ్లో తెలంగాణా జిల్లాలు తప్ప మిగిలిన్న ప్రాంతం అంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే.) దక్షిణ భారతంలో మద్రాస్ ప్రసిడెన్సీ కాక హైదరాబాదు, మైసూరు ఉన్నా ఈ రెండూ ఆంగ్లేయుల సామ్రాజ్యంలో భాగం కాదు. ఈ చారిత్రాత్మక నిజాన్ని బట్టి పరిశీలిస్తే ఆనాటి దక్షిణ భారతం మొత్తం మద్రాసే కదా, నాటి దక్షిణ భారతీయులందరు మద్రాసీలే కదా. అలా మొదలయ్యుండాలి దక్షిణ భారతీయుల్ని మద్రాసీలు అని పిలవడం. ఆ పిలుపే ఈనాటికి నిలిచిపోయింది. ఆనాడు నన్ను ఆ ముసలాయన నైజామీగా గుర్తించడానికి గల కారణం తనకు ఆనాటి రాష్ట్రాలైన మద్రాస్ ప్రేసిడెన్సీ, హైదరాబాద్, మైసూర్ తెలిసుండాలి.
స్వాత్రంత్ర్యానికి పూర్వం ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ పోయినా, మద్రాసు నగరమే చెన్నైగా మారిపోయినా, మద్రాసీ అన్న పేరు మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఉత్తర భారతీయులు ఈ మద్రసీని మరాచిపోయి మనకు మన గుర్తింపివ్వడానికి ఇంకా రెండు, మూడు తరాలు పడుతుందేమో. అంతవరకు ఈ మద్రాసీ రాక్షసి మనకు తప్పదేమో.
No comments:
Post a Comment