Wednesday, May 20, 2015

పాట: ఆనందమే ఆలాపనై

ఆనందమే... ఆలాపనై... నా గొంతులో... స్వరములు పలికేనా...
ఆకాశమే... నా స్నేహమై... తుళ్ళింతలో.. పదములు కలిపేనా ...
నా నవ్వులో... మేరుపైనా... నాకిప్పుడే... తెలిసేనా...
నేస్తం... పలికే... ఈ లాలనా... నన్నే. నాకే... తెలిపే... అన్వేషణ...
ఆనందమే... ఆలాపనై... నా గొంతులో... స్వరములు పలికేనా...

నా.... దారిలో... స్నేహం పరిమళించేనా...
పలుకే.. వినిపించి, పరదా.. తొలగించి, తలపులనే... తాకేనా …
మనసే.. వివరించి, మాటే... మంత్రించి, తన మహిమేదో.. చూపేనా ...
ఆ... మంచితనం... మంచుగుణం.. చూసి, నా... ఒంటితనం... జంటతనం.. కలిపి
చెలిమి రాగాల చిరునవ్వులు చిందించిన క్షణమున

ఆనందమే... ఆలాపనై...
ఆనందమే... ఆలాపనై... నా గొంతులో... స్వరములు పలికేనా...

నే.... నేనుగా... లేనే.. లేని భావన.....
కలిసే... ప్రతి ఊహ, అతడై..కదలాడి, వదలదుగా... తిన్నగా....
మనసే... నను వీడి, తనతో జత గూడి, వెనుకకు రానే... రాదుగా..!
ఈ... విలవిలలే.. తన వలనే... కలిగే, ఈ... కలవరమే... తోలివలపై.. ఎదిగే
వయసు తొలిసారి తన వాకిట తన వెలుగును చూసిన

ఆనందమే... ఆలాపనై...
ఆనందమే... ఆలాపనై... నా గొంతులో... స్వరములు పలికేనా...
ఆకాశమే... నా స్నేహమై... తుళ్ళింతలో.. పదములు కలిపేనా ...
నా నవ్వులో... మేరుపైనా... నాకిప్పుడే... తెలిసేనా...
నన్నే... నాకు... చూపించినా... ప్రేమ... నీవే... కావా... ఈ లాలనా.....


================================================
ఓ.. వజ్రాన్ని కోల్పోతే దాన్ని తిరిగి పొందడానికి ఎంత కష్టపడాలో ఈ పాట మళ్ళీ పొందడానికి దాదాపు అంత కష్టపడ్డా. internetలో ఈ పాట దొరకడం కాస్త కష్టంగా ఉంది (తెలుగులో వెతికితే దొరకదు, దొరకాలంటే  aanandamai alapanaiతో వెతకండి). నాలా వెతికేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని వాళ్ళకోసం ఈ blogలో వేస్తున్నా.  చక్కని సంగీతం, అందమైన సాహిత్యం, అద్భుతమైన భావంతో, కాస్త శాస్త్రీయ సంగీత బాణీలో సాగిపోయే భావగీతం. కానీ చాలా మందికి ఈ పాట తెలీనే తెలీదు. నాక్కూడా ఒకానొకసందర్భంలో పరిచయమయ్యేవరకు తెలీదు. కేవలం పెద్ద హీరో నటించిన పాటలు మాత్రమే జనాలకు చేరువయ్యే ఈ కాలంలో ఇలాంటి ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోవలసిందే.  ఈ పాటకు సాహిత్యం ఎవరో మీకుగానీ తెలిస్తే చెప్పండి.

పాట వినాలనుకుంటే: ఆనందమే ఆలాపనై (from raaga)

Thursday, March 19, 2015

నీ ఊహ

నిజంకన్నా ఊహే తీయగా ఉంటుంది. అందుకేనేమో నిజాన్ని చెదు నిజం అని, నిప్పులాంటి నిజం అని; అదే ఊహని తీయని ఊహ, తీయని కల అంటారు. ఊహ అబద్దమైనా సరే మనసుకు సేద తీరుస్తుంది. ఊహేలేకుంటే జీవితం ఎంత భారంగా ఉండేదో. ఆ ఊహంటే నాకు చాలా ఇష్టం. ఊహల్లో అయినా నిన్ను కలుస్తాను, ఊహల్లోనే నీతో ఊసులాడతాను. ఆ ఊహేలేకుంటే? ఊహించుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఊహ ఉండాలి, ఊహ కావాలి. నేను ఆ ఊహలో జీవించాలి.

నా ఊహల సామ్రాజ్యానికి మహారాణివి నీవు, నా ఊహల గుడిలో దేవివి నీవు, నా ఊహల జీవితాన ప్రేయసి నీవు. కానీ నిజం అదికాదు. నేనంటే నీకు చిరాకు, చికాకు, అసహ్యం. అందుకే మనసు నిండా ప్రేమ ఉన్నా నీ ఎదురుగా రావాలంటే భయం, ఎక్కడ నీ తిరస్కారాన్ని చవిచూడాల్సొస్తుందో అని. నీకు తెలీకుండా దొంగచాటుగా నీ నవ్వుల పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తుంది నా మనసు. ఆ నవ్వులు నాకోసమే అని ఊహించుకుని మురిసిపోతుంది నా మనసు. కానీ ఆ పిచ్చి మనసుకేమి తెలుసు ఆ నవ్వులు నావి కావని.

ఏదో ఒకరోజు నీ మనసు మారుతుందని, నేనంటే ఇష్టపడుతుందని ఊహించుకుంటూ, ఆ రోజు ఎంత అందంగా ఉంటుందో తలుచుకుంటూ ఈ నాటి నిజాన్ని మరచిపోతుంది. కానీ ఆ రోజు ఏనాటికి రాదు, నీ మనసులో నాకు ఏమాత్రం స్తానం దొరకదు, కనీసం అందులో నాపై జాలి కూడా కలగదు అన్న నిజం నా మనసుకు తెలీదు. తెలీకపోవడమే మంచిదేమో తెలిసిన మరుక్షణం అది విలపించి విలపించి ఏ స్పందనా లేని బండలామరిపోతుంది. అందుకే దాన్ని ఆ ఊహలోనే ఉండనీ దానికి నిజం చెప్పొద్దు.


నిజానికి ఊహకు మధ్య ఓ వంతెన కట్టాలని, ఆ వంతెన మీదుగా ఊహల్ని నిజాలు చెయ్యాలని ఆరాటపడుతున్న నా మనసుకు ఆ ఊహ శాశ్వత అబద్దం, అది ఏ నాటికీ నిజం కాదు, నిజం నీ ఊహ దరిదాపుల్లోకి కూడా రాదు అని ఎలాచెప్పను. చెప్పి దాన్ని ఎలా చంపేయను. అందుకే ఆ నిజం చేరని సుదూర తీరానికి వెళ్ళిపోవాలని, అక్కడ నిజాన్ని మరచి ఊహే నిజమనుకుని జీవించాలనుంది. ఊహ నిజం కాదు అని నా మనసుకి తెలిసేలోగా, ఈ లోకాన్ని వదిలి ఆ నిజం చేరలేని సుదూర లోకాన్ని చేరాలనుంది.

Saturday, January 31, 2015

ఆత్మహత్య తప్పా?

రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా తప్పే అంటారు అందరు. కానీ నేను ఎందుకు తప్పు అంటాను. అసలు తప్పంటే ఏంటి? ఈ ప్రపంచంలో తప్పు, ఒప్పు అనేవి దేశకాలమాన పరిస్తితులను బట్టి మారుతుంటాయి. ఒక పర్తిస్తితుల్లొ తప్పు మరో పరిస్తితుల్లో తప్పు అవకపోవచ్చు. ఉదాహరణకు సౌది అరేబియాలో తప్పు అనిపించింది భారత దేశంలో తప్పు కాకపోవచ్చు. భారత దేశంలో తప్పు అనిపించింది అమెరికాలో తప్పు అనిపించకపోవచ్చు. అలాగే ‘మనిషిని చంపడం తప్పా?’ అంటే, దాదాపు అందరు తప్పే అంటారు. మరి ఓ సైనికుడు శత్రుదేశపు సైనికున్ని లేదా తీవ్రవాదిని చంపుతాడు.  శత్రుదేశపు సైనికుడు, తీవ్రవాది ఇద్దరు మనుషులే. చంపింది మనిషినే. అది తప్పా? అందుకే తప్పు ఒప్పు అనేవి దేశకాలమాన పరిస్తితులను బట్టి మారుతుంటాయి.

ఈరోజు ఓ స్నేహితుడితో ఇదే విషయంపై కాసేపు వాదులాడాను అందుకే నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే నేను తప్పా ఒప్పా అని నిర్ధారించకుండా దానిపై కాసేపు ముచ్చటిస్తాను.

ఎవరు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా దానికి బలమైన మానసిక, శారీరక, సాంఘీక కారణం ఉంటుంది. వారి స్తానంలో ఉంటే తప్ప వారి మానసిక సంఘర్షన ఎవరికీ అర్ధం కాదు. అది అర్ధం కాకుండా వాళ్ళను విమర్శించడం, వాళ్ళు చేసేది తప్పు అండం వారిని అవమానించడమే. వారి స్తానంలో ఉంటే ఈ విమర్శకుడు అలానే చేసేవాడేమో. వారిస్తానంలోకెళ్ళి ఆలోచించడి (put yourself in their shoes). నన్ను నేను వారిస్తానంలో ఉంచి రాయడానికి ప్రయత్నిస్తున్నా. విశ్లేషణలోకి వెళ్ళేముందు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మానసిక పరిస్తితిని వివరిస్తూ ఎవరో రాసిన నాలుగు మాటలు
                              WHEN TEARS DON'T STOP FLOWING FROM EYES,
                              AND NO ONE APPEARS TO BE OWN,
                              WHEN DEATH APPEARS BEAUTIFUL THAN LIFE,
                              A PERSON IS FORCED TO COMMIT SUICIDE.

ఆత్మహత్య తప్పు అనేవాళ్ళకు నేను వేసే ముక్కుసూటి ప్రశ్న, ఆత్మహత్య ఎందుకు తప్పు? ఈ ప్రశ్నకు మాత్రం ఇదమిద్దంగా ఎవరూ సమాధానం చెప్పరు. కొందరు తప్పు అంతే అంటారు; ఇంకొందరు పుట్టించింది భగవంతుడు ప్రాణం తీసె హక్కు నీకు లేదు అంటారు; మరి కొందరు దేవుడు నిన్ను పుట్టించాడు అంటే దానికి ఓ కారణం ఉంది అందుకు బ్రతకాలి అంటారు; ఇలా వీళ్ళు ఇచ్చే ఏ ఒక్క సమాధానం సంతృప్తికరంగా ఉండదు. వీళ్ళ దగ్గర కారణం అంటూ ఉండదు. అది తప్పు అనే ఓ నిర్ణయం ఉంటుంది దాన్ని మనం పాటించాలి, ప్రశ్నించకూడదు, ప్రశ్నించడం తప్పు. వీళ్ళ గురించి ఆలోచించడం వృధా. ఇక  ఇంకొంతమంది కాస్త తార్కికంగా నువ్వు చనిపోతే x, y, z, p, q, r s, t, u, v, w మొ|| వాళ్ళంతా బాధపడతారు, నువ్వుపోయి వాళ్ళను బాధ పెడతావా అంటారు. ఇది వినడానికి కాస్త సరైనదే అనిపించినా, ఎవరో బాధపడతారు అని బ్రతకాలా? అలా బ్రతికిన బ్రతుకులో తను అంటు లేనప్పుడు ఆ బ్రతుక్కి అర్ధం ఏంటి? ఈ లోకంలో ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఊరేగడాని రాలేదు కదా. ఇవ్వాళ ఆత్మహత్య చేసుకోకున్నా కాలప్రభావం వళ్ళ పోతే ఆనాడూ ఈ x, y, z, p, q, r s, t, u, v, w లు బాధ పడతారు కదా. మరి అది ఆత్మహత్య చెసుకోవడానికి అడ్దంకి ఎందుకు కావాలి. ఎన్ని చెప్పినా వీళ్ళ జవాబు ఒక్కటే నీకు చనిపోయే హక్కు లేదు, దేవుడే చంపాలి. సరె, ఈ విషయం మీదే మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అన్ని పనులు చేసేది దేవుడే మనం నిమిత్తమాత్రులం అంటారా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారా? ఈ ఆత్మహత్య మాత్రం దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా, శివుడాజ్ఞలేకుండా జరుగుతుందా? దైవజ్ఞ/శివుడాజ్ఞలేకుండా ఏదైనా జరగగలదా? పోనీ, నిమిత్తమాత్రులం కాదు, పని మనం చేస్తాం, మనం చేసే పనికి శిక్ష ఉంటుంది అంటారా? ఎవరో ఎకడో శిక్ష విదిస్తారు అని ఇక్కడ, ఇప్పుడు ఈ జీవితంలో శిక్ష అనుభవించడానికి ఒప్పించగలమా? అందుకే ఆత్మహత్య తప్పు లేక ఒప్పు అనలేము. వారి వారి పరిస్తితుల ప్రకారం అది వారికి తప్పో ఓప్పో అనిపించవచ్చు. దాన్ని కాదు అనే హక్కు మనకెక్కడుంది? ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు. చాలామంది చావు పుట్టుకలు మన చేతిలో లేవు అంటారు. పుట్టుక మనచేతిలో లేదు, నిజం. బ్రతికి ఉండటం మనచేతిలో లేదు, నిజం. అలాగే చావడం మనచేతిలోనే ఉంది. అదీ నిజం, ఎవరొప్పుకున్న కోకున్నా నిజం.

ఇది అంగీకారయోగ్యం కాదు అందుకే తప్పు అంటారా? ఎవరికి అంగీకార యోగ్యం కాదు? చట్టానికా న్యాయానికా? చట్టనికి న్యాయానికి అంగీకారయోగ్యం కానిది నేరం. ప్రతి నేరం తప్పవ్వాలని నియమమేమీ లేదు. అయినా చనిపోతా అనుకున్నవాడికి చట్టం ఏంటి న్యాయం ఏంటి? ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కారుణ్య హత్యలు (euthanasia) లేవా? అవి చట్టబద్దం కావా? అవి కేవలం నివారణ లేని రోగాలున్నవారికే, ఆ శారీరక బాధ భరించలేనివారికే అంటారేమో. ఓ.. అంటే మీ ఉద్దేశంలో శరీరానికి కలిగే బాధే బాధా? మనసుకు కలిగే బాధ బాధ కాదా? శరీరానికి కలిగే బాధ తొలగించడానికి కారుణ్యహత్య (euthanasia)  సమర్ధనీయమయితే మనసుకు కలిగే బాధను నివారించడానికి కూడా కారుణ్యహత్య (euthanasia) సమర్ధనీయం కావాలి. కారుణ్యహత్య (euthanasia), ఆత్మహత్య రెండూ వేరు అంటారా? ఊహూ.. ఆ వాదనను నేను ఒప్పుకోను. ఆత్మహత్య అంటే తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకోవాడం. కారుణ్యహత్య (euthanasia)లో కూడా రోగి తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకుంటాడు దానికి పక్కవాళ్ళ సహాయం తీసుకుంటాడు. కనుక ఇది కూడా ఆత్మహత్యలో ఒకరకమే అంటాను. మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే జీవించను అనే హక్కు కూడా ఉండాలేమో. తను ఉండాలా పోవాలా అన్న నిర్ణయం తీసుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉండాలేమో. అయితే ఆ నిర్ణయం ఏ క్షనికావేశంతో తీసుకున్నదో కాక కనీసం ఓ ఆరునెలలు ఆలొచించి తీసుకున్నదయ్యుంటే దాన్ని వ్యతిరేకించనవసరం లేదేమో.

ఇక దీనికితోడు సలహాలిచ్చేవాళ్ళు, వీళ్ళు సలహాలిస్తున్నారో లేక అసలే మానసికంగా బాధ పడుతున్నవాళ్ళను అవమానిస్తున్నారో నాకైతే అర్ధం కాదు. కొందరేమో ఆత్మహత్య పిరికివాళ్ళ చర్య నువ్వు పిరికివాడివా, చేతకానివాడివా అంటారు. ఇంకొంతమంది చావడానికి చాలా ధైర్యం కావాలి, అందులో కొంతైనా బ్రతుకుని బాగుచేసుకోవడానికి వాడుకుంటే హాయిగా బ్రతుకొచ్చు అంటారు. అసలే మానసికంగా బాధల్లో ఉన్నవాళ్ళకు ఇవి రుచిస్తాయా? నిజానికి చావడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా బ్రతకడానికే ప్రయత్నిస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన ప్రకారం, "జన్మ జన్మల్లో చావును చుసిన జీవుడికి చావు అంటే భయం" అందుకే ప్రతి ప్రాణిలోని జీవుడు బ్రతకాలనే చూస్తాడు. అంతటి బ్రతకాలనే కోరికను ఎదురించి చావాలని చూస్తున్నవాడు ఎంతగా అలోచించుంటాడు? ఎదో క్షణికావేశంలో అత్మహత్య చేసుకుకోవాలని చూస్తున్నవాళ్ళను వదిలేస్తే మిగతావాళ్ళు ఈ సలహా ఇచ్చేవాళ్ళకన్నా ఎక్కువే ఆలోచించి ఉంటారు. ఇంకొంతమంది చావు సమస్యకు పరిష్కారం కాదు అని ఉచిత సలహా ఇస్తారు. ఎవరి సమస్యకు పరిష్కారం కాదు? పోయేవాడి సమస్యకా లేక పోగామిగిలినవాళ్ళ సమస్యకా? మనిషి పోయాక వాడికి ఈ సమస్యే ఉండదు కనుక చావు సమస్యకు పరిష్కారం కాదు అనడంలో అర్ధం లేదు. పోగామిగిలినవాళ్ళ సమస్య అంటారా? దానిగురించే ఆలోచిస్తేవాళ్ళు ఆత్మహత్య ప్రయత్నమే చేయరు. ఈ సలహాకు అర్ధమే లేదు. ఇంకో చెత్త సలహా. నీకు జీవితమంటే ఇష్టంలేదు సరె సమాజానికి ఉపయోగపడు, సమాజ సేవ చెయ్యి, నలుగురు అనాధలను దత్తత తీసుకుని పోషించు వాళ్ళకు ఆనందాని పంచు. ఎవరైన తనదగ్గర ఉన్నదే పక్కవాళ్ళకు ఇవ్వగలరు. వాళ్ళ దగ్గరే ఆనందం లేకుంటే ఇంక పక్కవాళ్ళకెలా ఇస్తారు? ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం ఆ మనిషిని ఇంకా రెచ్చగొట్టడమే అవుతుంది కానీ తన ఆలోచనను ఏ మాత్రం దూరం చేయదు.

ఆత్మహత్యను మతం అంగీకరించదు అంటారా? అవును, ఆత్మహత్య ధర్మబద్దం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దాన్ని వేదం నిషేధించింది. మనుస్మృతి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళకు కర్మకాండను నిషేధించింది. ఎందుకు నిషేధించింది ఇందులో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓ సమాధానం తోస్తుంది. మానవ జన్మ చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కానీ ఈ జన్మ లభించదు. ఈ జన్మను మోక్ష మార్గంలో ప్రయాణించడానికి వినియోగించుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం, నీ ఆద్యాత్మిక ప్రగతిని నిరొధించడమే. కర్మను ఎక్కడైతే వదిలేసి వెళ్తున్నారో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఈ వాదన కూడా రుచించే వాదన కాదు. వాళ్ళు సరే అలాగే కానీ నాకేంటీ నష్టం అంటే మీ సమాధానం? అదీ కాక ఈ ప్రపంచంలో ఎంతమంది మానవ జన్మను సద్వినియోగ పరుచుకుంటున్నారు? ఎందరు ధర్మ బద్దంగా జీవిస్తున్నారు? డబ్బు, సుఖం, మోహం, అహం, పేరు, ప్రతిష్ట మొ|| తప్ప ఈ ప్రపంచంలో ఎంతమందికి ధర్మం కావాలి? అసలు ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ప్రాపంచిక సుఖాలకోసం వెంపర్లాడే వీళ్ళంతా మానవ జన్మను సద్వినియోగంచేసుకుంటున్నారా? ప్రపంచంలో ధర్మబద్దం కానీ జీవనం జీవిస్తూ మానవ జన్మ దుర్వినియోగపరుచుకుంటే ఒప్పా? అదే ఆత్మహత్య చేసుకుని దుర్వినియోగపరుచుకుంటే తప్పా? రెండు దుర్వినియోగమే అయినప్పుడు రెంటిలో పెద్ద తేడా లేదు.

పోనీ మన పురాణల్లో ఆత్మహత్య చేసుకున్న/చేసుకోవలనుకున్న మహాపురుషులు లేరా? ఉన్నారు అంటాను. వారెవరో పరిశీలిద్దాం. పరిశీలించేముందు ఆత్మహత్య అంటే నా నిర్వాచనం చెప్తా. ఆత్మహత్య - తనను తాను చంపుకోవడం. సహజ సిద్దంగా లేదా బాహ్యప్రక్రియల వళ్ళ కాక తనకు తానుగా తన ఇచ్చానుసారంగా తనను తాను చంపుకోవడం. మళ్ళీ దానిని సమర్ధించడానికి కారణాలు వద్దు. సమర్ధించడానికి కారణాలు వెతికితే ఆత్మహత్య చెసుకోవలనుకుంటున్నవాళ్ళదగ్గర కూడా ఉంటాయి బోలెడన్ని కారణాలు. (నా పురాణ పరిజ్ఞానం కేవలం మిడిమిడి జ్ఞానమే, తెలిసి తెలియని విషయాలమీద నేను ఏమైనా తప్పులు చెప్పుంటే ఆ తప్పును ఎత్తిచూపండి సరిదిద్దుకుంటా)

ఆత్మ హత్య చేసుకున్న పురాణ పురుషుల్లో (పురుష - హృదయంలో నివసించే) మొట్టమొదటిగా నేను చెప్పేపేరు ఆదిపరాశక్తి పార్వతీ దేవి. సతీదేవి దక్షయజ్ఞం సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన కాలి బొటనవేలితో అగ్నిని రగిల్చి అందులో దూకింది. దానికి కారణం తన తండ్రి అయిన దక్షుడు తన భర్త శివున్ని అవమానించాడని. అలా దూకడాన్ని శాస్త్రం ధర్మం అంగీకరించాయి. అంటే తనని (లేదా తనవాళ్ళను) ఎవరైనా అవమానిస్తే, ఆ అవమాన భారాని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం అంగీకారయోగ్యమా? ఇది దైవలీల అన్న సమాధానం మాత్రం వద్దు, లీల ప్రశ్నించే ప్రశ్నకు సమాధానం చెప్పదు, పారిపోతుంది. ఇక రామాయణంలో వేదవతి రావణుడు తన కురులను ముట్టుకున్నాడని అగ్నిలో దూకింది. దీన్ని కూడా శాస్త్రం ధర్మం అంగీకరించాయి. ఎందుకు అంగీకరించాయి? అలాగే పురణాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాళ్ళను పరిశీలిస్తే, భరతుడు తన అన్న రాముడు 12 ఏళ్ళ తరువాత రాకుంటే అగ్నిలో దూకుతా అంటాడు. అదీ ఆనాటి ప్రాజ్ఞ సమ్మతమే. రాముడు వచ్చాడు కనున భరతుడు ఆత్మహత్య చేసుకోలేదు లేకుంటే చేసుకునేవాడే. హనుమంతుడు లంకలో సీతను చూసేవెళ్తాను, చూడలేకుంటే అగ్ని దూకుతా అనుకున్నాడు. అదీ అందరికీ అంగీకార యోగ్యమే. వాళ్ళ కారణాలు సమర్ధనీయం అనుకుంటే, వీళ్ళ కారణాలు సమర్ధనీయమే. నిన్న మొన్నటివరకు భారత దేశంలో ఒక సాంఘీక నియమంగా, ధర్మంగా ఆచరించబడ్డ సతీసహగమనం? మహాభారతంలో మాద్రి సతీ సహగమనం చేయలేదా? అది ధర్మబద్దమని అంగీకరింపబడలేదా? తన ఇష్టప్రకారం సతీసహగమనం చేయడం ఆత్మహత్య కాదా? ఇవ్వన్నీ చూస్తే నాకు ఓ అనుమానం వస్తుంది. అగ్నిలో దూకి ఆత్మ హత్య చేసుకోవడంలో తప్పులేదా? అది ధర్మబద్దమా?

మరి ప్రాయోపవేశం సంగతో? ప్రాయోపవేశం ఆత్మహత్య కాదా? మహాభారతంలో దుర్యొధనుడు అవమాన భారాన్ని భరించలేక ప్రాయోపవేశం సంకల్పిస్తాడు. అది ఆనాటి ప్రాజ్ఞులకు సమ్మతమే. అయితే శకుని తనమాయటలలో ఆ ప్రయత్నాన్ని విరంపింపజేస్తాడన్నది వేరే విషయం. అవమానభారం భరించలేక దుర్యోధనుడు ప్రాయోపవేశం సంకల్పించాడు, అవమానభారం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది. అవమానభారం భరించలేక ఆత్మహత్య.. సమ్మతమా? ప్రాయోపవేశానికి ఎన్నో నియమాలూ, పద్దతులూ. ఫలానా కారణాలు ప్రాయోపవేశానికి (ఆత్మహత్యకు) అంగీకరానీయం మిగతావి కాదు అన్న వాదన నాకు నచ్చదు. ఒక కారణం అంగీకరయోగ్యం అయితే వేరే కారణం కూడా అంగీకారయోగ్యం కావాలి. ఎవరి కారణం వారిది. అయితే, ప్రాయోపవేశంలో నాకు నచ్చిన విషయం, ప్రాయోపవేశి ఒక్క క్షణంలో చనిపోకుండా, కొంత కాలంపాటు ప్రాయోపవేశం చేసి మరణిస్తాడు. ఈ కాలంలో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం లభిస్తుంది, తను ఈ జీవితంలో పూర్తిచేయక మిగిలిపోయిన పనులు పూర్తిచేయడానికి సమయం లభిస్తుంది. అదీకాక తన వాళ్ళందరికి, సమాజానికి ఇతని చావు గురించి మానసికంగా సంసిద్ధమవడానికి అవకాశం లభిస్తుంది. తను నిజంగా  మరణించిన్నాడు అది వాళ్ళను అంతగా విభ్రాంతికి గురిచేయదు తెలిసిన విషమే కనుక.

ఎంత విశ్లేషించినా ఆత్మహత్య తప్పే. అంతే అంటారు అందరు. ఎవరికి తప్పు? చేసుకునే వాళ్ళకా, చూసే వాళ్ళకా? చేసుకునే వాళ్ళకు మాత్రం తప్పు అనిపించదు, చూసేవాళ్ళకు తప్పు అనిపించొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవాడికి నువ్వు చేసేపని తప్పు అని చెప్పడం తప్పా అంటే, నేను ముమ్మాటికి తప్పే అంటాను. ఆత్మహత్యా ప్రయత్నం మానిపించే ప్రయత్నం తప్పు కాదు, అది అభినందనీయం కానీ. వాళ్ళతో నువ్వు చేస్తున్నది తప్పు అని వాదించడం తప్పు. ఈ భూప్రపంచంలో ఎవరితో అయినా, ఏ విషయంలోఅయినా నువ్వు చేస్తున్నది తప్పు అని చర్చ ప్రారంభిస్తే ఎవరూ మీ మాటను వినరు, మీ అభిప్రాయాన్ని పట్టించుకోరు. ముందు మీరు వాళ్ళును అర్ధం చేసొండి. వాళ్ళు ఆ మానసిక పరిస్తితుల్లో తీసుకున్న నిర్ణయం సరైనది అని మీరు ముందుగా అంగీకరించడి. మిమ్మల్ని వాళ్ళ స్తానంలో ఉంచండి (put yourself in their shoes). మీరు వాళ్ళ స్తానంలో ఉంటే అంతకన్నా భయంకర నిర్ణయం తీసుకునేవాళ్ళేమో, ఎవరికి తెలుసు. ఈ నిజం అంగీకరించాక మాత్రమే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించండి. అనుక్షణం వాళ్ళ నిర్ణయం సరైనదే అని అంగీకరిస్తూ, వాళ్ళ మానసిక పరిస్తితి అర్ధం చేసుకొండి. అప్పుడు మీకు అర్ధమవుతుంది వాళ్ళను బాధించే పరిస్తితులు ఏంటో. అది సంఘానికి సంబంధించిందా, మిత్రులకు సంబంధించిదా, చుట్టూ ఉన్న పరిస్తితులకు సంబందించిందా? మీకు చేతనయితే వాటిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నించండి, అవి మారితే తను మారొచ్చు. ఓ మనిషి ఆత్మహత్యకు ప్రయత్నించాడంటే వాడికి జీవితం మీద ఆశలేదు. ఎందుకులేదో కనుక్కొండి, ఆశను చిగురింపజేయడానికి ప్రయత్నించండి. అంతే కానీ నువ్వు చేసేది తప్పు అని ఉపన్యాసలు దంచడమో, లేక ఎవరినో తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించడమో చేస్తే వాళ్ళకు విరక్తి ఇంకా పెరుగుతుంది.

ఇక ఆత్మహత్య చేసుకుందామనేవాళ్ళకు, మీ పరిస్తితులేంటో నాకు తెలియదు. అందుకే మీ నిర్ణయం తప్పు అని అనను. ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఏ నిర్ణయమైన తీసుకోవడానికి సంపూర్ణ స్వేచ్చ ఉండాలని నమ్మేవాన్ని నేను, అందుకే మీ నిర్ణయాన్ని తప్పు అనను. కానీ ఒక్కటి ఆలోచించండి, మీ నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నదా? ఈ ప్రపంచంలో ఏదీ ఎల్లకాలం ఉండదు కొన్నాళ్ళ తరువాత ఏదైన వెళ్ళిపోతుంది, పరిస్తితులు పూర్తిగా మారిపోతాయి. మిమ్మల్ని బాధ పెడుతున్న విషయానికి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కావలసిన సమయం ఇచ్చారా? లేదంటే సమయం ఇచ్చి చూడండి. అన్ని చేసిన తరువాత కూడా మీరు చనిపోవాలనే నిర్ణయించుకున్నారా? అయితే మీరు మీ నిర్ణయాన్ని ఒక ఆరునెలలు వాయిదా వేసుకొండి. ఓ నెల పాటు పునర్విమర్శ చేసుకొండి. అయినా మీ నిర్ణయం మారకుంటే ప్రాయోపవేశంలో నాకు నచ్చిన ఒక్క విషయాన్ని పాటించండి. అందరికి నేను పోతున్నా అని ఓ అయిదు నెలలు చెప్పండి. దానితో చుట్టూ ఉన్న అందరికి మానసికంగా సంసిద్దమవడానికి అవకాశం లభిస్తుంది. మీరు పూర్తి చెయ్యాల్సిన పనులేమైన ఉంటే పూర్తిచెయ్యండి ఆ తరువాత మీ నిర్ణయం మీది. ఈ ఆరు నెలల తరువాత మీకు మీరు చేయాలనుకున్న పని సరైనదే అనిపిస్తే మీ ఇష్టం. దానికి అవును కాదు అని చెప్పడానికి ఎవరు అర్హులు కారు.

పుట్టుక అనేది దేనికి మొదలు కాదు, చావు అనేది దేనికి అంతం కాదు. చావు పుట్టుకలు సంసార చక్రం (జనన మరణ చక్రం)లో  ఊచల్లాంటివి మాత్రమే.


గమనిక: ఇది చదివాక మీకు ‘వీడు ఆత్మహత్యను సమర్ధిస్తున్నాడ’ని మీకు అనిపించొచ్చు. నేను ముందే చెప్పా, "వారిస్తానంలోకెళ్ళి ఆలోచించడి (పుత్ యౌర్సెల్ఫ్ ఇన్ థైర్ షోస్). నన్ను నేను వారిస్తానంలో ఉంచి రాయడానికి ప్రయత్నిస్తున్నా". నేను మాత్రం ఆత్మహత్యను సమర్ధించను అలాగే వ్యతిరేకించను కూడా.

Thursday, January 15, 2015

వీడుకోలు నేస్తమా

ఈ జీవన ప్రయాణంలో ప్రతి కలయిక విడిపోవడానికి నాంది - అని చెప్పారు ఎవరో మహానుభావులు. అలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆచరణ? ఆచరించడం సాధ్యమా? చాలా వరకు పరిచయాల్లో కలవడం, విడిపోవడం, మధనపడటం, మరచిపోవడం సాధారణం. కానీ, నిన్ను? నిన్ను మరచిపోవడం సాధ్యమా? ఏ నాటికైన నేను నిన్ను మరచిపోగలనా? నా వళ్ళ కావడం లేదు. మనం ఎవరికి వారై వేరైపోయి విడిపోవడాన్ని నువ్వు తీసుకున్నంత సమభావనతో నేను తీసుకోలేకపోతున్నా. నీ అంత స్తిమితంగా నేను ఉండలేకపోతున్నా. నిజం ఇదే అని తెలుసు, ఇకనుండి ఈ నిజంలోనే జీనించాలని తెలుసు, కానీ అంగీకరించలేకపోతున్నా. తెలిసిన నిజాన్ని అంగీకరించలేక, కోరుకున్న కల అందక, నా మనసులో నాతోనేనే పోరాడుతూ, అది బయటివారికి కనిపించకుండా లేని నవ్వుని పెదాలపై పూసుకుని నన్ను నేను మోసం చేసుకుంటూ, చుట్టూ ఉన్న వాళ్ళను మోసం చేస్తూ రోజులీడుస్తున్నా.

నీతో గడిపిన ఆ రోజులు నా జీవితంలోనే అందమైన క్షణాలు. ఒక్కో క్షణం మాటల్లో చెప్పలేని ఎంతో తీయని అనుభూతి. నీతో కలిసిగడిపినంత ఆనందంగా ఈ జీవితంలో మరేనాడూ లేనేమో. అదో కలలా గడిచిపోయింది. ఒక్కోసారి అది అసలు నిజమేనా లేక కలా? అన్న అనుమానం కూడా కలుగుతునంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది, కల కరిగిపోయింది. అది మిగిల్చిన జ్ఞాపకాలు, ఆ జ్ఞపకాలు కలిగించే బాధ ఇవే ఈ జీవితానికి నాకు మిగిలిపోయాయి.

మనిద్దరం ఉత్తర దక్షిణ ద్రువాలం, ఇద్దరి భావాలు భావనలువేరు. వెయ్యిలో తొమ్మిదొందల తొంబయితొమ్మిది విషయాల్లో మనం విరుద్ధంగా ఆలోచిస్తాం. అది మనకు మొదటినుండే తెలుసు. మన స్నేహం మొదలయ్యిందే వాదనతో. ఆనాటి ఆ వాదనే లేకుంటే ఆ పరిచయం పరిచయంగానే మిగిలిపోయేదేమో, స్నేహంగా మారేది కాదేమో. పరిచయం కొత్తలో మనల్ని కలిపిన ఆ వాదనే కాలక్రమంగా మన మధ్య ఎడం పెంచింది. ఏ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయ బేధాలు ఉండటం, వాటివళ్ళ వాధనలు రావడం సహజం. ఓ బంధం ఎంత గట్టిగా ఉన్నది అనేది గొడవలు రాకుండా ఉండటాన్ని బట్టి కాదు, గొడవలు వచ్చిన ఎంత బలంగా ఉంది అన్నదాని మీద ఆధరపడి ఉంటుంది అని ఇద్దరికి తెలుసు. కానీ అది మనల్ని కలిపి ఉంచలేకపోయింది. ఓ గొడవ అయిపోయిన తరువాత ఆ వాదనను ఆ ఆవేశాన్ని అక్కడే వదిలి ముందుకు వెళ్ళాలి. కానీ, నీకు అదే కావాలి. ఆ విషయంలో అయిన గొడవే కావాలి ఎన్నాళ్ళయినా సరె అది నీ మనసులో అలాగే నిలిచిపోయింది. అక్కడే మొదలయ్యింది, అది మెల్లిమెల్లిగా చిలికి చిలికి గాలివానలా మన బంధాన్ని తెంచేంతగా.

ఆ రోజులు ఆ జ్ఞాపకాలు ఎంత తీయగా ఉన్నా ఈనాటి అవి గతం తిరిగి రావు. మనం వేరువేరు అన్నది ఈనాటి నిజం. ఆ నిజాన్ని ఎలా అంగీకరించేది. నిన్ను మరచి ఎలా జీవన యాత్ర కొనసాగించేది? నిన్ను మరచిపోవడం, నీ జ్ఞాపకాలు రాకపోవడం నాకు సాధ్యమా? మనం దూరమైన ఇన్ని రోజుల్లో నువ్వు గుర్తు రాని ఒక్క క్షణం కూడా లేదు అలాంటిది నిన్ను మరచిపోయే రోజొకటి వస్తుందా? పొద్దున మెలకువ రాగానే గుర్తొస్తావు, నిద్రపోయేముందు గుర్తొస్తావు, FMరేడియో వింటే గుర్తొస్తావు, అందులో 'ఏం సందేహంలేదు' పాట వస్తే మరీ గుర్తొస్తావు, ఒంటరిగా ఉంటే గుర్తొస్తావు, సాయంత్రం ఒంటరిగా అలా ORRమీద వాహ్యాళికి వెళితే గుర్తొస్తావు, ఫొన్ రింగ్ అయితే గుర్తొస్తావు, ఫొన్ రింగ్ అవకపోతే ఎందుకవ్వట్లేదు అని నువ్వే గుర్తొస్తావు, మెసేజ్ వస్తే గుర్తొస్తావు, మెసేజ్ రాకపోతే ఎందుకు రావట్లేదు అని నువ్వే గుర్తొస్తావు, అలసిపోతే గుర్తొస్తావు, ఉత్సాహంగా ఉంటే గుర్తొస్తావు, ఎవరితో అయినా మాట్లాడాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏదైనా చెప్పాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏది చెప్పకుండా మౌనంగా కూర్చోవాలన్నా నువ్వే గుర్తొస్తావు, ఏది చేసినా నువ్వే గుర్తొస్తావు, ఏది చేయకపోయినా నువ్వే గుర్తొస్తావు.. ఇంతగా గుర్తొచ్చే నిన్ను ఎలా మరచిపోగలను? నా వళ్ళ కాదు. తాగితే మరచిపోతారు అంటారు కదా, ఒక్కోసారి తాగితేనో అనిపిస్తుంది. నిన్ను మరచిపోతే గానీ నాకు మానసిక ప్రశాంతత రాదు, నాకు మానసిక ప్రశాంతత వస్తేగానీ నేను నిన్ను మరచిపోలేను.

ఇలా రాస్తూ ఉంటే, మనసులో నీ జ్ఞాపకాలు కదలాడుతూ ఉంటే ఇంకొక్క వాక్యం కూడా ముందుకు కదలలేకున్నా.  తుఫాను ముందు నిశ్శబ్ధలా ఉన్న నా భావవేశ సముద్రంలో నీ జ్ఞాపకాల అలలు అలజడి కలిగిస్తే ఆ భావాలు పొంగి కళ్ళల్లోంచి జారేలా ఉన్నాయి. అలా జరగకుండా వాటిని అక్కడే ఆపాలి ఎందుకంటే మగవాళ్ళు ఏడవకూడదు. వాళ్ళు మనుషులు కారు, వాళ్ళకు మనసు ఉండదు, ఆ మనసుకు బాధ కలుగదు, కలిగినా కన్నీళ్ళు రావు. అది సమాజం గీసిన గీత. దాన్ని దాటకూడదు. వాటిని అక్కడే ఆపాలి.

ఇక ఉంటా మరి.

నీ విఘ్ని

Tuesday, October 28, 2014

పోస్ట్ చేయని ఉత్తరాలు -5

నువ్వు హాయిగా, ప్రశాంతంగా పడుకున్నావు. రోజంతా అలసిపోయి నిద్రాదేవి ఒడిలో చేరి సేద తీరుతూ తీయగా కలలు కంటున్నావు. నువ్వు నిద్రపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు నిద్ర రావడంలేదు. మనసంతా అల్లకల్లోలంగా, చికాకుగా ఉంది. ఏవేవో ఆలోచనలు, ఎవరికి చెప్పలేను, చెప్పుకోవడానికి నువ్వు లేవు. నువ్వు లేక నిదుర రాక నిమిషమైన మనసు నిలకడగా ఉండటం లేదు. ఈ రోజంతా నువ్వు నాతో మాట్లాడలేదు తెలుసా. నువ్వు మాట్లాడకుంటే నేను నాలా ఉండను అని నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు మాట్లాడలేదు. నీకు నామీద కోపమో లేక అసహ్యమో తెలీదు. కానీ మాట్లాడలేదు అన్న విషయం మాత్రం తెలుసు. రోజంతా ఏదో చిన్న ఆశ రోజుమొత్తంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడకపోతావా అని. కానీ, ఆ ఆశ అడియాసే అయిపోయింది. ఈ రోజు అయిపోయింది, నువ్వు మాట్లాడనేలేదు.

అయినా నాకు కదా నీ మీద కోపమొచ్చింది. నేను కదా అలగాల్సింది. మరి నువ్వే నా మీద అలిగి మాట్లాడలేదు ఏమిటి? ఇదేమి న్యాయం? నేను అలగాల్సినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద అలుగుతావా? నాకు కోపమొచ్చినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద కోపం చూపిస్తావా? ఇదెక్కడి న్యాయం? అయినా నాకు నీ మీద కోపరావడం తప్పా? కోపం తెచ్చుకునే హక్కు నాకు లేదా? నువ్వు చేసిన పనికి నాకు బాధ కలగడం తప్పా? అందుకు నాకు కోపం రావడం తప్పా? కాదు కదా. మరి నాకెందుకీ శిక్ష? సరె, నీకు కోపం వచ్చిందే అనుకో, వస్తే? మాట్లాడకూడదా? మాట్లాడటం మానెయ్యాలా? కోపం వచ్చినా మాట్లాడొచ్చు కదా? మామూలుగా మాట్లాడటం ఇష్టంలేకపోతే తిట్టొచ్చుకదా? అవేవీ చేయకుండా, రోజంతా మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలి? నేనేమైపోతానో అని ఒక్క క్షణమైనా అలోచించావా?

నువ్వెప్పుడూ అంటుంటావు, "విఘ్నీ, నేనులేకుండా నువ్వు ఉండగలవు కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను" అని. కానీ నిజమేంటో తెలుసా? నాతో మాట్లాడకుండా నువ్వు హాయిగా ఉన్నావు, కానీ నీ కనుచూపైనా లేక నేను సతమతమవుతున్నా. మనసంతా ఏదో వెలితి, చుట్టూ అన్నీ ఎప్పటిలాగే ఉన్నా అంతా గందరగోళం. నాకు నేనుగా పరిపూర్ణం కాదు, నువ్వు లేకుంటే నేను శూన్యమే అని మళ్ళీ తెలిసింది. ఈ క్షణం నువ్వు నిద్రలేచి మాట్లాడితే ఎంత బాగుండు అన్న తపన, నిన్ను నిద్రలేపి మాట్లాడాలన్న ఆరాటం. అన్నీ నాకే. నీకేం నువ్వు చక్కగా బజ్జున్నావు. నేను, నా తలపులు, నా ఆలోచనలు, నా ఊహలు చేసుకోలేని సుదూర లోకాల్లో ఆనందంగా విహరిస్తున్నావు. కానీ ఇక్కడ నేను, నువ్వు ఎప్పుడెప్పుడు నిద్రలేచి నాతో మాట్లాడతావా అని నిద్రలేకుండా ఎదురు చూస్తూ ఉన్నా.

అదిగో, ఉషోదయ సమయం అయ్యింది. నాలో చిగురాశ ఉదయిస్తుంది. నా మీద ఉన్న కోపాన్నంతా ఓ కలలా మరచిపోయి మళ్ళీ నా మీద నీ ప్రేమ కురిపిస్తావని ఆశ. ఉదయ భానుడి లేత కిరణాల్లాంటి వెచ్చని ప్రేమనే నాపై కురిపిస్తావో లేక ప్రచంఢ భానుడి భగభగల్లాంటి నీ కోపంలో నన్ను దహించివేస్తావో చూడాలి మరి.


నీకిదే నా సుప్రభాత లేఖ..

Sunday, October 26, 2014

చినుకులు

ఈశాన్య ఋతుపవనాల వళ్ళ అనుకుంటా పొద్దున్నుండీ జల్లు కురుస్తూ ఉంది. ఈ ముసురు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. వరండాలో నిల్చుని చెయ్యి చాచి చూస్తే సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈ చినుకులు నన్ను ఏమి చేస్తాయి అనుకుని అలా నడుద్దామని బయలుదేరితే చల్లగా పలకరించింది వాన చినుకు. అది మీద పడగానే ఝల్లు మంది, అయినా హాయిగానే ఉంది. అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నా, నా ఆలోచనలు మాత్రం నీ చుట్టే. నీ ఆలోచనల్లో నేను మునిగిపోయుంటే, చినుకు చినుకుగా ముంచేస్తుంది నన్ను ఈ వాన. పడేది ఒక్కో చినుకే కానీ నాకు తెలియకుండానే మెల్లమెల్లగా తడిసిపోతున్నా. ఈ వానకూడా నీలాగే మెల్లమెల్లగా నాకే తెలీకుండానే నన్ను తడిపేస్తుంది.

నీ ప్రేమకూడా ఒక్కో చినుకుగా నన్ను తడిపేసింది. అందులో నేను తడుస్తున్నా అన్నవిషయం నాకు అర్ధమయ్యే నాటికి అందులో పూర్తిగా మునిగిపోయా. ఎప్పుడు మొదలయ్యిందో తెలీదు కానీ మొదట్లో నీ నవ్వు కోసం ఎంతగానో ఎదురు చూసేవాన్ని. అంతగా ఎదురుచూస్తే దొరికే నీ నవ్వు ఒకేఒక్కక్షణం.  ఆ ఒక్క క్షణం నవ్వుకోసం ఎంతగా ఎదురు చూసేవాన్నో నీకేం తెలుసు. ఎన్ని గంటలు ఎదురుచూసినా కానీ, నీ చిరుమందహాసాన్ని చూసిన ఆక్షణం ఎదురుచూపు చాలా తక్కువనిపించేది. నీ నవ్వు నీ పెదవులపైనే కాదు, నీ కళ్ళల్లొ కూడా అందంగా కనిపిస్తుంది. నీ మనసులో ఉన్న ప్రశాంతత మొత్తం నీ నవ్వులో కనిపిస్తుంది. ఆ ప్రశాంతత నాకు చాలా హాయిగా అనిపించేది. నీ కళ్ళల్లో నాపై నింపుకున్న అభిమానం, నువు చెప్పకున్నా నీ కళ్ళు చెప్పేవి. నీ కళ్ళు చెప్పే ఆ అభిమానం నిజమో అబద్దమో తెలీదు కానీ అది నిజమని అనుకోవడమే నాకు తృప్తిగా ఉండేది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు ఓ పెద్ద మాయావివి. నీ కంటి చూపులోనే ఏదో తెలీని మాయుంది. నీ నవ్వు, అమ్మో! అది మరీ పెద్ద మాయ. ఆ మాయ నన్ను నీ వైపు లాగేస్తుందని నాకు తెలియనే లెదు.

నీ నవ్వుకోసం నా ఎదురు చూపు, నీకోసం ఎదురుచూపుగా ఎప్పుడు మారిందో నాకు తెలీనేలేదు. నువ్వు నా కళ్ళ ఎదురుగా ఉండాలి, నీతో మాట్లాడాలి.  ఎంత ఎక్కువసేపు కుదిరితే అంత ఎక్కువసేపు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అని అడగకు, నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఏదో మాట్లాడాలి. నాలో ఈ మార్పు వస్తున్న క్షణం మాత్రం నాకు అర్ధమయ్యింది నాలో ఏదో మార్పు వస్తుందన్న విషయం. నేను నీకోసం ఎదురు చూస్తున్నా అన్న విషయం, నీతో మాట్లాడాలని తపన పడుతున్నా అన్న విషయం. నీకీ మార్పు అవసరమా అని నన్ను మెత్తగా మందలించింది నా బుద్ది, కానీ మనసు మాత్రం నాకిది చాలా బాగుంది నాకిదే కావాలి అని నిక్కచ్చిగా చెప్పింది. అయినా బుద్ది మాట వినడానికి నేనేమన్నా మహా యోగినా? అందుకే, మనసుదే పైచేయి అయ్యింది. అప్పటినుండి నీకోసం ఎదురు చూడటం, నీతో మాట్లాడటం, నీతో చాట్ చెయ్యడం నా రోజూ వారి దినచర్యలో అతి ముఖ్య భాగాలు అయిపోయాయి. ఎంతగా అంటే, అవి లేకుంటే ఆ రోజు రోజులా ఉండనంతగా, అవి లేకుంటే నేను నాలా ఉండనంతగా, నిదుర లేచినప్పటి నుండి, పడుకునేంత వరకు నువ్వుతప్ప వేరే ధ్యాస లేనంతగా. అదిగో, అప్పుడు తెలిసింది మెల్లమెల్లగా నీ ప్రేమ చినుకుల్లో నేను తడిసిపోయా అని.


ఈ చినుకులు నన్ను పూర్తిగా తడిపేసాయి. జుట్టులోంచి చుక్క చుక్కలుగా నీళ్ళు కారుతున్నాయి. చొక్కా మొత్తం తడిసిపోయింది. రోడ్డు మీద కనుచూపుమేరలో ఎవరూ లేరు. చలికి శరీరం సన్నగా వణికిపోతుంది. ఇంక వెనక్కి వెళ్ళాలి తప్పదు. ఈ వాన చినుకులకన్నా నీ ప్రేమ చినుకులే ఎంతో బాగున్నాయి. ఇప్పుడు నీ మాటల చినుకులు దొరకవేమో కానీ నీ జ్ఞాపకాల చినుకులనుండీ నన్నెవ్వరూ దూరం చేయలేదు. ఇంటికెళ్ళి వాటిలో తడుస్తా.

Thursday, September 4, 2014

నిదురించవే నా చెలి

నా హృదయంలో నిదురించే చెలి, కలల్లో కాక కళ్ళేదురుగా నిదురిస్తే? ఆ రోజు ఒకటొస్తుందని అది ఏదో ఓ మాయలోకి తీసుకెళ్తుందని నేనేనాడూ అనుకోలేదు. అనుకోని అదృష్టం వరమై కళ్ళముందు నిలిస్తే? గలగలా మాట్లాడుతూ, అందంగా నవ్వుతూ, కళ్ళతోనే కవ్విస్తూ, చిరుకోపం నటిస్తూ, మూతిముడుస్తూ, ప్రేమ ఒలికిస్తూ…. మాట్లాడుతూ, పోట్లాడుతూ.. ఆ మాటల్లోనే మెల్లిగా నువ్వు నిద్రలోకి జారుకున్న ఆక్షణం... కళ్ళెదురుగా ప్రియురాలు నిద్రిస్తూ ఉంటే ప్రేమికుడి మనసులో కలిగే మధురానుభూతి నాకు మొట్టమొదటిసారి తెలిసింది. కళ్ళు మూసుకుని అందంగా, అమాయకంగా, చిట్టి పాపలా కనిపించే నీ నగుమోము తదేకంగా చూస్తూ రెప్పవేయడం కూడా మరచిపోయా నేను. రెప్పవేస్తే ఆ రెప్ప పాటు కాలంలో ఎంత అందాన్ని, ఆనందాన్ని కోల్పోతానో అని రెప్పవేయనివ్వలేదు నా మనసు.  నిదురలో కూడా నీ పెదాలపై ఏమాత్రం చెరిగిపోని చిరునవ్వు.. నగుమోము అంటే ఏమిటి అని అడిగేవాళ్ళకు ఇదిగో ఇదే అని చూపించాలనుంది. ఆ నగుమోము ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. తీరుతుందన్న ఊహ కూడా లేదు.

నువ్వు మెలకువగా ఉన్నప్పుడు నిన్నే చూస్తే ‘ఏయ్ అలా చూడకు’ అని తల తిప్పుకుంటావు. కానీ ఇప్పుడు నేను ఇలా ఎంతసేపైనా చూసెయ్యొచ్చు. నీకు తెలీదుగా! తెలిసాక కొట్టవుగా? కాలం ఇక్కడే ఇలాగే ఆగిపోతే జీవితమంతా నిన్ను ఇలాగే చూస్తూ గడిపేయాలనుంది. కానీ.. పక్షుల కిలకిలలలాంటి నీ గలగలల మాటలు, నీ తిట్లు, నీ కోపాలు తాపాలు, ప్రేమ ఇవ్వన్నీ లేకుండా నేను ఉండగలనా? కుదరదు. నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ మైమరచిపోయే ఆ క్షణాలు లేకుండా నేను ఉండగలనా? ఊహూ. ఉండలేను. అంటే నువ్వు మెలకువలో కూడా ఉండాలి మరి. ఏంటో నా మనసులో ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలు. అదంతా మీ మాయే. ఆ మాయతో నిండిన మనసుతో నున్ను చూస్తుంటే, ఈ ఆనందం మరింతా అనందంగా ఉంది. అలా చూస్తున్న నాకు ఈ అందమైన క్షణాన్ని ఫొటోలో బంధించాలనిపించింది, కానీ దానికి నా మనసు ఒద్దంది.. నీ అందమైన ఈ రూపాన్ని తనలో బంధిచుకున్నా అంది.. ఎప్పుడు ఎక్కడ చూడాలనుకున్నా తనలో ఈ ప్రతిమ ఉండగా ఫొటో ఎందుకు అంది. ఇక మనసు మాట వినక తప్పలేదు.

నిన్నలా చూస్తున్న నా మనసు ‘నిదురించే ప్రియురాలి పెదాలపై ముద్దు దొంగిలిస్తేనో? అంతకన్నా అందమైన దొంగతనం ఉంటుందా’ అని నన్ను ప్రేరేపించింది. ఆ మనసు మాట వినాలనే ఉంది కానీ ఆ ముద్దు నీకు నిద్రా భంగం కలిగిస్తుందేమో అని మిన్నకుండిపోయా. గట్టిగా శ్వాసిస్తే ఆ శబ్ధానికి నీ నిదుర చెదిరిపోతుందేమో అని దాదాపు ఊపిరి పీల్చడమే మానేసా. నా వైపు తిరిగి నాతో మాట్లాడుతూ కుడిచేతిపై పడుకుని నిద్రలోకి జారుకున్నావు నీవు. ఇప్పుడు నిద్రలో ఉన్నా నువ్వు నన్నే చూస్తున్నట్టుగా ఉంది నాకు. నా వైపు చూస్తూ మూసిన ఆ కనురెప్పలు, తెరిచిన మరుక్షణం నువ్వే కనిపించాలి అన్నట్టుగా ఉన్నాయి. కళ్ళకు కాటుకందము అంటారు కానీ కాటుక పెట్టకున్నా కాటుక కళ్ళ సోయగం నీ కళ్ళది. నిద్రలో నీవు ఇంత అందంగా ఉంటావని నాకు తెలీదు. ముగ్ధ మనొహరానికి ప్రతిరూపమైన నీ మోము, సన్నగా వీస్తున్న ఏసీ గాలి ఆ గాలికి మెల్లగా కదులుతున్న నీ కురులు, నువ్వు శ్వాసిస్తుంటే లయబద్దంగా పైకి కిందికి కదులుతున్న నీ చేయి, రేకులు ముడుచుకున్న మొగ్గలాంటి నీ కళ్ళు. ఇలా నీలోని ప్రతి అందాన్ని ఎంతగా చూసినా ఇంకా ఇంకా చూడాలనే ఉంది. నీలోని ఓ అందాన్ని చూస్తే ఇంకో అందాన్ని చూడలేకున్నా. నీ అందాన్ని అంతా తనివితీరా చూడటానికి నా రెండుకళ్ళు చాలడంలేదు. ఇంత అందమైన నా ప్రియురాలు నిద్రిస్తున్న ఈ గదిలో ఏసీ గాలా?  ఊహూ వద్దు, సహజ సిద్దమైన చల్లని పైరగాలితో, పూల గుమగుమలతో నింపమని ప్రకృతిని అడుగుదామని కిటికీ వైపు చూస్తే అందులోంచి దొంగ చంద్రుడు నిన్ను చూడాలని తన వెన్నెల కిరణాలతో నిన్ను తాకాలని పరితపిస్తున్నాడు. ఆ దొంగ నిన్ను తాకకుండా కిటికీ తలుపులు మూయాలని ఎంతగా అనిపించినా మూయలేని అశక్తత నాది. అదిగో, అంతలో నీలో చిన్న ఉలికిపాటు, ఆ ఉలికిపాటుకి ఎక్కడ నీ నిద్ర చెదురుతుందో అని కలత చెందింది నా మనసు. కానీ ఆనందకరమైన విషయం ఏంటంటే నీ నిదుర చెదరలేదు. వెళ్ళకిలా తిరిగి, కుడిచేయి మడిచి తలపక్కన పెట్టుకుని పడుకున్నావు. ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సంపూర్ణంగా కనిపిస్తుంది చంద్ర బింభంలాంటి నీ మోము. ఇప్పుడు రమ్మను ఆ చందమామను. ఎందుకొస్తాడు? రాడు. నీ అందం ముందు తను దిగదుడుపని అవమాన పడలేక వెళ్ళి మెఘాలవెనక దాక్కున్నాడు. ఓ అందమైన పువ్వుని ఎటునుండి చూసినా అందంగానే ఉంటుంది. నీ అందాన్ని చూస్తుంటే నాకు ‘సొగసు చూడ తరమా నీ సొగసు చూడతరమా’ అని పాడాలనిపించింది. కానీ పాడితే.. అమ్మో! నీకు నిద్రా భంగమైపోదూ..

అలసి సొలసి నిదురించే నా చెలి అలసట తీర్చడానికి అందమైన కలగా మారి తన కన్నుల్లో చేరాలనుంది. ఆ కలలో అలసిన చెలి మనసుకు నే ఊరటనవ్వాలనుంది. గువ్వల్లా రెక్కలు కట్టుకుని ఊహాలోకాలకు ఎగిరిపోవాలనుంది. ఈ రేయి గడిచి తెలవారితే, ఉషోదయవేళలో చిరునవ్వుతో నీకు సుప్రభాతం పాడాలని ఎదురు చూస్తోంది నా మది. అందాకా నిదురించవే నా చెలి.

Friday, April 18, 2014

పోస్ట్ చేయని ఉత్తరాలు -4

రెండే రెండు నిమిషాల క్రితం ఎంతో ఆనందంగా ఉన్న నాకు ఇప్పుడు చాలా దిగులుగా ఉంది. అది ఎందుకో నీకు తెలుసు, నా ఆనందానికైనా బాధకైనా కారణం నువ్వే అని నీకు తెలుసులే. నా ఆనందమే నువ్వైనప్పుడు నువ్వులేని నాకు ఆనందం ఎలా ఉంటుంది? సమయం అంతలొనే ఎంతలా మారిపోయింది. సాయంత్రం నీతో కలిసి కాఫీడేలో కాఫీ తాగినప్పుడు, ఆ తరువాత నీతో కలిసి డిన్నర్ చేసినప్పుడు, పావు గంట క్రితం నీతో కలిసి ఐస్‌క్రీం తిన్నప్పుడు నీ తోడులో, నీ మాటల లాలనలో, నీ చూపుల జల్లులలో మైమరచి ఆనంద తీరాల్లో విహరించిన నా మనసు ఇప్పుడు ఒంటరిదైపోయింది.

నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి మరీ బస్ ఎక్కించా. అదిగో, నిన్ను తీసుకుని ఆ బస్ వెళ్ళిపోతుంది. దాన్ని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. నిన్ను నాకు దూరం చేస్తున్నందుకు దాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోతున్నావ్.. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నావ్. నువ్వు వెళ్ళిపోతే హైదరాబాద్ నిన్ను మిస్ అవదు, కాఫీడే నిన్ను మిస్ అవదు, ఐస్క్రీం పార్లర్ మిస్ అవదు.. కానీ నేను నిన్ను మిస్ అవుతా, చాలా మిస్ అవుతా… నా మనసులో తీరని వెలితి.. నువ్వు తప్ప మరేది గానీ, మరెవ్వరు గానీ పూడ్చలేని వెలితి.. అది నీకు అర్థం కావడంలేదా? అర్థం అయితే నువ్వు బస్ దిగి రావెందుకు? మొన్న అదేదో సినిమాలో చూసా హీరో మనసులోని బాధ అర్థమయిన హీరోయిన్ విమానంలోంచి దిగి మరీ వస్తుంది. కానీ నువ్వు బస్‌లోంచి కూడా రావడంలేదు ఎందుకు?

నీకు తెలుసు. నువ్వు తప్ప నాకు మరోలోకం లేదు అని నీకు తెలుసు. నువ్వు లేకుండా నేను క్షణం కూడా ఉండలేను అని నీకు తెలుసు. నాలాగే నువ్వుకూడా బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ తప్పదు వెళ్ళాలి. తప్పదు. మనకీ క్షణం ఎడబాటు, విరహం తప్పదు. జీవితంలో ఎన్నో బంధాలు బాధ్యతలు, వాటికోసం తప్పదు. అసలు ప్రపంచంలో మనిద్దరం తప్ప బంధాలు, బాధ్యతలు లేకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎప్పుడైన నాకు దేవుడు కనిపిస్తే అడుగుతా నువ్వు నేను తప్ప మరేవ్వరూ లేని లోకం సృష్టించమని. అక్కడ ప్రతి నిమిషం నువ్వు నాతోనే, నువ్వు నాకు దూరమయ్యే క్షణమే కాదు, దూరమవుతావనే ఊహ కూడా కూడా ఉండదు. ఊహ కూడా చాలా బాధగా ఉంటుంది తెలుసా.

నువ్వు రెండు రోజుల్లో మళ్ళీ హైదరాబాద్లో ఉంటావని తెలుసు. ఎడబాటు కేవళం రెండేరోజులనీ తెలుసు. రెండురోజులు కూడా మొబైల్లో, వాట్స్ఆప్లో ఉంటావనీ తెలుసు. తెలిసీ బాధపడుతోంది నా మనసు. నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా మాట్లాడుకునేది మొబైల్, వాట్స్ఆప్ల్లోనే; నువ్వు ఊరు వెళ్ళిపోయినా అవి ఉంటాయి అనీ తెలుసు. కానీ ఏదో లోటు, మాటల్లో చెప్పలేని వెలితి. నువ్వు ఇప్పుడు ఊరిలో లేవు అన్న చిన్న భావనే నాకు చాలా దిగులుదా ఉంది. నువ్వు ఉన్నప్పుడు ఎంతో అందగా కనిపించే నగరం ఇప్పుడు బోసిపోయినట్టుంది. ఇంతసేపు చల్లగా ఆహ్లాదకరంగా వీచిన గాలి ఇప్పుడు వడగాలిలా తోస్తోంది. నువ్వు ఎప్పుడు ఇంటికెళ్ళినా నా పరిస్తితి ఇంతే.  ఇదేంటో నా పిచ్చి... అది నీ పిచ్చి.

కీ… కీ.. వాట్స్ఆప్ శబ్దం, అది నీ మెసేజే. అప్పుడే నువ్వు వెళ్ళి 300సెకన్లు దాటింది. నిన్ను తీసుకెళ్ళిన బస్ కనుమరుగయిపోయింది. ఇంక ఇక్కడ ఒక్కక్షణం ఉండాలని లేదు. ఇంతమందిలోనూ నెను ఒంటరిగా మిగిలిపోయా.. నీవులేనప్పుడు ఎవరుంటే ఎమి.. నా ఒంటరితనాన్ని దూరం చెయ్యగలరా?... ఇంటికెళ్ళి నీ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. నా ఈ పిచ్చి ఆలోచనలన్ని ఉత్తరంగా రాసి నువ్వు రాగానే నీకందిస్తా..

నీ రాకకొసం ఎదురుచూస్తూ..


నీ...

Saturday, January 4, 2014

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

కాల చక్రం మరో భ్రమణం పూర్తి చేసుకుంది, నూతన సంవత్సరం రానేవచ్చింది, అభినందనల సందడులు హడావిడులు సద్దుమనిగాయి, మళ్ళీ అంతా మామూలు అయిపోయింది, కొత్తసంవత్సరానికి అందరు అలవాటుపడిపోయారు. కానీ నవ వసంతానికి స్వాగతవాక్యం పలకాలన్న నా కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంక లాభంలేదు అని మనసు చెవి మెలివేసి, కూర్చోబెట్టి ఏదైనా చెప్పు నేను రాస్తా అంటే, ఎందుకో నా మనసు భావాన్ని పలకలేను అని మౌనంగా ఉండుపోయింది. పోయిన సంవత్సరం రాసినకొత్త సంవత్సరానికి స్వాగతం’ను చదివి చూడు, అప్పుడైనా ఏవైనా కొత్త తలపులు తలుపు తడుతాయేమో ప్రయత్నించు అంటే మళ్ళీ పాత భావాలే పలుకుతా అంటుంది.

ఏమైంది ఈ మనసుకివాళ? ఎందుకీ మౌనం? ఏమిటీ నిరాసక్తత? ఎప్పుడూ నాతో ఏదో ఒక కత చెప్పే ఈ మనసు ఇవ్వాళ నేను చెప్పమని అడిగినా స్పందిచదెందుకు. మనసు ఏమి ఆలోచిస్తుందా అని తొంగి చూస్తే.... ఏ సంవత్సర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. వచ్చేటప్పుడు ఆశపెడితే, వచ్చాక ఏడిపి స్తుంది. ఆశలన్నీ నిరాశలయితే, కలలన్నీ కల్లలయితే, పన్నీరుగా కనిపించినవన్నీ నిజానికి కన్నీరని తేలితే.. ఆ సంవత్సరమంతా బాధను దిగమిందుకుని మళ్ళీ కొత్తసంవత్సరానికి ఆశతో స్వాగతం పలకనా? ముందున్నది నిరాశే అని తెలిసి ఆశపడనా? ఆశపడి భంగపడనా?...  ఆలోచన రాగానే నైరాశ్యంతో laptop పక్కన పడేసి కళ్ళుమూసుకున్నా....

"క్లైబ్యం మాస్మగమః" ఎక్కడినుండో వినిపించింది కంఠం. ఎవరా అని చూస్తే ఎదురుగా శ్రీ కృష్ణ పరమాత్మ, భగవద్గీతలో నుండి చిరునవ్వు చిందిస్తూ కనిపిచాడు. చిరునవ్వు సకల దుఃఖాలను పారద్రోలే ఆనంద స్వరూపంతో శోభిస్తుంది. దివ్య మంగళ చరణాలకు మనసులోనే ప్రణమిల్లు వేళ,
స్వామి: క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే| క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప||
(ఈ శ్లొకం ఎక్కడో విన్నట్టు అనిపించి, బాగా ఆలోచించి)
 నేను: స్వామీ! శ్లోకం మీరు గీతలో అర్జునికి చెప్పారు కదా, మరి ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారు?
స్వామి: అనాడు అర్జునుడు కర్తవ్యాన్ని వీడి హృదయ దౌర్భల్యాన్ని పొందాడు. ఈనాడు నీవు భవిష్యత్తు అంటే భయంతో హృదయ దౌర్బల్యాన్ని పొందావు. పిరికి తనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యమును వీడి, కార్యోన్ముఖుడవు కమ్ము. తప్పక లక్ష్యాన్ని పొందుతావు.
నేను: కానీ స్వామీ! టెర్రరిస్ట్ బాంబు పేలుళ్ళు వాటిలో ఎంతో మంది అమాయకుల మరణం, రైలు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. ఇవ్వన్నీ ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. సంవత్సరం కూడా వింటాను చూస్తాను. అలా చనిపోతున్నవారిని గురించి ఆలోచనవస్తేనే మనసు వ్యాకులత చెందుతుంది.
స్వామి: గతాసూన గతాసూంశ్చ నానుసోచంతి పండితాః
వివేకం కలవారు చనిపోయిన వారిని గురించి కానీ, బ్రతికి ఉన్నవాళ్ళను గురించి కాని బాధపడరు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాన్తరప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతి||
మనుష్యునకు ఈ దేహమున బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొకదేహమును పొందుటకూడ అటువంటిదే. కావున ఈ విషయమై చింతించకుము.
జాతస్య హి ధృవో మృత్యుః - పుట్టినవానికి మరణము తప్పదు అని గ్రహించి శోకింపకుండుము.
నేను: సరే స్వామి! మీరు చెప్పారు కనుక ఆ విషయం వదిలేస్తా. ఒక నిమిషం నా విషయమే ఆలోచించుకుందాం. ప్రతిసంవత్సరం ఏదో చేయాలనుకోవడం, ప్రయత్నించడం, విఫలమవడం మళ్ళీ బాధపడటం. అవి పొందలేకపోతున్నా అన్న ఆలోచనతో, పొందలేనేమో అన్న బాధతో వాటికోసం ప్రయత్నించాలన్న ఇచ్చ కూడా కలగడం లేదు. దీనికి నీ సమాధానం ఏంటి స్వామీ?
స్వామి: ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే| సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే||
క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్బుద్ధినాశో, బుద్దినాశాత్ ప్రణశ్యతి||
నీవు నీ కోరికల గూర్చి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అందుకే సంకట స్తితి.
మనుష్యులు విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారో దానిపై వారికి అనురాగం కలుగుతుంది, అనురాగం కామముగా మారుతుంది. అవి నెరవేరనిచో క్రొధం కలుగుతుంది. క్రోధం వలన అవివేకం ఆవేశం కలిగి తనను తాను మరచిపోతాడు. అజ్ఞానంతో అవివేకంతో ప్రవర్తిస్తాడు.
కనుక నీవు కోరికల గురించి ఎక్కువగా ఆలోచించకు, నీవు చేయవలసిన పనులను కేవలం బాధ్యతగా నిర్వర్తించు.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ| తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి||
యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయ| సిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే||
నీవు ఫలితమునందు ఆసక్తిని వదలి యోగ భావనతో నీ పనులను నిర్వర్తించు. సుఖ, దుఃఖాలను జయాపజయాలను సమానంగా భావించి కేవలం కర్తవ్య నిర్వహన కోసం కార్యోన్ముఖుడవు కమ్ము. నీవు కోరుకున్న ఫలితం కలిగినా కలగకున్నా సమాన భావంతో స్వీకరించు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||.
నీ కర్తవ్యం ఉద్దేశించినటువంటి పనులను చేయడానికే నీకు అధికారం ఉంది. దాని ఫలితాన్ని నిర్దేశించే అధికారం నీకు లేదు. ఫలితం మీద అధికారం లేదు కదా అని కర్మలను చేయటం మానకు. నీవైపు నుండి నీ కర్తవ్యాన్ని ఫలాపేక్షరహితుడివై నిర్వర్తించు.
అయితే నీ కర్మకు ఫలితం రాదేమో అని నిరాశ చెందకు
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం
ఎవరెవరు ఏయే విధంగా నన్ను పూజిస్తున్నారో, ఎవరు ఎయేవిధంగా నిష్కామ కర్మ అనుసరిస్తున్నారో వారికి వారి వారి కర్మానుసారంగా ఫలితాన్ని ప్రసాదిస్తున్నాను.
నిష్కామ భావంతో ఫలితం గురించి ఎదురు చూడకుండా జయాపజయాలను సమాన భావంతో అంగీకరిస్తూ నీ కర్మలు ఆచరించు. దానికి తగిన ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను.
నేను: స్వామీ! కానీ ఇదంతా నేను ఆచరించగలనా? నా మనస్సు నిష్కామ కర్మను చేయగలదా? అది ఎప్పుడు ఫలితం గురించే ఆలోచిస్తుంది.
స్వామి: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్| అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే||
అవును మనసుని నిగ్రహించడం చాలా కష్టసాధ్యమైన విషయమే. కానీ నిరంతర ప్రయత్నంతొ అభ్యాసించడం వలన దానిపై నిగ్రహాన్ని సాధించవచ్చు.
నేను: (మనసులో - అవును నిరాశ చెంది ప్రయోజనం లేదు. నా వంతు కర్తవ్యాన్ని ఫలితం దక్కదేమో అని నిరాశ చెందక నూతనోత్సాహంతో చేయవలసిన నిర్వర్తిస్తా- అనుకుని; స్వామీతో) స్వామీ| రేపు నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుంటాను. నీకు కొబ్బరికాయ కొట్టనా, లేక పూజ చేయించనా?
స్వామి: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి| తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః||
డాంబికాలకు పోకు. నిర్మలమైన భక్తితో నీవు ఏది సమర్పించినా మిక్కిలి ప్రేమతో స్వీకరిస్తా. అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, మరేదైనా. భక్తిలేకుండా దాంబికంగా నీవు గుడికట్టించిననూ అది నన్ను చేరదు.
నేను: (మనసులో) - నిష్కామ భావంతో సకల కర్మలు నిర్వర్తించాలి అది పూజ అయినా సరే అని ఆలోచిస్తుండగా.. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ నిబోధత అని మేలుకొలుపు వింపించింది.

కఠోపనిషత్తు నుండి యమ ధర్మరాజు "ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్.." (లే, మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో.. Arise, awake, and stop not till the goal is reached) అంటూ కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాడు. అది విన్న నా మనసులో స్వామీ వివేకానంద చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. “దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు నాశనమైనట్టే. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికి మహా కారణం భయమే. మూఢనమ్మకాలన్నింటిలోకి పెద్దది భయమే మన దుఃఖాలన్నింటికి కారణం భయం. నిర్భయత్వం మనిషికి ఒక్కక్షణంలో ముక్తిని తెచ్చిపెట్టగలదు. కాబట్టి, ‘లేవండి! మేల్కొనండి! గమ్యాన్ని సాధించేవరకు ఆగకండి’” అన్న మాటలు.
ఎంత అందమైన పిలుపు, భయాన్ని వీడి కర్తవ్యాన్ని నిర్వర్తించమంటూ అలా ప్రయత్నించి మన భవిష్యత్తును మనల్నే నిర్మించుకొమ్మని. మూర్ఖులు, అజ్ఞానులు తమ శక్తిని నమ్మకుండా అదృష్టాన్ని, జాతకాన్ని నమ్ముతారు. మరి నేను కూడా ఆ మూర్ఖుళ్ళో ఒకన్నా? కాదు. అలా ఏనాటికి కానివ్వను. నేను నా శక్తితో నా భష్యత్తును రచించుకుంటా. ఏ జాతకానికి ఏ గ్రహానికి తలొంచని భవిష్యత్తును నిర్మించుకుంటా. గ్రహాల ప్రభావం ఉండొచ్చుగాక దాని ప్రభావాన్ని ఎదురించి నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి నాకు ఉంది.  నిరాశ, నిస్పృహలతో బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ముల్లోకాలను నా పాదాల చెంతకు చేర్చుకునే శక్తి నాలో ఉంది. ఆ శక్తిముందు ఏ దుష్ట శక్తి, దుష్ట గ్రహం నిలువలేదు.

మన ఆలోఛనలే మన శీలాన్ని నిర్ణయిస్తాయి కదా. మన ఆలోచనలే మన ప్రస్తుత పరిస్తితిని, రేపటి గమ్యాన్ని నిర్ధారిస్తాయి కదా. ఒక్క చెడు ఆలోచన జీవితాన్ని అథః పాతాలనికి తీసుకుపోగలదు అలాగే ఒక్క మంచి ఆలోచన మనల్ని విశ్వవిజేతను చేయగలదు. అందుకే ఎప్పుడు మంచి ఆలోచనలతో, గెలుపును శాసించగలమనే ధైర్యంతో, మన శక్తి మీద నమ్మకంతో, ఓటమి భయంలేకుండా కర్తవ్యనిర్వనకు ముందడుగేద్దాం.
మిత్రులారా! రండి.. ఈ కొత్త సంవత్సరంలో గెలుపుని పాదాక్రాంతం చేసుకుందాం..


బ్లాగు మిత్రులందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.