నువ్వు
హాయిగా, ప్రశాంతంగా పడుకున్నావు. రోజంతా అలసిపోయి నిద్రాదేవి ఒడిలో చేరి సేద తీరుతూ
తీయగా కలలు కంటున్నావు. నువ్వు నిద్రపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు నిద్ర
రావడంలేదు. మనసంతా అల్లకల్లోలంగా, చికాకుగా ఉంది. ఏవేవో ఆలోచనలు, ఎవరికి చెప్పలేను,
చెప్పుకోవడానికి నువ్వు లేవు. నువ్వు లేక నిదుర రాక నిమిషమైన మనసు నిలకడగా ఉండటం లేదు.
ఈ రోజంతా నువ్వు నాతో మాట్లాడలేదు తెలుసా. నువ్వు మాట్లాడకుంటే నేను నాలా ఉండను అని
నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు మాట్లాడలేదు. నీకు నామీద కోపమో లేక అసహ్యమో తెలీదు.
కానీ మాట్లాడలేదు అన్న విషయం మాత్రం తెలుసు. రోజంతా ఏదో చిన్న ఆశ రోజుమొత్తంలో ఎప్పుడో
ఒకసారి మాట్లాడకపోతావా అని. కానీ, ఆ ఆశ అడియాసే అయిపోయింది. ఈ రోజు అయిపోయింది, నువ్వు
మాట్లాడనేలేదు.
అయినా
నాకు కదా నీ మీద కోపమొచ్చింది. నేను కదా అలగాల్సింది. మరి నువ్వే నా మీద అలిగి మాట్లాడలేదు
ఏమిటి? ఇదేమి న్యాయం? నేను అలగాల్సినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద అలుగుతావా?
నాకు కోపమొచ్చినప్పుడు కూడా నా బదులు నువ్వే నా మీద కోపం చూపిస్తావా? ఇదెక్కడి న్యాయం?
అయినా నాకు నీ మీద కోపరావడం తప్పా? కోపం తెచ్చుకునే హక్కు నాకు లేదా? నువ్వు చేసిన
పనికి నాకు బాధ కలగడం తప్పా? అందుకు నాకు కోపం రావడం తప్పా? కాదు కదా. మరి నాకెందుకీ
శిక్ష? సరె, నీకు కోపం వచ్చిందే అనుకో, వస్తే? మాట్లాడకూడదా? మాట్లాడటం మానెయ్యాలా?
కోపం వచ్చినా మాట్లాడొచ్చు కదా? మామూలుగా మాట్లాడటం ఇష్టంలేకపోతే తిట్టొచ్చుకదా? అవేవీ
చేయకుండా, రోజంతా మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలి? నేనేమైపోతానో అని ఒక్క క్షణమైనా
అలోచించావా?
నువ్వెప్పుడూ
అంటుంటావు, "విఘ్నీ, నేనులేకుండా నువ్వు ఉండగలవు కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను"
అని. కానీ నిజమేంటో తెలుసా? నాతో మాట్లాడకుండా నువ్వు హాయిగా ఉన్నావు, కానీ నీ కనుచూపైనా
లేక నేను సతమతమవుతున్నా. మనసంతా ఏదో వెలితి, చుట్టూ అన్నీ ఎప్పటిలాగే ఉన్నా అంతా గందరగోళం.
నాకు నేనుగా పరిపూర్ణం కాదు, నువ్వు లేకుంటే నేను శూన్యమే అని మళ్ళీ తెలిసింది. ఈ క్షణం
నువ్వు నిద్రలేచి మాట్లాడితే ఎంత బాగుండు అన్న తపన, నిన్ను నిద్రలేపి మాట్లాడాలన్న
ఆరాటం. అన్నీ నాకే. నీకేం నువ్వు చక్కగా బజ్జున్నావు. నేను, నా తలపులు, నా ఆలోచనలు,
నా ఊహలు చేసుకోలేని సుదూర లోకాల్లో ఆనందంగా విహరిస్తున్నావు. కానీ ఇక్కడ నేను, నువ్వు
ఎప్పుడెప్పుడు నిద్రలేచి నాతో మాట్లాడతావా అని నిద్రలేకుండా ఎదురు చూస్తూ ఉన్నా.
అదిగో,
ఉషోదయ సమయం అయ్యింది. నాలో చిగురాశ ఉదయిస్తుంది. నా మీద ఉన్న కోపాన్నంతా ఓ కలలా మరచిపోయి
మళ్ళీ నా మీద నీ ప్రేమ కురిపిస్తావని ఆశ. ఉదయ భానుడి లేత కిరణాల్లాంటి వెచ్చని ప్రేమనే
నాపై కురిపిస్తావో లేక ప్రచంఢ భానుడి భగభగల్లాంటి నీ కోపంలో నన్ను దహించివేస్తావో చూడాలి
మరి.
నీకిదే
నా సుప్రభాత లేఖ..