నా
హృదయంలో నిదురించే చెలి, కలల్లో కాక కళ్ళేదురుగా నిదురిస్తే? ఆ రోజు ఒకటొస్తుందని అది
ఏదో ఓ మాయలోకి తీసుకెళ్తుందని నేనేనాడూ అనుకోలేదు. అనుకోని అదృష్టం వరమై కళ్ళముందు
నిలిస్తే? గలగలా మాట్లాడుతూ, అందంగా నవ్వుతూ, కళ్ళతోనే కవ్విస్తూ, చిరుకోపం నటిస్తూ,
మూతిముడుస్తూ, ప్రేమ ఒలికిస్తూ…. మాట్లాడుతూ, పోట్లాడుతూ.. ఆ మాటల్లోనే మెల్లిగా నువ్వు
నిద్రలోకి జారుకున్న ఆక్షణం... కళ్ళెదురుగా ప్రియురాలు నిద్రిస్తూ ఉంటే ప్రేమికుడి
మనసులో కలిగే మధురానుభూతి నాకు మొట్టమొదటిసారి తెలిసింది. కళ్ళు మూసుకుని అందంగా, అమాయకంగా,
చిట్టి పాపలా కనిపించే నీ నగుమోము తదేకంగా చూస్తూ రెప్పవేయడం కూడా మరచిపోయా నేను. రెప్పవేస్తే
ఆ రెప్ప పాటు కాలంలో ఎంత అందాన్ని, ఆనందాన్ని కోల్పోతానో అని రెప్పవేయనివ్వలేదు నా
మనసు. నిదురలో కూడా నీ పెదాలపై ఏమాత్రం చెరిగిపోని
చిరునవ్వు.. నగుమోము అంటే ఏమిటి అని అడిగేవాళ్ళకు ఇదిగో ఇదే అని చూపించాలనుంది. ఆ నగుమోము
ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. తీరుతుందన్న ఊహ కూడా లేదు.
నువ్వు
మెలకువగా ఉన్నప్పుడు నిన్నే చూస్తే ‘ఏయ్ అలా చూడకు’ అని తల తిప్పుకుంటావు. కానీ ఇప్పుడు
నేను ఇలా ఎంతసేపైనా చూసెయ్యొచ్చు. నీకు తెలీదుగా! తెలిసాక కొట్టవుగా? కాలం ఇక్కడే ఇలాగే
ఆగిపోతే జీవితమంతా నిన్ను ఇలాగే చూస్తూ గడిపేయాలనుంది. కానీ.. పక్షుల కిలకిలలలాంటి
నీ గలగలల మాటలు, నీ తిట్లు, నీ కోపాలు తాపాలు, ప్రేమ ఇవ్వన్నీ లేకుండా నేను ఉండగలనా?
కుదరదు. నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ మైమరచిపోయే ఆ క్షణాలు లేకుండా నేను ఉండగలనా?
ఊహూ. ఉండలేను. అంటే నువ్వు మెలకువలో కూడా ఉండాలి మరి. ఏంటో నా మనసులో ఈ పరస్పర విరుద్ధమైన
ఆలోచనలు. అదంతా మీ మాయే. ఆ మాయతో నిండిన మనసుతో నున్ను చూస్తుంటే, ఈ ఆనందం మరింతా అనందంగా
ఉంది. అలా చూస్తున్న నాకు ఈ అందమైన క్షణాన్ని ఫొటోలో బంధించాలనిపించింది, కానీ దానికి
నా మనసు ఒద్దంది.. నీ అందమైన ఈ రూపాన్ని తనలో బంధిచుకున్నా అంది.. ఎప్పుడు ఎక్కడ చూడాలనుకున్నా
తనలో ఈ ప్రతిమ ఉండగా ఫొటో ఎందుకు అంది. ఇక మనసు మాట వినక తప్పలేదు.
నిన్నలా
చూస్తున్న నా మనసు ‘నిదురించే ప్రియురాలి పెదాలపై ముద్దు దొంగిలిస్తేనో? అంతకన్నా అందమైన
దొంగతనం ఉంటుందా’ అని నన్ను ప్రేరేపించింది. ఆ మనసు మాట వినాలనే ఉంది కానీ ఆ ముద్దు
నీకు నిద్రా భంగం కలిగిస్తుందేమో అని మిన్నకుండిపోయా. గట్టిగా శ్వాసిస్తే ఆ శబ్ధానికి
నీ నిదుర చెదిరిపోతుందేమో అని దాదాపు ఊపిరి పీల్చడమే మానేసా. నా వైపు తిరిగి నాతో మాట్లాడుతూ
కుడిచేతిపై పడుకుని నిద్రలోకి జారుకున్నావు నీవు. ఇప్పుడు నిద్రలో ఉన్నా నువ్వు నన్నే
చూస్తున్నట్టుగా ఉంది నాకు. నా వైపు చూస్తూ మూసిన ఆ కనురెప్పలు, తెరిచిన మరుక్షణం నువ్వే
కనిపించాలి అన్నట్టుగా ఉన్నాయి. కళ్ళకు కాటుకందము అంటారు కానీ కాటుక పెట్టకున్నా కాటుక
కళ్ళ సోయగం నీ కళ్ళది. నిద్రలో నీవు ఇంత అందంగా ఉంటావని నాకు తెలీదు. ముగ్ధ మనొహరానికి
ప్రతిరూపమైన నీ మోము, సన్నగా వీస్తున్న ఏసీ గాలి ఆ గాలికి మెల్లగా కదులుతున్న నీ కురులు,
నువ్వు శ్వాసిస్తుంటే లయబద్దంగా పైకి కిందికి కదులుతున్న నీ చేయి, రేకులు ముడుచుకున్న
మొగ్గలాంటి నీ కళ్ళు. ఇలా నీలోని ప్రతి అందాన్ని ఎంతగా చూసినా ఇంకా ఇంకా చూడాలనే ఉంది.
నీలోని ఓ అందాన్ని చూస్తే ఇంకో అందాన్ని చూడలేకున్నా. నీ అందాన్ని అంతా తనివితీరా చూడటానికి
నా రెండుకళ్ళు చాలడంలేదు. ఇంత అందమైన నా ప్రియురాలు నిద్రిస్తున్న ఈ గదిలో ఏసీ గాలా?
ఊహూ వద్దు, సహజ సిద్దమైన చల్లని పైరగాలితో,
పూల గుమగుమలతో నింపమని ప్రకృతిని అడుగుదామని కిటికీ వైపు చూస్తే అందులోంచి దొంగ చంద్రుడు
నిన్ను చూడాలని తన వెన్నెల కిరణాలతో నిన్ను తాకాలని పరితపిస్తున్నాడు. ఆ దొంగ నిన్ను
తాకకుండా కిటికీ తలుపులు మూయాలని ఎంతగా అనిపించినా మూయలేని అశక్తత నాది. అదిగో, అంతలో
నీలో చిన్న ఉలికిపాటు, ఆ ఉలికిపాటుకి ఎక్కడ నీ నిద్ర చెదురుతుందో అని కలత చెందింది
నా మనసు. కానీ ఆనందకరమైన విషయం ఏంటంటే నీ నిదుర చెదరలేదు. వెళ్ళకిలా తిరిగి, కుడిచేయి
మడిచి తలపక్కన పెట్టుకుని పడుకున్నావు. ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సంపూర్ణంగా కనిపిస్తుంది
చంద్ర బింభంలాంటి నీ మోము. ఇప్పుడు రమ్మను ఆ చందమామను. ఎందుకొస్తాడు? రాడు. నీ అందం
ముందు తను దిగదుడుపని అవమాన పడలేక వెళ్ళి మెఘాలవెనక దాక్కున్నాడు. ఓ అందమైన పువ్వుని
ఎటునుండి చూసినా అందంగానే ఉంటుంది. నీ అందాన్ని చూస్తుంటే నాకు ‘సొగసు చూడ తరమా నీ
సొగసు చూడతరమా’ అని పాడాలనిపించింది. కానీ పాడితే.. అమ్మో! నీకు నిద్రా భంగమైపోదూ..
అలసి
సొలసి నిదురించే నా చెలి అలసట తీర్చడానికి అందమైన కలగా మారి తన కన్నుల్లో చేరాలనుంది.
ఆ కలలో అలసిన చెలి మనసుకు నే ఊరటనవ్వాలనుంది. గువ్వల్లా రెక్కలు కట్టుకుని ఊహాలోకాలకు
ఎగిరిపోవాలనుంది. ఈ రేయి గడిచి తెలవారితే, ఉషోదయవేళలో చిరునవ్వుతో నీకు సుప్రభాతం పాడాలని
ఎదురు చూస్తోంది నా మది. అందాకా నిదురించవే నా చెలి.