ఆదిదేవుడు ఎవరని అడిగితే మనలో చాలా మంది మరో ఆలోచన లేకుండా శివుడు అని చెప్పేస్తారు. ఆ విషయం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది పండిత పామరులందరూ అంగీకరించే సత్యమా? అలా అని మీరనుకుంటే ఒక్కసారి వెళ్ళి వైష్ణవులతో ‘శివుడు ఆదిదేవుడు’ అని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి ఇస్కాన్ వాళ్ళకు చెప్పండి. ఒక్క వైష్ణవులే కాదు శాక్తేయులు, సౌరులు, గాణాపత్యులు, కౌమారులు మొదలగు వారెవ్వరు శివుడు ఆదిదేవుడంటే ఒప్పుకోరు. ఎవరి దైవం వారికి ఆదిదేవుడే. ఒకరి దైవాన్ని ఆదిదేవుడంటే ఇంకొకరు ఒప్పుకోరు. వీళ్ళందరిని ఒప్పించేలా చెప్పే జ్ఞానం నాకు లేదు. అందుకే ఈ విషయాన్ని ఆధ్యాత్మికంగా కాక శాస్త్రీయంగా సమీక్షిస్తున్నా.
సమీక్ష మొదలెట్టేముందు ఒక చిన్న ప్రశ్న, మనిషి దేవున్ని సృష్టించాడా లేక దేవుడు మనిషిని సృష్టించాడా? హేతువాదులయితే వెంటనే మనిషే దేవున్ని సృష్టించాడు అని చెప్పేస్తారు. మరి ఆస్తికులేమంటారు? హిందూ మతానికి మూలమైన వేదాల్లో భగవంతుండి ఆకరాన్నిగానీ రూపాన్నిగాని ప్రస్తావించే మంత్రాలు లేవు. వేద మంత్రాల ప్రకారం ప్రకారం భగవంతుడు నిరాకారుడు, నిర్వికారుడు. భగవంతుడి రూపాన్ని లక్షణాల్ని స్తుతించే, "శుక్లాంబర ధరం", "శాంతాకారం భుజగ శయనం", "శరదిందు వికాస మందహాసం", "నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ" మొదలగు శ్లోకాలన్నీ తరువాత కాలంలో వచ్చినవే. అలా అయితే భగవంతునికి రూపం మానవుడు ఆపాదించిందేనేమో కదా. హేతువాదంగా చూసినా, ఆస్తిక భావనతో చూసినా భగవంతుడి రూపం మానవ సృష్టి అవడానికి అవకాశం ఉంది. కనుక ఒకవేళ భగవంతుడి రూపం మానవ కల్పితమే అయితే, మనిషి ఏ రూపాన్ని ముందుగా కల్పించుంటాడో ఆ రూపన్ని ఆదిదేవుడు అనొచ్చేమో కదా. ఇక పరిశీలనలోకి వెళదాం…
జీవపరిణామ సిధ్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడని మనకు తెలుసు. మనిషి కోతి రూపంలో ఉన్నప్పుడే భగవంతున్ని సృష్టించాడనుకోవడంలో అర్ధంలేదు. మనిషి ఆదిమానవుడి రూపంలో ఉన్నప్పుడు భగవంతుని గురించి అలోచించుండాలి, భగవంతుడికి రూపం కల్పించుండాలి. భూమిమీదున్న మిగతా జంతు జాతుల్లో ఒకడయిన ఆదిమానవుడు భగవంతుడి గురించి ఎందుకాలోచించాడు? మిగతా జంతువులకు లేని ఈ అవసరం మనిషికే ఎందుకొచ్చింది? అందుకు కారణం చావు అయ్యుండాలి. జీవిత కాలం తనతో తోడుగా ఉన్న మనిషి, నిన్న తనతో మాట్లాడిన మనిషి, ఇవ్వాళ ఏమయ్యాడు? ఎక్కడికెళ్ళాడు? అలాగే నిన్నటి వరకు లేని ఈ చిట్టి పిల్లాడు ఇవ్వాళ ఎక్కడినుండి వచ్చాడు? అన్న అలోచననుండి పుట్టుండాలి భగవంతుడు. అలాగే ప్రకృతిలో తనను నిత్యం భయపెట్టే ప్రకృతి శక్తులను చూసి భయపడ్డ మనిషి, ఆ భయంనుండి తనను కాపాడేవాడెవడో ఉన్నాడు అని ఆలోచించి ఉండాలి. ఆ ఆదిమానవుడి ఆలోచనే భగవంతుడు అనే ఆలోచనకు మూలం అయ్యుండాలి. అందుకే ఆదిమానవుడు తనను భయపెట్టే ప్రకృతి శక్తులను ముందు పూజించుంటాడు. ఈ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లో ప్రకృతి ఆరాధన ఉంది. హైందవ మతంలో ఈనాటికీ ప్రకృతి ఆరాదన కనిపిస్తుంది.
అలా ఆలోచించడం మొదలెట్టిన మనిషి భగవంతుడికి రూపాన్ని (మూర్తి) కల్పిచడానికి ప్రయతించాడలనిపిస్తుంది. ఆ రూపాన్ని తనరూపం అయిన మనిషి రూపంగా మలచాడనుకుంటా. ఆది మానవుడు ఆకులు, జంతువుల చర్మం ధరించేవాడని చదువుకున్నాం. అవే తన భగవంతునికి తొడిగాడు. భగవంతుడు కనుక కొంచెం గొప్పగా ఉండటానికి పులిచర్మాన్ని తొడిగాడు. తనను రక్షించాలంటే బగవంతుడి దగ్గర ఆయుదం ఉండాలి. ఆది మానవుడు జంతువులను వేటాడటానికి బల్లెం వాడేవాడు. దాన్ని విసిరి జంతువులను సంహరించేవాడు. దాన్నే కాస్త మార్చి త్రిశూలం చేసాడు. తన భగవంతుడుకూడా త్రిశూలాన్ని విసురుతాడు. తనను అతిగా భయపెట్టే చావుకు అధిపతిగా చేసి స్మశానంలో కూర్చుండబెట్టాడు. భగవంతున్ని అందంగా అలంకరించాలి, కానీ మేకప్ కిట్ లేదు. ఎలా? పౌడర్‌కు బదులుగా స్మశానంలో పక్కనే ఉన్న బూడిద పూసాడు. నగలు చేయడం తెలీదు కనుక పాములతో అలంకరించాడు, ప్రకృతిలో చెట్లకి కాసే రుద్రాక్షను తెచ్చి దారనికి గుచ్చి మెడలో వేసాడు. కేశాలంకరణ తెలీని ఆదిమానవుడు తన భగవంతుడి కేశాలంకరణ కూడా తన కేశాలంకరణ లాగే చేసాడు. అలంకరణ కోసం ఆకాశంలో అందంగా కనిపించే నెలవంకను తెచ్చి తన భగవంతుని తెలలో పెట్టేసాడు. మనిషి కన్నా ప్రత్యేకంగా ఉంటాడు అని చెప్పడానికేమొ తన భగవంతునికి మూడో కన్ను పెట్టాడు. శివుడి వాయిద్యం ఢమరుకం కూడా చాలా ప్రాథమికంగా ఉంటుంది. అదికూడా ఆది మానవుడు ఆనాడు వాడిన వాయిద్యమే అయ్యుండాలి. ఇలా ఆదిమానవుడు తన భగవంతున్ని సృష్టించుకునుండాలి. ఆ భగవంతునికి ఆదిమానవుడు ఏ పేరు పెట్టాడో కానీ, శివుడు అన్న పేరు మాత్రం తరువాతి కాలంలో వచ్చిందేమో అనిపిస్తుంది. శివుడుకి మిగతా దేవుళ్ళకి తెడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శివుడి లక్షణాలన్నీ ఆదిమానవుడి లక్షణాలతో సరిపోతాయి. కానీ మిగతా దేవుళ్ళ విషయంలో అలా కాదు, ఆ రూపం కల్పించే నాటికి మనిషి ఆలోచనా సరళి మారింది, కొంత ఆధునికత అలవడింది. అందుకే ఆ దేవుళ్ళ రూపాలు కాస్త ఆధునికంగా ఉంటాయి. ఆదిమానవుడు ముందుగా కల్పించిన రూపం శివుడే అనిపిస్తుంది. అలా అలోచిస్తే శివుడే ఆది దేవుడు అనొచ్చేమో.
శివుడికి ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి. లింగ రూపం ఒక ప్రత్యేకత. ఆదిమానవుడు భగవంతుడికి (మానవ) రూపాన్ని కూడా కల్పించలేని కాలంలో ఈ లింగరూపలో పూజించుండాలి. కాల క్రమేణా మానవ రూపం కల్పించినా, లింగరూపంలో కూడా పూజిస్తూనే ఉన్నాడు. శివుడు ఆదిమానవుడి రూపంతో ఉన్నా, పార్వతి మాత్రం ఆధునిక రూపంలో ఉంటుంది. ఎందుకు? మరి ఈ ఆధునిక రూపన్ని ఆదిమానవుడు ఎలా కల్పించాడు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది, శివుడి మొదటి భార్య సతి. తను ఆదిమానవ రూపంలోనే ఉండుండాలి. తరువాతి కాలంలో ఆదిమానవ రూపంలో ఉన్న సతిని చంపేసి పార్వతిగా పునర్జన్మ కల్పించారు, అందుకే పార్వతి ఆధునికంగా ఉందా?
ఆనాడు మానవుడు భగవంతుని రూపాన్నెలా సృష్టించాడో తెలీదు కానీ, ఆదిమానవ రూపలో ఉన్న శివున్నే ఆది దేవుడు అనడం సమంజసం అనిపిస్తుంది.